Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఐటి మద్రాస్ స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం


తమిళ నాడు గవర్నర్ శ్రీ బన్‌ వారీలాల్ పురోహిత్ గారు, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఇ. కె. పళనిస్వామి గారు, నా సహచరులు శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ గారు, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ.పన్నీర్ సెల్వం గారు, ఐఐటి మద్రాస్ చైర్ మన్, గవర్నర్ల బోర్డు సభ్యులు, డైరెక్టర్, ఈ మహోన్నతమైన సంస్థ లోని ఫ్యాకల్టీ, గౌరవ అతిథులు, బంగారు భవిష్యత్తు లోకి అడుగు పెట్టడానికి సిద్ధం గా నిలబడిన యువ స్నేహితులారా, ఈ రోజు ఇక్కడ కు రావడం ఎంతో ఆనందదాయకం.

మిత్రులారా,

ఈ రోజున మినీ భారత్ మరియు కొత్త భారత్ స్ఫూర్తి నా ముందు నిలిచి ఉంది. ఇక్కడంతా అపారమైన శక్తి, చలనశీలత, సానుకూల దృక్పథం ప్రసరిస్తున్నాయి. మీకు పట్టాలు ప్రదానం చేసే సమయం లో మీ కళ్లలో ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించిన కలలు దర్శనం ఇస్తాయి. మీ కళ్లలో భారతదేశం భవిష్యత్ గమ్యాన్ని నేను చూడగలుగుతాను.

మిత్రులారా,

ఈ రోజు పట్టభద్రులైన వారి తల్లిదండ్రుల ను నేను అభినందిస్తున్నాను. వారి ఆనందం, గర్వం ఎలా ఉంటుందో ఊహించుకోండి. మిమ్మల్ని ఈ కీలక దశ కు తీసుకు రావడానికి వారు ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో త్యాగం చేశారు. వారు మీకు ఎగరడాని కి అవసరం అయిన రెక్కలు ఇచ్చారు. మీ అధ్యాపకుల కళ్ల లో కూడా ఈ గర్వం ప్రతిబింబిస్తోంది. వారు అవిశ్రాంతం గా శ్రమించడం ద్వారా చక్కని ఇంజనీర్లనే కాకుండా మంచి పౌరుల ను కూడా జాతి కి అందించారు.

సహాయ సిబ్బంది పాత్ర ను కూడా నేను ఈ సందర్భం గా ప్రముఖం గా ప్రస్తావిస్తున్నాను. తెరల వెనుకనే మౌనం గా ఉన్నప్పటికీ వారంతా మీకు ఆహారం తయారు చేశారు. మీ తరగతి గదుల ను శుభ్రం చేశారు. హాస్టళ్ల ను పరిశుభ్రం గా ఉంచారు. మీ విజయం లో వారి పాత్ర కూడా ఎంతో ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ముందు మీ అధ్యాపకులు, తల్లిదండ్రులు, సహాయ సిబ్బందికి గౌరవ సూచకం గా నిలబడి వందనం చేయాలని నేను ఈ విద్యార్థి మిత్రుల ను అభ్యర్థిస్తున్నాను.

మిత్రులారా,

ఇది ఎంతో అద్భుతమైన సంస్థ. ఇక్కడ పర్వతాలు కదులుతాయని, నదులు నిశ్చలం గా ఉంటాయని నాకు చెప్పారు. అలాంటి ప్రత్యేకత గల తమిళ నాడు రాష్ట్రం లో మనమందరం ఇప్పుడున్నాం. ప్రపంచం లోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళ భాష కు ఇది పుట్టినిల్లు. అలాగే ఐఐటి-మద్రాస్ లోని కొత్త భాష కు కూడా ఇదే నివాస స్థలం. ఇక్కడ నుంచి వెళ్లి మీరు పోగొట్టుకునేది ఎంతో ఉంటుంది. సారంగ్, శాస్త్ర మీరు తప్పనిసరిగా మిస్ అవుతారు. మీతో పాటుగా రెక్కలు విచ్చుకుని ఎగిరిన మిత్రుల కు దూరం అవుతారు. అయినా మీరు కోల్పోనిది కూడా ఒకటుంది. అత్యున్నత నాణ్యత గల పాదరక్షల ను ఎలాంటి భయం లేకుండా మీరు కొనుగోలు చేయగలుగుతారు.

మిత్రులారా,

మీరు నిజం గా ఎంతో అదృష్టవంతులు. అద్భుతమైన అవకాశాల గని గా ప్రపంచం యావత్తు ఆసక్తి గా ఎదురు చూస్తున్న సమయం లో ఒక అద్భుతమైన కళాశాల నుంచి మీరు ఉత్తీర్ణులై వెలుపలికి వస్తున్నారు. అమెరికా లో వారం రోజుల పాటు పర్యటించి నేను ఇప్పుడే తిరిగి వచ్చాను. ఆ పర్యటన సందర్భం గా ఎంతో మంది దేశాధినేతల ను, వ్యాపార దిగ్గజాల ను, నవ ఆవిష్కర్తల ను, ఆంత్ర ప్రన్యోర్ లను, ఇన్వెస్టర్ల ను నేను కలిశారు. మా చర్చల్లో ఒక భావం అందరి లోనూ కనిపించింది. అదే సరికొత్త భారత్ పై అపారమైన ఆశావహ దృక్పథం. భారత యువత సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం.

మిత్రులారా,

ప్రపంచం అంతటి మీద భారత సమాజం తనదైన ముద్ర వేసింది. ప్రత్యేకించి సైన్స్, టెక్నాలజీ, ఇనవేశన్ లో తమ ముద్ర స్పష్టం గా వేశారు. ఈ శక్తి వారికి ఎవరందించారు? వారిలో ఎక్కువ మంది ఐఐటి సీనియర్లే. ఆ రకంగా మీరు బ్రాండ్ ఇండియా ను ప్రపంచం లో బలం గా నిలిపారు. ఇటీవలే యుపిఎస్ సి పరీక్షలు ఉత్తీర్ణులైన యువ అధికారుల తో నేను మాట్లాడాను. వారిలో ఎందరో ఐఐటి పట్టభద్రులున్నారంటే నాకే కాదు, మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రకంగా మీరందరూ భారత్ ను మరింత అభివృద్ధి చెందిన ప్రదేశం గా నిలిపారు. కార్పొరేట్ ప్రపంచం చూడండి, అక్కడ కూడా ఐఐటి ఉత్తీర్ణులైన ఎందరో ఉన్నారు. ఆ రకంగా మీరందరూ భారత్ కు మరింత సంపద అందించారు.

మిత్రులారా,

21వ శతాబ్ది పునాదులు మూడు స్తంభాల పై ఆధారపడి ఉన్నాయి. అవే ఇనవేశన్, టీమ్ వర్క్,టెక్నాలజీ. ఈ మూడింటిలో ప్రతీ ఒక్కటీ మరోదానికి మద్దతుగా నిలుస్తుంది.

మిత్రులారా,

నేను ఇప్పుడే సింగపూర్-ఇండియా హ్యకథన్ చూసి వచ్చాను. అక్కడ సింగపూర్, భారతదేశాల కు చెందిన ఇన్నోవేటర్లు కలిసి పని చేస్తున్నారు. మనందరి ఉమ్మడి సవాళ్ల కు వారు పరిష్కారాలు అన్వేషిస్తున్నారు. వారంతా తమ శక్తి ని ఒకే దానిపై పెట్టారు. ఈ ఇన్నోవేటర్లందరూ వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చారు. వారి అనుభవాలు భిన్నం గా ఉన్నాయి. వారు భారత్, సింగపూర్ ఎదుర్కొంటున్న సమస్యలే కాదు, ప్రపంచం యావత్తు ఎదుర్కొంటున్న సమస్యల కు పరిష్కారాలు సృష్టించాల్సి ఉంది. అదే ఇన్నోవేషన్, టీమ్ వర్క్, టెక్నాలజీ శక్తి. ఈ పరిష్కారాలు ఏ ఒక్కరికో కాదు ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడాలి.

ఈ రోజున భారతదేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మారాలని ఆకాంక్షిస్తోంది. మీ ఇన్నోవేషన్, ఆశలు, టెక్నాలజీ అప్లికేషన్లే ఆ కల ను సాకారం చేస్తాయి. పోటీ ఆర్థిక వ్యవస్థ లోకి భారతదేశం పెద్ద అడుగుతో దూకేందుకు అది పునాది ఇస్తుంది.

మిత్రులారా,

దశాబ్దాల చరిత్ర ఉన్న ఒక సంస్థ 21వ శతాబ్ది ఆశల ను సాకారం చేసే విధం గా ఎలా పరివర్తన చెందుతుందన్న దానికి ఐఐటి మద్రాస్ సజీవ నిదర్శనం. కొద్ది సేపటి క్రితమే నేను ఈ క్యాంపస్ లోని రీసెర్చ్ పార్క్ ను సందర్శించాను. దేశం లోనే అది ఆ కోవలోని తొలి ప్రయత్నం. నేను ఇక్కడ ఎంతో చలనశీలత కలిగిన స్టార్ట్-అప్ వాతావరణం చూశాను. ఇప్పటికీ ఇక్కడ 200 వరకు స్టార్ట్-అప్ లను సిద్ధం చేసినట్టు నాకు చెప్పారు. వాటిలో కొన్నింటిని చూడగలగడం కూడా నా అదృష్టం. విద్యుత్ కార్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేథ వంటి విభాగాల్లో వారి కృషి ని నేను గమనించాను. ఈ స్టార్ట్-అప్ లన్నీ భారతదేశం ప్రత్యేకతను చాటి చెప్పగల, భవిష్యత్ ప్రపంచం లో తమకంటూ ప్రత్యేక స్థానం పొందగల భారత బ్రాండ్లను కేటాయించాలి.

మిత్రులారా,

పొదుపు, వినియోగం రెండింటి చక్కని కలయిక తో భారత ఇన్నోవేషన్లుంటాయి. ఐఐటి మద్రాస్ అలాంటి సంప్రదాయం లోనే జన్మించింది. ఇక్కడి విద్యార్థులు, పరిశోధకులు ఎంతో సంక్లిష్ట సమస్యల ను తీసుకుని అందరికీ పనికి వచ్చే, అందుబాటు లో ఉండే సొల్యూషన్లు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి విద్యార్థుల కు స్టార్ట్-అప్ లలోనే ఇంటర్న్ శిప్ ఉంటుందని, వారంతా ఆహారం, నిద్ర కూడా మరిచి తమ గదుల్లో కోడ్ రాస్తూ ఉంటారని నాకు చెప్పారు. ఆహారం, నిద్ర మినహా వారి స్ఫూర్తి రానున్న కాలం లో ఇన్నోవేషన్ కు, తాము చేపట్టిన పని లో అగ్రస్థానం చేరాలన్న ఆకాంక్షకు ఆలంబన అవుతుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

దేశంలో ఇన్నోవేషన్ కు, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల ఇంక్యుబేషన్ కు అనుకూలమైన అతి పెద్ద వాతావరణం కల్పించేందుకు మేం కృషి చేశాం. మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేథ, రోబోటిక్స్, ఇంకా ఎన్నో అత్యాధునిక టెక్నాలజీ లు ఇప్పుడు చిన్నతనంలోనే విద్యార్థుల కు పాఠశాలల్లో పరిచయం చేస్తున్నారు. దేశవ్యాప్తం గా అటల్ టింకరింగ్ లాబ్ ల ఏర్పాటు కు కృషి చేస్తున్నాం.

మీ అందరి వలెనే ఒకసారి ఒక విద్యార్థి ఒక సంస్థ లో అడుగు పెట్టి ఇన్నోవేషన్ లో కృషి చేయాలనుకుంటు అందుకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు మద్దతు ఇస్తాయి. స్టార్ట్-అప్ అభివృద్ధి కావడానికి, దాని ఉత్పత్తుల కు చక్కని మార్కెటింగ్ లభించడానికి అనువైన వాతావరణం కల్పించడం తదుపరి సవాలు. ఈ సవాలు ను దీటుగా ఎదుర్కొనేందుకు స్టార్ట్-అప్ ఇండియా కార్యక్రమం సహాయకారి గా ఉంటుంది. ఈ కార్యక్రమం వారి ఉత్పత్తులు మార్కెట్ ను చేరేందుకు మార్గం చూపుతుంది. అలాగే దేశం లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల ను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలో స్కీమ్ ను ప్రారంభించాం.

మిత్రులారా,

అవిశ్రాంతం గా చేసిన కృషి కారణంగానే భారతదేశం ఈ రోజు స్టార్ట్-అప్ ల అనుకూల వాతావరణం ఉన్న అగ్ర స్థాయి మూడు దేశాల్లో ఒకటి గా అవతరించింది. భారత స్టార్ట్-అప్ ల పయనం లో అత్యున్నత దశ ఏదో మీకు తెలుసా? ఈ శక్తి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి లభించడమే ఆ శక్తి. స్టార్ట్-అప్ లలో మీరు రాసే కోడ్ కన్నా మీరు మాట్లాడే భాషే ప్రధానం. మీ ఇంటి పేర్ల శక్తి ఎందుకూ ఉపయోగపడదు. మీ సొంతం గా ఏదైనా కల్పించే అవకాశం మీకుంది. మీ ప్రతిభే మీరేమిటో చెబుతుంది.

మిత్రులారా,

మీరు ఐఐటి లో చదవడం ఎలా ప్రారంభించారో మీకు గుర్తుందా? అప్పటికి అలాంటి ఆశలు ఎంతో సంక్లిష్టంగా కనిపించేవి. కాని మీ అందరి కఠోర శ్రమ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఎన్నో అవకాశాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, వాటిలో అన్నీ తేలికైనవి కావు. అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తున్న మొదటి అడుగే ఈ రోజు అసాధ్యమైనదిగా కనిపిస్తోంది. అయినా నిరాశ చెందవద్దు, మీ అడుగులతో ఆ సంక్లిష్టతల ను బద్దలుకొట్టండి. మీరు ఒక్కో అడుగు వేస్తున్న కొద్ది సమస్య కొద్ది కొద్దిగా విడిపోతున్నట్టు మీకు కనిపిస్తుంది. మనిషి శక్తి అంతా అవకాశాల మీదనే ఆధారపడి ఉంది. అందుకే కలలు కనడం ఎప్పుడూ అపకండి, సవాళ్లు ఎదుర్కొనేందుకు మీకు మీరే సిద్ధం అవండి. అలా మీకు మీరే పరివర్తన చెంది ప్రపంచం లో అత్యుత్తమం గా నిలవ గలుగుతారు.

మిత్రులారా,

ఈ సంస్థ నుంచి వెలుపలి కి వెళ్లగానే ఎన్నో ఆకర్షణీయమైన, పెద్ద అవకాశాలు మీ ముందుంటాయని నాకు తెలుసు. వాటన్నింటినీ చక్కగా ఉపయోగించుకోండి. ఒక్క కోరిక మిమ్మల్ని కోరాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ నివశిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, మీ మాతృభూమి అవసరాల ను కూడా దృష్టి లో ఉంచుకోండి. మీ కృషి, మీ ఇన్నోవేషన్లు, మీ పరిశోధనలు తోటి భారతీయుల కు ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండి. ఇది మీ సామాజిక బాధ్యత మాత్రమే కాదు, అపారమైన వ్యాపారావకాశాల ను కూడా మీ ముందుంచుతుంది.

మన ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో అతి తక్కువ ధరకు, అత్యంత అధునాతనమైన రీతిలో నీటిని రీ సైకిల్ చేసి తాజా నీటిని అందించగలిగే, నీటి వినియోగాన్ని అరికట్టగలిగే విధానం మీరు కనిపెట్టగలరా? ఒక సమాజం గా ఈ రోజున ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ స్థానం లో పర్యావరణ మిత్రమైన, ప్లాస్టిక్ అందిస్తున్న నష్టాల కు తావు లేని ఉత్పత్తి మనందరికీ అవసరం. మీ ఇన్నోవేటర్ల నుంచి కోరేది అదే.
సమీప భవిష్యత్తులో జనాభా కు వచ్చే వ్యాధులు సాంప్రదాయికమైన అంటు వ్యాధులు కాదు. హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబిటిస్, స్థూల కాయం, ఒత్తిడి వంటి జీవనశైలి ఆధారిత వ్యాధులు. డేటా సైన్స్ ఎంతో పరిణతి చెందింది. వ్యాధుల కు సంబంధించిన సమాచారం తో ఎంతో డేటా అందుబాటులో ఉంది. వాటిలోని ధోరణులను టెక్నాలజిస్టులు కనిపెట్టగలరు.

టెక్నాలజీకి డేటా సైన్స్, వ్యాధి నిర్ధారణ, ప్రవర్తన శాస్త్రం, మెడిసిన్ తోడైనప్పుడు ఎన్నో అద్భుతాలు వెలుపలికి వస్తాయి. ఇలాంటి అద్భుతాల తో ఆ వ్యాధుల వ్యాప్తి ని అరికట్టవచ్చునా? ఈ ధోరణుల గురించి మనకి తెలుసునా? ఈ ప్రశ్నల కు టెక్నాలజీ జవాబు ఇస్తుందా. ఐఐటి విద్యార్థులు దీన్ని చేపట్టగలరా?
నేను శరీర దారుఢ్యం, ఆరోగ్య సంరక్షణ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. మీ వంటి అద్భుతాలు ఆవిష్కరించ గల శక్తి సామర్థ్యాలున్న వారు పని లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే శరీరాన్ని దృఢం గా ఉంచుకునేందుకు ఉపయోగపడే ఫిట్ ఇండియా ఉద్యమం లో సభ్యులు గా నిలవండి. వ్యక్తిగత శరీర దారుఢ్యం మీద దృష్టి పెడుతూ ఆరోగ్య సంరక్షణ లో ఆధునిక ఆవిష్కరణల కు కృషి చేయండి.

మిత్రులారా,

మనం రెండు రకాల ప్రజల ను చూస్తాం. వారి లో ఒకరు జీవించే వారైతే మరొకరు కేవలం తమ అస్తిత్వం కాపాడుకునే వారు. కేవలం బతికి ఉండాలనుకుంటున్నారా లేక జీవితం పూర్తిగా జీవించాలనుకుంటున్నారా మీరే నిర్ణయించుకోండి. ఒక ఔషధం బాటిల్ కు కూడా తీరిపోయే కాలం ఉంటుంది. కాలం చెల్లిపోయినా ఆ బాటిల్ అస్తిత్వం అలాగే ఉంటుంది. ప్యాకేజింగ్ కూడా చెక్కు చెదరదు. అందులోని మందు కూడా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. దాని వినియోగం ఒక్కటే పనికి రాదు. జీవితం కూడా అలాగే ఉండాలా? జీవితం సజీవం, లక్ష్యం తో కూడుకున్నదై ఉండాలి. పూర్తి జీవితం గురించి తెలుసుకోవడం, నిరంతరం నేర్చుకోవడం, అర్ధం చేసుకోవడం, ఇతరుల కోసం జీవించడం లోనే జీవితం చిరస్థాయి అవుతుంది.
అందుకే వివేకానందుడు “ఇతరుల కోసం జీవించే వారు మాత్రమే జీవించి ఉంటారు” అన్నాడు.

మిత్రులారా,

మీ స్నాతకోత్సవ వేడుక ఇప్పటికి ఈ చదువు ముగిసిందనేందుకు మాత్రమే సంకేతం. కాని అదే విద్య కు అంతం కాదు. విద్య, అధ్యయనం చేయడం నిరంతర ప్రక్రియ. మనం జీవించి ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటాం. మీ అందరి కీ మానవాళి సంక్షేమం కోసం అంకితం కాగలిగే శక్తి, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మరోసారి ఆకాంక్షిస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.