Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఐఎమ్ లను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించనున్నారు


ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎమ్) బిల్లు, 2017కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ బిల్లులో భాగంగా ఐఐఎమ్ లను జాతీయ ప్రాముఖ్యం కలిగివున్న సంస్థలుగా ప్రకటించనున్నారు. దీనితో ఈ సంస్థలు వాటి విద్యార్థులకు డిగ్రీలను మంజూరు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.

బిల్లు ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

i. ఐఐఎమ్ లు వాటి విద్యార్థులకు డిగ్రీలను మంజూరు చేయగలుగుతాయి.

ii. ఈ బిల్లు తగినంత జవాబుదారీతనంతో కూడిన సంపూర్ణ స్వతంత్ర ప్రతిపత్తిని సంస్థలకు ధారదత్తం చేస్తుంది.

iii. ఈ సంస్థల నిర్వహణ బోర్డు అధీనంలో ఉంటుంది. సంస్థ ఛైర్ పర్సన్ ను మరియు డైరెక్టర్ ను బోర్డు ఎంపిక చేస్తుంది.

iv. బోర్డులో నిపుణులు మరియు పూర్వ విద్యార్థులకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం బిల్లు యొక్క ఇతర ముఖ్యమైన లక్షణాలలో ఒకటిగా ఉంది.

v. షెడ్యూల్డు కులాలు/తెగలకు చెందిన సభ్యులను మరియు మహిళలను బోర్డులోకి తీసుకోవడానికి కూడా వీలు కల్పించారు.

vi. సంస్థలు ఎలా పనిచేస్తున్నది స్వతంత్ర ఏజన్సీల ద్వారా నియమిత కాలంలో సమీక్ష జరిపించడానికి, మరియు ఆ ఫలితాలను ప్రజల పరిశీలన కోసం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

vii. సంస్థల వార్షిక నివేదికను పార్లమెంటుకు నివేదిస్తారు; అంతేకాకుండా వాటి అకౌంట్లను సిఎజి తనిఖీ చేస్తుంది.

viii. ఐఐఎమ్ లకు ఒక సమన్వయ వేదిక ఉండాలని, అది ఒక సలహా సంఘంగా కూడా పనిచేయాలనే నిబంధనను విధించారు.

పూర్వరంగం:

ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్ మెంట్ దేశంలో మేనేజ్ మెంట్ సంబంధిత విద్యను అత్యుత్తమ స్థాయిలో బోధించే ప్రధాన సంస్థలు. ఈ సంస్థలు మేనేజ్ మెంట్ లో ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే విద్యా బోధన, శిక్షణ పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఐఐఎమ్ లు ప్రపంచ శ్రేణి మేనేజ్ మెంట్ సంస్థలుగాను, ప్రావీణ్యతా కేంద్రాలుగాను గుర్తింపు తెచ్చుకొని దేశానికి ఖ్యాతిని కట్టబెట్టాయి. సొసైటీల చట్టంలో భాగంగా అన్ని ఐఐఎమ్ లు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఉంటున్నాయి.

ఇవి సొసైటీలు కావడం వల్ల, డిగ్రీలను ప్రదానం చేసేందుకు ఐఐఎమ్ లకు అధికారం లేదు. అందుకని, అవి మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఇంకా ఫెలో ప్రోగ్రామ్ లను ప్రదానం చేస్తున్నాయి. వీటిని క్రమానుగతంగా ఎమ్ బి ఎ లు, మరియు పిహెచ్ డి లతో సమానంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ తత్సమానత.. ప్రత్యేకించి ఫెలో ప్రోగ్రామ్ కు సంబంధించినంత వరకు.. విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యం కావడం లేదు.

***