ప్రముఖులారా,
ఏడో భారత–జర్మనీ ప్రభుత్వ స్థాయి సమావేశాల (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్– ఐజీసీ) సందర్భంగా, మీకు, మీ ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం.
ప్రముఖులారా,
భారత్ లో ఇది మీ మూడో పర్యటన. అదృష్టవశాత్తూ, ఇది నా మూడో పదవీకాలంలో మొదటి ఐజిసి సమావేశం కూడా. ఒకరకంగా చెప్పాలంటే ఇది మన స్నేహానికి తృతీయ ఉత్సవం.
ప్రముఖులారా,
2022లో బెర్లిన్ లో జరిగిన చివరి ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ సందర్భంగా ద్వైపాక్షిక సహకారం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
గత రెండేళ్లలో, మన వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ రంగాలలో ప్రోత్సాహకరమైన పురోగతి ఉంది. రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, హరిత, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో పెరుగుతున్న సహకారం పరస్పర విశ్వాసానికి చిహ్నంగా మారింది.
ప్రముఖులారా,
ప్రపంచం ప్రస్తుతం ఉద్రిక్తతల్నీ, సంఘర్షణల్నీ, అనిశ్చితినీ ఎదుర్కొంటోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చట్టబద్ధ పాలన, నౌకాయాన స్వేచ్ఛ గురించి కూడా తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో, భారత్ – జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక బలమైన పునాది ఏర్పడింది.
ఇది లావాదేవీ ఆధారిత సంబంధం కాదు; ఇది రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య రూపాంతర భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యం ప్రపంచ సమాజానికి, మానవాళికి స్థిరమైన, సురక్షితమైన, సుస్థిర భవిష్యత్తును నిర్మించడానికి దోహదపడే భాగస్వామ్యం.
ఈ విషయంలో గత వారం మీరు విడుదల చేసిన “ఫోకస్ ఆన్ ఇండియా” వ్యూహం చాలా స్వాగతించదగినది.
ప్రముఖులారా,
మన భాగస్వామ్యాన్ని విస్తరించి, మరింత ఉన్నత స్థాయికి చేర్చడానికి ఎన్నో కొత్త, ముఖ్యమైన ఆవిష్కరణలను చేపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మనం సమగ్ర ప్రభుత్వ దృక్పథం నుండి సమగ్ర జాతీయ దృక్పథం వైపు కదులుతున్నాం.
ప్రముఖులారా,
రెండు దేశాలకు చెందిన పరిశ్రమలు… ఆవిష్కర్తలను, యువ ప్రతిభావంతులను కలుపుతున్నాయి. సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తేవడం మన ఉమ్మడి కర్తవ్యంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, క్లీన్ ఎనర్జీ వంటి ముఖ్యమైన రంగాల్లో మన సహకారాన్ని మరింత బలోపేతం చేసే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ రోడ్ మ్యాప్ ఈ రోజు విడుదల అవుతున్నది.
మనం ఇటీవలే జర్మన్ వాణిజ్య స్థాయి ఆసియా–పసిఫిక్ సమావేశంలో పాల్గొన్నాం. త్వరలోనే ఈసిఇఒల ఫోరమ్ లో కూడా పాల్గొంటాం. ఇది మన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యపరచడానికి, ప్రతికూలతలను తగ్గించడానికి మనం చేస్తున్న కృషికి వేగం వస్తుంది. తద్వారా భద్రత, నమ్మకానికి, విశ్వసనీయతకు ఆధారమైన సరఫరా వ్యవస్థలను సృష్టించడంలో సహాయపడుతుంది.
వాతావరణ చర్య పట్ల మన నిబద్ధతకు అనుగుణంగా, పునరుత్పాదక శక్తిలో ప్రపంచ పెట్టుబడులకు మనం ఒక వేదికను సృష్టించాం. ఈ రోజు గ్రీన్ హైడ్రోజన్ రోడ్ మ్యాప్ కూడా విడుదలైంది.
భారత్– జర్మనీల మధ్య విద్య, నైపుణ్యాభివృద్ధి, రవాణాభివృద్ధి సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. జర్మనీ విడుదల చేసిన నైపుణ్య కార్మికుల సంచార (స్కిల్డ్ లేబర్ మొబిలిటీ స్ట్రాటజీ) వ్యూహాన్ని స్వాగతిస్తున్నాం. నేటి సమావేశం మన భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను.
నేను ఇప్పుడు మీ అభిప్రాయాలను వినాలనుకుంటున్నాను.
ఆ తరువాత, వివిధ రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలను నా సహచరులు మనకు వివరిస్తారు.
మరోసారి, భారతదేశంలో మీకు,మీ ప్రతినిధి బృందానికి హృదయపూర్వక స్వాగతం.
గమనిక – ఇది ప్రధాన మంత్రి వ్యాఖ్యలకు సుమారు అనువాదం. ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు.
****
Speaking during meeting with Chancellor Scholz. @Bundeskanzler https://t.co/Fzm87UWMYH
— Narendra Modi (@narendramodi) October 25, 2024