వేతనం, పింఛను సంబంధిత లాభాలకు సంబంధించి ఏడో కేంద్ర వేతన సంఘం (సిపిసి) చేసిన సిఫారసులను అమలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సిఫారసులు 2016 జనవరి 1వ తేదీ నుంచే అమలవుతున్నట్టుగా పరిగణిస్తారు.
గతంలో ఉద్యోగులకు అయిదో సిపిసి వేళ ఆ సంఘం సిఫారసుల అమలుకై 19 నెలల పాటు, ఆరో సిపిసి వేళ ఆ సంఘం సిఫారసుల అమలుకై 32 నెలల పాటు వేచి ఉండవలసి వచ్చింది. కానీ, ఈ సారి 7వ సి పి సి యొక్క సిఫారసులు గడువు తేదీ నుండి ఆరు నెలల లోపే అమలులోకి వస్తున్నాయి.
వేతన బకాయిలను, పింఛను సంబంధిత లాభాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) లోనే చెల్లించాలనే నిర్ణయాన్ని కూడా మంత్రిమండలి తీసుకుంది. ఇంతకు ముందు దీనికి భిన్నంగా బకాయిలలోని కొన్ని భాగాలను తరువాతి ఆర్థిక సంవత్సరంలో చెల్లించడం జరిగింది.
పైన ప్రస్తావించిన సిఫారసులతో కోటి కి పైగా ఉద్యోగులు లాభపడనున్నారు. వీరిలో 47 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మరొక 53 లక్షల మంది పింఛనుదారులు కలసి ఉన్నారు. వీరిలోనే 14 లక్షల మంది ఉద్యోగులతో పాటు 18 లక్షల మంది పింఛనుదారులు రక్షణ దళాలకు చెందిన వారు కావడం గమనార్హం.
ముఖ్య అంశాలు :
1. పే బాండ్స్ కు మరియు గ్రేడ్ పే కు సంబంధించి ప్రస్తుతమున్న వ్యవస్థను సమాప్తం చేశారు. కమిషన్ సిఫారసు చేసిన ప్రకారం, ఒక కొత్త పే మ్యాట్రిక్స్ కు ఆమోదం లభించింది. ఇప్పటి నుండి ఉద్యోగి హోదాను పే మ్యాట్రిక్స్‌లోని అతడి లేదా ఆమె స్థాయి ద్వారా నిర్ధరిస్తారు. కాగా ఇంతవరకు గ్రేడ్ పే ను అనుసరించి దీనిని నిర్ధరిస్తూ వచ్చారు. పౌర సిబ్బంది (సివిలియన్), రక్షణ ఉద్యోగులు, సైన్య నర్సింగ్ సేవ.. వీటి కోసం వేరు వేరు పే మాట్రిసెస్ను రూపొందించారు. ఈ మాట్రిసెస్ వెనుక ఉన్న సూత్రం, హేతుబద్ధతలు మాత్రం ఒకే రకమైనవి కావడం విశేషం.
2. ఇప్పడున్న అన్ని స్థాయిలను కొత్త విధానంలో కలిపివేశారు. ఏవైనా కొత్త హోదాలను ప్రవేశపెట్టడం గాని, లేదా ఏదైనా హోదాను తొలగించడం గాని చేయలేదు. పే మ్యాట్రిక్స్ లో ప్రతి హోదాలోనూ కనీస వేతనాన్ని ఖరారు చేయడం కోసం ఒక హేతుబద్ధీకరణ సూచీకి ఆమోదం లభించింది. ఇది హయరార్కీలో ప్రతి మెట్టు వద్ద పెరిగే పాత్ర, బాధ్యత, జవాబుదారుతనం పై ఆధారపడివుంటుంది.
3. కనీస వేతనాన్ని రూ.7,000 నుండి పెంచి, ప్రతి నెలకు రూ.18,000గా చేసేయడం జరిగింది. అత్యంత కింది స్థాయిలో కొత్తగా నియమితులయ్యే ఏ ఉద్యోగికైనా అందే ఆరంభిక వేతం ఇప్పుడు రూ.18,000 ఉండగలదు. కొత్తగా నియమితులయ్యే క్లాస్-1 అధికారికి ఆరంభ వేతనం రూ.56,100 ఉంటుంది. ఇది 1: 3.12 కంప్రెషన్ రేషియోను ప్రతిబింబిస్తుంది. దీనివల్ల.. నేరు నియామకం పద్ధతిన జరిగే ఏ క్లాస్-1 అధికారి వేతనమైనా అత్యంత తక్కువ స్థాయిలో భర్తీ అయ్యే కొత్త ఉద్యోగి యొక్క వేతనం కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలుస్తుంది.
4. వేతనం మరియు పింఛను సవరణల కోసం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను పే మాట్రిసెస్లో కలిపివేసిన అన్ని హోదాలకు వర్తిస్తుంది.
5. వేతనంలో వృద్ధి (ఇంక్రిమెంట్ )రేటును గతంలో మాదిరే 3 శాతం వద్దే అట్టిపెట్టారు. అధిక మూల వేతనం రీత్యా ఉద్యోగులు భవిష్యత్తులో లాభపడనున్నారు. ఎలాగంటే, భవిష్యత్తులో వారి వేతనంలో ఏదైతే వార్షిక వృద్ధి ఉండగలదో అది ఇప్పటితో పోలిస్తే 2.57 రెట్లు ఎక్కువగా ఉండగలదు.
6. మంత్రిమండలి 13 ఎ (బ్రిగేడియర్) హోదాకు సంబంధించి డిఫెన్స్ పే మ్యాట్రిక్స్లో పెంపుదలకు ఆమోదం తెలిపింది. దీనితో పాటు లెవల్ 12 ఎ (లెఫ్టినెంట్ కల్నల్), 13 (కల్నల్), 13 ఎ (బ్రిగేడియర్) స్థాయిలలో అదనపు దశలను సైతం కల్పించారు. దీనితో రక్షణ సంబంధిత పే మ్యాట్రిక్స్ ను మరింత మెరుగుపరిచినట్లయింది. సంయుక్త సాయుధ పోలీసు బలగాలు (సి ఎ పి ఎఫ్)లో వివిధ స్థాయిలలో ఉన్నట్లుగానే రక్షణ రంగంలోనూ సమానత్వాన్ని తీసుకు రావాలన్నదే ఇందులోని ఉద్దేశం.
7. రక్షణ మరియు సంయుక్త సాయుధ పోలీసు బలగాల (సి ఎ పి ఎఫ్) ఉద్యోగులు సహా వేరు వేరు ఉద్యోగులపైన ప్రభావాన్ని చూపగల మరి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. వాటిలో ఈ కింద పేర్కొన్నవి కూడా కలసి ఉన్నాయి.. :
• గ్రట్యూటీ గరిష్ఠ పరిమితిని రూ. 10 లక్షల నుండి పెంచి, రూ.20 లక్షలు చేసేశారు. డి ఎ 50 శాతం పెరిగినపుడల్లా, గ్రట్యూటీ పై గరిష్ఠ పరిమితి సైతం 25 శాతం పెరిగిపోనుంది.
• పౌర మరియు రక్షణ బలగాల ఉద్యోగుల సంబంధికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఏకమొత్తపు పరిహారం చెల్లింపు కోసం ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పరచారు. ఇందులో.. వివిధ కేటగిరీలకు ఇప్పుడు ఉన్న రేట్లను రూ. 10 లక్షలు- రూ.20 లక్షల నుండి రూ. 25 లక్షలు-రూ.45 లక్షలకు పెంచివేశారు.
• రక్షణ బలగాల సిబ్బందిలో వేరు వేరు కేటగిరీలకు మిలిటరీ సర్వీస్ పే రేట్లను రూ. 1,000, రూ.2,000, రూ.4,200 మరియు రూ.6,000 ల నుండి క్రమానుగతంగా రూ. 3,600, రూ. 5,200, రూ. 10,800 మరియు రూ.15, 500కు పెంచడం జరిగింది.
• స్వల్ప సమయ సేవల కోసం నియమించుకున్న అధికారులకు (7 ఏళ్ల నుండి పదేళ్ల లోపు ఎప్పుడైనా సాయుధ బలగాల నుండి వెళ్లిపోయేందుకు అవకాశం ఉన్నవారికి) వారి 10.5 నెలల వేతనంతో సమానమైన గ్రట్యూటీ ని ఇవ్వనున్నారు.
• ఇన్నాళ్లుగా ఉన్న ఆసుపత్రి సెలవు, ప్రత్యేక అంగవైకల్య సెలవు, అనారోగ్య సెలవుల వంటి వాటన్నింటినీ ‘పనికి సంబంధించిన అనారోగ్యం, గాయం సెలవు’ (డబ్ల్యు ఆర్ ఐ ఐ ఎల్) పేరిట ఒక కొత్త సెలవుగా మార్పు చేశారు. ఈ సెలవు పెట్టుకొని ఉద్యోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నన్ని రోజులు ఉద్యోగులకు పూర్తి వేతనం, అలవెన్సులు మంజూరు చేస్తారు.
8. గృహ నిర్మాణ అడ్వాన్సు గరిష్ఠ పరిమితిని రూ. 7.50 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచాలన్న కమిషన్ సిఫారసును కూడా మంత్రిమండలి ఆమోదించింది. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం.. వైద్య చికిత్స కోసం అడ్వాన్సు, పర్యటనలు, బదిలీ అయినపుడు టిఎ (ప్రయాణ భత్యం), మరణించిన ఉద్యోగి కుటుంబానికి టిఎ, ఎల్‌టిసి ల వంటి నాలుగు వడ్డీ రహిత అడ్వాన్సులను అలాగే ఉంచారు. ఇవికాక మిగిలిన అన్ని వడ్డీ రహిత అడ్వాన్సులను రద్దు చేశారు.
9. సంఘం సిఫారసు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బృంద బీమా పథకం (సిజిఇజిఐఎస్)కు చెల్లించే నెలవారీ వాటాలో భారీ పెంపును ఆమోదించకూడని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ప్రస్తుతమున్న నెలవారీ వాటాలే కొనసాగనున్నాయి. దీని వల్ల కింది స్థాయి ఉద్యోగులకు చేతికి అందే వేతనం రూ. 1,470 మేర పెరగనుంది. అయితే, ఉద్యోగుల సామాజిక భద్రత అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవర్ ఉండేటట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటూ ప్రత్యేకంగా ఒక బృంద బీమా పథకంపై కసరత్తు చేయవలసిందిగా ఆర్థిక శాఖకు మంత్రిమండలి సూచించింది.
10. పింఛను, సంబంధిత ప్రయోజనాలకు సంబంధించి సంఘం చేసిన సాధారణ సిఫారసులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పింఛను సవరణకు సంబంధించి సంఘం చేసిన రెండు ఐచ్ఛికాలకు (ఆప్షన్ లను) వాటి అమలులోని సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా ఆమోదం తెలిపింది. 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉన్న రెండో ఐచ్ఛికాన్ని వినియోగించుకొని తక్షణమే పింఛను సవరణ అమలవ్వాలి. మొదటి సూత్రీకరణ అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఓ సంఘాన్ని వేయనున్నారు. తొలి సూత్రీకరణ అమలు సాధ్యమేనని సంఘం పరీక్షలో తేలితే.. దీనినే వర్తింపచేస్తారు. ఈ సంఘం 4 నెలల్లో నివేదికను ఇవ్వాల్సివుంటుంది.
11. సి పి సి ఇప్పుడు ఉన్న 196 అలవెన్సులను, వాటి హేతుబద్ధీకరణ ఆధారంగా పరీక్షించింది. వీటిలో 51 అలవెన్సులను రద్దు చేయాలని, 37 అలవెన్సులను కలిపేయాలని సూచించింది. అయితే.. విస్తృతమైన అర్థమున్న అలవెన్సుల నిబంధనలకు ముఖ్యమైన మార్పులను సూచించినందున.. అలవెన్సులపై 7వ సి పి సి చేసిన సిఫారసులను పరీక్షించేందుకు ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో ఓ సంఘాన్ని వేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రతిపాదిత సంఘం తన నివేదికను 4 నెలల్లో అందజేస్తుంది. ఒక తుది నిర్ణయాన్ని తీసుకొనేటంత వరకు ఇప్పుడున్న అన్ని అలవెన్సులను ప్రస్తుత రేట్లలోనే చెల్లించనున్నారు.
12. జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్ పి ఎస్) అమలును గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఒక సంఘాన్ని, కమిషన్ రిపోర్టు అమలులో తలెత్తే సమస్యలను గుర్తించేందుకు ఒక సంఘాన్ని వేరువేరుగా ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
13. సి పి సి ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయిన అంశాలను, వ్యక్తిగత పదవికి / కాడర్ కు సబంధించిన అంశాలను, పాలన సంబంధమైన అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు పరిశీలించవచ్చని మంత్రిమండలి నిర్ణయించింది.
14. 7వ సి పి సి అంచనా వేసిన ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో తన సిఫారసులన్నింటిని అమలు చేసేటట్లయితే అదనంగా రూ.1,02,100 కోట్ల భారం పడుతుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలోని రెండు నెలలకు వేతన బకాయిలు, పింఛను బకాయిల రీత్యా మరొక రూ.12, 133 కోట్లు ఖర్చు కాగలదు.