ద ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకు కు కాబోయే అధ్యక్షుడు శ్రీ జిన్ లీకున్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం ద్వారా ఏఐఐబీ కి అధ్యక్షుడిగా ప్రప్రథమంగా ఎంపికైన శ్రీ లీకున్ ను ప్రధాని అభినందించారు.
ఆసియా ప్రాంత దేశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బీఆర్ఐసీఎస్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు తో పాటు ఏఐఐబీ కూడా ముఖ్య పాత్రను పోషిస్తుందన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. వివిధ దేశాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచేందుకు రహదారి మార్గాలు, రైలు మార్గాలు, నౌకాశ్రయాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. అలాగే, శీతోష్ణ స్థితులలో వచ్చే మార్పులకు తట్టుకొని నిలబడగల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలోనూ, నిలకడతో కూడిన ప్రగతి సాధన కోసం కాలుష్యానికి చోటు ఇవ్వని శక్తిని సమకూర్చుకోవడం పైనా దృష్టి పెట్టాలని, ఇలా చేయడం ఆర్థిక పురోగతిని ఇనుమడింపచేయడమే కాకుండా లక్షలాది ప్రజలను పేదరికంలో నుంచి వెలికితీసుకురాగలదని కూడా ప్రధాని అన్నారు.
ఏఐఐబీ వ్యవస్థాపక సభ్య దేశం గాను, ఆ బ్యాంకులో రెండో అతి పెద్ద షేర్ హోల్డర్ గాను ఉన్న భారతదేశం ఏఐఐబీ విజయం సాధించడానికి గాను తన పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధాన మంత్రి హామీని ఇచ్చారు.