దాదాపు ఒక సంవత్సరం కిందట నేను మధ్య ఆసియా దేశాల పర్యటనను తాశ్ కెంత్ నుండి ప్రారంభించాను.
శ్రేష్ఠుడు శ్రీ కరీమోవ్ మరియు ఉజ్ బెక్ ప్రజానీకం అందించిన స్నేహశీలత్వాన్ని, ఉదారమైన స్వాగతాన్ని నేను ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకొన్నాను.
ఈ సమావేశం నిర్వహణకు ఇంత ఉత్తమమైన ఏర్పాట్లు చేసిన శ్రేష్ఠుడు శ్రీ కరీమోవ్ కు, ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఇతర నాయకులలో నన్ను కూడా ఒకరుగా కలవనీయండి.
గత ఏడాది అధ్యక్షుడు శ్రీ పుతిన్ ఎంతో సమర్థంగా నిర్వహించిన ఉఫా శిఖరాగ్ర సమావేశంలో భారతదేశాన్ని ఎస్ సి ఒ లో పూర్తి స్థాయి సభ్యత్వ దేశంగా చేర్చుకునే ప్రతిపాదనను ఎస్ సి ఒ నాయకులంతా ఆమోదించారు.
అది ఎస్ సి ఒ తో భారతదేశ అనుబంధంలో కీలకమైన ఘట్టం.
ఈ రోజు మనం మెమొరాండం ఆఫ్ ఆబ్లిగేషన్స్ పై సంతకాలు చేయబోతున్నాం.
దీనితో ఎస్ సి ఒ లో భారతదేశం సభ్యత్వ ప్రక్రియ లాంఛనాలన్నింటినీ మనం పూర్తి చేసినట్లు అవుతుంది.
ఈ ప్రాంతంతో భారతదేశానికి ఉన్న పురాతన బంధాలకు ఇది ఒక తార్కికమైన విస్తరణ అవుతుంది; ప్రపంచ జనాభాలో ఆరింట ఒక వంతు ఎస్ సి ఒ కుటుంబంలో భాగం కానున్నది.
ఎస్ సి ఒలో భారతదేశానికి సభ్యత్వం అనే ప్రతిపాదనకు ఉబ్బితబ్బిబ్బు అయ్యేటటువంటి మద్దతును అందించినందుకు ఎస్ సి ఒ సభ్యత్వ దేశాలకు నిజానికి మేం ఎంతో కృతజ్ఞులం.
ఎస్ సి ఒ లో కొత్త సభ్యత్వ దేశమైన పాకిస్తాన్ కు, ఈ సముదాయంలో మొట్టమొదటిసారి పరిశీలక హోదా లభించిన బెలారూస్ కు కూడా నేను స్వాగతం పలుకుతున్నాను.
శ్రేష్ఠులారా,
భారతదేశం ఈ ప్రాంతానికి కొత్త ఏమీ కాదు. మీతో మా చారిత్రక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. మనను కలుపుతున్నది ఒక్క భౌగోళిక బంధం మాత్రమే కాదు. మన మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలు, పాక శైలులు మరియు వాణిజ్య సంబంధాల వల్ల మన సమాజాలు సంపన్నమయ్యాయి.
అవి రష్యా, చైనా, మరియు మధ్య ఆసియా దేశాలతో ఈనాటి మన సంబంధాలకు బలమైన పునాదిగా ఉన్నాయి.
శ్రేష్ఠులారా,
భారతదేశం పూర్తి స్థాయి సభ్యత్వ దేశం కావడంతో ఎస్ సి ఒ సరిహద్దులు పసిఫిక్ నుండి యూరోప్ నకు; ఆర్క్ టిక్ నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించగలవు.
మనం ప్రపంచ జనాభాలో 40 శాతం జనాభాకు, ఒక బిలియన్ యువతీయువకులకు ప్రాతినిధ్యం వహించగలం.
ఈ సముదాయానికి ఎస్ సి ఒ సిద్ధాంతాలకు అనుగుణమైన సిద్ధాంతాలను భారతదేశం అందిస్తోంది.
యూరేసియా ప్రజలతో భారతదేశం ఎల్లప్పుడూ మంచి సంబంధాలనే కలిగివుంది.
ఆసియా- పసిఫిక్ ప్రాంతానికి సుస్థిరత, భద్రత, సుసంపన్నత తీసుకురావాలన్న అంతర్జాతీయ లక్ష్యాల సాధనలో మేం కూడా భాగస్వాములం అవుతున్నాం.
శక్తి, ప్రాకృతిక వనరులు, పారిశ్రామిక విభాగాలలో ఎస్ సి ఒ కు ఉన్న బలాల నుండి భారతదేశం ప్రయోజనం పొందుతుందనడంలో ఎటువంటి సందేహానికి తావు లేదు.
దీనికి బదులుగా, దృఢమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు భారతదేశపు విస్తార మార్కెటు ఎస్ సి ఒ ప్రాంత ఆర్థిక పురోగతిని మరింత ముందుకు నడిపించగలదు.
వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార- సాంకేతిక విజ్ఞానం, అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాలలో భారతదేశానికి ఉన్న సత్తా ఎస్ సి ఒ సభ్యత్వ దేశాలకు ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చగలవు.
ఈ ప్రాంతంలో మానవ వనరులు మరియు సంస్థాగత సామర్థ్యాలను అభివృద్ధి పరచడంలో మేం భాగస్వాములం కాగలం.
మన ప్రాథమ్యాలు ఒకదానితో మరొకటి తుల తూగుతున్న కారణంగా అభివృద్ధి క్రమంలో మన అనుభవాలు మన దేశాల అవసరాలను తీర్చడంలో దోహదపడగలుగుతాయి.
శ్రేష్ఠులారా,
21వ శతాబ్దికి చెందిన పరస్పర ఆధారిత ప్రపంచంలో ఆర్థికావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అలాగే భౌగోళిక-రాజకీయ సంక్లిష్టతలు, భద్రత పరమైన సవాళ్లు మన ముందున్నాయి.
ఆర్థికంగా మనం సుసంపన్నం కావాలంటే ఈ ప్రాంతంలోని దేశాల మధ్య అనుసంధానం అత్యంత అవసరం.
భౌగోళిక అనుసంధానం ఒక్కటే సరిపోదు.
మనకు కావలసింది వస్తువులు, సేవలు, మూలధనం, మరియు ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు.
అయితే, ఇవి ఉంటేనే చాలదు.
మన ప్రాంతం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో రైలుమార్గాలు, రహదారులు, మరియు వాయు మార్గాలను కూడా విస్తరించుకోవలసిన అవసరం ఉంది.
అలాగే ఎస్ సి ఒ లో భారతదేశం వాణిజ్య, రవాణా, శక్తి, డిజిటల్ రంగాలలో, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను విస్తరించడంతో నిర్మాణాత్మక భాగస్వామి కాగలదు.
అంతర్జాతీయ స్థాయిలో నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడర్ లోను, చాబహార్ ఒప్పందంలోను, అశ్ గబత్ ఒప్పందంలోను చేరాలన్న మా నిర్ణయం ఈ కోరికకు, అభిమతానికి అద్దం పడుతున్నవే.
శ్రేష్ఠులారా,
ఎస్ సి ఒ లో భారతదేశ సభ్యత్వం ఈ ప్రాంత సుసంపన్నతకు తోడ్పడగలదు. ఇది ఈ ప్రాంత భద్రతను కూడా పటిష్ఠం చేయగలదు. విద్వేషం, హింస, భయోత్పాతం వంటి తీవ్ర సిద్ధాంతాల బారి నుండి మన సమాజాలకు మన భాగస్వామ్యం రక్షణ కల్పించగలదు.
ఈ లక్ష్య సాధన కోసం భారతదేశం ఎస్ సి ఒ సభ్యత్వ దేశాలతో కలసి పనిచేయగలదు. మనం తీవ్రవాదంతో అన్ని స్థాయిలలోను పోరాడడానికి ఎంత మాత్రం సహనానికి తావు ఇవ్వకుండా ఏకన్ముఖ ధ్యేయంతో ముందంజ వేద్దాం.
ఇదే విధమైన ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకొంటే, స్థిరమైన, స్వతంత్రమైన మరియు శాంతియుతమైన అఫ్గానిస్తాన్ అవతరణ అనేది ప్రతి ఒక్క అఫ్గాన్ పౌరుని నిజాయతీ కలిగిన కాంక్ష మాత్రమే కాదు; అది ఎస్ సి ఒ ప్రాంతం మరింత భద్రంగా, సురక్షతో కూడుకొని ఉండేటందుకు కూడా అవసరమైందే.
చివరగా శ్రీ అధ్యక్షా,
ఎస్ సి ఒ సభ్యత్వ దేశాలతో భారతదేశ అనుబంధం.. ప్రపంచ ఆర్థిక పురోగతికి చోదక శక్తి అయ్యే; అంతర్గతంగా ఇతోధిక స్థిరత్వం మరియు భద్రత కలిగి వుండే; ఇతర భోగోళిక ప్రాంతాలతో దృఢంగా పెనవేసుకొనే.. ఒక ప్రాంతాన్ని తీర్చిదిద్దగలదన్న నమ్మకం నాకుంది.
శ్రేష్ఠులారా,
వచ్చే సంవత్సరం ఆస్తానాలో జరుగబోయే ఎస్ సి ఒ సమావేశానికి సమాన భాగస్వామిగా హాజరయ్యేందుకు మేం ఎదురుచూస్తుంటాం.
2017 లో ఎస్ సి ఒ కి అధ్యక్షత వహించనున్న కజక్ స్తాన్ విజయం సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
ఉజ్ బెకిస్తాన్ ప్రభుత్వానికి మరియు ప్రజలకు వారు ఇచ్చిన ఆతిథ్యానికి గాను నేను మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఈ రోజు విజయవంతంగా సమావేశాన్ని నిర్వహించినందుకు శ్రేష్ఠుడు శ్రీ కరీమోవ్ కు ఇవే నా అభినందనలు.
మీకు ధన్యవాదాలు.
SCO Summit leaders in Uzbekistan. pic.twitter.com/Ijs7gWUTIl
— PMO India (@PMOIndia) June 24, 2016
My remarks at the SCO Summit focused on the rich potential of what the SCO can achieve & how India will gain from the strengths of the SCO.
— Narendra Modi (@narendramodi) June 24, 2016
Highlighted the need to adopt zero tolerance to terror & the need for a comprehensive approach to fight terrorism at all levels.
— Narendra Modi (@narendramodi) June 24, 2016
India will be a productive partner in building strong trade, transport, energy, digital & people-to-people links. https://t.co/JICun9KRzs
— Narendra Modi (@narendramodi) June 24, 2016