Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్సెల్ గ్రూపు 90 సంవత్సరాల ఉత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ఎస్సెల్ గ్రూపు 90 సంవత్సరాల ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరయ్యారు.

ప్రధాన మంత్రికి ఎస్సెల్ గ్రూపు చైర్మన్ శ్రీ సుభాష్ చంద్ర స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పంపిన ఆహ్వానాన్ని దయతో స్వీకరించినందుకుగాను ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సెల్ గ్రూపు ఇటీవల చేపట్టిన నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా, స్వచ్ఛ భారత్ మరియు తక్కువ ఖర్చులో గృహ‌ నిర్మాణ‌ం వగైరా కార్యక్రమాలను గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ప్రధాన మంత్రి శ్రీ మోదీ రెండు సామాజిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రారంభించారు. వాటిలో ఒకటైన “సార్థి’’ అనేది విద్య, ఆరోగ్యం మరియు ఉద్యోగం వంటి విషయాలపైన ప్రజలకు సాధికారితను కల్పించే కార్యక్రమం కాగా, మరొక కార్యక్రమం ఆపన్నులైనటువంటి ప్రజలకు సాధికారితను కల్పించడం కోసం రూ.5000 కోట్ల కార్పస్ తో డిఎస్ సి ఫౌండేషన్ గురించిన ప్రకటన.

ప్రధాన మంత్రి ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతీయ సంప్రదాయాలకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని అభివర్ణించారు. వరుసగా వచ్చే తరాలు కుటుంబ విలువలను ముందుకు తీసుకుపోయే సంప్రదాయం మరియు వారి వారి సామర్థ్యాలతోను, దక్షతతోను కుటుంబానికి తమ వంతు తోడ్పాటును అందించే సంప్రదాయం భారతదేశంలో నెలకొన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.

శ్రీ నంద్ కిశోర్ గోయంకా తో తాను లోగడ జరిపిన సమావేశాలను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ, ఈ కుటుంబం కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఎల్లప్పుడూ ముందుండేదని, ప్రతి సవాలును ఒక అవకాశంగా తీసుకొందని, ‘‘భూమి నుండి ఉపగ్రహం’’ వరకు ఒక శ్రేణిని కలిగిన కార్యక్రమాలలో తన ఉనికిని చాటుకొందని ప్రధాన మంత్రి వివరించారు.

సభకు హాజరైన ప్రతి ఒక్కరు స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయ్యే సరికి అంటే, 2022 వ సంవత్సరానికల్లా, వారు దేశం కోసం ఏమేం చేయగలరనే అంశంలో నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు.

****