Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఎల్బీఎస్‌ఎన్ఏఏ’లో 96వ కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం

‘ఎల్బీఎస్‌ఎన్ఏఏ’లో 96వ కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం


   ఫౌండేషన్ కోర్సు పూర్తిచేసిన యువ మిత్రులందరికీ విశేష అభినందనలు! ఇవాళ హోలీ పర్వదినం నేపథ్యంలో దేశ ప్రజలతోపాటు మీకు, మీ అకాడమీ సిబ్బందికి వారి కుటుంబాలకు హోలీ శుభాకాంక్షలు. ఇదే రోజున శ్రీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల పేరిట పోస్టల్ సర్టిఫికేట్లను మీ అకాడమీ జారీ చేయడం కూడా నాకెంతో సంతోషం కలిగించింది. అంతేకాకుండా  కొత్త క్రీడా ప్రాంగణం, హ్యాపీ వ్యాలీ ప్రాంగణం ఇవాళే ప్రారంభం కావడం ముదావహం. ఈ సదుపాయాలతో జట్టు స్ఫూర్తి, ఆరోగ్యం, శరీర దారుఢ్యం బలోపేతం అవుతాయి. అలాగే సివిల్ సర్వీసులను మరింత ఆధునికం, సమర్థంగా రూపుదిద్దడంలో దోహదం చేస్తాయి.

మిత్రులారా!

   నేను కొన్నేళ్లుగా వివిధ సివిల్ సర్వెంట్ల బృందాలను కలుసుకుంటూ, వారితో గడుపుతూ వస్తున్నాను. కానీ, నా దృష్టిలో మీ బృందానికి చాలా ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 75వ ఏట నిర్వహిస్తున్న అమృత మహోత్సవ కాలంలో మీరంతా మీ ఉద్యోగ జీవితానికి శ్రీకారం చుడుతున్నారు. భారత స్వాతంత్ర్యం శతాబ్ది వేడుకలకు సిద్ధమయ్యే నాటికి మాలో చాలామంది ఉండరు. కానీ, మీరు, మీ బృంద సభ్యులు మాత్రం అందులో పాలుపంచుకుంటారు. ఈ పవిత్ర స్వాతంత్య్ర సమయంలో రాబోయే 25 ఏళ్లలో దేశ ప్రగతి పయనాన్ని వివరించే అన్ని పరిణామాలలో మీ వృత్తాంతంసహా మీ బృందం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

   21వ శతాబ్దపు ప్రస్తుత తరుణంలో ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది. కరోనా సృష్టించిన బీభత్సం అనంతర పరిస్థితుల నుంచి కొత్త ప్రపంచ క్రమం ఆవిర్భవిస్తోంది. ఈ క్రమంలో భారత్ తన పాత్రనే కాకుండా స్వీయ ప్రగతి వేగాన్ని కూడా పెంచుకోవాలి. ఈ మేరకు గత 75 ఏళ్లలో ముందడుగు వేసినదానికన్నా అనేక రెట్లు అధిక వేగంతో దూసుకుపోవాల్సిన తరుణమిది. సమీప భవిష్యత్తులో మీరు ఒక జిల్లా లేదా ఒక శాఖను నడిపించే స్థితిలో ఉంటారు. మీ పర్యవేక్షణలో ఎక్కడో ఒకచోట ఒక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు సాగుతూండవచ్చు. లేదా విధాన రూపకల్పన స్థాయిలో మీరు సలహాలిచ్చే ఉన్నత స్థితిలోనూ ఉండవచ్చు. వీటన్నిటి నడుమ 21వ శతాబ్దపు మన అతిపెద్ద లక్ష్యం స్వయం సమృద్ధ-నవ భారత నిర్మాణమేనని మీరు మరువరాదు. ఈ సమయంలో అటువంటి అవకాశాన్ని ఎంతమాత్రం వదులుకోరాదు కాబట్టి మీమీద నాకు భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలు మీ వ్యక్తిత్వం, కార్యాచరణ, పని సంస్కృతికి సంబంధించినవే. ఈ నేపథ్యంలో మీ వ్యక్తిత్వ వికాసంలో ఉపయోగపడగల కొన్ని చిన్నచిన్న అంశాలతో నేను ప్రారంభిస్తాను.

మిత్రులారా!

   మీ శిక్షణ సమయంలో శ్రీ సర్దార్ పటేల్ దార్శనికత, ఆలోచనలపై మీకు అవగాహన కల్పించారు. అలాగే సేవా స్ఫూర్తి, కర్తవ్య పరాయణత రెండింటి ప్రాధాన్యం మీ శిక్షణలో సమగ్ర భాగంగా ఉంది. మీరు ఈ సర్వీసులో ఎన్నేళ్లు కొనసాగినా ఈ అంశాలు మీ వ్యక్తిగత, వృత్తిగత విజయానికి కొలమానం కావాలి. సేవాభావం, కర్తవ్య పరాయణత స్థాయి తగ్గకుండా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీ లక్ష్యానికి దూరమవుతున్నారేమో నిరంతరం విశ్లేషించుకోవాలి. ఈ లక్ష్యాన్ని సదా ప్రాధాన్య స్థానంలో ఉంచండి. అది దారిమళ్లడం లేదా పలచబారడం ఉండకూడదు. అధికారం తలెకెక్కి సేవాతత్పరత క్షీణించడంవల్ల వ్యక్తి లేదా వ్యవస్థ తీవ్రంగా నష్టపోవడం మనమంతా ప్రత్యక్షంగా చూశాం. కొందరి విషయంలో ఈ నష్టం త్వరగానో, ఆలస్యంగానో సంభవించవచ్చు కానీ, అది అనివార్యం అన్నది వాస్తవం.

మిత్రులారా!

   మీకు ప్రయోజనకరం కాగల మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం కర్తవ్య పరాయణతతో, లక్ష్యసాధనకు ప్రాధాన్యంతో కృషిచేస్తే ఏ పనీ భారం కాబోదు. మీరంతా ఇక్కడికి ఏదో ఒక లక్ష్యంతోనే వచ్చారు. అలాగే ఈ సమాజం, దేశం సానుకూల పరివర్తనలో భాగమయ్యేందుకు వచ్చారు. అయితే, పని పూర్తి చేయించడంలో ఆజ్ఞలివ్వడం లేదా కర్తవ్య నిబద్ధతను ప్రేరేపించడం అనే రెండు పద్ధతుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి కర్తవ్య ప్రేరేపణ అన్నది మీరు పెంచుకోవాల్సిన నాయకత్వ లక్షణమని నా భావన. జట్టు స్ఫూర్తికి ఇదెంతో అవసరం. ఇది అత్యంత ముఖ్యమైనదేగాక ఇందులో రాజీపడే అవకాశమే ఉండదు.

మిత్రులారా!

   ప్పటినుంచి కొన్ని నెలల తర్వాత మీరంతా కార్యరంగంలో దిగుతారు. కాబట్టి ఫైళ్లకు, వాస్తవాలకు మధ్యగల తేడాను అర్థం చేసుకుంటూ మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఫైళ్లు పరిష్కరించినంత మాత్రాన మీకు నిజమైన సంతృప్తి కనిపించదు. క్షేత్రస్థాయితో మీ సంధానం ద్వారానే అసలైన అనుభూతి సాకారమవుతుంది. ఫైళ్లలో ఉండే సమాచారం కేవలం అంకెలు, లెక్కలు కాదనే వాస్తవాన్ని మీరు జీవితాంతం గుర్తుంచుకోవాలి. ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ఒక జీవితమే. ఆ జీవితాలకు కొన్ని ఆశలు-ఆకాంక్షలతోపాటు సమస్యలు-సవాళ్లు కూడా ఉంటాయని గ్రహించాలి. కాబట్టి మీరు అంకెల ఆధారంగా కాకుండా ప్రతి వ్యక్తి జీవితం ప్రాతిపదికన పని చేయాలి. మీతో ఇలా నా మనోభావాలను పంచుకోవాలని భావిస్తున్నాను. ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకోవడంలో ఈ తారకమంత్రం ధైర్యాన్నిస్తుంది. దాన్ని అనుసరించడం ద్వారా మీరు తప్పులు చేసే పరిస్థితి అరుదుగా ఉంటుంది.

మిత్రులారా!

   మీరు ఎక్కడ నియమితులైనా ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్న ఆసక్తి, ఉత్సాహం మీలో ఉంటాయి. పరిస్థితుల్లో మార్పు తేవడంపై మీకెన్నో ఆలోచనలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏదైనా ఒకటి సముచితం కాదని, మార్పు అవసరమని మీరు భావిస్తారు. అలాంటప్పుడు అప్పటికే ఏళ్ల తరబడి అమలులోగల పలు వ్యవస్థలు, నియమ నిబంధనలు మీకు అడ్డు నిలుస్తాయి. వాటిని మీరు ఇష్టపడకపోవచ్చు లేదా అవి అసంబద్ధమైనవిగా, ప్రతిబంధకాలుగా  మీకు అనిపించవచ్చు. అది తప్పని నేను చెప్పను… అదంతా నిజమే కావచ్చు. మీ చేతిలో అధికారం ఉన్నపుడు మీదైన మార్గంలో పని చేయాలని భావించినపుడు ఒక్కసారి ఓర్పుతో పునరాలోచించండి. నేను సూచించే మార్గాన్ని మీరు అనుసరించగలరా?

   నేను మీకో సలహా ఇవ్వదలిచాను. ఒక నిర్దిష్ట వ్యవస్థ లేదా నిబంధన రూపొందడానికి మూలేమేమిటో అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నించండి. ఏ సందర్భాల నడుమ అది అమలులోకి వచ్చిందో, అప్పటి పరిస్థితులేమిటో అవగాహన చేసుకోండి. ఆ మేరకు 20, 50, 100 సంవత్సరాల కిందట అది ఎందుకు రూపొందించబడిందో ఫైళ్లలోని ప్రతి పదాన్నీ సాదృశ ధోరణితో పరిశీలించండి. క్షుణ్నంగా అధ్యయనం చేసి, సదరు వ్యవస్థలోని సహేతుకత, దానివెనుకగల ఆలోచన లేదా అవసరం ఎలాంటిదో గమనించండి. దాని మూలాల్లోకి వెళ్లి సదరు నిబంధన ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోండి. ఒక సమస్య మూలాల్లోకి వెళ్లి మీరు అధ్యయనం చేసినపుడు దానికి శాశ్వత పరిష్కారాన్ని మీరు కనుగొనగలరు. ఆదరాబాదరా చేసిన పనులు ఆ సమయానికి సరైనవిగా అనిపించవచ్చు… కానీ, అవి శాశ్వత పరిష్కారానికి దోహదపడవు. మీరు ఈ విధంగా లోతుకు వెళ్లినపుడు సంబంధిత ప్రాంతంలో పాలన వ్యవహారాలపై మీకు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. ఇదంతా చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోబోయే ముందు మరొక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి.

   హాత్మాగాంధీ ఎప్పుడూ- “మీ నిర్ణయంతో సమాజంలోని చివరి వరుసలోగల వ్యక్తికి కూడా ప్రయోజనం కలుగుతుందంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దు” అని చెబుతూండేవారు. అయితే, దీనికి నేను మరొక అంశం జోడిస్తాను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏ వ్యవస్థను మార్చినా మనం అఖిలభారత సర్వీసులకు ప్రతినిధులం కాబట్టి అది దేశం మొత్తాన్నీ దృష్టిలో ఉంచుకుని చేయాలి. మన మదిలోగల నిర్ణయం స్థానికతకు పరిమితమైనదే కావచ్చు… కానీ, సంబంధి స్వప్నం మాత్రం దేశం మొత్తానికీ వర్తించాలి.

మిత్రులారా!

   స్వాతంత్ర్య ‘అమృత్ కాలం’లో మనం “సంస్కరణ, సామర్థ్యం, పరివర్తన”లను తదుపరి స్థాయికి చేర్చేందుకు కృషిచేయాలి. ఆ మేరకే భారతదేశం ‘సబ్‌ కా ప్రయాస్’ స్ఫూర్తితో ముందుకెళ్తోంది. మీ ప్రయత్నాల్లో ప్రతి ఒక్కరి కృషి, భాగస్వామ్యాల శక్తిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ పనిలో అనేక విభాగాలను, ప్రతి ఉద్యోగినీ సంధానించే ప్రయత్నం చేస్తే అది తొలి వలయం అవుతుంది. కానీ, సామాజిక సంస్థలు, సాధారణ ప్రజానీకాన్ని జోడిస్తే అది మరింత పెద్ద వలయం కాగలదు. ఒక విధంగా చూస్తే- సమాజంలోని చివరి వ్యక్తిసహా ప్రతి ఒక్కరూ మీ ప్రయత్నాల్లో భాగంగా ఉంటూ వారికీ యాజమాన్యం ఉండాలి. ఈ విధంగా చేస్తే పొందగల బలాన్ని మీరు ఊహించలేరు.

   ఉదాహరణకు ఒక పెద్ద నగరంలోని పురపాలక సంఘంలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అనేకమంది పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నారని భావిద్దాం. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడూ వారి కృషిలో భాగం పంచుకుంటే అది పారిశుధ్య కార్మికులకు ప్రతిరోజూ పండుగ కాదా? మురికిపై అదొక ప్రజా ఉద్యమంగా మారదా? దానివల్ల ఫలితాలు బహుముఖంగా ఉంటాయా… లేదా? ప్రతి ఒక్కరి కృషి సహజంగానే సానుకూల ఫలితాన్నిస్తుంది. మొత్తంమీద ప్రజా భాగస్వామ్యం ఉన్నపుడు ఒకటీ+ఒకటీ 2 కాదు… 11 అవుతుంది!

మిత్రులారా!

   మీకు ఇవాళ నేను మరొక కార్యభారం కూడా అప్పగిస్తున్నాను. మీ ఉద్యోగ జీవితమంతా- ఒకవిధంగా మీ జీవితంలో అదొక భాగమయ్యేలా.. ఓ అలవాటుగా దీన్ని కొనసాగించండి. సంప్రదాయమంటే కృషివల్ల అలవాటుగా మారేదేనని నా దృష్టిలో సాదాసీదా నిర్వచనం. మీరు ఏ జిల్లాలో నియమితులైన అక్కడి సమస్యలు, కష్టాలపై ఒక విశ్లేషణ చేపట్టండి. అయితే, ఈ సమస్యలను మీకు ముందున్నవారు ఎందుకు పరిష్కరించలేదన్న ప్రశ్న మీ మదిలో తలెత్తవచ్చు. ఏదేమైనా మీరు నియమించబడిన జిల్లాలో జనజీవనానికి సమస్యాత్మకంగా మారిన, వాటి ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచిన ఓ ఐదు సవాళ్లను గుర్తించగలరా? వాటిని మీరు స్థానిక స్థాయిలో గుర్తించడం ప్రధానం. ఇదెందుకు అవసరమో కూడా నేను మీకు వివరిస్తాను. మా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో మేమూ అటువంటి కొన్ని సవాళ్లను గుర్తించాం. ఒకసారి ఈ పని పూర్తయ్యాక వాటి పరిష్కారానికి ముందడుగు వేశాం. మరి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాతనైనా పేదలకు పక్కా ఇళ్లు ఉండవద్దా? ఇదొక పెనుసవాలు… దీన్ని మేం స్వీకరించాం. పేదలందరికీ పక్కా ఇల్లు ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పరిధిని వేగంగా విస్తరించాం.

   దేశంలో అనేక జిల్లాలు ఇలా ప్రగతి పరుగులో దశాబ్దాల వెనుకబాటు అనే పెనుసవాలును ఎదుర్కొంటున్నాయి. ఒక రాష్ట్రం ఎంతో ముందంజ వేసినా, దాని పరిధిలోని రెండు జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అలాగే ఒక జిల్లా ఎంతో అభివృద్ధి చెందినా దాని పరిధిలోని రెండు సమితులు కునారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక దేశంగా అటువంటి జిల్లాలను గుర్తించే సమగ్ర ప్రణాళికను రూపొందించాం. ఇలా గుర్తించాక ఆ జిల్లాలను రాష్ట్ర సగటు స్థాయికి… వీలైతే జాతీయ సగటు స్థాయికి చేర్చే దిశగా ‘ప్రగతికాముక జిల్లాల’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా పేదలకు విద్యుత్తు, వంటగ్యాస్‌ కనెక్షన్ల లభ్యత మరొక సవాలు. దీన్ని పరిష్కరించడానికి ‘ఉజ్వల’ పథకం కింద మేం ‘సౌభాగ్య’ కార్యక్రమం ప్రారంభించి వారికి ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా మేం ఈ కృషికి శ్రీకారం చుట్టి, ఇన్నేళ్లలో ప్రభుత్వ పథకాలను సంతృప్తస్థాయికి చేర్చే దిశగా ఏ ప్రభుత్వమూ ఆలోచించని పరిస్థితిని తొలగించాం.

   నేపథ్యంలో మీకో ఉదాహరణ చెబుతాను. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఒకనాడు అనేక ప్రాజెక్టులు స్తంభించిపోతూండేవి. అలాగే ఒక రోడ్డు వేసిన మరునాడు టెలిఫోన్‌ శాఖ దాన్ని తవ్విపోసేది. ఆ తర్వాత మురుగునీటి పారుదల శాఖ మరోసారి తవ్వేసేది. అందుకే సమన్వయ లోపం సవాలును అధిగమించే దిశగా మేం ‘పీఎం గతిశక్తి’ పేరిట జాతీయ బృహత్‌ ప్రణాళికను రూపొందించాం. తద్వారా అన్ని కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలక వ్యవస్థలతోపాటు ప్రతి భాగస్వామ్య సంస్థకూ ఆయా ప్రాజెక్టులపై ముందస్తు సమాచారం ఇవ్వడాన్ని తప్పనిసరి చేశాం. మనం సవాలును గుర్తించగలిగితే దానికి పరిష్కారం అన్వేషించి అమలు చేయడం సులువు కాగలదనడానికి ఇదొక నిదర్శనం. అందువల్ల మీరు పనిచేసే ప్రాంతాల్లో మీరు ఏ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకు ఆనందం కలుగుతుందో అలాంటివాటిలో 5-7-10 సవాళ్లను గుర్తించండి. తద్వారా ప్రభుత్వంపై వారికి నమ్మకంతోపాటు మీమీద గౌరవం కూడా ఇనుమడిస్తుంది. అలాగే మీ పదవీకాలంలోగా సమస్యలు పరిష్కరించేలా మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోండి.

   న ఇతిహాసాల్లో ‘ఆత్మానందం’ అనే మాట ఒకటుంది. ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని స్వీకరించి, దాన్ని విజయవంతంగా అమలు చేయడంవల్ల కలిగే ఆనందం జీవితంలో ఎన్నో పనులు చేసినా కొన్నిసార్లు లభించకపోవచ్చు. అలాంటి అంతులేని ఆనందం కలిగినపుడు అలసట అనే మాటకే తావుండదు. ఈ విధంగా 1-2-5 సవాళ్లను ఎవరైనా స్వీకరించి తమ ప్రతిభ, అనుభవంతోపాటు అందుబాటులోగల వనరులను ఉపయోగించి వాటిని పరిష్కరిస్తే కలిగే ఆత్మానందం వర్ణించనలవి కానిదిగా ఉంటుంది! అటువంటి సవాళ్లకు పరిష్కారాన్వేషణతో కలిగి సంతృప్తి అనంతం. మీరు చేపట్టే చర్యలు లబ్ధిదారులకు మనశ్శాంతినిచ్చి, వారు మీ కృషిని గుర్తించేలా ఉండాలి. ఎలాగంటే- మీరు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన ఓ 20 ఏళ్ల తర్వాత కూడా మీ కృషి అక్కడి ప్రజలు గుర్తుంచుకునేలా ఉండాలి.

   మీరు అటువంటి సమస్యలను అన్వేషించి గుణాత్మక మార్పు తేవాలని అభిలషిస్తున్నాను. అవసరమైతే అంతర్జాతీయ అధ్యయనాల సమీక్షకు సందేహించకండి. ఇందుకు సంబంధించి చట్టాన్ని పరిశీలించండి.. సాంకేతిక పరిజ్ఞాన సాయం తీసుకోండి. దేశంలోని వివిధ జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించే 300-400 మంది సామూహిక ప్రతిభను ఒకసారి ఊహించుకోండి. ఒక్కమాటలో చెబితే- మీరంతా సమష్టిగా భారతదేశంలోని సగం జనాభాలో కొత్త ఆశలు చిగురింపజేయవచ్చు. తద్వారా అనూహ్య మార్పులు తథ్యం. ఈ కృషిలో మీరు ఒంటరులు కాదు… మీ విధానాలు, కృషి, చర్యలు దేశంలో సగభాగంగా ఉన్న 400 జిల్లాలను ప్రభావితం చేయగలవని గుర్తించండి.

మిత్రులారా!

   మా ప్రభుత్వం సివిల్‌ సర్వీసులలో సముచిత సంస్కరణలతో ఈ శకపు పరివర్తనకు మద్దతునిస్తోంది. ఈ మేరకు “మిషన్‌ కర్మయోగి, ఆరంభ్‌” వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. మీ అకాడమీలో శిక్షణ స్వరూపం ఇప్పుడు మిషన్‌ కర్మయోగి ఆధారంగానే రూపొందిందని నాకు సమాచారం ఇచ్చారు. దీని తోడ్పాటుతో మీరు కచ్చితంగా ప్రయోజనం పొందగలరని విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా మరొక అంశాన్ని మీ దృష్టికి తేవాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో ఏదో ఒక సులువైన బాధ్యతతో సరిపెట్టుకుందామనే యోచన ఎన్నడూ చేయకుండా మీరు ప్రార్థన చేసుకోవాలి. నేను ఈ మాట అన్న తర్వాత మీ వదనాలు కిందకు వాలడాన్ని నేను గమనించాను.

   యనేం ప్రధానమంత్రి… సులువైన బాధ్యతలు వద్దని ప్రార్థించాల్సిందిగా సలహా ఇస్తున్నాడని మీరు ఆశ్చర్యపోతూంటారేమో! సదా సవాళ్లతో కూడిన బాధ్యతలను ఎంచుకోవడానికే మీరు సదా ప్రయత్నించాలి. సవాలు విసిరే పనిని దిగ్విజయంగా పూర్తి చేయడంలోగల ఆనందం మరెందులోనూ లేదనడంలో సందేహం లేదు. నిశ్చింత స్థాయికి చేరడం గురించి మీరెంతగా యోచిస్తే అంతగా మీ వ్యక్తిగత ప్రగతికేగాక దేశాభివృద్ధికీ మీరే ఆటంకాలుగా పరిణమిస్తారు. మీ జీవితం స్తంభించిపోయి… కొన్నేళ్ల తర్వాత మీకు మీరే భారమనిపించే పరిస్థితి వస్తుంది. మీరిప్పుడు యవ్వన దశలో ఉన్నారు. దేనికైనా సిద్ధమన్న సామర్థ్యం ఈ వయసులో సహజం. ఆ మేరకు గడచిన 20-25 ఏళ్లలో మీరు నేర్చుకున్న  దానితో పోలిస్తే సవాలు విసిరే బాధ్యతల స్వీకరణ ఎంత గొప్పదో రాబోయే 2 నుంచి 4 సంవత్సరాల్లోగా మీకే అర్థమవుతుంది. అంతేకాదు.. ఇలాంటి అనుభవాలు రాబోయే 20-25 ఏళ్లపాటు మీకెంతో ఉపయోగకరంగా ఉంటాయి.

మిత్రులారా!

   మీరు వివిధ రాష్ట్రాలు, విభిన్న సామాజిక పరిస్థితులకు చెందినవారు. కానీ, ‘ఐక్య భారతం-శ్రేష్ఠ భారతం’ వెనుక మీరే చోదకశక్తులు. రాబోయే కాలంలో మీ సేవా పరాయణత, వినమ్ర వ్యక్తిత్వం, నిజాయితీలు మీకు విశిష్ట గుర్తింపు తెచ్చిపెడతాయని నా దృఢ విశ్వాసం. చాలా కాలం కిందట  నేనొక సూచన చేశాను… అది ఈసారి ఆచరణలోకి వచ్చినట్లు కనిపించడం లేదు. అదేమిటంటే- మీరు ఈ అకాడమీలో ప్రవేశించగానే ఇక్కడికి రావడానికి కారణమేమిటో, ఈ రంగంలో ప్రవేశించడం వెనుక మీకున్న స్వప్నాలు, సంకల్పాలు ఏమిటో వివరిస్తూ ఒక సుదీర్ఘ వ్యాసం రాయాలని నేను సలహా ఇచ్చాను. మీరెందుకు ఈ మార్గం ఎంచుకున్నారు? మీరేం చేయాలని భావిస్తున్నారు? ఈ సర్వీసులో మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? వగైరా అంశాలతో రాసుకున్న మీ వ్యాసాన్ని రహస్యంగా ఉంచుకోండి. మీరు 25 లేదా 50 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న తర్వాత బహుశా ఇక్కడ ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి రావచ్చు. ముస్సోరీలోని ఈ అకాడమీ నుంచి 50 ఏళ్లకిందట వెళ్లినవారు ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వస్తారు. ఆ విధంగా మీరిక్కడ రాసుకున్న మీ తొలి వ్యాసాన్ని 25 ఏళ్ల తర్వాత లేదా 50 ఏళ్ల తర్వాత చదువుతారు. అటుపైన ఆ స్వప్నాలు, సంకల్పాల మేరకు నడచుకున్నామా… నాటి లక్ష్యాలను సాధించామా అని మీకు మీరే బేరీజు వేసుకుంటారు. అందుకే మీరిక్కడికి రాగానే ఒక వ్యాసం రాసి, ఈ ప్రాంగణంలో వదిలి వెళ్లడం ముఖ్యమని నేను చెప్పాను.

   క్కడ అనేక శిక్షణ కార్యక్రమాలున్నాయి. ఒక లైబ్రరీతోపాటు మీకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ శిక్షణ కార్యక్రమానికి రెండు విషయాలను జోడించాలని అకాడమీ డైరెక్టర్‌తోపాటు ఇతర బాధ్యులను కోరుతున్నాను. కృత్రిమ మేధస్సుపై శిక్షణ కోసం ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేయండి. అలాగే డేటా ఆధారిత పాలనను ఒక శిక్షణాంశంగా చేర్చండి. రాబోయే కాలంలో డేటాయే అతిపెద్ద శక్తి. ఆ మేరకు డేటా ఆధారిత పాలన గురించి నేర్చుకోవడంతోపాటు దాన్ని మనం అర్థం చేసుకుని, ప్రతిచోటా అన్వయింపజేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాల్లో నైపుణ్యం సాధించినవారికి గుర్తింపు ఏమీ లభించకపోవచ్చుగానీ, తదుపరి శిక్షణ పొందే బృందాలకు ఈ రెండూ అత్యావశ్యకం.

   అలాగే వీలైతే మీ కర్మయోగి కార్యక్రమం కింద డేటా ఆధారిత పాలనపై ఒక ఆన్‌లైన్ సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెట్టండి. తద్వారా ఎవరైనా ఆ పరీక్షకు హాజరై ధ్రువీకరణ పత్రం పొందగలుగుతారు. దీంతోపాటు కృత్రిమ మేధస్సుపైనా ఒక సర్టిఫికెట్‌ కోర్సు తప్పక ఉండాలి. దీనిపై ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించి, ఉన్నతాధికారులంతా దానికి హాజరై సర్టిఫికెట్‌ పొందాలి. కాలక్రమంలో ఆధునిక భారత నిర్మాణ స్వప్నం సాకారం కావడానికి ఇదెంతగానో తోడ్పడగలదు.

మిత్రులారా!

   నేనివాళ మీ మధ్య ఉండాలని, మీతో కాస్త సమయం గడపపాలని ఎంతగానో ఆశించాను. కానీ, సమయాభావంతోపాటు ఇతర ఇబ్బందులు, పార్లమెంటు సమావేశాలు ఉన్నందున స్వయంగా రాలేకపోయాను. అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మిమ్మల్నందర్నీ చూడగలగడం ఆనందదాయకం. నేను మీ వదనాల్లో మెదిలే భావాలను గమనిస్తూ నా ఆలోచనలను మీతో పంచుకుంటున్నాను.

మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందనలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు!

 

బాధ్యత నిరాకరణ ప్రకటన: ప్రధానమంత్రి వాస్తవ ప్రసంగం హిందీలో ఉంది. ఇది దానికి రమారమి అనువాదం మాత్రమే.

***