త్వరలో జరగబోతున్న గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో లోకకల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. అనంతరం భారతదేశ సంస్కృతి, వైవిధ్యాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.
గతానికి భిన్నంగా వినూత్నమైన రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రధాని ముచ్చటించారు. ఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా పలకరించి స్నేహపూర్వకంగా సంభాషించారు.
భిన్నత్వంలోనే ఏకత్వమనే జాతీయ భావన ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ఇతర రాష్ట్రాల వారితో పరస్పరం సంభాషించడం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధాని సూచించారు. ఇలాంటి చర్చలు దేశప్రగతికి ముఖ్యమైన అవగాహన, ఐక్యతను ఎలా పెంపొందిస్తాయో వివరించారు.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బాధ్యత గల పౌరులుగా తమ విధులను నిర్వర్తించడం అత్యంత కీలకమైన అంశమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సమష్టి ప్రయత్నాల ద్వారా దేశాన్ని బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా కట్టుబడి ఉండాలని సూచించారు. మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకుని దేశ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని యువతను ప్రోత్సహించారు. క్రమశిక్షణ, సమయపాలన, పొద్దున్నే నిద్రలేవడం, డైరీ రాయడం లాంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు.
ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన పథకాల గురించి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి చర్చించారు. మూడు కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీ’లను తయారు చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతను సాధించడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేశారు. ఈ పథకం ద్వారా తన తల్లి ఎలా లబ్ధి పొందినదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక వ్యక్తి వివరించారు. ఈ పథకం వల్ల ఆమె తయారు చేస్తున్న ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. దేశంలోని సరసమైన డేటా ధరలు అనుసంధాన వ్యవస్థలను గణనీయంగా మార్చాయని, డిజిటల్ ఇండియాను శక్తిమంతం చేశాయని ప్రధాని వివరించారు. ఇవి ప్రజలు ఒకరితో ఒకరు పరస్పరం అనుసంధానమై ఉండేందుకు, అవకాశాలను విస్తరించుకొనేందుకు దోహదపడుతున్నాయని అన్నారు.
పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. 140 కోట్ల మంది భారతీయులు శుభ్రతను పాటించాలనే తీర్మానం చేసుకుంటే దేశం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమ ప్రాముఖ్యం గురించి మాట్లాడుతూ, అందరూ మొక్కలు నాటి తమ తల్లికి అంకితమివ్వాలని సూచించారు. ఫిట్ ఇండియా ఉద్యమం గురించి కూడా ప్రధాని చర్చించారు. శారీరక ధారుడ్యం, ఆరోగ్యంపై దృష్టి సారించి యోగ సాధనకు సమయం కేటాయించాలని, ఇది బలమైన ఆరోగ్యమైన దేశానికి అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయులతో సైతం ప్రధాని ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ, వారి సందర్శనల్లో ఎదురైన సానుకూల అనుభవాలను పంచుకొన్నారు.
***
As Republic Day approaches, interacted with NCC Cadets, NSS Volunteers, Tribal guests and Tableaux Artists taking part in the parade. We had the opportunity to discuss diverse issues including Swachhata, women empowerment, ‘Ek Bharat Shreshtha Bharat’ and more. pic.twitter.com/mKLVaD8HB7
— Narendra Modi (@narendramodi) January 24, 2025
Some more glimpses from the interaction with NCC Cadets, NSS Volunteers, Tribal guests and Tableaux Artists. pic.twitter.com/uvhsoah0tX
— Narendra Modi (@narendramodi) January 24, 2025