న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. న్యూస్ఎక్స్ వరల్డ్ ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో ఛానల్‌లను కలిగి ఉన్న ఈ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పలు ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాల ప్రారంభాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
గతంలో ఇలాంటి మీడియా కార్యక్రమాలకు తాను హాజరయ్యానని గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి, ఈ రంగంలో నేడు కొత్త ఒరవడిని సృష్టించిన న్యూస్ఎక్స్ వరల్డ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ తరహా మీడియా కార్యక్రమాలు దేశంలో ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ, న్యూస్ఎక్స్ వరల్డ్ దీనికి కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆయన పేర్కొన్నారు. తమ శిఖరాగ్ర సదస్సు రాజకీయాల కంటే విధానాలను గురించిన చర్చలకే ప్రాధాన్యమిచ్చినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల చర్చలు, ఆలోచనలకు ఈ సదస్సు గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఒక వినూత్న నమూనాపై పనిచేశారని తెలిపిన ప్రధానమంత్రి ఇతర మీడియా సంస్థలు సైతం వారి సొంత ఆలోచనలకు అనుగుణంగా ఈ ధోరణిని మరింత మెరుగ్గా కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
“ప్రపంచం 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఆసక్తిగా గమనిస్తోంది” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారత్‌ను సందర్శించి, మన విధానాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని, ప్రతిరోజూ కొత్త రికార్డులు ఇక్కడ నమోదవుతున్నాయని, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘటన మన దేశంలో చోటుచేసుకుంటున్నదని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 26తో మహా కుంభమేళా ముగిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ పవిత్ర సంగమ తీరంలో కోట్లాది మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. “భారత నిర్వహణ నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రపంచం చూస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల నుంచి విమాన వాహక నౌకల వరకు ప్రతీది భారత్‌లో తయారవుతున్నాయన్న ప్రధానమంత్రి… ఈ విషయంలో భారత్ ఘనత గురించి ప్రపంచం వివరంగా తెలుసుకోవాలనుకుంటుందని తెలిపారు. న్యూస్ఎక్స్ వరల్డ్ కు ఇది ఒక గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.
కొన్ని నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ, 60 ఏళ్లలో తొలిసారిగా దేశంలో ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. గత 11 ఏళ్లలో దేశం సాధించిన అనేక విజయాలతోనే ప్రజల్లో ఈ విశ్వాసం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త ఛానల్ వాస్తవ ఘటనలను గురించి పక్షపాతం లేకుండా ప్రపంచానికి యదార్థాన్ని చూపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“కొన్ని సంవత్సరాల క్రితం, నేను ‘వోకల్ ఫర్ లోకల్‘, ‘లోకల్ ఫర్ గ్లోబల్‘ అనే దార్శనికతను దేశానికి అందించాను. నేడు, ఈ దార్శనికత వాస్తవ రూపం దాల్చడం మనం చూస్తున్నాం” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. భారత ఆయుష్ ఉత్పత్తులు, యోగాను నేడు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారన్న ప్రధానమంత్రి, మన సూపర్ ఫుడ్ అయిన మఖానా, అలాగే “శ్రీ అన్నా“గా పిలిచే చిరుధాన్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. తన మిత్రులైన ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ ఢిల్లీ హాత్‌లో మన చిరుధాన్యాలతో చేసిన వంటకాలను స్వయంగా రుచి చూసి ఆనందం వ్యక్తం చేయడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
చిరు ధాన్యాలతో పాటు, మన దేశ పసుపు కూడా ప్రపంచస్థాయిని చేరుకుందనీ, ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పసుపులో 60 శాతానికి పైగా మన దేశమే అందిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. భారత కాఫీ సైతం ప్రపంచ దేశాల ఆదరణ పొందడమే గాక, ప్రపంచంలోని కాఫీ ఎగుమతిదారుల్లో ఏడో స్థానంలో భారత్ నిలిచిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మన దేశ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మందులు ప్రపంచ గుర్తింపు పొందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అనేక ప్రపంచస్థాయి కార్యక్రమాలకు భారత్ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమిట్‌కు సహ–ఆతిథ్య దేశంగా హాజరైన భారత్ ఇటీవలే ఆ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పొందినట్లు తెలిపారు. భారత్ అధ్యక్షతన జీ–20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించామన్న ఆయన, ఆ సదస్సులోనే కొత్త ఆర్థిక మార్గంగా భారత్–మధ్యతూర్పు–యూరప్ కారిడార్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గ్లోబల్ సౌత్‌కు ప్రధాన గొంతుకగా భారత్ ద్వీప దేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, మిషన్ లైఫ్ దార్శనికతను ప్రపంచానికి అందించిన ఘనత భారత్ సొంతమని ఆయన ఉద్ఘాటించారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి కార్యక్రమాల్లో భారత్ నాయకత్వాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. అనేక భారతీయ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న క్రమంలో, భారత మీడియా సైతం ఈ ప్రపంచస్థాయి అవకాశాలను అర్థం చేసుకుని, స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.
దశాబ్దాలుగా ప్రపంచం భారత్ ను వెనకుండి పనిచేసిపెట్టే కార్యాలయం మాదిరిగా చూశారనీ, “నేడు భారత్ ప్రపంచ కర్మాగారంగా రూపుదిద్దుకుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్ నేడు శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. గతంలో స్థానిక మార్కెట్లకే పరిమితమైన రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. పుల్వామా స్నో పీస్, మహారాష్ట్ర పురందర్ అంజీర పండ్లు, కాశ్మీర్ క్రికెట్ బ్యాట్‌లకు ప్రపంచస్థాయిలో డిమాండు పెరుగుతోందని శ్రీ మోదీ ప్రస్తావించారు. భారత రక్షణ ఉత్పత్తులు ప్రపంచానికి మన ఇంజనీరింగ్, సాంకేతికత బలాన్ని ప్రదర్శించాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమొబైల్ రంగం వరకు, భారత స్థాయిని, సామర్థ్యాన్ని ప్రపంచం చూసిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. “భారత్ ప్రపంచానికి ఉత్పత్తులను అందించడమే కాకుండా ప్రపంచ సరఫరా రంగంలో విశ్వసనీయ, నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోంది” అని ఆయన అన్నారు.
“ఏళ్ల తరబడి కృషి, ప్రణాళికబద్ధమైన విధాన నిర్ణయాల ఫలితంగానే వివిధ రంగాల్లో భారత్ నాయకత్వం సాధ్యపడింది” అని శ్రీ మోదీ తెలిపారు, గత పదేళ్లలో సాధించిన పురోగతిని ప్రధానంగా ప్రస్తావించారు. గతంలోని అసంపూర్ణ వంతెనలు, సగంలో నిలిచిపోయిన రహదారుల స్థానంలో ఇప్పుడు మంచి రహదారులు, అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వేలు అందుబాటులోకి వచ్చి వేగంగా ముందుకు సాగే మార్గాలుగా రూపాంతరం చెందాయన్నారు. తగ్గిన ప్రయాణ సమయం, ఖర్చులు సరుకు రవాణా సమయాన్ని తగ్గించే అవకాశాన్ని పరిశ్రమలకు కల్పించాయని, ఇది ఆటోమొబైల్ రంగానికి గణనీయ ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. వాహనాలకు పెరిగిన డిమాండ్, ఈవీ ఉత్పత్తులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రస్తావించిన ఆయన, నేడు భారత్ ఒక ప్రధాన ఆటోమొబైల్ ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా రూపుదిద్దుకుందని వ్యాఖ్యానించారు.
ఎలక్ట్రానిక్స్ తయారీలో సైతం గణనీయమైన పురోగతి సాధ్యమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో, 2.5 కోట్లకు పైగా కుటుంబాలకు తొలిసారిగా విద్యుత్ సదుపాయం దక్కింది. దీని వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల డిమాండ్, ఉత్పత్తి పెరిగిందని ఆయన అన్నారు. సరసమైన డేటాతో మొబైల్ ఫోన్ల డిమాండ్ పెరిగిందనీ, మొబైల్ ఫోన్లలో సేవల లభ్యత పెరగడంతో డిజిటల్ పరికరాల వినియోగం అనూహ్యంగా పెరిగిందని ఆయన వివరించారు. పిఎల్ఐ వంటి పథకాలు ఈ డిమాండ్‌ను అవకాశంగా మార్చాయని, దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ప్రధాన ఎగుమతిదారుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, విజయవంతంగా వాటిని సాధించగల భారత సామర్థ్యానికి “మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్” తారకమంత్రమని శ్రీ మోదీ పేర్కొన్నారు. దీని కారణంగానే ప్రభుత్వ జోక్యం లేదా ఒత్తిడి లేకుండా సమర్థంగా, ప్రభావవంతమైన పాలనను అందించగలుగుతున్నట్లు తెలిపారు. బ్రిటిష్ పాలనలో అమలైన, వాడుకలో లేని సుమారు 1,500 చట్టాలను గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వం రద్దు చేసిందని శ్రీ మోదీ ఉదహరించారు. అటువంటి చట్టంలో ఒకటి నాటిక ప్రదర్శన చట్టం. ఇది బహిరంగ ప్రదేశాల్లో నృత్యం చేసే వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతించే చట్టం. ఈ చట్టం స్వాతంత్ర్యం తర్వాత 70 సంవత్సరాల వరకు అమలులో ఉందనీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిని రద్దు చేసిందని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల జీవనాధారమైన వెదురుకు సంబంధించిన పాత చట్టాలను సైతం ప్రధానమంత్రి ఉదహరించారు. గతంలో, వెదురును నరికిన వారిని అరెస్టు చేసేలా చట్టం ఉంది, ఎందుకంటే వెదురును వృక్షాల వర్గంలో చేర్చారు. అయితే వెదురును గడ్డిమొక్కగా గుర్తిస్తూ దశాబ్దాల నాటి పనికిరాని ఆ చట్టాన్ని మా ప్రభుత్వం మార్చింది. అటువంటి కాలం చెల్లిన చట్టాలపై మునుపటి నాయకులు, ఉన్నత వర్గాలు నిర్లక్ష్యం వహించారని విమర్శించిన శ్రీ మోదీ, వాటి రద్దు కోసం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
పదేళ్ల కిందట ఐటీఆర్ దాఖలు చేయడం ఒక సాధారణ వ్యక్తికి చాలా కష్టమైన పనిగా ఉండేదనీ, కానీ నేడు అది కొన్ని క్షణాల్లోనే పూర్తవుతోందని, అలాగే కొద్ది రోజుల్లోనే వారి ఖాతాలకు రిఫండ్స్ జమ అవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఆదాయపు పన్ను చట్టాలను మరింత సరళీకృతం చేసే ప్రక్రియ పార్లమెంటులో కొనసాగుతోందని ఆయన తెలిపారు. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపునిచ్చామనీ, ఇది వేతనదారులకు గణనీయ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. యువ నిపుణులు వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి, అలాగే వారి పొదుపును పెంచుకోవడానికి బడ్జెట్ సహాయపడిందని ఆయన స్పష్టం చేశారు. జీవన సౌలభ్యం, వ్యాపార నిర్వహణ సౌలభ్యం కల్పించడం అలాగే దేశ ప్రజలకు, వారి ఆకాంక్షల కోసం అంతులేని అవకాశాలను అందించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. అనేక అంకుర సంస్థలు జియోస్పేషియల్ డేటా నుంచి ప్రయోజనం పొందుతున్నాయన్నారు. గతంలో మ్యాప్‌లను రూపొందించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం దీనిని మార్చడం ద్వారా అంకుర సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఈ డేటాను అద్భుతంగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించామని ఆయన తెలిపారు.
ప్రపంచానికి సున్నా అనే భావనను అందించిన భారత్ ఇప్పుడు అనంతమైన ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ ఆవిష్కర్తగానే కాకుండా “ఇండోవేటింగ్” అంటే భారతీయ విధానాన్ని ఆవిష్కరిస్తూ రాణిస్తోందని పేర్కొన్నారు. భారతదేశం సరసమైన, అందుబాటులో ఉండే, అనుసరణీయమైన పరిష్కారాలను ఆవిష్కరిస్తూ, ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రపంచానికి వాటిని అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచానికి సురక్షితమైన, ఖర్చు లేని డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అవసరమైనప్పుడు, భారత్ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వ్యవస్థను అభివృద్ధి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రొఫెసర్ కార్లోస్ మోంటెస్ యూపీఐ టెక్నాలజీ ప్రజా–హిత స్వభావాన్ని చూసి ముగ్ధులయ్యారని, నేడు ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు యూపీఐని తమ ఆర్థికరంగ వ్యవస్థల్లో అనుసంధానిస్తున్నాయని శ్రీ మోదీ గుర్తుచేశారు. భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలైన ఇండియా స్టాక్‌తో అనుసంధానం కోసం అనేక దేశాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ప్రపంచానికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను భారత టీకా అందించిందన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఆరోగ్య సేతు యాప్‌ను ఓపెన్ సోర్స్‌గా మార్చిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ ప్రధాన శక్తిగా అవతరించిందని, ఇతర దేశాల అంతరిక్ష ఆకాంక్షల సాధనకు భారత్ సహాయం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ఏఐ రంగంలో భారత్ కృషిచేస్తూ, తన అనుభవాలు, నైపుణ్యాలను ప్రపంచంతో పంచుకుంటోందని ప్రధానమంత్రి వివరించారు.
ఈ రోజు అనేక ఫెలోషిప్‌లను ప్రారంభించిన ఐటీవీ నెట్‌వర్క్‌ను ప్రశంసిస్తూ, భారత యువత అభివృద్ధి చెందిన భారతదేశంలో అతిపెద్ద లబ్ధిదారులు, వాటాదారులుగా ఉంటారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం పిల్లలకు పాఠ్యపుస్తకాలకు మించి ఆలోచించే అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు. మిడిల్ స్కూల్ నుంచే పిల్లలు కోడింగ్ నేర్చుకుంటున్నారనీ, ఏఐ, డేటా సైన్స్ వంటి రంగాలకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలతో పిల్లలకు ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం బడ్జెట్‌లో 50 వేల కొత్త అటల్ టింకరింగ్ ల్యాబుల ఏర్పాటును ప్రకటించామని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
వార్తా ప్రపంచంలో, వివిధ ఏజెన్సీల సబ్‌స్క్రిప్షన్లు మెరుగైన వార్తల కవరేజీకి సహాయపడతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అదేవిధంగా, పరిశోధన రంగంలోని విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ సమాచార వనరులను వినియోగించుకోవాలని సూచించారు. గతంలో, వారు అధిక ధరలు చెల్లించి వేర్వేరు జర్నల్స్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చేదనీ, అయితే తమ ప్రభుత్వం “ఒక దేశం, ఒకే చందా” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పరిశోధకులకు ఈ సమస్య నుంచి ముక్తి కలిగించిందన్నారు. దేశంలోని ప్రతి పరిశోధకుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత జర్నల్స్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 6వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష అన్వేషణ, బయోటెక్ పరిశోధన లేదా ఏఐ రంగం అయినా, ప్రతి విద్యార్థికీ ఉత్తమ పరిశోధన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపిన ప్రధానమంత్రి, భారత చిన్నారులు భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఐఐటీ విద్యార్థులతో డాక్టర్ బ్రియాన్ గ్రీన్ సమావేశం, సెంట్రల్ స్కూల్ విద్యార్థులతో వ్యోమగామి మైక్ మాసిమినో సమావేశం వంటి అద్భుతమైన అనుభవాలను ప్రస్తావిస్తూ, దేశంలోని చిన్న పాఠశాలల నుంచి భవిష్యత్తులో ప్రభావవంతమైన ఆవిష్కరణలు రావడం ఖాయమని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రతి ప్రపంచ వేదికపై భారత జెండా రెపరెపలాడేలా చేయడమే భారత్ ఆకాంక్ష అని పేర్కొన్న ప్రధానమంత్రి… నామమాత్రపు ఆలోచనలు, చర్యలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. ఒక మీడియా సంస్థగా, న్యూస్ఎక్స్ వరల్డ్ ఈ భావాన్ని అర్థం చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం, దేశంలోని వివిధ రాష్ట్రాలను చేరుకోవడంపై దృష్టి పెట్టిన మనం నేడు మన నెట్‌వర్క్‌ను ప్రపంచమంతటికీ చేర్చే సాహసోపేతమైన అడుగు వేశామన్నారు. ఈ ప్రేరణ, సంకల్పం ప్రతి పౌరుడు, వ్యవస్థాపకుల్లో ఉండాలని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మార్కెట్, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ టేబుల్‌పై భారతీయ బ్రాండ్‌ను చూడాలనే తన దార్శనికతను ఆయన పంచుకున్నారు. “మేడ్ ఇన్ ఇండియా” ప్రపంచ మంత్రంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు “హీల్ ఇన్ ఇండియా“, పెళ్లికి ప్లాన్ చేసేటప్పుడు “వెడ్ ఇన్ ఇండియా” గురించి ఆలోచించాలని, పర్యటనలు, సమావేశాలు, ప్రదర్శనలు, కచేరీల కోసం భారత్‌కు రావడానికి ప్రపంచమంతా ప్రాధాన్యం ఇవ్వాలనే తన కలను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. మనలో ఈ సానుకూల దృక్పథాన్ని, బలాన్ని పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ఆయన, ఈ ప్రయత్నంలో నెట్‌వర్క్, ఛానల్ల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. అవకాశాలు అంతులేనివని, ధైర్యం, దృఢ సంకల్పంతో వాటిని వాస్తవంలోకి మార్చుకోవడం ఇప్పుడు మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
“రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు, ఐటీవీ నెట్‌వర్క్ కూడా ప్రపంచ వేదికపై తనదైన గుర్తింపు సాధించడానికి ఇదేవిధమైన సంకల్పంతో కృషి చేయాలని సూచించిన ఆయన, వారి విజయం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీవీ మీడియా నెట్‌వర్క్ వ్యవస్థాపకులు, రాజ్యసభ ఎంపీ శ్రీ కార్తికేయ శర్మ, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి శ్రీ టోనీ అబాట్, శ్రీలంక మాజీ అధ్యక్షులు, ప్రధానమంత్రి శ్రీ రణిల్ విక్రమసింఘే తదితరులు పాల్గొన్నారు.
Addressing the NXT Conclave in Delhi. @nxt_conclave https://t.co/kdcwYCuxYU
— Narendra Modi (@narendramodi) March 1, 2025
The world is keenly watching 21st-century India. pic.twitter.com/bnyjPbbUZN
— PMO India (@PMOIndia) March 1, 2025
Today, the world is witnessing India’s organizing and innovating skills. pic.twitter.com/GlKy0fSXF1
— PMO India (@PMOIndia) March 1, 2025
I had presented the vision of ‘Vocal for Local’ and ‘Local for Global’ to the nation and today, we are seeing this vision turn into reality: PM @narendramodi pic.twitter.com/8MYHB0OpBc
— PMO India (@PMOIndia) March 1, 2025
Today, India is emerging as the new factory of the world.
We are not just a workforce; we are a world-force! pic.twitter.com/6aM98Ca3Xl
— PMO India (@PMOIndia) March 1, 2025
Minimum Government, Maximum Governance. pic.twitter.com/DmUc56bCQg
— PMO India (@PMOIndia) March 1, 2025
India is becoming the land of infinite innovations. pic.twitter.com/2OL0I9oUX1
— PMO India (@PMOIndia) March 1, 2025
India’s youth is our top priority.
The National Education Policy has given students the opportunity to think beyond textbooks. pic.twitter.com/Q1W39AXv0f
— PMO India (@PMOIndia) March 1, 2025
***
MJPS/SR
Addressing the NXT Conclave in Delhi. @nxt_conclave https://t.co/kdcwYCuxYU
— Narendra Modi (@narendramodi) March 1, 2025
The world is keenly watching 21st-century India. pic.twitter.com/bnyjPbbUZN
— PMO India (@PMOIndia) March 1, 2025
Today, the world is witnessing India's organizing and innovating skills. pic.twitter.com/GlKy0fSXF1
— PMO India (@PMOIndia) March 1, 2025
I had presented the vision of 'Vocal for Local' and 'Local for Global' to the nation and today, we are seeing this vision turn into reality: PM @narendramodi pic.twitter.com/8MYHB0OpBc
— PMO India (@PMOIndia) March 1, 2025
Today, India is emerging as the new factory of the world.
— PMO India (@PMOIndia) March 1, 2025
We are not just a workforce; we are a world-force! pic.twitter.com/6aM98Ca3Xl
Minimum Government, Maximum Governance. pic.twitter.com/DmUc56bCQg
— PMO India (@PMOIndia) March 1, 2025
India is becoming the land of infinite innovations. pic.twitter.com/2OL0I9oUX1
— PMO India (@PMOIndia) March 1, 2025
India's youth is our top priority.
— PMO India (@PMOIndia) March 1, 2025
The National Education Policy has given students the opportunity to think beyond textbooks. pic.twitter.com/Q1W39AXv0f