Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

‘ఎన్‌ఎక్స్‌టి’ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


నమస్కారం!

‘ఐటీవీ’ నెట్‌వర్క్ వ్యవస్థాపకులు, పార్లమెంటులో నా సహసభ్యులైన కార్తికేయ శర్మ గారు, ఈ నెట్‌వర్క్ సిబ్బంది, దేశవిదేశాల నుంచి హాజరైన అతిథులు, ఇతర ప్రముఖులు,
సోదరీసోదరులారా!

   ‘న్యూస్‌ ఎక్స్ వరల్డ్’ శుభప్రదంగా ప్రారంభమైంది… ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల, హిందీ భాషలు సహా మీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రాంతీయ ఛానెళ్లన్నీ కూడా ఇప్పుడు వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. దీనికితోడు నేడు అనేక పరిశోధక సభ్యత్వాలు (ఫెలోషిప్‌), ఉపకార వేతనాలకు (స్కాలర్‌షిప్‌) శ్రీకారం చుట్టారు. ఈ కార్యకలాపాలన్నిటిపైనా మీకు శుభాకాంక్షలు.

మిత్రులారా!

   నేను ఇలాంటి మీడియా కార్యక్రమాలకు తరచూ హాజరవుతుంటాను. అయితే, ఈ రోజు మీరొక కొత్త శైలికి శ్రీకారం చుట్టారని భావిస్తూ దీనిపైనా మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేశంలో ఇటువంటి మీడియా కార్యక్రమాలు సర్వసాధారణం… సంప్రదాయంగా కొనసాగుతున్నాయి. కొన్ని ఆర్థిక రంగ చర్చనీయాంశాలు కూడా వీటిలో భాగం కావడం అందరికీ ప్రయోజనకరమే. అయితే, మీ నెట్‌వర్క్ దీనికో కొత్త కోణాన్ని జోడించింది. మూస ధోరణికి భిన్నంగా కొత్త పుంతలు తొక్కుతూ మీరొక వినూత్న నమూనాను రూపొందించారు. లోగడ వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఇలాంటి సదస్సులతో పోలిస్తే, ఇది విభిన్నమని, ఇక్కడ సాగుతున్న చర్చలనుబట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే- మునుపటి సదస్సులు నాయకత్వ కేంద్రకంగా నడిస్తే, ఈ సదస్సు విధాన కేంద్రకం కావడం, విధానాలపై చర్చలు సాగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇక మునుపటి కార్యక్రమాలు ఎక్కువగా గతం ప్రాతిపదికన వర్తమానంపై దృష్టి కేంద్రీకరించినవే. కానీ, మీరు నిర్వహిస్తున్న ఈ సదస్సు భవిష్యత్తుకు అంకితమైనది కావడం అత్యంత ముదావహం. నేను ప్రత్యక్షంగా హాజరైనవే కాకుండా పరోక్షంగా చూసిన ఇలాంటి కార్యక్రమాలన్నీ విషయ ప్రాముఖ్యం బదులు వివాద ప్రాధాన్యంగా ఉండటం గమనించాను. కానీ, ఇక్కడ వాదం కన్నా సంవాదం, సంభాషణలకు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. నేను హాజరైన అనేక కార్యక్రమాలు ఓ చిన్న గదిలో, పరిమిత హాజరీతో నిర్వహించినవే. అయితే, ఇక్కడ.. ఇవాళ.. అందునా ఒక మీడియా సంస్థ ఆధ్వర్యాన ఇంతటి భారీ కార్యక్రమాన్ని, దానికి అన్నివర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనం హాజరీని చూడటం అసాధారణమనే చెప్పాలి. సర్వసాధారణంగా కొన్ని మీడియా సంస్థలు ఎదురుచూసే ‘మసాలా’ సమాచారం ఈ సదస్సులో వాటికి (స్కూప్) లభించకపోవచ్చు. కానీ,  దేశానికి మాత్రం ఎంతో ప్రేరణ లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే- ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరి ఆలోచనలు జాతికి స్ఫూర్తినిచ్చేవిగా ఉంటాయి. కాబట్టి, భవిష్యత్తులో ఇతర మీడియా సంస్థలు ఈ ధోరణిని, నమూనాను స్వీకరిస్తాయని భావిస్తున్నాను. తద్వారా ఓ చిన్నగది, పరిమిత హాజరీ మూస నుంచి బయటపడి, తమదైన శైలిలో కార్యక్రమాలను వినూత్నంగా మార్చగలవని ఆశిస్తున్నాను.

మిత్రులారా!

   యావత ప్రపంచం నేడు 21వ శతాబ్దపు భారత్‌వైపు దృష్టి సారించింది. ఈ దేశాన్ని సందర్శించాలని, ఇక్కడి సంస్కృతి-సంప్రదాయాలను అర్థం చేసుకోవాలని ప్రపంచ దేశాల పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. నిత్యం సానుకూల కథనాలు వెలువడే దేశంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రాచుర్యం నానాటికీ పెరుగుతోంది. మనమిక్కడ వార్తలు సృష్టించే అవసరం లేదు… రోజుకొక కొత్త రికార్డు సృష్టి లేదా ఒక కొత్త పరిణామం ఆవిష్కృతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26న ప్రయాగ్‌రాజ్‌లో ఐక్యతా యజ్ఞం మహా కుంభమేళా సమాప్తమైంది. ఓ తాత్కాలిక నగరం.. తాత్కాలిక ఏర్పాట్లు… కోట్లాది ప్రజానీకం నదీతీరం చేరిన తీరు, వందల కిలోమీటర్లు ప్రయాణానంతరం పవిత్ర స్నానంతో వారిలో ఉప్పొంగిన భావోద్వేగాలు… ఇవన్నీ చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో నివ్వెరపోయింది. ఈ విధంగా భారత్‌ నిర్వహణా నైపుణ్యం, ఆవిష్కరణ సామర్థ్యం నేడు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. సెమీకండక్టర్ల నుంచి విమాన వాహక నౌకలదాకా ప్రతి ఒక్కటీ ఇక్కడే తయారవుతోంది. భారత్‌ రచిస్తున్న ఈ విజయగాథను సవివరంగా తెలుసుకోవాలని ప్రపంచం ఆకాంక్షిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నడుమ ఈ ‘న్యూస్ ఎక్స్ వరల్డ్’ ఇందుకో సదవకాశం కల్పించిందని నేను భావిస్తున్నాను.

మిత్రులారా!

   ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికల క్రతువును భారత్‌ కొన్ని నెలల కిందటే దిగ్విజయంగా నిర్వహించింది. అంతేకాదు… 60 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. గడచిన 11 ఏళ్లలో దేశం సాధించిన అనేక విజయాలే ఈ ప్రజా విశ్వాసానికి మూలం. ఈ నేపథ్యంలో మీ కొత్త ఛానెల్ భారత వాస్తవ విజయగాథలను ప్రపంచం ముందుంచగలదని నేను విశ్వసిస్తున్నాను. ఆర్భాటాలు, హంగులేవీ అక్కర్లేదు… మనం మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ మేరకు అసలు సిసలు భారత్‌ చిత్రాన్ని మీ అంతర్జాతీయ ఛానెల్ ప్రపంచ మానవాళికి చూపాలని ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా!

   చాలా ఏళ్ల కిందట ‘స్థానికత కోసం నినాదం’ (వోకల్ ఫర్ లోకల్), ‘గ్రామం నుంచి ప్రపంచం’ (లోకల్ ఫర్ గ్లోబల్) దృక్కోణాన్ని నేను దేశం ముందుంచాను. ఇది వాస్తవ రూపం దాల్చడాన్ని నేడు మనమంతా చూస్తున్నాం. మన ఆయుష్ ఉత్పత్తులు, యోగా వంటివి స్థానికం నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ఇవాళ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా యోగా తెలిసిన వారు ఒక్కరైనా మీకు తటస్థపడతారు. ఇక్కడ కూర్చున్న నా మిత్రుడు టోనీ నిత్య యోగాభ్యాసి. భారత సూపర్‌ఫుడ్- ‘మఖానా’ (తామర గింజలు) స్థానికం నుంచి ప్రపంచ స్థాయికి దూసుకెళ్తోంది. మన చిరుధాన్యాలు- ‘శ్రీఅన్న’కూ అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభిస్తోంది. ఢిల్లీలోని ‘హాట్’ (గ్రామీణ బజారు)లో భారత చిరుధాన్య వంటకాలపై నా మిత్రుడు టోనీ అబాట్‌ ప్రత్యక్ష అనుభవాన్ని నేను తెలుసుకున్నాను. ఆ వంటకాలు తనకెంతో నచ్చాయని విన్నపుడు నా ఆనందానికి అవధుల్లేవు.

మిత్రులారా!

   చిరుధాన్యాలు మాత్రమే కాదు… మన పసుపు పంట కూడా స్థానికం నుంచి ప్రపంచ స్థాయిని అందుకుంది. ప్రపంచానికి అవసరమైన పసుపులో 60 శాతానికిపైగా మన దేశం నుంచే సరఫరా అవుతోంది. మన కాఫీ పంటకూ స్థానికం నుంచి ప్రపంచ స్థాయికి చేరింది. భారత్‌ నేడు ప్రపంచంలో 7వ అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా ఎదిగింది. భారత మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇక్కడ తయారయ్యే ఔషధాలు ప్రపంచంలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇవే కాకుండా మరో ముఖ్యాంశాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావించాల్సి ఉంది. అదేమిటంటే- భారత్‌ అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోంది. కృత్రిమ మేధ (ఎఐ)పై ఇటీవల ఫ్రాన్స్‌లో నిర్వహించిన కార్యాచరణ సదస్సుకు హాజరయ్యే అవకాశం నాకు లభించింది. ప్రపంచానికి భవిష్యత్‌ ‘ఎఐ’ దిశగా మార్గనిర్దేశం చేసే ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ సహాధ్యక్షత వహించగా, తదుపరి సదస్సు నిర్వహణ బాధ్యతను స్వీకరించింది. ఇప్పటికే తన అధ్యక్షతన అద్భుతమైన జి-20 శిఖరాగ్ర సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత్‌-మధ్యప్రాచ్యం-ఐరోపా కారిడార్ రూపంలో ప్రపంచానికి ఓ కొత్త ఆర్థిక వేదికను ఏర్పరిచాం. అలాగే వర్ధమాన దేశాలు తమ గళం గట్టిగా వినిపించగల అవకాశాన్ని కల్పించింది. ద్వీప దేశాలను, వాటి ప్రయోజనాలను మన ప్రాథమ్యాలకు జోడించాం. వాతావరణ సంక్షోభం నుంచి ఉపశమనం దిశగా ప్రపంచానికి ‘మిషన్ లైఫ్’ పేరిట భారత్‌ ఓ కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసింది. అలాగే అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఎ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల సంకీర్ణం (సిడిఆర్‌ఐ) వంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి భారత్‌ నాయకత్వ పటిమ ప్రస్ఫుటమవుతోంది. అనేక భారత బ్రాండ్లు ప్రపంచమంతటా విస్తరిస్తున్న నేపథ్యంలో మన మీడియా కూడా ఆ బాటలో పయనించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ విధంగా అంతర్జాతీయ అవకాశాలను అది అర్థం చేసుకుని ముందడుగేస్తోంది.

మిత్రులారా!

   ప్రపంచం కొన్ని దశాబ్దాలుగా భారతదేశాన్ని తన కార్యకలాపాల వేదికగా పరిగణిస్తూ వచ్చింది. కానీ, మన దేశం నేడు ప్రపంచానికి సరికొత్త తయారీ కూడలిగా రూపొందుతోంది. ఇవాళ మనం శ్రామిక శక్తిగా మిగిలిపోకుండా ప్రపంచ శక్తిగా మారుతున్నాం! ఒకనాడు దిగుమతి చేసుకున్న వస్తువుల ఎగుమతికి భారత్‌ ఇప్పుడొక కేంద్రంగా తయారవుతోంది. ఒకప్పుడు స్థానిక మార్కెట్‌కే పరిమితమైన రైతు, నేడు తన పంటను ప్రపంచ విపణిలో అమ్మకానికి పెట్టగలుగుతున్నాడు. పుల్వామా ‘స్నో పీస్’ (మంచు బఠానీ), మహారాష్ట్ర ‘పురందర్ ఫిగ్స్’ (అత్తి), కశ్మీర్‌ క్రికెట్ బ్యాట్‌ వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. మన రక్షణ రంగ ఉత్పత్తులు భారత ఇంజనీరింగ్-సాంకేతికత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమొబైల్ దాకా ప్రతి రంగంలోనూ  ప్రపంచం మన స్థాయిని, సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా గమనిస్తోంది. ఇలా మన ఉత్పత్తులను ప్రపంచానికి చేరువ చేయడమేగాక ప్రపంచ సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ, ఆధారపడదగిన భాగస్వామిగానూ రూపాంతరం చెందుతోంది.

మిత్రులారా!

   అన్ని రంగాల్లో మనమివాళ అగ్రస్థానానికి చేరుతున్నామంటే కారణం- కొన్నేళ్లుగా చక్కని ప్రణాళికలతో కఠోరంగా కృషి చేయడమే. వ్యవస్థీకృత విధాన నిర్ణయాలతో మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా గడచిన పదేళ్ల మన పయనాన్ని గమనించండి. వంతెనలు, రోడ్ల నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన స్థితినుంచి సరికొత్త స్వప్నాలు నేడు ఆధునిక వేగంతో సాకారం అవుతున్నాయి. చక్కని రహదారులు, అద్భుతమైన ఎక్స్‌ప్రెస్‌వేలతో ప్రయాణ సమయం, వ్యయం రెండూ తగ్గాయి. దీంతో రవాణా సాధనాల లభ్యత వ్యవధిని గణనీయంగా తగ్గించడంలో పరిశ్రమలకు వెసులుబాటు లభించింది. ముఖ్యంగా రోడ్డు రవాణా రంగానికి భారీ ప్రయోజనం చేకూరింది. వాహనాల డిమాండ్‌ పెరిగింది… తదనుగుణంగా వాహనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఈ విదంగా మనం ప్రపంచంలో ప్రధాన ఆటోమొబైల్ ఉత్పత్తిదారు-ఎగుమతిదారుగా భారత్‌ ఎదుగుతోంది.

 

 

మిత్రులారా,

ఎలక్ట్రానిక్స్ తయారీలోనూ ఇదే తరహా మార్పు కనిపించింది. తొలిసారిగా 2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ గత దశాబ్ద కాలంలోనే చేరింది. దేశంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి పెరిగింది. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల డిమాండ్‌ను పెంచింది. మేం డేటా చౌకగా చేయటం వల్ల మొబైల్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. మొబైల్ ఫోన్లలోనే ఎక్కువ సేవలు అందేలా చేయటంతో డిజిటల్ పరికరాల వినియోగం మరింత పెరిగింది. ఈ డిమాండ్‌ను అవకాశంగా మలుచుకుని పీఎల్ఐ పథకాల వంటి కార్యక్రమాలను ప్రారంభించాం. నేడు భారత్‌ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా మారింది.

మిత్రులారా,

నేడు భారతదేశం చాలా పెద్ద లక్ష్యాలను పెట్టుకొని, వాటిని సాధిస్తోంది. దీని వెనుక ఒక ప్రత్యేక మంత్రం ఉంది. అదే కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన. సమర్ధవంతమైన, ప్రభావంతమైన పరిపాలనకు ఇదే సూత్రం. దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి జోక్యం, ఒత్తిడి ఉండదు. ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెబుతాను. గత దశాబ్ద కాలంలో ప్రాముఖ్యత కోల్పోయిన 1500 చట్టాలను రద్దు చేశాం. 1500 చట్టాలను రద్దు చేయడం అనేది పెద్ద విషయం. వీటిలో చాలా చట్టాలు ఆంగ్లేయుల కాలంలో చేసినవే. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెబుతాను.  నాటక ప్రదర్శన చట్టం అనే ఒక చట్టం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ చట్టాన్ని బ్రిటిష్ వారు 150 సంవత్సరాల క్రితం చేశారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకాలను ఉపయోగించకూడదని బ్రిటిష్ వారు కోరుకున్నారు. ఒక బహిరంగ ప్రదేశంలో 10 మంది నృత్యం చేస్తే వారిని అరెస్టు చేయవచ్చనే నిబంధన ఈ చట్టంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ల పాటు ఈ చట్టం కొనసాగింది. ఈ చట్టం వల్ల పెళ్లి ఊరేగింపులో 10 మంది నృత్యం చేస్తే వరుడుతో పాటు వారిని కూడా పోలీసులు అరెస్టు చేయొచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70-75 ఏళ్ల పాటు ఈ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టాన్ని మా ప్రభుత్వం తొలగించింది. మనం ఈ చట్టాన్ని 70 సంవత్సరాలుగా కొనసాగించాం. ఆనాటి ప్రభుత్వానికి నేను చెప్పడానికి ఏం లేదు. ఆ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఈ లుటియన్స్ సమూహం, ఈ ఖాన్ మార్కెట్ ముఠాను చూసి నేను మరింత ఆశ్చర్యపోతున్నాను. ఇలాంటి చట్టంపై 75 ఏళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రతిరోజూ కోర్టుకు వెళ్లే వారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించిన కాంట్రాక్టర్ల మాదిరిగా తిరిగే వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు వారికి స్వేచ్ఛ గుర్తుకు రాలేదా? ఒకసారి ఆలోచించండి.. మోదీ ఇలాంటి చట్టం చేసి ఉంటే ఏమయ్యేది? మోదీ ఇలాంటి చట్టం చేయబోతున్నారని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఈ ట్రోలర్లు ప్రచారం చేసి ఉంటే ఈ వ్యక్తులు అల్లకల్లోలం సృష్టించే వారు. మోదీ జుట్టు పట్టుకొని లాగేవారు.

మిత్రులారా,

బానిసత్వ కాలం నుంచి ఉన్న  ఈ చట్టాన్ని రద్దు చేసింది మా ప్రభుత్వమే. వెదురుకు సంబంధించిన మరొక ఉదాహరణ నేను చెబుతాను. వెదురు మన గిరిజన ప్రాంతాలకు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలకు జీవనాడి. కానీ ఇంతకుముందు వెదురు కొట్టినందుకు కూడా జైలుకు పంపేవారు. అప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు చేశారు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నారు.. వెదురు ఒక చెట్టా! కాదా! కొందరు అది చెట్టు అని నమ్ముతారు, మరికొందరు చెట్టు కాదు అని నమ్ముతారు. స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా మన దేశ ప్రభుత్వం వెదురును ఒక చెట్టుగా నమ్మింది. దీనివల్ల చెట్లను నరికేయటంపై నిషేధం ఉన్నట్లుగానే వెదురును కొట్టటంపై కూడా నిషేధం ఉంది. వెదురును చెట్టుగా భావించే చట్టం మన దేశంలో ఉండేది. చెట్లకు సంబంధించిన చట్టాలన్నీ దానికి వర్తించేవి. దీనివల్ల నరికేయటం కష్టమయ్యేది. వెదురు చెట్టు కాదనే విషయాన్ని మన గత పాలకులు అర్థం చేసుకోలేకపోయారు. ఆంగ్లేయులకు స్వంత ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ మనం ఎందుకు చేయలేదు? వెదురుకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న చట్టాన్ని కూడా మా ప్రభుత్వమే మార్చేసింది.

మిత్రులారా,

పదేళ్ల క్రితం ఐటీఆర్ దాఖలు చేయడం సామాన్యుడికి ఎంత కష్టమో గుర్తుండే ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని క్షణాల్లో ఐటీఆర్ దాఖలు చేయచ్చు. అంతేకాకుండా రీఫండ్ కూడా కొద్ది రోజుల్లోనే నేరుగా ఖాతాలో జమ అవుతోంది. ఇప్పుడు ఆదాయపు పన్నుకు సంబంధించిన చట్టాన్ని మరింత సులభతరం చేసే ప్రక్రియ పార్లమెంటులో కొనసాగుతోంది. రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేశాం. ఇప్పుడు చప్పట్లు వినిపిస్తున్నాయి. వెదురు గిరిజనులకు చెందినది కాబట్టి మీరు అభినందించలేదు. ముఖ్యంగా పాత్రికేయ సిబ్బందికి, మీలాంటి వేతన జీవులకు ఇది మేలు చేస్తుంది. మొదటి, రెండో ఉద్యోగం చేస్తోన్న యువత ఆకాంక్షలు కూడా వేరు. వారి ఖర్చులు కూడా వేరు. వారి ఆకాంక్షలను నెరవేర్చాలి. వారి పొదుపు పెరగాలి. ఈ విషయంలో బడ్జెట్ చాలా సహాయం చేసింది. దేశ ప్రజలకు సులభతర జీవనం, సులభతర వ్యాపారం ఇవ్వడం, వారికి ఎగిరేందుకు ఎలాంటి హద్దులు లేని అకాశాన్ని ఇవ్వటమే మా లక్ష్యం. నేడు ఎన్ని అంకురాలు జియోస్పేషియల్ డేటాను సద్వినియోగం చేసుకుంటున్నాయో చూడండి. గతంలో ఎవరైనా మ్యాప్ తయారు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. మేం దీన్ని మార్చాం. నేడు మా అంకురాలు, ప్రైవేట్ కంపెనీలు ఈ డేటాను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాయి.

 

 

మిత్రులారా,

ప్రపంచానికి జీరో భావనను అందించిన భారత్, ఇప్పుడు అనంతమైన నూతన ఆవిష్కరణల భూమిగా మారుతోంది. ఈ రోజు భారత్ నూతన ఆవిష్కరణలు చేయడం మాత్రమే కాకుండా, సొంత మార్గంలో కొత్తదనాన్ని సృష్టిస్తోంది. నేను “ఇండొవేట్” అని చెప్పినప్పుడు, దాని అర్థం “భారతీయ విధానంలో ఆవిష్కరణలు చేయడం.” ఇండొవేటింగ్ ద్వారా, మనం అందరికీ అందుబాటులో ఉండే, సులభంగా ఉపయోగించుకునే, అవసరాలకు అనుగుణంగా మారే పరిష్కారాలను రూపొందిస్తున్నాం. మనం ఈ పరిష్కారాలను పరిమితం చేయడం లేదు, ప్రపంచమంతటికీ వాటిని అందుబాటులో ఉంచుతున్నాం. ప్రపంచం ఒక సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను కోరినప్పుడు, మనం యుపిఐ వ్యవస్థను సృష్టించాం. నేను ప్రొఫెసర్ కార్లోస్ మోంటెస్‌  చెప్పేది వింటున్నాను, ఆయన యుపిఐ వంటి ప్రజా హిత సాంకేతికతల పట్ల ఎంతో ఆకర్షితులయ్యారని అనిపించింది.

నేడు, ఫ్రాన్స్, యుఎఇ, సింగపూర్ వంటి దేశాలు యుపిఐని తమ ఆర్థిక వ్యవస్థలో సమగ్రపరుచుకుంటున్నాయి. నేడు, ప్రపంచంలోని అనేక దేశాలు మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియా స్టాక్ లో చేరడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో, మన వ్యాక్సిన్ భారతదేశ నాణ్యమైన ఆరోగ్య పరిష్కారాల నమూనాను ప్రపంచానికి చూపించింది. మనం ఆరోగ్య సేతు యాప్‌ను కూడా ఓపెన్ సోర్స్ చేసి, ప్రపంచమంతా దానివల్ల ప్రయోజనం పొందేలా చేశాము. ఇప్పుడు భారత్ ఒక ప్రధాన అంతరిక్ష శక్తిగా ఎదిగింది; మనం ఇతర దేశాలకు కూడా వారి అంతరిక్ష లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతున్నాం. అలాగే, ప్రజల హితం కోసం కృత్రిమ మేధ పై కూడా భారత్ పని చేస్తోంది.  తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది.

మిత్రులారా,

ఐటివి నెట్ వర్క్ నేడు అనేక ఫెలోషిప్ లను ప్రారంభించింది. అభివృద్ధి చెందిన భారతదేశం నుండి అత్యధిక ప్రయోజనం పొందేది భారత యువతే, అలాగే దేశ అభివృద్ధిలో వారు అతిపెద్ద భాగస్వాములుగా ఉన్నారు. అందుకే, యువత ప్రయోజనాలు మాకు  అత్యంత ప్రాధాన్యం. జాతీయ విద్యా విధానం (ఎన్ ఇ పి) పిల్లలకు పుస్తకాల పరిధిని మించి ఆలోచించే అవకాశాన్ని అందించింది. మిడిల్ స్కూల్ నుంచే కోడింగ్ నేర్చుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాలకు పిల్లలు సిద్ధమవుతున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పిల్లలకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పై ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తున్నాయి. అందుకే ఈ ఏడాది బడ్జెట్ లో కొత్తగా 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించాం.

మిత్రులారా,

వార్తాప్రపంచంలో, మీరు వివిధ ఏజెన్సీల నుంచి చందాలు తీసుకుంటారు, ఇది మంచి వార్తల కవరేజీని పొందడంలో మీకు సహాయపడుతుంది. అదేవిధంగా, పరిశోధనా రంగంలో, విద్యార్థులకు మరింత ఎక్కువ సమాచార వనరులు అవసరం. దీనికోసం గతంలో వివిధ జర్నల్స్ కోసం సబ్ స్క్రిప్షన్లను ఖరీదైన రేట్లకు తీసుకోవాల్సి వచ్చేది. మన ప్రభుత్వం పరిశోధకులందరినీ ఈ ఆందోళన నుండి విముక్తం చేసింది. వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ తీసుకొచ్చాం. దీంతో దేశంలోని ప్రతి పరిశోధకుడికి ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్ కు ఉచిత ప్రవేశం లభించడం ఖాయం. ఇందుకోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతోంది. ప్రతి విద్యార్థికి అత్యుత్తమ పరిశోధనా సౌకర్యాలు అందేలా చూస్తున్నాం. అంతరిక్ష పరిశోధన అయినా, బయోటెక్ పరిశోధన అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మన పిల్లలు భవిష్యత్ నేతలుగా ఎదుగుతున్నారు. డాక్టర్ బ్రియాన్  గ్రీన్ ఐఐటి  విద్యార్థులను కలుసుకున్నారు, అలాగే అంతరిక్ష యాత్రికుడు మైక్ మాసిమినో సెంట్రల్ స్కూల్ విద్యార్థులను కలుసుకున్నారు. ఈ అనుభవం నిజంగా అద్భుతంగా అనిపించిందని ఆయన అన్నారు. భారతదేశంలోని ఓ చిన్న పాఠశాల నుంచి భవిష్యత్తును మార్చే గొప్ప ఆవిష్కరణ వెలువడే రోజు ఎంతో దూరం లేదు.

మిత్రులారా,

ప్రతి ప్రపంచ వేదికపైనా భారత పతాకం ఎగరనిద్దాం. ఇది మన ఆకాంక్ష, ఇది మన దిశ.

మిత్రులారా,

ఇది చిన్నగా ఆలోచించే, చిన్న అడుగులు వేస్తూ ముందుకెళ్లే సమయం కాదు. ఒక మీడియా సంస్థగా మీరు కూడా ఈ భావాన్ని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. పది సంవత్సరాల క్రితం మీరు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎలా చేరుకోవాలి? మీ మీడియా హౌస్‌ను ఎలా విస్తరించాలి? అనే దానిపై ఆలోచించేవారు. కానీ ఇవాళ  మీరు అంతర్జాతీయంగా ఎదగాలనే ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. ఈ ప్రేరణ, ఈ ప్రతిజ్ఞ ప్రతి పౌరుడి, ప్రతి పారిశ్రామికవేత్త లక్ష్యంగా మారాలి. నా కల ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి మార్కెట్‌లో, ప్రతి డ్రాయింగ్ రూమ్‌లో, ప్రతి డైనింగ్ టేబుల్‌పై ఒక భారతీయ బ్రాండ్ ఉండాలి. మేడ్ ఇన్ ఇండియా – అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే మంత్రంగా మారాలి.ఏదైనా వ్యాధి వస్తే, ముందుగా భారత్ లో నయం చేసుకోవాలి (హీల్ ఇన్ ఇండియా) అని ఆలోచించాలి. వివాహం చేసుకోవాలనుకుంటే,  భారత్ లో పెళ్లి చేసుకోవాలి (వెడ్ ఇన్ ఇండియా) అనే ఆలోచన ముందుగా రావాలి. ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే, భారత్‌ను  ప్రథమ ఎంపికగా పెట్టుకోవాలి. ఎవరైనా సమావేశం  లేదా ఎగ్జిబిషన్ నిర్వహించాలని అనుకుంటే, మొదట భారతదేశానికే రావాలి. సంగీత కచేరీ చేయాలనుకునే వ్యక్తి, తొలుత భారత్‌ను ఎంచుకోవాలి. ఈ శక్తిని, ఈ సానుకూల దృక్పథాన్ని మనలో అభివృద్ధి చేసుకోవాలి. మీ నెట్‌వర్క్, మీ ఛానల్ ఇందులో కీలక పాత్ర పోషించాలి. అవకాశాలు అనంతం, ఇప్పుడు మన ధైర్యం, సంకల్పం ద్వారా వాటిని నిజం చేయాలి.

మిత్రులారా,

వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గా ఎదగాలన్న సంకల్పంతో మన దేశం ముందుకెళ్తోంది. మీరు కూడా మీడియా సంస్థగా ప్రపంచ వేదికపైకి రావాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. ఈ విషయంలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను. మరోసారి ఐటివి నెట్‌వర్క్ మొత్తం బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశవిదేశాల నుంచి వచ్చిన వారందరినీ అభినందిస్తున్నాను. వారి ఆలోచనలు, అభిప్రాయాలు సానుకూల దృక్పథాన్ని మరింత బలపరిచాయి, ఇందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతదేశ గౌరవం పెరిగినప్పుడు, ప్రతి భారతీయుడికి ఆనందం, గర్వం కలుగుతుంది. దీనికి నేను వారందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి సుమారు అనువాదం.  ఆయన అసలు ప్రసంగం హిందీలో చేశారు. 

 

***