Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఐఐబి మూడో వార్షిక స‌మావేశ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఎఐఐబి మూడో వార్షిక స‌మావేశ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఎఐఐబి మూడో వార్షిక స‌మావేశ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఎఐఐబి మూడో వార్షిక స‌మావేశ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు అధ్య‌క్షులు,

వేదికను అలంకరించిన ఇత‌ర ప్ర‌ముఖులు,

భార‌త‌దేశం తో పాటు ఇత‌ర దేశాల‌ నుండి స‌మాశానికి విచ్చేసిన ప్ర‌తినిధుల‌కు

మహిళలు మరియు సజ్జనులారా,

ముంబయి లో జరుగుతున్న ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు మూడో వార్షిక స‌మావేశం కోసం ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. బ్యాంకు తో, బ్యాంకు స‌భ్యుల‌ తో మన అనుబంధాన్ని మ‌రింత గాఢతరం చేసుకొనేందుకు ఈ అవ‌కాశం ల‌భించడం హర్షణీయం.

ఎఐఐబి త‌న ఆర్ధిక సహాయ కార్య‌క‌లాపాల‌ను 2016 జ‌న‌వ‌రి లో ప్రారంభించింది. మూడు సంవత్సరాల కన్నా లోపే, ఈ బ్యాంకు లో 87 మంది స‌భ్యులు చేరారు. మరి అదే విధంగా నిబ‌ద్ధ‌త‌తో కూడిన 100 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల మూలధన రాశి దీనికి దక్కింది. ఈ బ్యాంకు ఆసియా లో ఒక కీల‌కమైనటువంటి పాత్ర ను పోషించ‌డానికి సిద్ధంగా ఉంది.

మిత్రులారా,

మ‌న ప్ర‌జ‌ల‌కు మెరుగైన భ‌విష్య‌త్తు ను అందించ‌డానికిగాను ఆసియా దేశాల‌న్నీ క‌లసి ఐక‌మ‌త్యంగా చేసిన కృషి ఫ‌లితంగా ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు ప్రారంభ‌మైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మ‌నం ఒకే విధ‌మైన స‌వాళ్ల‌ను పంచుకుంటున్నాం. మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న కోసం వ‌న‌రుల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం ఎలా అనేది ఈ స‌వాళ్ల‌లో ఒక‌టి. ఈ సంవత్సరపు స‌మావేశాన్ని ‘‘అవస్థాపన కోసం ఆర్ధిక సహాయాన్ని సమీకరించడం: నూతన ఆవిష్కరణ మ‌రియు స‌హ‌కారం’’ అనే అంశం ఇతివృత్తంగా నిర్వ‌హిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సుస్థిర‌మైన మౌలిక స‌దుపాయాలకై ఎఐఐబి పెట్టే పెట్టుబ‌డులు కోట్లాది ప్ర‌జ‌ల జీవితాలను ప్రభావితం చేయగలుగుతాయి.

విద్య‌, ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక సేవ‌లు, ఇంకా సాంప్రదాయక ఉపాధి అవ‌కాశాల లభ్యత లో ఆసియా ఇప్పటికీ విస్తృత స్థాయి అసమానతలను ఎదుర్కొంటోంది.

ఎఐఐబి వంటి సంస్థల ద్వారా ఏర్పడే బహుళ దేశాల సభ్యత్వం వ‌న‌రుల స‌మీక‌ర‌ణ కు తోడ్పడంలో ఒక కీల‌క‌ పాత్ర‌ను పోషించగలుగుతుంది.

శక్తి మరియు విద్యుత్తు, ర‌వాణా, టెలిక‌మ్, గ్రామీణ మౌలిక స‌దుపాయాలు, వ్య‌వ‌సాయాభివృద్ధి, నీటి స‌ర‌ఫ‌రా మరియు పారిశుద్ధ్యం, ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ‌, గ్రామీణాభివృద్ధి, మరియు లాజిస్టిక్స్ మొద‌లైన రంగాలకు దీర్ఘ‌ కాలం పాటు నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఈ నిధుల‌కు వ‌డ్డీ రేట్లు తక్కువ ఖర్చుతో సుస్థిర‌త‌ను క‌లిగివుండవలసిన అవసరం ఉంది.

ఎఐఐబి చాలా త‌క్కువ కాలంలోనే, 4 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్లకు పైగా ఆర్ధిక సాయాన్ని అందించ‌డానికిగాను డ‌జ‌ను దేశాలలో 25 ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది. ఇది చ‌క్క‌టి ప్రారంభం.

ఎఐఐబి ద‌గ్గ‌ర వంద బిలియ‌న్ డాల‌ర్ల మూల‌ధ‌నం ఉంది. అలాగే సభ్య‌త్వ దేశాలలో మౌలిక స‌దుపాయాల ఏర్పాటు పెద్ద ఎత్తున చేయాల్సి వుంది. 4 బిలియ‌న్ల ఆర్ధికా సాయాన్నించి 2020 నాటికి 40 బిలియ‌న్ డాల‌ర్ల‌కు, 2025 నాటికి వంద బిలియ‌న్ డాల‌ర్ల‌కు ఎఐఐబి త‌న ఆర్ధిక సహాయాన్ని విస్త‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిస్తున్నాను.

అంతే కాదు ఈ ఆర్దిక సాయం అంద‌జేత ప్ర‌క్రియ సులువుగా ఉండాలి. శీఘ్ర‌గ‌తిన ఆమోదం తెల‌పాలి. అంతే కాదు అత్యున్న‌త స్థాయి నాణ్య‌త‌ గ‌ల ప్రాజెక్టుల‌కు, బ‌ల‌మైన ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెల‌పాలి.

ఆర్దిక వృద్ధి అనేదాన్ని అంద‌రినీ క‌లుపుకుపోయేలా, సుస్థిరంగా ఉండేలా చేయ‌డానికిగాను భార‌త‌దేశం, ఎఐఐబి.. ఈ రెండూ బ‌ల‌మైన నిబ‌ద్ధ‌తతో ఉన్నాయ‌ని నేను న‌మ్ముతున్నాను. భార‌త‌దేశం లో మేము ప్ర‌త్యేక‌మైన‌ ప్ర‌భుత్వ- ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య న‌మూనాల‌ను అమ‌లు చేస్తున్నాం. అంతే కాదు మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌కోసం ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెట్ ఫండ్స్‌, ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్ మెంట్ ట్ర‌స్టుల‌ను ప్రారంభిస్తున్నాము. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పెట్టుబ‌డుల‌ కోసం ప్ర‌త్యేక ఆస్తుల త‌ర‌గ‌తి లాగా ఉండేలా బ్రౌన్ ఫీల్డ్ ఆస్తుల‌ను అభివృద్ధి చేయ‌డానికి భార‌త‌దేశం ప్ర‌య‌త్నిస్తోంది. భూ స‌మీక‌ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ అనుమ‌తుల స్థాయిల‌ను దాటిన ఆస్తుల వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు. అలాంటి ఆస్తుల‌కు.. పింఛన్ ల నుండి వ‌చ్చే సంస్థాగ‌త పెట్టుబ‌డి, బీమా, సావ‌రిన్ వెల్త్ ఫండ్స్‌.. ముందు ముందు స‌మ‌కూర‌డానికి అవ‌కాశం ఉంది.

మ‌రొక కార్య‌క్ర‌మం నేశన‌ల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్‌. మౌలిక స‌దుపాయ‌ల‌ క‌ల్ప‌న‌ కోసం దేశీయంగాను, అంత‌ర్జాతీయంగాను అందుబాటు లోకి వ‌చ్చే వ‌న‌రుల‌ ద్వారా పెట్టుబ‌డులను సాధించ‌డ‌మే ఈ ఫండ్ ఉద్దేశ్యం. ఇది త‌న పెట్టుబ‌డుల‌ కోసం ఎఐఐబి నుండి 200 మిలియ‌న్ అమెరికా డాలర్ల నిధుల‌ను పొందడం ద్వారా ప‌టిష్ట‌మైంది.

మహిళలు మరియు సజ్జనులారా,

ప్ర‌పంచవ్యాప్తంగా చూసిన‌ప్పుడు భార‌త‌దేశం పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను క‌లిగిన దేశాల్లో ముందు వ‌రుస‌ లో ఉంటుంది. పెట్టుబ‌డిదారులు ఆర్దిక వృద్ధి కోసం, స్థూల ఆర్ధిక స్థిర‌త్వం కోసం చూస్తారు. వారు వారి పెట్టుబ‌డుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ మ‌ద్ద‌తుగా నిలిచే విధి విధానాల‌ వ్య‌వ‌స్థ‌ ను, రాజ‌కీయ స్థిర‌త్వాన్ని కోరుకుంటారు. భారీ స్థాయిలో జ‌రిగే కార్య‌క‌లాపాలు, అత్య‌ధిక అద‌న‌పు విలువ దృష్ట్యా చూసిన‌ప్పుడు దేశీయంగా వుండే భారీ విపణి ప‌రిమాణం, నైపుణ్యం గ‌ల కార్మికులు, నాణ్య‌మైన భౌతిక మౌలిక స‌దుపాయాల‌ ప‌ట్ల పెట్టుబ‌డిదారులు ఆక‌ర్షితులు అవుతారు. ఈ ప్ర‌మాణాల‌న్నింటి విష‌యంలో భార‌త‌దేశం స‌రైన స్థానంలో ఉంది. అంతే కాదు బాగా ప‌ని చేసింది కూడా. మాకు గ‌ల అనుభ‌వాల‌ను, విజ‌యాల‌ను మీకు నన్ను వెల్లడించనివ్వండి.

అంత‌ర్జాతీయ ఆర్ధిక రంగంలో భార‌త‌దేశం ఒక వెలుగు దివ్వె గా ఆవిర్భ‌వించింది. అంత‌ర్జాతీయ ఆర్ధిక వృద్ధి కి మ‌న దేశ సామ‌ర్థ్యం దోహ‌దం చేస్తోంది. 2.8 ట్రిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల‌ తో , ఆర్ధిక‌ ప‌రిమాణం విష‌యంలో ప్ర‌పంచం లో ఏడో స్థానం లో భారతదేశం ఉంది. కొనుగోలు సామ‌ర్థ్యం విష‌యంలో భార‌త‌దేశం మూడో స్థానంలో ఉంది. 2017 నాలుగో భాగంలో 7.7 శాతం చొప్పున వృద్ధి చెంద‌డం జ‌రిగింది. 2018లో 7.4 శాతం వృద్ధి చెందాల‌నే ల‌క్ష్యాన్ని పెట్టుకున్నాం.

స్థిర‌మైన ధ‌ర‌ల‌తో మా స్థూల ఆర్ధిక ప్రాథమిక అంశాలు ప‌టిష్టంగా ఉన్నాయి. విదేశీ రంగం బ‌లంగా ఉంది. అలాగే ఆర్ధిక ప‌రిస్థితి నియంత్ర‌ణ‌లో ఉంది. చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్న‌ప్ప‌టికీ ద్రవ్యోల్బ‌ణం ఉండవలసిన స్థాయిలోనే ఉంది. ఆర్ధిక ఏకీక‌ర‌ణ మార్గంలో ప‌య‌నించాల‌నే నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం క‌ంకణం కట్టుకొంది. జిడిపి లో ప్ర‌భుత్వ రుణాల శాతం క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంది. చాలాకాలం త‌ర్వాత భార‌త‌దేశ రేటింగు పెరిగింది.

విదేశీ రంగం బ‌లంగా ఉంది. మా విదేశీ మారక‌ద్ర‌వ్య నిలువ‌లు 400 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల‌ కంటే అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఆర్ధిక వ్య‌వ‌హారాలలో ఎలాంటి ఒడుదొడుకులు లేవు. భార‌త‌దేశ ఆర్ధిక రంగం ప‌ట్ల అంత‌ర్జాతీయంగా విశ్వ‌సం పెరుగుతోంది. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ విష‌యంలో గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో 222 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల‌కంటే ఎక్కువ‌గానే భార‌త‌దేశానికి వ‌చ్చాయి. యుఎన్ సిటిఎడి వెలువ‌రించిన ప్ర‌పంచ పెట్టుబ‌డుల నివేదిక ప్ర‌కారం, భార‌త‌దేశం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల ను ఆకర్షిస్తున్న అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉంది.

మహిళలు మరియు సజ్జనులారా,

విదేశీ పెట్టుబ‌డిదారుల ప‌రంగా చూసిన‌ప్పుడు భార‌త‌దేశం ఏమాత్రం ప్ర‌మాద‌క‌రం కాని రాజ‌కీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను క‌లిగివుంది. పెట్టుబ‌డుల‌ను పెంచ‌డానికిగాను ప్ర‌భుత్వ అనేక చ‌ర్య‌ల‌ను తీసుకుంది. వ్యాపార‌ రంగం కోసం విధివిధానాల‌ను స‌ర‌ళీక‌రించాము. ఎంతో ధైర్యంగా ఆర్ధిక సంస్క‌ర‌ణ‌లను చేప‌ట్టాము. పెట్టుబ‌డిదారుల‌ కోసం స‌మ‌ర్థ‌వంత‌మైన‌, పార‌ద‌ర్శ‌క‌మైన‌, న‌మ్మ‌క‌మైన‌, అంచ‌నా వేయ‌గ‌ల ఆర్ధిక వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాము.

మేము ఎఫ్ డిఐ వ్య‌వ‌స్థ‌ను స‌ర‌ళీక‌రించాం. ప్రస్తుతం చాలా రంగాలు ఆటోమేటిక్ రూట్ లో ఆమోదం పొందుతున్నాయి.

వ‌స్తువులు, సేవ‌ల పన్ను మా దేశం ఎంతో ప‌ద్ధ‌తి ప్ర‌కారం తెచ్చిన సంస్క‌ర‌ణ‌లులలో ఒక సంస్కరణ. ఇది ఒకే దేశం, ఒకే ప‌న్ను నియ‌మం ప్ర‌కారం ప‌ని చేస్తోంది. ప‌న్నుల‌కు సంబంధించి త‌లెత్తే ఊహించ‌ని స‌మ‌స్య‌ల‌ను ఇది త‌గ్గిస్తుంది. పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంచుతుంది. నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది. వీటన్నిటి కార‌ణంగా భార‌త‌దేశంలో పెటుబ‌డిదారులు సులువుగా వ్యాపారం చేసుకోగలుగుతారు.

దీంతో పాటు ఇంకా ఇత‌ర మార్పుల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం గుర్తించింది. ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌చురించిన‌ సుల‌భ‌త‌ర వ్యాపార నిర్వ‌హ‌ణ నివేదిక 2018 లో గ‌త మూడు సంవ‌త్స‌రాల‌ను తీసుకుంటే, భార‌త‌దేశ స్థానం 42 స్థానాలు ఎగ‌బాకింది.

గ‌త ప‌ది సంవ‌త్స‌రాలలో భార‌త‌దేశ విపణి ప‌రిమాణం, వృద్ధి ఎంతో స‌మ‌ర్థ‌వంత‌మైన‌వ‌ని పేరు తెచ్చుకున్నాయి. గ‌త ప‌దేళ్ల‌లో భార‌త‌దేశ త‌ల‌స‌రి ఆదాయం రెట్టింపు అయింది. భార‌త‌దేశంలో 300 మిలియ‌న్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారులు ఉన్నారు. రాబోయే ప‌ది సంవ‌త్స‌రాల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంద‌నే అంచ‌నాలున్నాయి. భార‌త‌దేశం లో డిమాండ్ల ప‌రిమాణం, స్కేల్‌ అనేవి పెట్టుబ‌డిదారుల‌కు మ‌రిన్ని అవ‌కాశాల‌ను క‌ల్పిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు భార‌త‌దేశంలోని గృహ నిర్మాణ కార్య‌క్ర‌మం ద్వారా ప‌ది మిలియ‌న్ ఇళ్ల‌ను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అనేక దేశాల‌న్నిటినీ క‌లుపుకొని చూసిన‌ప్పుడు వాటికి అవ‌స‌ర‌మయ్యే గృహాల‌కంటే ఇది ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి భార‌త‌దేశ‌ గృహ‌నిర్మాణంలో నూత‌న సాంకేతిక‌త‌ను వినియోగించ‌డంవ‌ల్ల అలా ఉప‌యోగించిన‌వారికి మేలు జ‌రుగుతుంది.

వ్యాపార స్థాయికి సంబంధించి మ‌రో ఉదాహ‌ర‌ణ భార‌త‌దేశంలో అమ‌లు చేస్తున్న నవీకరణయోగ్య శక్తి కార్య‌క్ర‌మం. 2022 నాటికి 175 గీగావాట్ల‌ నవీకరణయోగ్య శక్తి సామ‌ర్థ్యాన్ని నిర్మించుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాము. ఇందులో సౌర శక్తి సామ‌ర్థ్యం వంద గీగావాట్లు. ఈ ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను ప‌నులు చాలా వేగంగా కొన‌సాగుతున్నాయి. 2017 లో సంప్ర‌దాయ ఇంధ‌నాని కన్నా నవీకరణ యోగ్య శక్తి కే ఎక్కువ సామ‌ర్థ్యాన్ని అందించాము. అంత‌ర్జాతీయ సౌర ఇంధ‌న కూటమి (ఐఎస్ఎ) ను నెల‌కొల్ప‌డం ద్వారా ప‌లు దేశాల‌ను క‌లుపుకుపోతూ సౌర శక్తి ప్ర‌ధాన స్ర‌వంతి లోకి తెస్తున్నాము. ఈ సంవత్సరం ఢిల్లీ లో అంత‌ర్జాతీయ సౌర వేదిక ప్రారంభ స‌మావేశాన్ని నిర్వ‌హించుకున్నాము. 2030 నాటికి ఒక ట్రిలియ‌న్ అమెరికా డాల‌ర్ల పెట్టుబ‌డిని పెట్ట‌డం ద్వారా 1000 గీగావాట్ల సౌర సామ‌ర్థ్యాన్ని సాధించాల‌ని అంత‌ర్జాతీయ సౌర కూటమి ల‌క్ష్యంగా పెట్టుకుంది.

ఎల‌క్ట్రానిక్ మొబిలిటీ కోసం భార‌తదేశం కృషి చేస్తోంది. మ‌న ముందు ఉన్నటువంటి స‌వాలు సాంకేతిక‌త‌కు సంబంధించింది. ముఖ్యంగా స్టోరేజీకి సంబంధించింది. ఈ ఏడాది మేము అంత‌ర్జాతీయ మొబిలిటీ స‌మావేశానికి ఆతిథ్యం ఇవ్వ‌బోతున్నాము. ఇది మేము మ‌రింత ప్ర‌గ‌తిని సాధించడంలో తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

భారతదేశం లో మేము అన్ని స్థాయిల్లో సంధానాన్ని ఆధునీక‌రిస్తున్నాము. జాతీయ కారిడోర్ లను, ర‌హ‌దారులను నిర్మించ‌డం ద్వారా రహదారి సంధానాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి భార‌త‌మాల ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాం. పోర్టు క‌నెక్టివిటీ ని పెంచ‌డానికి సాగ‌ర‌మాల ప్రాజెక్టును ప్రారంభించాం. అంతే కాదు ఈ ప్రాజెక్టు ద్వారా పోర్టుల ఆధునీక‌ర‌ణ చేయ‌డ‌మే కాకుండా పోర్టుల‌తో లింక‌య్యే ప‌రిశ్ర‌మ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. రైల్వే నెట్ వ‌ర్క్ లో ఏర్పడే ప్రతిష్టంభ‌న‌ను తొల‌గించ‌డానికిగాను ప్ర‌త్యేక‌మైన వ‌స్తు ర‌వాణా కారిడోర్ లను అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది. అలాగే జ‌ల ర‌వాణాకు సంబందించిన సామ‌ర్థ్యాన్ని పెంచ‌డానికి జ‌ల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టు ఉంది. ఇది జాతీయ నీటి ర‌వాణా మార్గాలలో దేశీయ నీటి ర‌వాణాకు సంబంధించిన‌ అంత‌ర్గ‌త వ్యాపారానికి చెందిన‌ది.. స్థానికంగా విమానాశ్ర‌యాల‌ను అభివృద్ది చేసి, వైమానిక ర‌వాణాను పెంచ‌డానికిగాను ఉడాన్ ప‌థ‌కాన్ని ప్రారంభించాము. ర‌వాణా కోసం, వ‌స్తువుల స‌ర‌ఫ‌రా కోసం భార‌త‌దేశానికి గ‌ల సుదూర కోస్తా తీర‌ప్రాంతాన్ని వినియోగించుకునే అవ‌కాశంపైన దృష్టి పెట్టాలి. ఈ రంగాన్ని మ‌నం ఇంకా ప‌ట్టించుకోలేద‌ని నేను న‌మ్ముతున్నాను.

సంప్ర‌దాయ మౌలిక వ‌స‌తుల అంశాన్ని గురించి మ‌నం మాట్లాడుతూనే భార‌త‌దేశం ఇప్ప‌టికే ఏర్పాటు చేసుకున్న‌ ఆధునిక మౌలిక వ‌స‌తుల‌ను గురించి కూడా ఇక్క‌డ ప్ర‌స్తావించాలి. దేశంలో మారుమూల ప్రాంతాల‌కు కూడా భార‌త్ నెట్ ద్వారా క‌నెక్టివిటీని అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాము. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో 460 మిలియ‌న్ ఇంట‌ర్ నెట్ వినియోగ‌దారులు ఉన్నారు. 1.2 బిలియ‌న్ మొబైల్ ఫోన్ లను ఉప‌యోగిస్తున్నారు. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హిస్తున్నాము. భీమ్ యాప్ తోపాటు యునైటెడ్ పేమెంట్స్ ఇంట‌ర్ ఫేస్ (యుపిఐ) వ్య‌వ‌స్థ‌, రూపే కార్డు అనేవి దేశంలోని డిజిట‌ల్ ఆర్ధిక వ్య‌వ‌స్థ వాస్త‌వ సామ‌ర్థ్యాన్ని తెలియ‌జేస్తున్నాయి. మొబైల్ ఫోన్ లో ఉమంగ్ యాప్‌ ను ఉప‌యోగించ‌డం ద్వారా 100కు పైగా ప్ర‌జా సేవలు దేశ పౌరులకు అందుబాటులో వ‌చ్చాయి. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ డిజిట‌ల్ తార‌త‌మ్యాల‌ను త‌గ్గించ‌డానిగాను మా డిజిట‌ల్ ఇండియా మిశన్ ఉప‌యోగ‌ప‌డుతోంది.

భార‌త‌దేశ ఆర్ధిక రంగానికి వ్య‌వ‌సాయం జీవ‌నాడి లాంటిది. గిడ్డంగులు, శీత‌లీక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లు, ఆహార ఉత్ప‌త్తుల త‌యారీ, పంట‌ల బీమా, ఇంకా ఇత‌ర విభాగాల‌లో పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హిస్తున్నాము. అతి త‌క్కువ నీటిని వినియోగంచుకొని ఉత్పాద‌క‌త‌ను పెంచ‌డానిగాను సూక్ష్మ సాగునీటి పారుదలను మేము ప్రోత్స‌హిస్తున్నాము. ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికిగ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించి, మాతో భాగ‌స్వాములు కావాల‌ని ఎఐఐబి ని నేను కోరుతున్నాను.

2022 కల్లా దేశంలో ప్ర‌తి పేద‌వానికి, ఇల్లు లేని కుటుంబానికి మ‌రుగుదొడ్డి, నీరు, విద్యుత్ సౌక‌ర్యం గ‌ల‌ నివాస గృహాన్ని అందించాల‌ని మేము ల‌క్ష్యంగా పెట్టుకొన్నాము. వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణకు సంబంధించి స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యూహాలను మేము ప‌రిశీలిస్తున్నాము.

ఈ మ‌ధ్య‌నే మేము మా జాతీయ ఆరోగ్య సంర‌క్ష‌ణా కార్య‌క్ర‌మం ‘ఆయుష్మాన్ భార‌త్’ ను ప్రారంభించాము. దీని ద్వారా ప్ర‌తి ఏడాది 100 మిలియ‌న్ పేద , అణ‌గారిన వ‌ర్గాల కుటుంబాల‌కు, ఒక్కొక్క కుటుంబానికి 7000 డాల‌ర్ల మేర‌కు ల‌బ్ధి చేకూరుతుంది. ఆరోగ్య సంరక్షణ సౌక‌ర్యాల‌ను విస్త‌రించ‌డం ద్వారా భారీ సంఖ్య‌లో ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంది. అంతే కాదు ఉన్న‌త నాణ్య‌త‌గ‌ల మందుల , ఇత‌ర వినియోగ వ‌స్తువుల‌, వైద్య సాంకేతిక‌త ప‌రిక‌రాల ఉత్ప‌త్తిని ఇది ప్రోత్స‌హిస్తుంది. కాల్ సెంట‌ర్లు, ప‌రిశోధ‌న‌, మ‌దింపు, ఐఇసి విభాగాల‌కు సంబంధించిన అనుబంధ కార్య‌క్ర‌మాల్లో ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంది. మొత్తం ఆరోగ్య సంరక్షణ రంగం భారీ స్థాయిలో బ‌లోపేత‌మ‌వుతుంది.

అంతేకాదు ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఆరోగ్య సంరక్షణ ప్ర‌యోజ‌నాలు అందించ‌డం వ‌ల్ల ఆ మేర‌కు ఆయా కుటుంబాలు డ‌బ్బు ను పొదుపు చేసుకోగ‌లుగుతాయి. దానిని ఇత‌ర అవ‌స‌రాల‌ కోసం వినియోగించ‌డం గానీ, పెట్టుబ‌డులుగా పెట్ట‌డం గానీ చేయ‌వ‌చ్చు. పేద కుటుంబాల్లో పెరిగే ఈ ఆదాయం కార‌ణంగా ఆర్ధిక‌ రంగంలో డిమాండ్ పెరుగుతుంది. ఇంత‌వ‌ర‌కూ అందుబాటు లోకి రాని ఈ ఆర్ధిక సామ‌ర్థ్యాన్ని పెట్టుబ‌డిదారులు వినియోగించుకోవ‌చ్చు.

మిత్రులారా,

భార‌త‌దేశ ఆర్ధిక పున‌రుత్థాన గాథ ఆసియా లోని ప‌లు ప్రాంతాల గాథ ల‌ను ప్ర‌తిబింబిస్తోంది. ప్ర‌స్తుతం ఆసియా ఖండం ప్ర‌పంచ ఆర్ధిక కార్య‌క్ర‌మంలో కేంద్ర‌ స్థానం లోకి చేరింది. ప్ర‌పంచ ప్ర‌ధాన వృద్ధి చోదకశక్తి గా అవ‌త‌రించింది. ఆసియా శ‌తాబ్దంగా ప‌లువురు కీర్తిస్తున్న యుగంలో మ‌నం జీవిస్తున్నాము.

నూత‌న భార‌త‌దేశం ఆవిర్భ‌విస్తోంది. అంద‌రికీ ఆర్ధిక అవ‌కాశాల‌ను అందించే, విజ్ఞాన ఆర్ధిక‌రంగాన్ని క‌లిగిన‌ , స‌మ‌గ్ర ప్ర‌గ‌తిని సాధించే, స‌రైన భ‌విష్య‌త్ గ‌ల‌, బ‌ల‌మైన‌, డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల‌నే స్తంభాల‌మీద భార‌త‌దేశం నిర్మిత‌మ‌వుతోంది. ఎఐఐబితో పాటు మా అభివృద్ధి భాగ‌స్వాములతో క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించ‌డానికి మేము స‌దా సిద్ధంగా ఉన్నాము.

చివరగా, ఈ స‌మావేశంలో జ‌రిగే చ‌ర్చ‌లు, సంప్ర‌దింపులు అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని, బ‌లోపేతం చేస్తాయ‌ని నేను ఆశిస్తున్నాను.

మీకు ఇవే ధన్యవాదాలు.