గౌరవనీయులైన ఛైర్మన్,
దీర్ఘ కాలం పాటు ప్రజా సేవ చేసిన తరువాత, శారీరికంగా మిమ్మల్ని మీరు సరైన రీతిలో ఉంచుకొన్నారు కాబట్టి, ఈ రోజు మీరు ఒక కొత్త కార్య క్షేత్రంలో అడుగుపెడతారన్న నమ్మకం నాకు ఉంది. మీకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నది; ఈ కుటుంబంలో తాతగారు జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు; రాజ్యాంగ పరిషత్తులోనూ ఆయన పని చేశారు; ఒక విధంగా మీరు ప్రజా జీవనంలోను, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లోను ఒక గొప్ప పాత్రను పోషించినటువంటి, అలాగే ఖిలాఫత్ ఉద్యమంతో కూడా సాన్నిహిత్యం కలిగిన పూర్వికులకు చెందినటువంటి కుటుంబం నుండి వచ్చారు.
మీరు స్వయంగా వృత్తి రీత్యా దౌత్య నిపుణుడిగా సేవలను అందించారు. మరి వృత్తిరీత్యా దౌత్యవేత్త అంటే ఎవరు ? ఈ విషయాన్ని ప్రధాన మంత్రి ని అయిన తరువాతనే నేను అర్థం చేసుకొన్నాను. ఎందుకంటే ఎవరైనా చిరునవ్వులు చిందించినప్పుడో, లేదా మరొకరితో కరచాలనం చేసినప్పుడో దానికి అర్థం ఏమిటనేది ఎవరైనా ఇట్టే తెలుసుకోలేరు! ఇలా ఎందుకంటే, ఇందుకోసమే వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అయితే ఈ నేర్పును ఇక్కడ గత పది సంవత్సరాలుగా అమలులో పెట్టడం జరిగి వుంటుంది; అంతేకాదు, ఈ ప్రావీణ్యం సభకు తప్పక మేలు చేసి ఉంటుంది.
ఒక దౌత్యవేత్తగా మీ వృత్తి జీవితం పశ్చిమ ఆసియాతో గాఢంగా ముడివడింది. మీరు మీ ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలు ఒకే రంగంలో గడిపారు. ఒకే రకం వ్యక్తులతో ఒకే రకమైన ఆలోచనలతో, ఒకే రకం స్థితిగతులలో మరియు చర్చోపచర్చలతో మీ పదవీ కాలం సాగిపోయింది. పదవీ విరమణ చేసిన తరువాత కూడా మీ యొక్క కార్యభారం ఒకే రంగంతో ఇప్పటికీ పెనవేసుకొనివుంది; అది మైనారిటీ కమిషన్ లో కావచ్చు, లేదా అలీగఢ్ విశ్వవిద్యాలయంలో కావచ్చు. కానీ, ఈ పది సంవత్సరాలలో మీ బాధ్యత పూర్తి భిన్నంగా ఉండింది. మీరు రాజ్యాంగ స్వరూపానికి లోబడి విధులను నిర్వర్తించవలసి వచ్చింది. ఈ పనిని చక్కగా నెరవేర్చడం కోసం మీరు ఎంతో శ్రమకు ఓర్చారు.
బహుశా కొంత అసౌకర్యంగా భావిస్తే భావించి ఉండవచ్చు గాని మీకు ఈ రోజు ఆ సమస్యయితే లేదు. మరి మీరు ఈ యొక్క విముక్తిని కూడా అనుభూతి చెందుతారు; మీ యొక్క స్వతంత్ర ఆలోచనా సరళితో పనిచేసే అవకాశాన్ని మీరు పొందుతారు.
మనం ఒకరితో మరొకరం పెద్దగా సంభాషించనప్పటికీ, మనం కలుసుకున్నప్పుడల్లా, మీ వద్ద నుండి నేర్చుకోవడానికి ఎంతో ఉండిపోయింది. ఏ విదేశానికి అయినా వెళ్ళే ముందు, వెళ్ళి వచ్చిన తరువాత, మీతో మాట్లాడే అవకాశం నాకు లభించిన ప్రతి సారీ, నేను మీ యొక్క అంతర్ దృష్టిని తప్పక గమనించే వాడిని. ఇది నా అవగాహన పరిధిని పెంచుకోవడంలో ఉపయోగపడింది. ఈ కారణంగా మీకు నేనెంతో కృతజ్ఞుడిని. నా హృదయాంతరాళంలో నుండి మీకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
దేశానికి ఉప రాష్ట్రపతిగా మీరు అందించిన సేవలకు గాను, ఉభయ సభల తరఫున మరియు ఈ దేశ ప్రజల పక్షాన నేను నా యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాను. మీరు సాధించిన విజయాలు, మీ అనుభవంతో పాటు పదవీవిరమణ అనంతరం మీ యొక్క హోదాకు గొప్ప ప్రాముఖ్యం ఉన్నది. రాజ్యాంగాన్ని అనుసరించడం ద్వారా మీ అమూల్యమైనటువంటి కాలమూ మరియు మీ యొక్క శక్తి యుక్తులు ఈ దేశానికి మార్గదర్శకత్వం వహించడంలో తోడ్పడుగాక. మీకు ఇవే శుభాకాంక్షలు.
అనేకానేక ధన్యవాదాలు.