Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర కోయల్ రిజర్వాయర్ ప్రాజెక్టు యొక్క మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఝార్ ఖండ్, బిహార్ లలో ఉత్తర కోయల్ రిజర్వాయర్ ప్రాజెక్టు యొక్క మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టును ప్రారంభించిన నాటి నుండి మూడు ఆర్ధిక సంవత్సరాలలో – రూ. 1622.27 కోట్ల అంచనా వ్యయంతో – ఈ పనులను పూర్తి చేయాలని సంకల్పించారు.

బెట్లా జాతీయ పార్కు, పలామూ పులుల సంరక్షణ కేంద్రం నీట మునగకుండా కాపాడేందుకు, ఆనకట్టలో గతంలో నిర్ణయించిన నీటి నిల్వ స్థాయిని తగ్గించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సోనే నదికి ఉప నదిగా ఉన్న, చివరికి గంగానదిలో కలుస్తున్న ఉత్తర కోయల్ నదిపై ఈ ప్రాజెక్టు ఉంది. ఝార్ ఖండ్ రాష్ట్రం లో అత్యంత వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాలలో ఈ ఉత్తర కోయల్ రిజర్వాయర్ ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం 1972 లో ప్రారంభమై – 1993 వరకు కొనసాగింది. ఆ తర్వాత బిహార్ ప్రభుత్వ అటవీ శాఖ ఆ పనులను నిలిపివేసింది. అప్పటి నుండి ఈ ప్రాజెక్టు పనులు స్థంభించిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులలో ప్రధానంగా : 1160 మిలియన్ ఘనపు మీటర్ల (MCM) నీటిని నిల్వ చేయడం కోసం ఉద్దేశించిన 67.86 మీటర్ల ఎత్తు, 343.33 మీటర్ల పొడవు తో మండల్ డ్యామ్ గా పిలువబడే కాంక్రీట్ ఆనకట్ట నిర్మాణం, డ్యామ్ దిగువకు 96 కిలోమీటర్ల కాలువల నిర్మాణం, సాగుకు అనువుగా నీటి సరఫరా విధానంతో మొహమ్మద్ గంజ్ బ్యారేజీ కుడి, ఎడమ కాలువల నిర్మాణం ఉన్నాయి. కొత్తగా నిర్మించే 341 మీటర్ల దిగువ స్థాయి కట్టడం వల్ల – మండల్ డ్యాం – ఇప్పుడు 190 MCM ల నీటిని నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా – ఝార్ఖండ్ లోని పలము, గఢ్ వా జిల్లాలు – బిహార్ లోని ఔరంగాబాద్, గయా జిల్లాల లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల్లో ఏడాదికి సుమారుగా 1,11,521 హెక్టార్లకు సాగునీరు అందుబాటు లోకి తేవాలని ఉద్దేశించారు. ఇంతవరకు అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టు 71,720 హెక్టార్లకు సాగు నీరు అందిస్తోంది. కాగా ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా మరో 39,801 హెక్టార్లకు సాగు నీటి ప్రయోజనం లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాలకు లభించే సాగునీటి సామర్థ్యం ఈ విధంగా ఉంటుంది :

బిహార్ లో సాగు నీటి సామర్థ్యం – 91,917 హెక్టార్లు
ఝార్ ఖండ్ లో సాగు నీటి సామర్థ్యం – 19,604 హెక్టార్లు
మొత్తం సాగు నీటి సామర్థ్యం – 1,11,521 హెక్టార్లు

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని రూ. 2391.36 కోట్లు గా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పై ఇంతవరకూ రూ. 769.09 కోట్లు ఖర్చు అయ్యింది. ఝార్ ఖండ్, బిహార్ ల లోని ఈ ఉత్తర కోయల్ జలాశయ పనులను – మూడు ఆర్ధిక సంవత్సరాలలో రూ. 1622.27 కోట్లు అంచనా వ్యయంతో పూర్తిచేయాలన్న ప్రతిపాదనను – కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.

మిగిలిన పనులలో సాధారణ భాగాలకు ఖర్చయ్యే రూ.1013.11 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం – ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PMKSY) నిధుల నుండి గ్రాంట్ గా సమకూరుస్తుంది. ఇందులో 607 కోట్ల రూపాయల నికర ప్రస్తుత విలువ (NPV) వ్యయం, పరిరక్షక అటవీ నిర్మూలన వ్యయం కలిసి ఉన్నాయి. ఈ పనులు పూర్తిచేయడానికి ఖర్చయ్యే మొత్తంలో 60 శాతం – రూ.365.50 కోట్లను (బిహార్ రూ.318.64 కోట్లు మరియు ఝార్ ఖండ్ రూ.46.86 కోట్లు) కూడా – దీర్ఘకాల సాగునీటి నిధి (LTIF) నుండి – PMKSY కింద బిహార్, ఝార్ ఖండ్ ల నుండి – కేంద్రప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పనులు పూర్తిచేయడానికి ఖర్చయ్యే మొత్తంలో మిగిలిన 40 శాతం – రూ.243.66 కోట్లు (బిహార్ రూ.212.43 కోట్లు మరియు ఝార్ఖండ్ రూ.31.23 కోట్లు) – ఎటువంటి వడ్డీ రాయితీ లేకుండా మార్కెట్ రేటు కు నాబార్డ్ ద్వారా LTIF నుండి రుణంగా సమకూర్చుకుంటాయి.

ఈ ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తిచేయడానికి – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ – WAPCOS ను MoWR, RD & GR కింద ప్రాజెక్టు యాజమాన్య ప్రతినిధి (PMC) గా నియమించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పనుల అమలుతీరును – నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నేతృత్వంలో భారత ప్రభుత్వ సాధికార సంఘం పర్యవేక్షిస్తుంది.