ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరాఖండ్ రోజ్-గార్ మేళాను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు నియామక పత్రాలు పొందిన వారి జీవితంలో ఇది ఒక శుభపరిణామమని పేర్కొంటూ, ఇది వారి జీవితాన్ని మార్చే అవకాశం మాత్రమే కాదు, సమగ్ర మార్పుకు ఒక మాధ్యమంగా ఉంటుందని తెలియజేశారు. దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న కొత్త ప్రయోగాల గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, నియమితులైన వారిలో ఎక్కువమంది విద్యారంగంలో సేవలందిస్తున్నారని చెప్పారు. “నూతన జాతీయ విద్యా విధానం భారతదేశ యువతను నూతన శతాబ్దానికి సిద్ధం చేస్తుంది” అనే ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉత్తరాఖండ్ యువతపై ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రతి యువకుడు ముందుకు సాగడానికి సరైన మాధ్యమాన్ని పొందుతూ వారి ఆసక్తి ఆధారంగా కొత్త అవకాశాలను పొందాలనే ఉద్దేశంతో, కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిరంతర ప్రయత్నాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాల కోసం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నాయని, ఆయన తెలియజేశారు. గత కొద్ది నెలల్లో దేశం లోని లక్షలాది మంది యువత కేంద్ర ప్రభుత్వం నుంచి తమ నియామక పత్రాలను అందుకున్నారని, ప్రధానమంత్రి పేర్కొంటూ, ఇందులో ఉత్తరాఖండ్ కూడా భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీ.జే.పీ. పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలాంటి రిక్రూట్మెంట్ ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. “ఈ రోజు ఉత్తరాఖండ్ కూడా దానిలో భాగమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను”, అని ప్రధానమంత్రి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పర్వతాల నీరు, యువత పర్వతాలకు ఉపయోగపడవనే పాత సామెత నుండి విముక్తి పొందాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. “ఉత్తరాఖండ్ యువత తమ గ్రామాలకు తిరిగి రావాలనేది కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నం“, అని ప్రధానమంత్రి పేర్కొంటూ, పర్వత ప్రాంతాలలో కల్పిస్తున్న కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల గురించి ప్రముఖంగా వివరించారు. ఉత్తరాఖండ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, కొత్త రోడ్డు, మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా అనుసంధానతను పెంపొందించడంతో పాటు అనేక ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నట్టు, తెలియజేశారు. అన్ని చోట్లా ఉద్యోగావకాశాలు ఊపందుకుంటున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ, భవన నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు, ముడిసరుకు పరిశ్రమలు, దుకాణాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. రవాణా రంగంలో డిమాండ్ పెరగడం వల్ల ఏర్పడుతున్న కొత్త అవకాశాల గురించి కూడా ఆయన వివరించారు. గతంలో ఉత్తరాఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల యువత ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలస వెళ్ళేవారని పేర్కొంటూ, అయితే నేడు వేలాది మంది యువకులు గ్రామాల్లో ఇంటర్నెట్, డిజిటల్ సేవలను అందిస్తున్న సాధారణ సేవా కేంద్రాల్లో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “ఈ ఉద్యోగాలు భారతదేశంలో మొదటిసారిగా ఉత్తరాఖండ్ లో సృష్టించబడ్డాయి” అని ప్రధానమంత్రి తెలియజేశారు.
సుదూర ప్రాంతాలను రోడ్డు, రైలు, ఇంటర్నెట్ తో అనుసంధానించడంతో ఉత్తరాఖండ్ లో పర్యాటక రంగం విస్తరిస్తున్నదని, పర్యాటకరంగ పటంలోకి కొత్త పర్యాటక ప్రదేశాలు వచ్చి చేరుతున్నాయని, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. దీని వల్ల ఇప్పుడు, ఉత్తరాఖండ్ యువత పెద్ద నగరాలకు వెళ్లే బదులు, తమ ఇంటి వద్దే ఉపాధి అవకాశాలను పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ముద్రా యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. షాపులు, ధాబాలు, అతిధి గృహాలు, హోమ్‌స్టేల వంటి ఉదాహరణలను ప్రధానమంత్రి పేర్కొంటూ, అటువంటి వ్యాపారాలకు ఎలాంటి హామీ లేకుండా పది లక్షల రూపాయల వరకు ఋణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38 కోట్ల రూపాయల మేర ముద్రా ఋణాలు ఇచ్చాం. దాదాపు 8 కోట్ల మంది యువకులు తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారారు”, అని ప్రధానమంత్రి చెప్పారు. వీరిలో మహిళలతో పాటు, ఎస్.సి./ఎస్.టి./ఓ.బి.సి. వర్గాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని కూడా ఆయన తెలియజేశారు.
యువత తమ సేవల ద్వారా భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుతూ, “ఇది భారత దేశ యువతకు అద్భుతమైన అవకాశాల అమృత్ కాల్” అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.
Addressing the Uttarakhand Rozgar Mela. Best wishes to the newly inducted appointees. https://t.co/jcSQhCVAsY
— Narendra Modi (@narendramodi) February 20, 2023
*****
DS/TS
Addressing the Uttarakhand Rozgar Mela. Best wishes to the newly inducted appointees. https://t.co/jcSQhCVAsY
— Narendra Modi (@narendramodi) February 20, 2023