నమః పార్వతీ పతయే! హర హర మహాదేవ!
వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూ, రాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూ, సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కేంద్ర మంత్రిమండలి సభ్యులూ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ గార్లూ, రాష్ర్ట మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యులూ, ఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా…
మరోమారు వారణాసిని సందర్శించే అవకాశం నాకు దక్కింది.. ఈ రోజు చేత్ గంజ్ లో ‘నక్కటయ్యా’ జాతర జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ధన్ తెరాస్, దీపావళి, ఛాత్ పండుగలు రానున్నాయి. అయితే వాటి రాక కన్నా ముందుగానే ఇవ్వాళ ఇక్కడ ఒక అభివృద్ధి పండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు.
మిత్రులారా, నేడు బెనారస్ కి పర్వదినం. ఇప్పుడే ఒక పెద్ద కంటి ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేసి ఇక్కడకు చేరుకోవడంలో కాస్త ఆలస్యం అయ్యింది. శంకర నేత్రాలయం వయసు పైబడిన వారికీ, పిల్లలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విశ్వనాథుని కృప వల్ల అనేక కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ జరిగాయి. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్ర, దేశ పురోభివృద్ధికి ఊతం లభిస్తుంది. బాబత్ పూర్, ఆగ్రా, సహ్రాన్ పూర్ లోని సర్సావా సహా, ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో విమానాశ్రయాల ప్రారంభోత్సవాలు జరిగాయి. విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, ఆరోగ్యం, పర్యాటక రంగాలకు సంబంధించి, బెనారస్ కు అనేక ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులు మీకు సౌలభ్యాన్ని కల్పించేవి మాత్రమే కాక, మన యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలనూ కల్పిస్తాయి. బుద్ధుడు బోధనలు అందించిన సారనాథ్ కు ఈ సీమ నెలవు. ఇటీవలే నేను ‘అభిధమ్మ’ మహోత్సవంలో పాలుపంచుకున్నానీ, ఈరోజు సార్నాథ్ కు సంబంధించి కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశాననీ మీకు తెలుసు. కాశీ సారనాథ్ లతో ప్రత్యేక అనుబంధంగల పాళీ, ప్రాకృత భాషలకు ప్రాచీన భాషల హోదా కల్పించామనీ మీకు తెలుసు. ఆ భాషలకు ఇటువంటి గౌరవం లభించడం మనందరకూ గర్వకారణం, అభినందనలు! వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల దృష్ట్యా కూడా దేశవాసులకు అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, వరసగా మూడోసారి మీకు సేవచేసే బాధ్యతను అప్పగించినప్పుడు, ఇకపై మూడింతల వేగంతో పనిచేస్తానని మీకు మాటిచ్చాను. కొత్త ప్రభత్వం ఏర్పడి 125 రోజులు పూర్తవకముందే, అతి స్వల్ప కాలంలో దేశవ్యాప్తంగా 15 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో అనేకానేక ప్రాజెక్టులు చేపట్టాం. నిరుపేదలు , రైతాంగం, యువత కోసమే అత్యధికంగా ఈ ఖర్చు చేశాం. ఇందుకు భిన్నంగా పదేళ్ళ కిందట వార్తాపత్రికల శీర్షికలు ఎలాగుండేవో గుర్తు చేసుకుంటే, లక్షల కోట్ల రూపాయల అవినీతి గురించిన వార్తలే ప్రముఖంగా కనబడేవి! నేడు ఇంటింటా 125 రోజుల్లో 15 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ఖర్చు గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి మార్పునే దేశం కోరుకుంటోంది. ప్రజాధనం ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం, నిజాయితీగా ఖర్చుచేయాలన్నదే మా ఆశయం.
మిత్రులారా, గత పదేళ్ళలో పెద్దఎత్తున దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ మౌలిక రంగ అభివృద్ధి లక్ష్యాలు ముఖ్యంగా రెండు రకాలు – ఒకటి, పెట్టుబడుల ద్వారా పౌరులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం, రెండు, ఇవే పెట్టుబడుల ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడం. నేడు దేశంలో అత్యాధునిక రహదారులూ, కొత్త మార్గాల్లో కొత్త రైల్వే లైన్లూ, కొత్త విమానాశ్రయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని కేవలం ఇటుకలూ, రాళ్ళూ, లోహం, ఇనుప కడ్డీల నిర్మాణాలుగా చూడలేం. ప్రజలకు సౌకర్యం అందించే, దేశ యువతకు ఉపాధిని అందించే సాధనాలివి.
ఆధునిక హంగులతో మేం నిర్మించిన బాబత్ పూర్ విమానాశ్రయాన్నే తీసుకోండి. కేవలం విమానాశ్రయాన్ని వినియోగించుకుని రాకపోకలు సాగించేవారికి మాత్రమే లబ్ధి కలిగిందా? లేదే! బెనారస్ వాసులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకానికి కూడా దన్నుగా నిలుస్తోంది కదా! ఈరోజున బెనారస్ ను సందర్శించేవారి సంఖ్య అనేక రేట్లు పెరిగింది. కొందరు చూడటానికి, మరికొందరు వ్యాపార నిమిత్తం– ఈ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. దీనివల్ల మీరంతా లాభపడుతున్నారు కదా! ఈ రోజు బాబత్ పూర్ విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. దీని వల్ల మీరంతా మరింత లాభపడతారు. ప్రాజెక్టు పూర్తవడంతోటే మరిన్ని విమానాలు స్థానిక విమానాశ్రయాన్ని వినియోగించుకుంటాయి.
మిత్రులారా, ఈ కొత్త మౌలిక సదుపాయాల మహాయజ్ఞం వల్ల, మనం నిర్మించిన అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన విమానాశ్రయాలు, భవంతుల గురించి ప్రపంచం ముచ్చటిస్తోంది. 2014 లో మన దేశంలో కేవలం 70 విమానాశ్రయాలే ఉండేవి. ఇప్పుడే నాయుడు గారు వివరణ వల్ల ఈ సంఖ్య 150 కి చేరుకున్నట్లు తెలుసుకున్నాం. కేవలం కొత్త విమానాశ్రయాల నిర్మాణానికే మనం పరిమితమవలేదు, సగటున నెలకి ఒకటి చొప్పున, దేశంలోని డజను విమానాశ్రయాల్లో కొత్త సదుపాయాలు కల్పించి నవీకరించాం. పునరుద్ధరణ పనులు జరిగిన విమానాశ్రయాల్లో అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్ ఉన్నాయి. అద్భుతమైన సౌకర్యాలు గల అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ప్రతిరోజూ రామభక్తులకు స్వాగతం పలుకుతోంది. ఉత్తరప్రదేశ్ లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని ఒకప్పుడు అనుకునేవారు. నేడు ఈ రాష్ట్రం జాతీయస్థాయి ఎక్స్ప్రెస్ వే లకు నిలయంగా ఉన్నది. అదేవిధంగా అత్యధిక విమానాశ్రయాలు గల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. నోయిడా జెవార్ వద్ద మరో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తోంది. రాష్ట్రంలో ఇంతటి అభివృద్ధి సాధించినందుకు, యోగీ గారికీ, కేశవ్ ప్రసాద్ మౌర్య గారికీ, బ్రజేష్ పాఠక్ గారికీ, వారి బృందం మొత్తానికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
బెనారస్ పార్లమెంటు సభ్యుడుగా ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి నేను గర్విస్తున్నాను. ప్రాచీన వారసత్వ పరిరక్షణతో కూడిన అభివృద్ధిని సాధించి, పట్టణాభివృద్ధికి నమూనాగా నిలిచే ఆధునిక నగరంగా కాశీని తీర్చిదిద్దాలన్నది మనందరి స్వప్నం. కాశీ విశ్వనాథుని భవ్య ఆలయం, రుద్రాక్ష సమావేశ మందిరం, వలయ రహదారి, గంజారీ స్టేడియం వంటి కొత్తరకం మౌలిక సదుపాయాల గురించి నేడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కాశీలో కొత్త రోప్ వే నిర్మాణం కూడా జరగబోతోంది. విశాలమైన రహదార్లూ, గంగానది సుందర తీరాలూ ఇవన్నీ మనసుని ఆహ్లాదపరిచేవే.
మిత్రులారా, కాశీ సహా మొత్తం పూర్వాంచల్ (ఉత్తరప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాలూ, బీహార్ లోని పశ్చిమ ప్రాంతాలు) ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తున్నాం. గంగానదిపై కొత్త రైలు–రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాజ్ ఘాట్ బ్రిడ్జి వద్ద మరో పెద్ద బ్రిడ్జి నిర్మాణం జరగబోతోంది. కింద రైళ్ళు, వంతెన పైన ఆరు లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల బెనారస్, చందౌలికి చెందిన లక్షలాది ప్రజలు ప్రయోజనం పొందుతారు.
మిత్రులారా, క్రీడల కేంద్రంగా కూడా కాశీ గుర్తింపు పొందుతోంది. పునరుద్ధరణ పనులు జరిగిన సిగ్రా క్రీడాంగణం ఈనాడు కొత్తగా మీముందు నిలుస్తోంది. జాతీయ క్రీడలకే గాక ఒలింపిక్స్ కు కూడా ఆతిథ్యం ఇవ్వగల సదుపాయాలను ఈ స్టేడియం కలిగి ఉంది. క్రీడా సదుపాయాలను ఇక్కడ ఏర్పరచారు. ఇటీవల ముగిసిన ‘సంసద్ ఖేల్ ప్రతియోగితా’ వల్ల కాశీ యువత సామర్ధ్యం ఎంతటిదో మనకి అవగతమైంది. ఇక పెద్దపెద్ద ఆటలపోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన సదుపాయాలన్నీ మన పూర్వాంచల్ బిడ్డలకు ఇక్కడే లభిస్తాయి.
మిత్రులారా, మహిళలకూ, యువతకూ సాధికారత అందించిన సమాజం తప్పక అభివృద్ది సాధిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మేం నారీశక్తికి సహకారం అందిస్తున్నాం. స్త్రీలు సొంత వ్యాపారాలు మొదలుపెట్టేందుకు అనువుగా లక్షలాది మహిళలకు ‘ముద్ర’ రుణాలను అందించాం. గ్రామాల్లో ‘లఖ్ పతి దీదీ’ లను తయారుచేయడం మా తదుపరి లక్ష్యం. ఈరోజున మన గ్రామీణ సోదరీమణులు డ్రోన్ పైలెట్లుగా కూడా పనిచేస్తున్నారు. స్వయంగా మహాశివుడు, అన్నపూర్ణేశ్వరి నుంచీ భిక్షను అర్ధించే కాశీ క్షేత్రమిది. సాధికార మహిళలను కలిగిన సమాజం అభివృద్ధి సాధిస్తుందని కాశీ నగరం మనకు నేర్పుతోంది. ఈ నమ్మకంతోనే ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలోని ప్రతి అంశంలోనూ ‘నారీశక్తి’ని కేంద్రంగా చేశాం. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం, దేశంలోని లక్షలాది మహిళలకు సొంత ఇళ్ళను బహుమతిగా అందించింది. బెనారస్ కు చెందిన అనేకులు కూడా పథకం వల్ల లబ్ధి పొందారు. ఇక మరో 3 కోట్ల నూతన గృహాలు నిర్మించాలని ప్రభుత్వం తలపెడుతోంది. ఇంతవరకూ ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇళ్ళు లభించని వారణాసి మహిళలకు ఇక మీదట లభిస్తాయి. ఇప్పటికే మేం నల్లాల ద్వారా తాగునీరు, గృహ అవసరాలకు నీరు సహా ఉజ్జ్వల గ్యాస్ ను అందించాం. ఇప్పుడు ఉచిత విద్యుత్తు, విద్యుత్ ద్వారా ఆదాయం సమకూర్చే పథకాలను ప్రారంభించబోతున్నాం. ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’, మన సోదరీమణుల జీవితాలను మెరుగుపరుస్తుంది.
మిత్రులారా, మహాశివుడి పవిత్ర జ్యోతిర్లింగానికీ, మోక్షస్థానమైన మణికర్ణికకూ, జ్ఞానాన్ని అందించే సారనాథ్ కూ ఆలవాలమైన మన కాశీ నగరం సాంస్కృతిక వైభవానికి చిహ్నం. ఎన్నో దశాబ్దాల పాటు పట్టించుకోకుండా వదిలేసిన కాశీ నగరంలో, ఇప్పుడు ఏకకాలంలో, అనేక రంగాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు మీకో ప్రశ్న – కాశీ అభివృద్ధికి నోచుకోకుండా నిరోధించిన దృక్పథాలు ఏవి? అభివృద్ధి పనుల కోసం అలమటించిన 10 ఏళ్ళ నాటి కాశీని గుర్తు చేసుకోండి.. ఉత్తరప్రదేశ్ ను దశాబ్దాలపాటు పాలించి, ఢిల్లీలో అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీలు ఏనాడూ బెనారస్ అభివృద్ధికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. తరచి చూస్తే, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు అందుకు కారణాలుగా మనకి కనిపిస్తాయి. కాంగ్రెస్ కానీయండి, సమాజవాదీ పార్టీ కానివ్వండి, బెనారస్ అభివృద్ధిని ఈ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో పట్టించుకుంటాయన్న ఆశ లేదు. చివరికి అభివృద్ధి పనుల్లో కూడా వివక్ష చూపిన పార్టీలవి.
ఇందుకు భిన్నంగా, ఏ పథకంలోనూ వివక్షకు తావివ్వని మా ప్రభుత్వం, ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అన్న సూత్రమే మంత్రంగా ముందుకు సాగుతోంది. మేం చెప్పినదాన్నే, విస్పష్టంగా ప్రకటించి ఆచరణలో పెడతాం. అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. రామ్ లల్లాను ప్రతిరోజూ లక్షలాది భక్తులు సందర్శించుకుంటున్నారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ అంశం అనేక సంవత్సరాల పాటు మూలన పడింది. ఈ అంశంలో కదలిక తెచ్చి, చారిత్రిక నిర్ణయం తీసుకోవడం కూడా మా హయాంలోనే జరిగింది. ‘ముమ్మారు తలాక్’ క్రూర సంప్రదాయం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యేవి. అటువంటి ఇబ్బంది నుంచి ముస్లిం మహిళలకు మా ప్రభుత్వమే విముక్తి కల్పించింది. ‘ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) కమిషన్’ కు రాజ్యాంగ హోదా కల్పించింది కూడా బీజేపీ ప్రభుత్వమే. అంతే కాదు, ఎవరి హక్కులకూ భంగం వాటిల్లకుండా, ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు 10% అదనపు రిజర్వేషన్ లను కల్పించినదీ మేమే!
మిత్రులారా, మా పనిని మేం నెరవేర్చాం. దేశంలోని ప్రతి కుటుంబ జీవన చిత్రాన్నీ మార్చేందుకు మేం సదుద్దేశంతో, నిజాయితీగా పనిచేశాం. అందుకే దేశం మాకు దీవెనలను అందించడం కొనసాగిస్తోంది. హర్యానాలో వరసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఎంపికయ్యింది. జమ్మూ కాశ్మీర్ లో కూడా రికార్డ్ సంఖ్యలో మాకు ఓట్లు లభించాయి.
మిత్రులారా, కుటుంబ రాజకీయాల బెడదను దేశం నేడు ఎదుర్కొంటోంది. వారసత్వ రాజకీయాల వల్ల యువత తీవ్రంగా నష్టపోతోంది. ఈ పార్టీలు యువతకు ఏనాడూ అవకాశాలనివ్వవు. అందుకనే, రాజకీయాలతో సంబంధంలేని కుటుంబాలకు చెందిన 100,000 యువతను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని ఎర్రకోట బురుజు నుంచి చేసిన ప్రసంగంలో నేను తెలియచేశాను. ఇది భారతీయ రాజకీయాల రూపురేఖలని మార్చి వేసే ప్రచారోద్యమం. అవినీతి, వారసత్వ పోకడలకు చరమగీతం పాడే ఉద్యమం. ఈ సరికొత్త రాజకీయ ఉద్యమ మూలస్థంభాలుగా నిలవాలని కాశీ, ఉత్తరప్రదేశ్ యువతకు ఇదే నా పిలుపు. కాశీ పార్లమెంటు సభ్యుడిగా, స్థానిక యువత అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను.
మిత్రులారా, దేశం అభివృద్ధిలో నూతన ప్రమాణాల విషయంలో కాశీ మరోమారు స్ఫూర్తిగా నిలుస్తూ, దేశానికి చైతన్యాన్ని అందించడంలో తన ఉనికిని చాటుతోంది. అన్ని రాష్ట్రాలూ, గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కాశీ పౌరులు సహా, నేటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి దేశ పౌరునికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నాతో కలిసి అనండి– నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ!
***
Speaking at the launch of infrastructure projects in Varanasi. These development initiatives will significantly benefit the citizens, especially our Yuva Shakti.https://t.co/wwzjuVyFW8
— Narendra Modi (@narendramodi) October 20, 2024
बीते 10 सालों में हमने देश में इंफ्रास्ट्रक्चर निर्माण का एक बहुत बड़ा अभियान शुरू किया है: PM @narendramodi pic.twitter.com/G4EYxqkUeV
— PMO India (@PMOIndia) October 20, 2024
विकास भी, विरासत भी। pic.twitter.com/cEut9OWMDR
— PMO India (@PMOIndia) October 20, 2024
समाज का विकास तब होता है, जब समाज की महिलाएं और नौजवान सशक्त होते हैं।
— PMO India (@PMOIndia) October 20, 2024
इसी सोच के साथ सरकार ने नारी शक्ति को नई शक्ति दी है: PM @narendramodi pic.twitter.com/ooZmWvXt7W