Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉమ్రాహా గ్రామ్‌లోని స్వరవేద మహామందిర్ ధామ్‌లో సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవాలకు హాజరైన ప్రధానమంత్రి

ఉత్తరప్రదేశ్‌లోని ఉమ్రాహా గ్రామ్‌లోని స్వరవేద మహామందిర్ ధామ్‌లో సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవాలకు హాజరైన ప్రధానమంత్రి


   త్తరప్రదేశ్‌లోని ఉమ్రాహా గ్రామ్‌లోగల స్వరవేద మహామందిర్ ధామ్‌లో నిర్వహించిన సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవాలకు ప్రధానమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- కాశీ నగరంలో అద్భుతమైన ‘విశ్వనాథ్‌ ధామ్‌’ను నిన్న మహాదేవుని పాదాలకు అంకితం చేయడాన్ని గుర్తుచేసుకున్నారు. “కాశీనగర శక్తి నిరంతరం ప్రవేహించేది మాత్రమేగాక కొత్త కోణాలకు ప్రసరించడం కొనసాగిస్తుంది” అని ఆయన చెప్పారు. అలాగే పవిత్ర గీతాజయంతి నేపథ్యంలో కృష్ణ భగవానుని పాదాలకు ఆయన ప్రణామం చేశారు. “కురుక్షేత్ర సమరాంగణంలో సైనిక బలగాలు ముఖాముఖి తలపడిన ఇదే రోజున మానవాళికి ఆధ్యాత్మిక పరమార్థంతోపాటు జ్ఞానయోగ లబ్ధి కలిగింది. ఇటువంటి గీతా జయంతి పర్వదినం సందర్భంగా కృష్ణ భగవానుని పాదాలకు ప్రణమిల్లుతూ మీతోపాటు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   ద్గురు సదాఫల్దియోగారికి కూడా ప్రధానమంత్రి నివాళి అర్పించారు. ఈ మేరకు “ఆయన ఆధ్యాత్మిక సన్నిధికి భక్తిపూర్వకంగా శిరసువంచి నమస్కరిస్తున్నాను. దీన్ని కొత్తగా విస్తరించడమే కాకుండా ఇక్కడి సంప్రదాయాలను కొనసాగిస్తున్న శ్రీ స్వతంత్రదేవ్‌ మహరాజ్‌, శ్రీ విజ్ఞాన్‌దేవ్‌ మహరాజ్‌లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి అన్నారు. స్వాతంత్ర్య పోరాటానికి తోడ్పాటు దిశగా ఆయన కృషిని ప్రధాని గుర్తుచేసుకున్నారు. అలాగే గడ్డుకాలం దాపురించినపుడు సాధువులకు మార్గనిర్దేశం చేయడంద్వారా భారత కీర్తిప్రతిష్టలను నిలబెట్టారని కొనియాడారు. “మన దేశం ఎంత అద్భుతమైనదంటే పరిస్థితులు ప్రతికూలించిన ప్రతి సందర్భంలోనూ కాలగతిని మార్చడానికి ఎవరో ఒక సాధుపుంగవుడు ఉద్భవిస్తాడు. ఆ కోవలోనే ప్రపంచం చేత మహాత్ముడుగా మన్నన పొందిన గొప్ప స్వాతంత్ర్యయోధుడి మాతృభూమి మన భారతదేశం” అని ప్రధాని పేర్కొన్నారు.

   కాశీ నగరం మహిమ-ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా విశదీకరించారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లోనూ భారతదేశ కీర్తిని నిలపడమేగాక కళలు, వ్యవస్థాపన తదితరాల మూలాలను పరిరక్షిస్తూ వచ్చాయని ఆయన అన్నారు. “ఎక్కడ బీజం ఉన్నదో.. అక్కడి నుంచే వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించడం మొదలవుతుంది. అందుకే ఇవాళ మనం బనారస్ అభివృద్ధి గురించి చర్చించడమంటే మొత్తం భారతదేశ ప్రగతికి మార్గ ప్రణాళికను రూపొందించినట్లే కాగలదు” అని ఆయన అన్నారు.

   కాశీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న అర్ధరాత్రి నగరంలోని కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి పరిశీలించారు. బనారస్‌లో అభివృద్ధి పనులపై తన నిరంతర ప్రమేయం గురించి పునరుద్ఘాటిస్తూ- “నిన్న రాత్రి 12 గంటల తర్వాత నాకు అవకాశం లభించగానే నా కాశీ నగరంలో ఇప్పటిదాకా పూర్తయిన, ఇంకా కొనసాగుతున్న పనులను పరిశీలించేందుకు మరోసారి బయల్దేరాను” అని ఆయన చెప్పారు. గడోలియా ప్రాంతంలో చేపట్టిన సుందరీకరణ పనులు చూడముచ్చటగా మారాయని హర్షం వెలిబుచ్చారు. “అక్కడ చాలామందితో నేను మాట్లాడాను. మాండూవాడీహ్‌లోని బనారస్ రైల్వే స్టేషన్‌ను కూడా చూశాను. ఈ స్టేషన్ కూడా నవీకరించబడింది. ఆ విధంగా ప్రాచీనతను కొనసాగిస్తూ- ఆధునికతను ఆహ్వానిస్తున్న బనారస్ నేడు దేశానికి కొత్త దిశను నిర్దేశిస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య పోరాట సమయంలో సద్గురు ఉపదేశించిన ‘స్వదేశీ’ మంత్రం గురించి ప్రధాని ఇవాళ ప్రస్తావిస్తూ- ఆ స్ఫూర్తితోనే దేశం “స్వయం సమృద్ధ భారతం” ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. “స్థానిక వ్యాపారాలు.. ఉపాధి.. దేశంలోని ఉత్పత్తులు ఇవాళ కొత్త శక్తిని సంతరించుకుంటుండగా.. స్థానికత ప్రపంచవ్యాప్తం అవుతోంది” అని ఆయన చెప్పారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగంలో ‘అందరి కృషి’ స్ఫూర్తి గురించి ప్రస్తావిస్తూ ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని సంకల్పాలు పూనాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయాలన్నీ దేశ ఆకాంక్షలకు ప్రతీక అయిన సద్గురు సంకల్పాలను నెరవేర్చేవిగా ఉండాలని ఆయన కోరారు. ఆ మేరకు రానున్న రెండేళ్లలో ఉమ్మడి కృషితో సదరు సంకల్పాలన్నీ వేగంగా నెరవేరేలా చూడాలని సూచించారు. ఈ సంకల్పాల్లో బాలికా విద్య, వారి నైపుణ్యాభివృద్ధి ప్రధానమైనదని పేర్కొన్నారు. “ఎవరైతే తమ కుటుంబాలతోపాటు సమాజ బాధ్యతను కూడా నెరవేర్చగలరో వారు ఒకరిద్దరు పేద బాలికల నైపుణ్యాభివృద్ధికీ చొరవ చూపాలి” అని నొక్కిచెప్పారు. ఇక రెండో సంకల్పం జల పరిరక్షణకు సంబంధించినదని పేర్కొంటూ “మనకు జీవధారలైన గంగానది వంటి జలవనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది” అని ప్రధానమంత్రి తన ఉపన్యాసం ముగించారు.

 

***