చెక్ రిపబ్లిక్ ప్రధాని హిస్ ఎక్స్ లెన్సీ ఆంద్రెజ్ బాబిస్ జనవరి 17 నుంచి 19 వరకు భారతదేశంలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు చెక్ వ్యాపార, పారిశ్రామిక రంగాల మంత్రి మార్తా నొవకోవా, పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఉజ్వల గుజరాత్ సదస్సు 2019లో భాగస్వామ్య దేశం చెక్ రిపబ్లిక్. ప్రధాని శ్రీ బాబిస్ నేతృత్వంలో చెక్ రిపబ్లిక్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
గుజరాత్ సదస్సు నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ,ప్రధాని శ్రీ బాబిస్ ల మధ్యన జనవరి 18న ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్యన గల ద్వైపాక్షిక సంబంధాలు, ఇంకా అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు ముఖ్యంగా రెండు దేశాలకు సంబంధించి పరస్పరం ప్రాధాన్యతగల అంశాలపైన చర్చలు జరిగాయి.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కనబరుస్తున్న దార్శనిక నాయకత్వాన్ని ఈ సందర్భంగా చెక్ రిపబ్లిక్ ప్రధాని ప్రశంసించారు. ప్రధాని దార్శనికత కారణంగా భారతదేశ ఆర్ధిక రంగం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని తద్వారా వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతున్నాయని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత రాష్ట్రపతి చెక్ రిపబ్లిక్ ను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని శ్రీ బాబిస్..రాష్ట్రపతి పర్యటనలో ఇరు దేశాల మధ్యన పలు ద్వైపాక్షిక సహకార ఎంఓయులపై సంతకాలు జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
భారీ యంత్రాలు, ప్రిసిషన్ ఇంజినీరింగుకు సంబంధించిన తయారీ సాంకేతికతల విషయంలో చెక్ రిపబ్లిక్ దగ్గర ఆధునిక సాంకేతికతలున్నాయి. ఈ నేపధ్యంలో భారతదేశ మార్కెట్ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ డెన్మార్క్ ను కోరారు. రక్షణ, ఆటోమోటివ్, రైల్వే రంగాల్లో తయారీ అవకాశాలున్నాయని అన్నారు.
చెక్ రిపబ్లిక్లోని పరిశోధన మరియు అభివృద్ధి మండలిలో భారతదేశ శాస్త్రవేత్తను సభ్యునిగా నియమించాలని కోరుతూ చెక్ ప్రధాని ఆహ్వానం పలికారు. ఇది ఆ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ. అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పరిశోధకులకు ఆతిథ్యమిచ్చే ఈ సంస్థకు స్వయంగా చెక్ ప్రధానే అద్యక్షునిగా వున్నారు.
ఇరు దేశాల మధ్యన ఎంతోకాలంగా సంప్రదాయబద్దంగా వున్న ద్వైపాక్షిక సంబంధాలను ఇరుదేశాల ప్రధానులు ప్రశంసించారు. వీటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని నిర్ణయించారు.
తన పర్యటనలో భాగంగా ప్రధాని శ్రీ బాబిస్ ఈ నెల 19న భారత రాష్ట్రపతిని కలవనున్నారు. అంతే కాదు ఆయన పుణేలోని చెక్ కంపెనీలను సందర్శించి అక్కడి సింబియోసిస్ విశ్వవిద్యాలయంలోని యూరోపియన్ వ్యవహరాల అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
***
Mr. Andrej Babiš, the Prime Minister of the Czech Republic and I held wide-ranging talks in Gandhinagar. His presence at the Vibrant Gujarat Summit is a great gesture. We discussed bilateral cooperation in defence, transportation and manufacturing. pic.twitter.com/ttVYVcc5Ca
— Narendra Modi (@narendramodi) January 18, 2019