ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 23 నుంచి 25 వరకు మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోనిచత్తర్‌పూర్ జిల్లాలో మధ్యాహ్నం 2గంటలకు బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు భోపాల్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధానమంత్రి బీహార్‌లోని భాగల్‌పూర్ చేరుకుని 19వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు, అలాగే ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఆయన సాయంత్రం 6గంటలకు గౌహతి చేరుకుని జూమోయిర్ బినందిని (మెగా జూమోయిర్) 2025 కార్యక్రమానికి హాజరవుతారు. 25వ తేదీ ఉదయం 10:45గంటలకు గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడి, మౌలిక సదుపాయాల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
మధ్య ప్రదేశ్‌లో పీఎం కార్యక్రమాలు
చత్తర్‌పూర్ జిల్లా గర్హా గ్రామంలో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ. 200 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించనుంది. అత్యాధునిక యంత్రాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండే ఈ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్స అందించనున్నారు.
భోపాల్‌లో రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్) 2025ను సైతం ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా అబివృద్ధి చేయుటలో కీలకం కానున్న ఈ జీఐఎస్‌లో శాఖల వారీగా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనున్నారు; ఫార్మా, వైద్య పరికరాలు, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం అలాగే ఎమ్ఎస్ఎమ్ఈ వంటి శాఖలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో గ్లోబల్ సౌత్ కంట్రీస్ కాన్ఫరెన్స్, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ సెషన్ వంటి అంతర్జాతీయ స్థాయి సమావేశాలతో పాటు కీలక భాగస్వాములుగా ఉన్న దేశాల కోసం సైతం ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు.
ఈ సదస్సు సందర్భంగా మూడు ప్రధాన పారిశ్రామిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఆటోమోటివ్ సామర్థ్యాలు, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలను ఆటో షో ద్వారా ప్రదర్శించనున్నారు. వస్త్రాలు, ఫ్యాషన్ ఎక్స్‌పో ద్వారా సాంప్రదాయిక, ఆధునిక వస్త్రాల తయారీలో రాష్ట్ర నైపుణ్యాలను ప్రధానంగా ప్రదర్శించనున్నారు. “వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ)” విలేజ్ ప్రదర్శన ద్వారా రాష్ట్ర పనితీరునీ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు.
60కి పైగా దేశాల ప్రతినిధులు, వివిధ అంతర్జాతీయ సంస్థల అధికారులు, అలాగే భారత్ నుంచి 300కి పైగా పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, విధాన నిర్ణేతలు తదితరులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్నారు.
బీహార్‌లో పీఎమ్ కార్యక్రమాలు
రైతు సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా భాగల్పూర్‌లో పలు కీలక కార్యక్రమాలను పీఎమ్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా పీఎమ్ కిసాన్ 19వ విడత నిధులను ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతులు రూ. 21,500 కోట్లకు పైగా ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు.
రైతులు తమ ఉత్పత్తుల ద్వారా మెరుగైన ఆదాయం పొందేలా చేయడంపై ప్రధానమంత్రి ప్రధానంగా దృష్టిసారించారు. దీనికోసం పదివేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పీఓలు) ఏర్పాటు చేసి, వాటిని ప్రోత్సాహించడం కోసం కేంద్రప్రభుత్వ రంగ పథకాన్ని 2020, ఫిబ్రవరి 29న ప్రధానమంత్రి ప్రారంభించారు. రైతులు వారి వ్యవసాయ ఉత్పత్తులను సమిష్టిగా ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఇది సహాయం చేస్తుంది. ఐదు సంవత్సరాల్లోనే, ఈ కార్యక్రమం ద్వారా దేశంలో పదివేలవ ఎఫ్‌పీఓ ఏర్పాటుతో ప్రధానమంత్రి ఆశయం నెరవేరింది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద మోతీహరిలో నిర్మించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇండిజీనస్ బ్రీడ్స్ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అత్యాధునిక ఐవీఎఫ్ పద్ధతులను ప్రవేశపెట్టడం, మరింత దిగుబడి కోసం దేశీయ జాతులకు చెందిన మేలైన పశువులను ఉత్పత్తి చేయడం అలాగే ఆధునిక పునరుత్పత్తి విధానాలను గురించి రైతులకు, సంబంధిత నిపుణులకు శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యాలు. 3 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు వ్యవస్థీకృత మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో బరౌనిలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, రూ. 526 కోట్లకు పైగా నిధులతో నిర్మించిన వారిసాలిగంజ్–నవాడా–తిలయ్య రైలు సెక్షన్ డబ్లింగ్ అలాగే ఇస్మాయిల్‌పూర్ – రఫీగంజ్ రహదారి పైవంతెనను కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
అస్సాంలో పీఎమ్ కార్యక్రమాలు
ప్రధానమంత్రి జూమోయిర్ బినందిని (మెగా జూమోయిర్) 2025 కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరుకానున్నారు. ఇది అస్సాంకు చెందిన తేయాకు తెగ, ఆదివాసీ వర్గాల నుంచి 8 వేల మంది కళాకారులు జూమోయిర్ జానపద నృత్య ప్రదర్శన చేసే అద్భుతమైన సాంస్కృతిక మహోత్సవం. ఈ కార్యక్రమం సమ్మిళితత్వం, ఐక్యత అలాగే సాంస్కృతిక విశిష్టతల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. అస్సాం రాష్ట్ర సమకాలీన సాంస్కృతిక సమ్మేళనాన్ని సూచిస్తుంది. మెగా జూమోయిర్ కార్యక్రమం 200 సంవత్సరాల తేయాకు పరిశ్రమకు, అస్సాంలో 200 సంవత్సరాల పారిశ్రామికీకరణకు ప్రతీకగా నిలుస్తుంది.
ఈనెల 25 నుంచి 26 వరకు గౌహతిలో జరగనున్న అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడులు, మౌలికసదుపాయాల సదస్సు 2025ను సైతం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రారంభ సమావేశంతో పాటు, పలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఏడు సమావేశాలు అలాగే నిర్ధిష్ట అంశాలకు సంబంధించిన 14 సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, పారిశ్రామికాభివృద్ధి, ప్రపంచ వాణిజ్య భాగస్వామ్యాలు, వృద్ధి చెందుతున్న పరిశ్రమలు అలాగే దూసుకెళ్తున్న ఎమ్ఎస్ఎమ్ఇ రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గురించి 240కి పైగా ప్రదర్శనకారులతో ఒక సమగ్ర ప్రదర్శన నిర్వహించనున్నారు.
వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచస్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల నిపుణులు, అంకురసంస్థలు అలాగే విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
***