Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈజిప్టు అధ్యక్షుడితో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంయుక్త పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొని ప్రసార మాధ్యమాలకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం

ఈజిప్టు అధ్యక్షుడితో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంయుక్త పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొని ప్రసార మాధ్యమాలకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం


శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అలీ సీసీ,

ప్రముఖ మంత్రులు మరియు ఈజిప్టు, భారతదేశ ప్రతినిధి వర్గాల సభ్యులు, ఇంకా

ప్రసార మాధ్యమాల నుండి వచ్చిన మిత్రులారా,

అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అలీ సీసీ మొట్టమొదటి సారి భారతదేశంలో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎక్స్ లెన్సీ, దేశ విదేశాలలో మీరు అనేక గొప్ప కార్యాలను సాధించారు. మిమ్మల్ని ఇక్కడ చూసి 125 కోట్ల మంది భారతీయులు సంతోషిస్తున్నారు. ఆసియాను ఆఫ్రికాతో జోడించే ఒక సహజసిద్ధమైన సేతువే ఈజిప్టు. మీ ప్రజలు మితవాద ఇస్లాముకు ఒక వాణిగా ఉన్నారు. అలాగే మీ దేశం ఆఫ్రికాలోనూ, అరబ్ ప్రపంచంలోనూ ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలకు ఒక కారకంగా ఉంది. ఈజిప్టు అభివృద్ధి చెందుతున్న దేశాల పక్షాన సదా పోరాడుతూ వస్తోంది.

మిత్రులారా,

మన భాగస్వామ్యం ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అనే అంశంపై అధ్యక్షుల వారు, నేను విస్తృత చర్చలు జరిపాము. మన మధ్య ఉన్న బంధాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి చేపట్టవలసిన కార్యక్రమాల విషయంలో ఒక అంగీకారానికి వచ్చాము. ఆ కార్యక్రమాలలో:

మన సాంఘిక, ఆర్థిక ప్రాధాన్యాలకు అనుగుణంగా స్పందించడం; వ్యాపారం మరియు పెట్టుబడుల సంబంధాలను పెంచి పోషించుకోవడం;

మన సమాజాలను భద్రంగా ఉంచుకోవడం;

మన ప్రాంతంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి పరస్పరం సహకరించుకోవడం; ఇంకా, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలలో మన అనుబంధాన్ని మరింత ప్రోత్సహించుకోవడం వంటివి కలసి ఉన్నాయి.

మిత్రులారా,

మన మధ్య సహకారం కోసం బహుళ విధాలుగా పురోగమించాలని మా సంభాషణలలో అధ్యక్షుల వారు, నేను ఏకాభిప్రాయం సాధించాము. ఉన్నత స్థాయి రాజకీయ సంప్రదింపుల ప్రక్రియను పటిష్టపరుస్తూ, కొనసాగించాలని నిశ్చయించాము. మన సమాజాల ఆర్థిక సమృద్ధికి బలమైన వ్యాపార, పెట్టుబడి బంధాలు నెలకొనడం అత్యవసరమని గుర్తించాము. అందుకని, రెండు దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడుల ప్రవాహాలను మరింత ధారాళంగా పెంచుకోవడం మన కీలక ప్రాధాన్యాలలో ఒక భాగం కావాలని తీర్మానించుకున్నాము. ఈ దిశగా, ఈ రోజు సంతకాలు జరిగిన సముద్ర మార్గ రవాణా సంబంధిత సహకార ఒప్పందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నది.

ఇదే విధంగా రెండు దేశాల మధ్య నూతన వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యాలను ఏర్పర్చడంలో మన ప్రైవేటు రంగం ముందు వరుసలో నిలవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్థిక రూపేణా ఏర్పడిన బంధాన్ని మరిన్ని రూపాలలోకి విస్తరించడానికి మనం వ్యవసాయం, నైపుణ్యాలకు పదునుపెట్టడం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం మరియు ఆరోగ్య రంగాలలో మన మధ్య సహకారాన్ని పెంపొందించుకుందాము.

మిత్రులారా,

పెచ్చరిలుతున్న విప్లవ వాదం, హింస, బీభత్సం ఒక మన రెండు దేశాలకే కాకుండా వివిధ ప్రాంతాల ప్రజా సముహాలకు కూడా పెను ముప్పును వాటిల్లచేస్తున్నాయన్న విషయంలో అధ్యక్షుల వారిదీ, నాదీ ఒకే భావన.

ఈ సందర్భంలో మేము మన భద్రత మరియు రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించాం. ఇందులో:

రక్షణ రంగ వ్యాపారాన్ని, శిక్షణను, సామర్ధ్యాలకు మెరుగులు దిద్దడాన్ని విస్తరించుకోవడం;

తీవ్రవాదంపై పోరాడడానికి సమాచారాన్ని మరింత ఎక్కువగా ఇచ్చి పుచ్చుకోవడం, తీవ్రవాద నిరోధక కార్యకలాపాలలో పరస్పరం సహకరించుకోవడం;

వీటితో పాటు, మాదక పదార్ధాల అక్రమ రవాణా, సీమాంతర నేరాలు మరియు మని-లాండరింగ్ లపై యుద్ధం చేయడానికి ఉమ్మడిగా కృషి చేయడం వంటివి భాగం కానున్నాయి. సుసంపన్న సంస్కృతిక వారసత్వం కలిగిన, ప్రాచీనమైన మరియు గర్వించదగిన రెండు నాగరిక సమాజాలైన మన రెండు దేశాల ప్రజలకు, ప్రజలకు మధ్య ఉండే సంబంధాలను ఇంకా సాంస్కృతిక అనుబంధాన్ని ఇప్పటి కన్నా ఎక్కువ స్థాయికి మెరుగుపరచాలని కూడా మేము నిర్ణయించాము.

ఎక్స్ లెన్సీ,

ఐక్య రాజ్య సమితి భద్రత మండలిలో ఈజిప్టు తన ప్రస్తుత పదవీ కాలంలో చేస్తున్న మంచి పనులను భారతదేశం ప్రశంసిస్తోంది. ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాలపైన ఐక్య రాజ్య సమితి లోను, బయటా మరింత సన్నిహితంగా సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని మేము తీసుకున్న నిర్ణయం మన ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేసేదే. ఈనాటి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఐక్య రాజ్య సమితి భద్రత మండలి సంస్కరణలకు లోను కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము అంగీకరించాము. వచ్చే వారంలో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశంలో ఈజిప్టు కూడా పాలుపంచుకోవడాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈ పరిణామం జి-20 సదస్సులో జరిగే చర్చలకు అదనపు విలువను జోడించి, తీర్మానాల ప్రాముఖ్యాన్ని పెంచగలదని మేము విశ్వసిస్తున్నాము.

శ్రేష్టుడైన అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అలీ సీసీ, మీకు మరియు మీ ప్రతినిధి వర్గానికి నన్ను మరోమారు ఆదరణ పూర్వక స్వాగతం పలకనీయండి. మీకు మరియు ఈజిప్టు ప్రజలకు మరెన్నో విజయాలు చేకూరాలని నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి పరంగా, ఆర్థిక పరంగా, భద్రత పరంగా మీరు నిర్దేశించుకొన్న లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ఒక నమ్మదగిన భాగస్వామి కావడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.

మీకు ఇవే నా కృతజ్ఞతలు.

అనేకానేక ధన్యవాదములు.