Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

ఇరాన్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ


16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క‌జాన్‌లో నేడు ఇరాన్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ మ‌సూద్ పెజెష్కియాన్‌తో స‌మావేశ‌మ‌య్యారు.

ఇరాన్ 9వ అధ్య‌క్షుడుగా ఎన్నికైనందుకు డాక్ట‌ర్ మ‌సూద్ పెజెష్కియాన్‌ను ప్ర‌ధాని అభినందించారు. ఇరాన్‌ను బ్రిక్స్ కుటుంబంలోకి సాద‌రంగా ఆహ్వానించారు. నాయ‌కులిద్ద‌రూ ద్వైపాక్షిక సంబంధాల‌ను స‌మీక్షించి, విభిన్న రంగాల్లో స‌హ‌కారాన్ని ప‌టిష్ఠం చేసుకోగ‌ల మార్గాల గురించి చ‌ర్చించారు. చాబ‌హార్ పోర్టుపై దీర్ఘ‌కాలిక ఒప్పందంపై ఉభ‌య దేశాలు సంత‌కాలు చేయ‌డం ద్వైపాక్షిక సంబంధాల్లో కీల‌క ఘ‌ట్ట‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే ఆఫ్ఘ‌నిస్తాన్‌ను పున‌ర్నిర్మించి, తిరిగి అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని పున‌రుద్ఘాటించ‌డంతో పాటు సెంట్ర‌ల్ ఆసియా ప్రాంతంలో వాణిజ్య‌, ఆర్థిక అనుసంధాన‌త‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. 

ప‌శ్చిమాసియా సంక్షోభం స‌హా వివిధ ప్రాంతీయ ప‌రిణామాల‌పై నాయ‌కులిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం అభిప్రాయాలు తెలియ‌చేసుకున్నారు. సంఘ‌ర్ష‌ణ తీవ్ర‌రూపం దాల్చ‌డం ప‌ట్ల ప్ర‌ధాని తీవ్ర ఆందోళ‌న ప్ర‌క‌టిస్తూ ప‌రిస్థితి తీవ్ర‌తను త‌గ్గించాల‌న్న భార‌త‌దేశం పిలుపును పున‌రుద్ఘాటించారు. పౌరుల‌కు సంపూర్ణ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, సంఘ‌ర్ష‌ణ‌ను నిరోధించ‌డంలో దౌత్య‌ప‌ర‌మైన చొర‌వ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని సూచించారు.  

బ్రిక్స్, ఎస్‌సీఓ వంటి బ‌హుముఖీన వేదిల‌పై స‌హ‌కారాన్ని కొన‌సాగించాలని నాయ‌కులిద్ద‌రూ అంగీకారానికి వ‌చ్చారు. వీలైనంత త్వ‌ర‌గా భార‌త‌దేశంలో ప‌ర్య‌టించాల‌ని ఇరాన్ అధ్య‌క్షుడు పెజెష్కియాన్ ను ప్ర‌ధాని ఆహ్వానించ‌గాఅందుకు ఆయన అంగీక‌రించారు. 

 

***