Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి భార‌త ప‌ర్య‌ట‌న ( 2018 జ‌న‌వ‌రి 15 ) సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న

ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి భార‌త ప‌ర్య‌ట‌న ( 2018 జ‌న‌వ‌రి 15 ) సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న

ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి భార‌త ప‌ర్య‌ట‌న ( 2018 జ‌న‌వ‌రి 15 ) సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న


 

శ్రేష్ఠులైన ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ,

ప్రసార మాధ్యమాల సభ్యులారా,

భార‌త‌దేశాన్ని సందర్శించేందుకు మొట్టమొదటి సారిగా విచ్చేసినటువంటి ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ కు స్వాగ‌తం పలకడం గొప్ప ఆనందాన్నిస్తోంది.

येदीदीहायाकर, बरूख़िमहाबायिमलेहोदू!

(నా మంచి మిత్రుడా, భారతదేశంలోకి మీకు ఇదే స్వాగ‌తం!)

ప్రధాని గారూ, మీ భారతదేశ సందర్శన భారత్, ఇజ్రాయల్ ల మధ్య మైత్రీ ప్రస్థానంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘడియ.

మీ పర్యటన భార‌త‌దేశానికి, ఇజ్రాయెల్ కు మ‌ధ్య 25 సంవత్సరాలుగా నెలకొన్న దౌత్య సంబంధాలకు ఒక యథోచితమైనటువంటి పతాక సన్నివేశపు సంస్మరణ కూడాను.

2018వ సంవ‌త్స‌రంలో మా సత్కారాన్ని అందుకొంటున్న తొలి అతిథిగా మీ ప‌ర్య‌ట‌న మా నూతన సంవత్సరానికి ఒక ప్ర‌త్యేకమైన ఆరంభాన్ని సూచిస్తోంది. భార‌తీయులంతా వ‌సంత రుతువు, పునరుద్ధరణ, ఆశ‌, పంట‌ కోతల ఆగమన వేళలో ప్రసన్నులుగా ఉన్న మంగళప్రదమైన తరుణాన ఈ ప‌ర్య‌ట‌న చోటుచేసుకొంటోంది. అలాగే లోహ్ డీ, బిహూ, మ‌క‌ర సంక్రాంతి మరియు పొంగ‌ల్ ల వంటి ప‌ండుగలు భార‌త‌దేశపు భిన్న‌త్వం మరియు ఏక‌త్వపు వైభవాన్ని వ్యక్తంచేస్తుంటాయి.

మిత్రులారా,

ఇజ్రాయల్‌ కు గత సంవత్సరం జులై లో నా చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌యాణం సంద‌ర్భంగా 125 కోట్ల మంది భార‌తీయుల స్నేహాన్ని, శుభాకాంక్ష‌ల‌ను నేను మోసుకెళ్లాను. బ‌దులుగా నా మిత్రుడు బిబి నాయ‌క‌త్వంలో ఇజ్రాయలీ ప్ర‌జ‌లు నాపై చూపిన ప్రేమాద‌రాలు న‌న్ను ఆనందంలో ముంచెత్తాయి.

ఆ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి ఊపిరి పోస్తామ‌ని ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ తో పాటు నేను కూడా వ్య‌క్తిగ‌తంగాను మరియు ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప‌ర‌స్ప‌రం వాగ్దానం చేసుకొన్నాం. విభిన్న, వినూత్న విశ్వాసం, ఆశ‌ల‌తో కూడిన స‌హ‌కారం నిండిన‌దిగా మాత్ర‌మే గాక సంయుక్త కృషి, విజ‌యాల‌తో కూడిన‌దిగా ఈ భాగ‌స్వామ్యం ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాం. శ‌తాబ్దాలుగా మ‌న‌ను క‌లిపి ఉంచిన‌ స‌హ‌జ స్నేహానుబంధాల నుండి వెలువ‌డిన ఈ వాగ్దానం దాదాపు అన్ని రంగాలలో స‌మాన భాగ‌స్వామ్యం దిశ‌గా మ‌న‌ను న‌డిపిస్తుంది. మ‌న సంయుక్త ఆశ‌యాలకు, ఆచ‌ర‌ణ‌కు నిద‌ర్శ‌నంగా ఆరు నెల‌ల తరువాత భార‌తదేశంలో మీ అద్భుత‌ ప‌ర్య‌ట‌న సాగుతోంది.

ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, నేను క‌ల‌సి కూర్చుని నిన్న, ఇవాళ మ‌న సంబంధాల్లో ప్ర‌గ‌తిని స‌మీక్షించాం. అదే స‌మ‌యంలో మ‌న‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేసే అవ‌కాశాలు-సంభావ్య‌త‌లతో పాటు వాటిని అందిపుచ్చుకోవ‌డం గురించి మా మ‌ధ్య స‌రికొత్త సంభాష‌ణ సాగింది. మా చ‌ర్చ‌లు ఎంతో విస్తృత‌మైన‌వి, లోతైన‌వీనూ. మ‌రింత ముంద‌ంజ వేయాల‌న్న ఆకాంక్షే వీటికి చోద‌కం. ఫ‌లితాలను సాధించ‌డంలో ప్ర‌ధాని, నేను ఎంతో వేగిర‌ప‌డ‌తామ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. నేనిక్క‌డో బ‌హిరంగ ర‌హ‌స్యాన్ని చెప్ప‌బోతున్నాను.. అదేమిటో మీకూ తెలుసున‌ని నాకు తెలుసు. యంత్రాంగంలో పేరుకుపోయిన ‘‘విప‌రీత జాప్యం’’ అనే జాడ్యాన్ని ప‌దునైన చ‌ర్య‌ల ఖ‌డ్గంతో ఖండించి, మ‌రింత వేగంగా ముందుకు సాగాల‌న్న ఆకాంక్ష‌ను నిరుడు టెల్ అవీవ్‌లో మీరు వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాని గారూ, ఆ దిశ‌గా భార‌త‌దేశంలో మేమిప్ప‌టికే ముందడుగు వేసినట్లు మీకు చెప్ప‌డానికి నేను ఎంతో సంతోష‌ప‌డుతున్నాను. మ‌నం ఇంత‌కుముందు తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లు విష‌యంలో సంయుక్త ఆదుర్దాను, కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లులో పెట్టాం. క్షేత్ర‌ స్థాయిలో దీని ఫ‌లితాలు ఇప్ప‌టికే స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌న మ‌ధ్య చ‌ర్చ‌లు మ‌రింత వేగ‌వంతమై మన భాగ‌స్వామ్యం కొత్త ఎత్తుల‌కు చేరే విధంగా ఇవాళ్టి చ‌ర్చ‌లు ఏకీభావంతో సాగాయి. ఈ సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను మూడు విధాలుగా ముందుకు తీసుకుపోతాం.

మొద‌టిది..

• ముందుగా మ‌న రెండు దేశాల ప్ర‌జ‌ల జీవితాల‌కు సంబంధించిన రంగాలలో స‌హ‌కారంపై ప్ర‌స్తుత పునాదుల‌ను బ‌లోపేతం చేస్తాం. అవే.. వ్య‌వ‌సాయం, శాస్త్ర విజ్ఞానం- సాంకేతిక‌ విజ్ఞానం, భ‌ద్ర‌త‌. అత్యంత ఆధునిక ఇజ్రాయలీ విధానాలు, సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా వ్య‌వ‌సాయ రంగం స‌హ‌కారంలో ప్ర‌ధాన‌మైన నైపుణ్య కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డంపై మేం మా అభిప్రాయాల‌ను పంచుకున్నాం. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల విధానం స‌ర‌ళీక‌ర‌ణ నేప‌థ్యంలో భార‌త కంపెనీల‌తో సంయుక్తంగా ర‌క్ష‌ణ రంగంలోనూ మ‌రింత‌గా ఉత్ప‌త్తి కార్య‌క‌లాపాలు చేప‌ట్టాల‌ని ఇజ్రాయెల్‌ను ఆహ్వానించాను.

రెండోది..

• చ‌మురు- స‌హ‌జ‌వాయువు, సైబ‌ర్ సెక్యూరిటీ, చ‌ల‌న‌చిత్రాలు, స్టార్ట్- అప్ లు వంటి స్వ‌ల్ప స‌హ‌కారం గ‌ల రంగాల‌ లోకి మ‌రింత‌గా చొచ్చుకుపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇంత‌కుముందే మార్చుకున్న అవ‌గాహ‌న ఒప్పందాలలో ఇవి అంత‌ర్భాగంగా ఉండ‌డం మీకు అవ‌గ‌త‌మ‌వుతుంది. చ‌ర్చ‌ల విస్తృతి, వైవిధ్యంపై మా ఆకాంక్ష‌ను ఈ రంగాల్లో అధిక‌శాతం ప్ర‌తిబింబిస్తున్నాయి.

మూడోది..

• భౌగోళికంగా రెండు దేశాల మ‌ధ్య ప్ర‌జల రాక‌పోక‌లు, ఆలోచ‌న‌ల భాగ‌స్వామ్యానికి తోడ్ప‌డ‌టంపై మేం నిబ‌ద్ధ‌త‌తో ఉన్నాం. ఇందుకు విధాన‌ప‌ర‌మైన ప్రోత్సాహం, మౌలిక స‌దుపాయాలు, అనుసంధాన బంధాలు, ప్ర‌భుత్వాతీత మ‌ద్ద‌తును అందించే మార్గాల‌కు ప్రోత్సాహం వంటివి అవ‌స‌రం. రెండు దేశాల ప్ర‌జ‌లు ప‌ర‌స్ప‌ర‌ సంద‌ర్శ‌న‌తో పాటు ఉద్యోగాలు చేసుకొనే దిశ‌గానూ ఇజ్రాయల్‌ తో చ‌ర్చిస్తున్నాం. అలాగే పౌరులు దీర్ఘ‌కాలం ప‌ని చేసుకొనేందుకు వీలు క‌ల్పించేలా స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌ర‌చే ల‌క్ష్యంతో ఇజ్రాయల్‌ లో త్వ‌ర‌లోనే భార‌త సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నాం. అంతేకాకుండా శాస్త్ర సంబంధ విద్యా కోర్సులు చ‌దివే 100 మంది యువ‌జ‌నం ఏటా ప‌ర‌స్ప‌రం రెండు దేశాలలో ప‌ర్య‌టించే ఏర్పాటు చేయాల‌ని మేం నిర్ణ‌యించాం.

మిత్రులారా,

వృద్ధి ప‌థంలో సాగే ప‌ర‌స్ప‌ర వాణిజ్యం, పెట్టుబ‌డులు బ‌ల‌మైన భాగ‌స్వామ్యంలో భాగ‌మ‌న్న‌ది మా దృక్ప‌థంలో ఓ స‌మ‌గ్ర భాగం. ఈ దిశ‌గా మ‌రింత క‌స‌ర‌త్తు చేయవలసిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, నేను అంగీకారానికి వచ్చాం. నిరుడు టెల్ అవీవ్‌లో ప‌లువురు సిఇఒ ల‌తో భేటీ అయిన నేప‌థ్యంలో ద్వైపాక్షిక వేదిక‌పై రెండో సారి స‌మావేశం కాబోతున్నాం. ఈ మేరకు ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ త‌న వెంట భారీ వాణిజ్య ప్ర‌తినిధి బృందాన్ని తీసుకురావ‌డంపై హ‌ర్షం ప్ర‌క‌టిస్తున్నాను. ఇదేకాకుండా ప్ర‌పంచ‌ పరిస్థితులు, ప్రాంతీయ ప‌రిస్థితులు, ప‌రిణామాల‌ పైనా ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, నేను మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఆ మేర‌కు ప్ర‌పంచంలో, ఆయా ప్రాంతాల‌లో శాంతి, సుస్థిర‌త‌ల అంశంపై స‌హ‌కారాన్ని గురించి స‌మీక్షించాం.

మిత్రులారా,

ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ నిన్న భార‌త‌దేశంలో అడుగు పెట్ట‌గానే ముందుగా నాతో క‌ల‌సి తీన్‌మూర్తి హైఫా చౌక్‌ వ‌ద్ద భార‌త అమ‌ర‌ వీరుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. స‌రిగ్గా శ‌తాబ్దం కింద‌ట ఇజ్రాయల్‌ లోని హైఫా న‌గ‌రంలో జ‌రిగిన యుద్ధంలో సాహ‌సులైన భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు. వారి సంస్మ‌ర‌ణార్థం నిర్మించిన ఈ స్మార‌కానికి తీన్‌మూర్తి హైఫా చౌక్‌గా పునఃనామ‌క‌ర‌ణం చేశాం. మ‌న రెండు దేశాలూ మ‌న చరిత్ర‌ను, మ‌న వీరుల‌ను ఎన్న‌డూ విస్మ‌రించ లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ సౌహార్ద‌త‌ను మేం ఎంతో అభినందిస్తున్నాం. ఇజ్రాయల్‌ తో ఉత్తేజ‌క‌ర భాగ‌స్వామ్యం భ‌విష్య‌త్తు నాకెంతో ఆశాభావంతో ఆశావ‌హంగా క‌నిపిస్తోంది. భార‌త‌దేశం- ఇజ్రాయల్ సంబంధాల‌ను కొత్త శిఖ‌రాల‌కు తీసుకువెళ్ల‌డంపై నిబద్ధ‌తకు సంబంధించిప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ లో నా స‌రిజోడు నాకు క‌నిపిస్తున్నారు. చివ‌ర‌గా ప్ర‌ధాని గారూ.. ఎల్లుండి మీతో క‌ల‌సి నా సొంత రాష్ట్రం గుజ‌రాత్‌ లో ప‌ర్య‌టించే అవ‌కాశం ల‌భించ‌డం నాకు ఎన‌లేని సంతోషంగా ఉంది. వ్య‌వ‌సాయం, సాంకేతిక‌త‌, ఆవిష్క‌ర‌ణ‌ల వంటి విభిన్న‌ రంగాలలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై మ‌న వాగ్దానం ఫ‌లించ‌డాన్ని మ‌రో సారి చూసే అవ‌కాశం అక్క‌డ మ‌న‌కు ల‌భిస్తుంది.

ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, శ్రీ‌మ‌తి నెత‌న్యాహూ తో పాటు వారి బృందానికి బార‌తదేశంలో ప‌ర్య‌ట‌న మ‌ర‌పురాని స్మృతిగా మిగిలిపోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

మీకు అనేకానేక ధన్యవాదాలు. Toda Rabah!

***