Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయల్ భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఇజ్రాయల్ భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఇజ్రాయల్ భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు ఇజ్రాయల్ లోని తెల్ అవీవ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

 

భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఇజ్రాయల్ కు రావడం ఇదే మొదటి సారి అని, ఇందుకోసం స్వాతంత్ర్యం సిద్ధించాక 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టిందని చెబుతూ ఆయన తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టారు.

 

తనకు ఆత్మీయ స్వాగతం పలికి, తన పర్యటన అంతటా గౌరవాన్ని ఇచ్చినందుకుగాను ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి కేవలం 25 సంవత్సరాలే అయినప్పటికీ, భారతదేశం మరియు ఇజ్రాయల్ మధ్య బంధం అనేక శతాబ్దాల నాటిదని ఆయన అన్నారు.  13వ శతాబ్దంలో, భారతదేశానికి చెందిన సూఫీ సాధువు శ్రీ బాబా ఫరీద్ జెరుసలెమ్ కు విచ్చేసి, ఒక గుహ లో ఏకాగ్రతతో ధ్యానించేవారన్న సంగతిని తనకు తెలియజేయడమైందని శ్రీ మోదీ చెప్పారు.

 

భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య ఉన్న సంబంధం సంప్రదాయాలు, సంస్కృతి, విశ్వాసం మరియు మిత్రత్వాలతో కూడుకొన్న సంబంధం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.  భారతదేశంలోను, ఇజ్రాయల్ లోను జరుపుకొనే పండుగలలో సారూప్యం ఉన్నట్లు ఆయన తెలిపారు.  ఈ సందర్భంలో, హోలీ మరియు పూరిమ్; ఇంకా దీపావళి మరియు హనుక్కా లను గురించి ఆయన ప్రస్తావించారు.

 

ఇజ్రాయల్ సాధించిన ప్రభావవంతమైన సాంకేతిక విజ్ఞ‌ాన సంబంధి పురోగతి, ధైర్య సాహసాలకు, ప్రాణ సమర్పణకు సంబంధించిన ఇజ్రాయల్ యొక్క చిరకాల సంప్రదాయాలను గురించి ప్రధాన మంత్రి వివరించారు.  ఒకటో ప్రపంచ యుద్ధం కాలంలో హైఫా విముక్తి ఘట్టంలో భారతీయ సైనికులు కీలకమైనటువంటి పాత్రను పోషించారని ఆయన గుర్తుచేశారు.  భారతదేశంలోను, ఇజ్రాయల్ లోను భారతీయ యూదు సముదాయం చేసిన గొప్ప సేవలను గురించి కూడా ఆయన చాటిచెప్పారు.

 

ఇజ్రాయల్ లో నూతన ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రధాన మంత్రి కొనియాడుతూ, జియో-థర్మల్ పవర్, సౌర ఫలకాలు, అగ్రో-బయోటెక్నాలజీ మరియు భద్రత వంటి రంగాలలో ఇజ్రాయల్ ఘనమైన పురోగతిని సాధించిందన్నారు.

 

ఇటీవలి కాలంలో భారతదేశంలో చేపట్టిన సంస్కరణలను గురించి ప్రధాన మంత్రి స్థూలంగా వివరించారు.  వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి)ని ప్రవేశపెట్టడం, ప్రకృతి వనరుల వేలం విధానం, బీమా మరియు బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, నైపుణ్యాలకు పదును పెట్టడం తదితర అంశాలను గురించి ఆయన చెప్పుకువచ్చారు.  2022 కల్లా వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకొన్నట్లు వెల్లడించారు.  భారతదేశంలో రెండో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడంలో ఇజ్రాయల్ తో భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు.  శాస్త్ర విజ్ఞ‌ానం, నూతన ఆవిష్కరణలు మరియు పరిశోధన.. ఇవి భవిష్యత్తులో భారతదేశం, ఇజ్రాయల్ లకు మధ్య బంధాలకు పునాది కాగలవన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

ముంబయి ఉగ్రవాద దాడులలో బతికి బయటపడిన చిరంజీవి మోశే హోల్జ్ బర్గ్ తో అంతక్రితం తాను జరిపిన భేటీని ఆయన జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నారు.

 

ఇజ్రాయల్ లో ఉన్న భారతీయ సముదాయ సభ్యులకు, వారు ఇజ్రాయల్ లో నిర్బంధ సైనిక సేవ చేసినప్పటికీ ఒసిఐ కార్డులను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఇజ్రాయల్ లో భారతీయ  సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య ప్రత్యక్ష గగనతల అనుసంధానాన్ని నెలకొల్పుతామని కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ చెప్పారు.

 

 

***