నా మంచి స్నేహితుడు ప్రధాని శ్రీ నెతన్యాహూ
మీడియా మిత్రులారా, ప్రధాని శ్రీ నెతన్యాహూ, ఆయన సతీమణి శ్రీమతి సరా నెతన్యాహూ లు తమ నివాసానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వారి ఆదరణకు, ఉదాత్తమైన ఆతిథ్యానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.
మిత్రులారా,
అత్యంత భయానక మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన ఆరు మిలియన్ యూదులను గుర్తు చేసుకుంటూ వారి గౌరవార్థం యాద్ వాశెమ్ మెమోరియల్ మ్యూజియంలో కొద్ది క్షణాల క్రితం నేను ఒక పుష్పగుచ్ఛాన్ని సమర్పించాను. కొన్ని తరాల క్రితం మాటల్లో చెప్పలేని విధంగా జరిగిన అత్యంత దారుణమైన దుశ్చర్యకు యాద్ వాశెమ్ ఒక చిహ్నం. ఎంతో దారుణమైన ఆ విషాదాన్ని తట్టుకుని, ద్వేషభావాన్ని అధిగమించి ఒక చలనశీల ప్రజాస్వామ్య జాతిని ఆవిష్కరించేందుకు మీరందరూ చూపిన అకుంఠితమైన స్ఫూర్తికి అది ఒక నివాళి. మానవతపైన, నాగరిక విలువలపైన నమ్మకం గల వారంతా ఒక్కటిగా చేరి, ఎన్ని కష్టాలెదురైనా ఆ విలువలను కాపాడాలనే సందేశాన్ని యాద్ వాశెమ్ మనందరికీ అందిస్తుంది. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న ఉగ్రవాదాన్ని, దౌర్జన్యకాండలను కూడా మనం అదే స్ఫూర్తితో వ్యతిరేకించాలి.
మిత్రులారా,
మన ప్రజల మధ్య బంధం వేలాది సంవత్సరాల క్రితం నాటిది. భారతదేశ నైరుతి కోస్తా తీరంలో తొలి యూదులు అడుగుపెట్టినప్పటి కాలం నాటి దీర్ఘ చరిత్ర ఉంది. అప్పటి నుండి యూదులు అభివృద్ధి చెందుతూవచ్చారు. వారి సంప్రదాయాలు, పద్ధతులు భారత సమాజాన్ని సుసంపన్నం చేశాయి. లెఫ్టినంట్ జనరల్ జె ఎఫ్ ఆర్ జాకబ్, వైస్ అడ్మిరల్ బెంజామిన్ శామ్ సన్, వాస్తు కళలో సుప్రసిద్ధుడు శ్రీ జోశువా బెంజామిన్, నటీమణులు నదీరా గారు, సులోచన గారు, ప్రమీల గారుల వంటి యూదు సంతతికి చెందిన భారతీయులు వారి విభిన్న ప్రతిభాపాటవాలతో భారతీయ సమాజం అల్లికను సుసంపన్నం చేశారు. ఉభయ దేశాల మధ్య గల భాగస్వామ్య చరిత్రకు భారత యూదులు సజీవ, చలనశీల అనుసంధానకర్తలు. మన ఉభయ సమాజాల మధ్య ప్రాచీన కాలం నుండి నెలకొన్న బంధానికి నా ఇజ్రాయల్ పర్యటన ఒక చిహ్నంగా నిలుస్తుంది. రేపు ఇజ్రాయల్ లోని భారతీయ సంతతి ప్రజలతో సమావేశమయ్యే అవకాశం కలగడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మిత్రులారా,
ఆధునిక కాలంలో, 25 సంవత్సరాల క్రితం మన దేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్యబంధం ఏర్పడిన నాటి నుండి మన బంధం మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక సుసంపన్నత, శక్తివంతమైన సాంకేతికత, నవకల్పనలతో అల్లుకుపోవాలని, మన సమాజాలకు భద్రతను సాధించాలన్న ఉమ్మడి లక్ష్యాలు ఉభయ దేశాల మధ్య ఏర్పరచుకోవలసిన సంఘటిత కార్యాచరణ విస్తృతికి అద్దం పడుతున్నాయి. రానున్న దశాబ్దాల్లో మన ఆర్థిక బంధాన్ని పరివర్తన చేయగల బాంధవ్యం ఏర్పాటు చేసుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ప్రపంచంలో త్వరిత గతిన అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. అభివృద్ధి ప్రాధాన్యాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నవకల్పన లను ఆసరా చేసుకోవాలన్న మా లక్ష్యమే మన మధ్య విస్తరించుకోవలసిన విద్య, శాస్త్ర, పరిశోధన, వ్యాపార బంధాల విస్తృతిని తెలియచేస్తోంది. మన శాంతి, సుస్థిరత, సుసంపన్నతలకు ఉమ్మడిగా ఎదురవుతున్న సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేందుకు దృఢమైన భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ఈ లక్ష్యాలన్నింటినీ వాస్తవంలోకి తీసుకురాగల స్పష్టమైన కార్యాచరణను రూపొందించేందుకు ప్రధాని శ్రీ నెతన్యాహూతో కలిసి నేను కృషి చేస్తాను. హృదయపూర్వకమైన స్వాగతం పలికినందుకు ప్రధాని శ్రీ నెతన్యాహూ కు, శ్రీమతి నెతన్యాహూ కు మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ధన్యవాదాలు. మీకు ఎన్నెన్నో ధన్యవాదాలు..
Sharing my remarks at the press meet with PM @netanyahu. https://t.co/MxUZyLo72s pic.twitter.com/34SZX8j9i1
— Narendra Modi (@narendramodi) July 4, 2017