మాననీయ అధ్యక్షులు శ్రీ జోకో విడోడో,
ప్రముఖ ప్రతినిధులు,
ప్రసార మాధ్యమాలకు చెందిన మిత్రులారా,
తొలుత, అసె లో ఇటీవలి భూకంపంలో జరిగిన ప్రాణ నష్టానికి మా ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశానికి తొలి అధికార పర్యటనకు వచ్చిన అధ్యక్షులు శ్రీ జోకో విడోడోకు స్వాగతం పలికే గౌరవం నాకు దక్కింది. 2014 నవంబరులో అధ్యక్షులు శ్రీ విడోడో తో నేను తొలిసారి భేటీ అయ్యి, మా భాగస్వామ్యం మాకు మరియు ఈ ప్రాంతానికి ఏ విధంగా లాభదాయకమో సుదీర్ఘంగా చర్చించాను.
శ్రేష్ఠుడా,
మీరు ఒక గొప్ప దేశానికి నాయకులు. ప్రపంచంలోనే అధిక జనాభా గల ముస్లిం దేశమైన ఇండోనేషియా ప్రజాస్వామ్యానికి, భిన్నత్వానికి, బహుళ సంస్కృతికి, సామాజిక సామరస్యానికి మారుపేరుగా నిలుస్తోంది. మేము పాటించే విలువలు కూడా అవే. మన దేశాలు, సమాజాల మధ్య చారిత్రకంగా బలీయమైన దీర్ఘకాలిక వాణిజ్య బంధం, సాంస్కృతిక బంధం ఉన్నాయి. ప్రపంచంలో రాజకీయంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా త్వరిత గతిన మార్పులు చోటు చేసుకొంటున్న భౌగోళిక ప్రదేశంలో మనం నివసిస్తున్నాం. మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త ఉత్తేజాన్ని, వేగాన్ని అందించేందుకు మీ పర్యటన తోడ్పడుతుంది. అలాగే ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతికి, సుసంపన్నతకు, సుస్థిరతకు దోహదకారి అయ్యే రీతిలో మన సారూప్యాలను నిర్మించుకొనే అవకాశం కలుగుతుంది.
మిత్రులారా,
భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసిలో ఎంతో విలువైన భాగస్వామి ఇండోనేషియా. ఆగ్నేయాసియా ప్రాంతంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ అది. రెండు పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు, ప్రధాన వర్థమాన ఆర్థిక వ్యవస్థలుగా మన మధ్య వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. మనకు ఉమ్మడి ఆందోళనలు, సవాళ్ళు కూడా ఉన్నాయి. అధ్యక్షుల వారితో ఈ రోజు నేను జరిపిన విస్తృత చర్చలలో మన సహకారానికి సంబంధించి అన్ని కోణాల పైన చర్చించాను. రక్షణ, భద్రత సంబంధ సహకారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉభయులమూ అంగీకరించాము. రెండు దేశాలు సాగర తీరం విస్తృతంగా గల ఇరుగు పొరుగు దేశాలు కావడం వల్ల సాగర జలాల భద్రత, వైపరీత్య నివారణ, పర్యావరణ పరిరక్షణ లలోనూ సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాము. సాగర తీర సహకారానికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనలో ఈ విభాగంలో అందించుకోవలసిన సహాయ సహకారాలను విస్తృతంగా పొందుపరచాము. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా నిరోధానికి కూడా మా భాగస్వామ్యం విస్తరిస్తుంది.
మిత్రులారా,
ఆలోచనలు, వాణిజ్యం, పెట్టుబడులు, మానవ వనరులు స్వేచ్ఛగా మార్పిడి జరిగేందుకు వీలుగా ఆర్థిక, అభివృద్ధి భాగస్వామ్యం పటిష్ఠం చేసుకొనేందుకు అధ్యక్షుల వారు, నేను అంగీకారానికి వచ్చాము. ఫార్మా, ఐటి, సాఫ్ట్ వేర్, నైపుణ్యాల వృద్ధి రంగంలోని భారతీయ కంపెనీలు ఇండోనేషియా కంపెనీలతో సన్నిహితంగా కలిసి పని చేసేలా ప్రోత్సహించాలన్న అధ్యక్షులు శ్రీ విడోడో సూచనను నేను అంగీకరించాను. అలాగే రెండూ వర్థమాన దేశాలు కావడం వల్ల మన సామర్థ్యాలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు మౌలిక వసతుల అభివృద్ధి రంగంలో రెండువైపులా పెట్టుబడుల రాకపోకలకు అవకాశం కల్పించాలని మేము నిర్ణయించాము. ఉభయ దేశాల పరిశ్రమల మధ్య సహకారానికి అవకాశం గల విభాగాలను గుర్తించేందుకు సిఇఒ ల ఫోరమ్ కృషి చేస్తుంది. సేవలు, పెట్టుబడుల విభాగంలో భారతదేశం- ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య అంగీకారాన్ని సత్వరం అమలుపరచడం, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి సత్వరం తుది రూపం ఇవ్వడం ఈ దిశగా తీసుకోవలసిన తక్షణ చర్యలని ఉభయులం అంగీకారానికి వచ్చాం. అంతరిక్ష విభాగంలో కూడా ఉభయ దేశాల మధ్య రెండు దశాబ్దాలుగా నెలకొన్న విలువైన సహకారాన్ని మరింతగా విస్తరించుకోవలసిన అంశాన్ని మేం గుర్తించాం. ఉభయ దేశాల భాగస్వామ్యంలో గల ఈ వేగాన్ని నిలబెట్టుకొనే దిశగా ద్వైపాక్షిక సహకార కార్యక్రమ పట్టికను ఆచరించేందుకు మంత్రిత్వ స్థాయిలో ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని సత్వరం సమావేశపరచాలని ఉభయులమూ ఆదేశించాము.
మిత్రులారా,
మన సమాజాల మధ్య గల చారిత్రక బంధం, బలీయమైన సాంస్కృతిక అనుబంధం మన వారసత్వ సంపదకు చిహ్నం. చారిత్రకంగా మనను అనుసంధానం చేస్తున్న అంశాలపై పరిశోధనను ముమ్మరం చేయవలసిన ప్రాధాన్యాన్ని అధ్యక్షుల వారు, నేను గుర్తించాము. ఉభయ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలలో భారతదేశం, ఇండోనేషియా అధ్యయన పీఠాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతం చేసేందుకు కూడా మేము అగీకరించాము. అలాగే, ఉపకార వేతనాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా విస్తరించేందుకు అంగీకారానికి వచ్చాము. ఉభయ దేశాల మధ్య ప్రత్యక్ష అనుసంధానం, ప్రజల మధ్య బాంధవ్యం పెంచుకోవడం అవసరమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఇండోనేషియాకు చెందిన గరుడ సంస్థ ముంబయ్ కి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించడాన్ని మేము ఆహ్వానించాము.
శ్రేష్ఠుడా,
మీరు భారతదేశ పర్యటనకు వచ్చినందుకు మరో సారి నా ధన్యవాదాలు. మన ద్వైపాక్షిక బంధాన్ని మరో కొత్త స్థాయికి చేర్చాలన్న మీ ఆకాంక్షతో నేను ఏకీభవిస్తున్నాను. మనం జరిపిన చర్చలు, ఈ రోజు సంతకం చేసిన ఒప్పందాలు ఉభయ దేశాల వ్యూహాత్మక బంధానికి కొత్త దిశ, సరికొత్త ఉత్తేజం నింపుతాయని నేను విశ్వసిస్తున్నాను. ముగించే ముందు ఇండోనేషియా లోని మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
మీకు అందరికీ కృతజ్ఞతలు.