ఇండోనేషియా అధ్యక్షుడు మాననీయ శ్రీ జోకో విడోడో డిసెంబరు 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు భారతదేశంలో అధికారికంగా పర్యటించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం నేపథ్యంలో శ్రీ జోకో విడోడో తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటనకు వచ్చారు. భారత రాష్ట్రపతి మాననీయ శ్రీ ప్రణబ్ ముఖర్జీ 2016 డిసెంబరు 12న రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన అధికారిక విందుకు హాజరైన అనంతరం ఆయనతో సమావేశమయ్యారు. ఆ తరువాత పరస్పర ప్రాముఖ్యం గల ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో లు విస్తృతంగా చర్చించారు. కాగా, 2015 నవంబరు 15వ తేదీన భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. హమీద్ అన్సారీ ఇండోనేషియాను సందర్శించిన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు.
ఇరుగుపొరుగు సముద్రతీర దేశాలైన భారతదేశం, ఇండోనేషియా ల మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో లు గుర్తు చేసుకొన్నారు. రెండు దేశాల ప్రజల నడుమ నాగరికతా బంధంతో పాటు హిందూ, బౌద్ధ, ఇస్లాము ల వారసత్వ అనుబంధాలను జ్ఞప్తికి తెచ్చుకొన్నారు. శాంతియుత సహ జీవనంలో బహుళత్వం, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన కీలక విలువలని వారు స్పష్టం చేశారు. రెండు దేశాల నడుమ రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాల కలయికను స్వాగతించారు. దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇవి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య 2005 నవంబరులో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన అనంతరం సంబంధాలు సరికొత్త వేగాన్ని అందుకొన్నాయని నాయకులు ఇద్దరూ పేర్కొన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు 2011 జనవరిలో భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా ‘రానున్న దశాబ్దంలో భారతదేశం- ఇండోనేషియా నూతన వ్యూహాత్మక భాగస్వామ్య దృష్టికోణాన్ని నిర్వచిస్తూ చేసిన సంయుక్త ప్రకటనను అనుసరించడం ద్వారా ఈ బంధాలకు మరింత ఉత్తేజం లభించింది. దీనితో పాటు భారతదేశ ప్రధాన మంత్రి 2013 అక్టోబరులో ఇండేనేషియా లో పర్యటించిన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు పంచముఖ వ్యూహాన్ని కూడా అనుసరించాలని నిర్ణయించారు. కాగా, ఆసియాన్ సదస్సుకు హాజరైనపుడు నైపిడాలో 2014 నవంబరు 13వ తేదీన తాము తొలిసారి కలిసిన సందర్భాన్ని ఇరువురు నాయకులూ గుర్తు చేసుకొన్నారు. ఆ సమయంలోనే భారతదేశం, ఇండోనేషియా ల మధ్య పటిష్ఠ సహకారానికి అవకాశమున్న అంశాలపై వారిద్దరూ చర్చించుకొన్నారు.
వ్యూహాత్మక ఒడంబడిక
ద్వైపాక్షికంగా వార్షిక శిఖరాగ్ర సమావేశాలతో పాటు బహుళపాక్షిక కార్యక్రమాల నడుమన కూడా సదస్సుల నిర్వహణకు ఇండోనేషియా అధ్యక్షుడు, భారతదేశ ప్రధాన మంత్రి అంగీకారానికి వచ్చారు. అలాగే రెండు దేశాల మధ్య మంత్రిత్వ స్థాయి, కార్యాచరణ యంత్రాంగాల స్థాయి సంభాషణలు సహా నిరంతర ద్వైపాక్షిక సత్వర సంప్రదింపులకూ వారు ప్రాధాన్యమిచ్చారు.
వ్యవసాయం, బొగ్గు, ఆరోగ్యం, ఉగ్రవాద నిరోధం, మత్తుమందులు- మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, వాటి ప్రభావం తదితర రంగాలకు సంబంధించి నేపిడాలో 2014 నవంబరు నాటి సమావేశం సందర్భంగా అంగీకారం కుదిరిన తరువాత ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ బృందాలు ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై నాయకులు ఇద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఆయా సమావేశాలలో ఆమోదించిన అంశాలన్నింటినీ పూర్తిగా అమలు చేయాలని నాయకులు ఉభయులూ కోరారు.
రెండు ప్రజాస్వామ్య దేశాల నడుమ చట్ట సభల స్థాయి ఆదాన ప్రదానాలకు గల ప్రాముఖ్యాన్ని నాయకులు ఇద్దరూ పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా రెండు దేశాల చట్ట సభల ప్రతినిధి బృందాల సందర్శనలు క్రమం తప్పకుండా కొనసాగుతుండడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇండోనేషియాలో 2016 ఏప్రిల్‌లో భారతదేశ పార్లమెంటు ప్రతినిధి బృందం జరిపిన సౌహార్ద పర్యటనను, 2015 డిసెంబరులో ఇండోనేషియా ప్రజా ప్రతినిధుల సభ, ప్రాంతీయ మండలుల ప్రతినిధి బృందాలు భారతదేశాన్ని సందర్శించడాన్ని వారు ప్రశంసించారు. ఈ ఏడాది ప్రారంభంలో కార్యరంగంలో దిగిన భారతదేశం, ఇండోనేషియా ల మేధావుల బృందం దార్శనిక పత్రం- 2025ను సమర్పించడంపై నాయకులు హర్షం వెలిబుచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి 2025 వరకు, ఆ తరువాత రెండు దేశాల భవిష్యత్ పథాన్ని నిర్దేశించే సిఫారసులు ఈ పత్రంలో ఉన్నాయి.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ- ఐఎస్ ఆర్ ఒ 2015 సెప్టెంబరులో లపాన్ ఎ2, 2016 జూలైలో లపాన్ ఎ3 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టడంపై నాయకులు ఇద్దరూ హర్షం వెలిబుచ్చారు. అంతరిక్ష పరిశోధనలు, ఉపయోగాలపై అంతర్ ప్రభుత్వ చట్ర ఒప్పందం ఖరారు దిశగా లపాన్, ఇస్రో ల సంయుక్త సంఘం నాలుగో సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని వారు రెండు సంస్థలనూ ఆదేశించారు. భూ-జలాధ్యయనం, వాతావరణ అంచనాలు, విపత్తుల నిర్వహణ, పంటల అంచనాలు, వనరుల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలేగాక శాంతియుత ప్రయోజనాలకు సంబంధించిన అనువర్తన ఒప్పందాలు ఇందులో భాగంగా ఉంటాయి.
రక్షణ, భద్రత రంగాలలో సహకారం
తీర ప్రాంత ఇరుగు పొరుగు దేశాలు, వ్యూహాత్మక భాగస్వాములుగా రెండు దేశాల మధ్య భద్రత, రక్షణ రంగాలలో సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన ఆవశ్యకతను నాయకులు ఇద్దరూ గుర్తించారు. ఈ దిశగా రక్షణ రంగంలో సహకారాత్మక కార్యకలాపాలపై ప్రస్తుత ఒప్పందాన్ని దృఢమైన “ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం”గా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం రక్షణ మంత్రుల స్థాయి చర్చలు, సంయుక్త రక్షణ సహకార కమిటీ ల స్థాయి సమావేశాలను సత్వరం ఏర్పాటు చేసి, ప్రస్తుత ఒప్పందంపై సమీక్షించాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు.
రెండు దేశాల సైనిక దళాల స్థాయి (ఆగస్టు 2016) నౌకా దళాల స్థాయి (జూన్ 2015) చర్చలు విజయవంతంగా పూర్తి కావడం, తత్ఫలితంగా రెండు సాయుధ దళాల నడుమ రక్షణ సహకార విస్తృతితో పాటు వాయు సేన స్థాయి చర్చలను వీలైనంత త్వరగా నిర్వహించాలన్న నిర్ణయానికి రావడం పైనా నాయకులు ఇద్దరూ హర్షం వెలిబుచ్చారు. రెండు దేశాల ప్రత్యేక బలగాలు సహా సాయుధ దళాల శిక్షణ, సంయుక్త కసరత్తులతో పాటు రక్షణ పరంగా ఆదాన ప్రదాన కార్యకలాపాల సంఖ్యను పెంచేందుకు అంగీకరించారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాల బదిలీ, సాంకేతిక సహాయం, సామర్థ్య నిర్మాణ సహకారం ద్వారా రక్షణ పరికరాల సంయుక్త ఉత్పాదనకు వీలుగా రెండు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య భాగస్వామ్యానికి మార్గాన్వేషణ చేపట్టే బాధ్యతను రక్షణ మంత్రులకు అప్పగించారు.
ప్రపంచవ్యాప్త ఉగ్రవాదం, ఇతర అంతర్జాతీయ నేరాల ముప్పును గురించి ఇద్దరు నాయకులూ చర్చించారు. ఉగ్రవాదంతోపాటు ముష్కర కార్యకలాపాలకు నిధుల నిరోధం, అక్రమ ద్రవ్య చెలామణీ, ఆయుధాల దొంగ రవాణా, మానవ అ్రకమ రవాణా, సైబర్ నేరాలపై పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని గణనీయంగా పెంచుకోవాలని వారు తీర్మానించారు. ఉగ్రవాద నిరోధంపై సంయుక్త కార్యాచరణ బృందం క్రమం తప్పకుండా సమావేశం అవుతుండడాన్ని వారు ప్రశంసించారు. దీనితో పాటు 2015 అక్టోబరు నాటి సమావేశంలో సైబర్ భద్రత సహా పరస్పర ప్రయోజనాంశాలపై చర్చల ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. మత్తుమందులు-మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, వాటి ప్రభావం తదితరాలకు సంబంధించి 2016 ఆగస్టులో రెండు దేశాల సంయుక్త కార్యాచరణ బృందం తొలిసారి సమావేశం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.
“విపత్తుల ముప్పు తగ్గింపుపై ఆసియా మంత్రుల సదస్సు-2016”ను న్యూ ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించడాన్ని నాయకులు ఇద్దరూ హర్షించారు. ఈ రంగంలో సహకారానికి గల అవకాశాలను గుర్తించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణపై సహకార పునరుత్తేజానికి సంబంధిత శాఖలు సమాయత్తం కావాలని కోరారు. ఆ మేరకు క్రమం తప్పని సంయుక్త కసరత్తులు, శిక్షణ సహకారం వంటి వాటి ద్వారా ప్రకృతి విపత్తులపై సత్వర స్పందన సామర్థ్య వృద్ధికి కృషి చేయాలని సూచించారు. రెండు దేశాలకూ సముద్ర పరిధి తమకే గాక పరిసర ప్రాంతీయ దేశాలకు, మొత్తంమీద ప్రపంచానికి ఎంత ప్రధానమైందో నాయకులు ఇరువురూ ప్రముఖంగా గుర్తించారు. తీర ప్రాంత సహకార విస్తృతికి ప్రతినబూనుతూ ఈ సందర్శన సందర్భంగా
“సముద్ర సహకారంపై ప్రత్యేక ప్రకటన”ను వారు విడుదల చేశారు. ఈ ప్రకటనలో భాగంగా తీర భద్రత, తీర ప్రాంత పరిశ్రమలు, తీర రక్షణ, సముద్ర రవాణా తదితరాల్లో ద్వైపాక్షిక సహకారానికి అవకాశం గల విస్తృతాంశాలను రెండు దేశాలూ గుర్తించాయి.
చట్టవిరుద్ధ, అనియంత్రిత, సమాచార రహిత (ఐయుయు) చేపల వేటపై పోరాటంతో పాటు నిరోధం, నియంత్రణ, నిర్మూలనకు అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని కూడా నాయకులు ఇద్దరూ పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఐయుయు చేపల వేటకు సంబంధించిన సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయడం మీద హర్షం వ్యక్తం చేస్తూ ఇండోనేషియాకు, భారతదేశానికి మధ్య సుస్థిర మత్స్య నిర్వహణ వ్యవస్థను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రపంచానికి నిరంతర ముప్పుగా పరిణమిస్తున్న నేరాలలో బహుళజాతి వ్యవస్థీకృత చేపలవేట కూడా ఒకటిగా మారుతున్నదని ఇద్దరు నాయకులూ గుర్తించారు.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం
భారతదేశం, ఇండోనేషియా ల మధ్య వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలలో వృద్ధిపై నాయకులు ఇరువురూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉభయ తారక వాణిజ్యాభివృద్ధికి, పెట్టుబడులకు, ప్రైవేటు రంగ చోదిత ఆర్థికాభివృద్ధికి మరింత ప్రోత్సాహం కల్పించే పారదర్శక, సరళ, సార్వత్రిక ఆర్థిక విధాన ముసాయిదా ప్రాముఖ్యాన్ని గుర్తించారు. వాణిజ్యశాఖ మంత్రుల ద్వైవార్షిక వేదిక సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులకు గల అవరోధాలను తొలగించే లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పనపై అవసరమైన చర్చలకు ఈ వేదిక వీలు కల్పిస్తుంది.
భారతదేశ పరివర్తన దిశగా ప్రభుత్వం చేపట్టిన వినూత్నచర్యలు, పథకాల గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ విడోడోకు వివరించారు. ఆ మేరకు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘స్మార్ట్‌సిటీ’, ‘స్వచ్ఛ భారత్’, ‘స్టార్ట్-అప్ ఇండియా’ వంటి వాటిని క్లుప్తంగా పరిచయం చేశారు. అంతేకాకుండా ఈ అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇండోనేషియా వ్యాపార రంగానికి ఆహ్వానం పలికారు. అలాగే ఇండోనేషియాలో వ్యాపార సౌలభ్య వృద్ధికి ఇటీవల చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న చర్యలను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీకి వివరించారు. తమ దేశంలోని ఔషధ, మౌలిక సదుపాయ, సమాచార సాంకేతిక, ఇంధన, తయారీ పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా భారతీయ కంపెనీలను ఆహ్వానించారు.
ఇండోనేషియా- ఇండియా సిఇఒ ల వేదిక న్యూ ఢిల్లీలో 2016 డిసెంబరు 12వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్తల సమావేశం నిర్వహించడంపై నాయకులు ఇద్దరూ హర్షం ప్రకటించారు. అంతేకాకుండా ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడుల సహకారాభివృద్ధి దిశగా నిర్మాణాత్మక సూచనలు చేసేందుకు వీలుగా సిఇఒ ల వేదిక క్రమం తప్పకుండా వార్షిక సమావేశాలు నిర్వహించాలని ప్రోత్సహించారు. కాగా, రెండు దేశాల నుండి ఎంపిక చేసిన సిఇఒ లతో 2016 డిసెంబరు 13న నిర్వహించిన సమావేశం సందర్భంగా డిసెంబరు 12 నాటి సదస్సుపై సిఇఒ ల వేదిక సహాధ్యక్షులు సమర్పించిన నివేదికను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడోకు అందజేశారు.
రెండు దేశాల ఆర్థిక వృద్ధికి విశ్వసనీయ, పరిశుభ్ర, సరసమైన ధర గల ఇంధనం అందుబాటు ఆవశ్యకతను నాయకులు ఇద్దరూ గుర్తించారు. ఇందుకోసం 2015 నవంబరులో కుదిరిన నవ్య, పునరుత్పాదక ఇంధన ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. నవ్య, పునరుత్పాదక ఇంధనంపై సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు. దానితో పాటు నిర్దిష్ట ద్వైపాక్షిక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కోసం ఈ కార్యాచరణ బృందం తొలి సమావేశాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వినూత్న చొరవను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో స్వాగతించారు. ప్రత్యేకించి ఈ దిశగా అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఆయన ముందుచూపును కొనియాడారు.
బొగ్గుకు సంబంధించి 2015 నవంబరులో సంయుక్త కార్యాచరణ బృందం మూడో సమావేశం ఫలితాలను నాయకులు ఇద్దరూ సమీక్షించారు. వాతావరణ మార్పు లక్ష్యాలతో పాటు రెండు దేశాల ఇంధన భద్రతను పరస్పర ఆకాంక్షిత భాగస్వామ్యంతో సాధించే దిశగా ఇంధన సామర్థ్య సాంకేతికత, నవ్య- పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానాలకు ప్రోత్సాహంపై సహకారానికి ఇద్దరు నాయకులూ అంగీకరించారు. భవిష్యత్తులో సమ్మిశ్రిత ఇంధన అవసరాలను తీర్చేందుకు వీలుగా చమురు-సహజవాయు రంగంలో సహకారంపై ఒప్పందం నవీకరణకు ప్రోత్సహించాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించారు. అలాగే సంయుక్త కార్యాచరణ బృందం సాధ్యమైనంత త్వరగా సహకారాన్ని విస్తృతం చేసుకునేలా కార్యాచరణను వేగిరపరచాలని నిశ్చయించారు.
రెండు దేశాల్లో ఉమ్మడి ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనడంలో సన్నిహిత సహకారానికి బాటలు పరచేలా ఆరోగ్య సహకారంపై అవగాహన ఒప్పందం నవీకరణకూ ఇద్దరు నాయకులూ ఆసక్తి చూపారు. ఔషధ రంగంలో పరస్పర ప్రయోజన సహకార విస్తృతికి ప్రోత్సాహం ప్రకటించారు. అంతేకాకుండా రెండు దేశాల్లో ప్రజలకు ఆహార భద్రత కల్పన ప్రాముఖ్యాన్ని ఎత్తిచూపుతూ దీనికి సంబంధించి పటిష్ఠ కార్యాచరణకు అంగీకరించారు. ఇండోనేషియా అవసరాల మేరకు బియ్యం, చక్కెర, సోయాబీన్ సరఫరాకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంసిద్ధత తెలిపారు. సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానాలు విసురుతున్న సవాళ్లు, అవకాశాలను గుర్తించి, ఈ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలోపాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా సహకారాభివృద్ధిపై తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.
వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య పరస్పర సంబంధాల వికాసంలో అనుసంధానతకు గల ప్రాముఖ్యాన్ని ఇద్దరు నాయకులూ గుర్తించారు. ఈ దిశగా 2016 డిసెంబరు నుంచి జకార్తా, ముంబయ్ ల మధ్య పౌర విమానయాన సంస్థ గరుడ ఇండోనేషియా విమాన సేవలను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే భారతదేశ పౌర విమానయాన సంస్థ కూడా రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేలా ప్రోత్సహించారు. దీనితో పాటు నౌకాయాన సంబంధాలను కూడా రెండు దేశాలూ ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రంగంలో ప్రైవేటురంగ పెట్టుబడులుసహా రేవులు, విమానాశ్రయాల అభివృద్ధిలో ప్రభుత్వ- ప్రైవేటు పెట్టుబడులు లేదా ఇతర రాయితీ పథకాల అమలునూ ప్రోత్సహించాలని నిర్ణయించారు. రెండు దేశాల నడుమ వాణిజ్యంలో ద్వైపాక్షిక సహకారాభివృద్ధి కోసం ప్రమాణాల పరంగానూ ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఆ మేరకు ప్రమాణీకరణ సహకారంపై ఇండోనేషియా జాతీయ ప్రమాణాల సంస్థ (బిఎస్ఎన్), భారతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ (బిఐఎస్)ల మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని వారు హర్షించారు.
సాంస్కృతిక, ప్రజా సంబంధాలు
సాంస్కృతిక ఆదాన ప్రదాన కార్యక్రమం 2015-2018 కింద కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, పురాతత్త్వ శాస్త్ర పరంగా ప్రోత్సహిస్తూ రెండు దేశాల ప్రజల మధ్య సన్నిహిత చారిత్రక, సాంస్కృతిక బంధాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరు నాయకులూ ప్రకటించారు. పర్యాటకానికి ప్రోత్సాహంతో పాటు యువత పైనా చలనచిత్రాలు చూపగల ప్రభావాన్ని, వాటికి గల ప్రజాదరణను గుర్తిస్తూ చలనచిత్ర రంగంలో సహకారంపై ఒప్పందం ఖరారుకు ఉభయపక్షాలూ అంగీకారం తెలిపాయి.
ఇండియా, ఇండోనేషియాలలో యువతరం సాధికారిత కోసం విద్య, మానవ వనరుల అభివృద్ధిలో పెట్టుబడులకుగల ప్రాముఖ్యాన్ని నాయకులు ఇద్దరూ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల మధ్య ఆచార్యుల ఆదానప్రదానానికి, బోధకులకు శిక్షణతో పాటు ద్వంద్వ పట్టా కార్యక్రమాల కోసం సంధాన వ్యవస్థీకరణ ద్వారా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న విద్యాపరమైన సహకారాన్ని ఉభయపక్షాలూ గుర్తించాయి. ఉన్నత విద్యారంగంలో ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాల్సిన ఆవశ్యకతను నాయకులు ఇద్దరూ గుర్తు చేస్తూ, ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉభయపక్షాల అధికారులను ఆదేశించారు.
ఇండోనేషియాలోని విశ్వవిద్యాలయాలలో భారతీ అధ్యయన పీఠాల ఏర్పాటును ఇద్దరు నాయకులూ స్వాగతించారు. అలాగే భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో ఇండోనేషియా అధ్యయన పీఠాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు అంగీకరించారు. యువజన వ్యవహారాలు, క్రీడల పైనా సహకారాభివృద్ధికి ఉభయపక్షాలూ అంగీకరించాయి. ఆ మేరకు సదరు అంశాలలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని హర్షించాయి.
ఉమ్మడి సవాళ్లపై స్పందనాత్మక సహకారం
సకల స్వరూప, స్వభావాలతో కూడిన ఉగ్రవాదాన్ని నాయకులు ఇద్దరూ తీవ్రంగా ఖండించారు. ముష్కర మూకల దుష్కర చర్యలను “ఎంతమాత్రం సహించేది లేద”ని దృఢస్వరంతో చెప్పారు. విశ్వవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు, హింసాత్మక తీవ్రవాదాలపై వారు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఉగ్రవాద సంస్థలను గుర్తించి, వాటి పేర్లను ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రత మండలి చేసిన నంబరు 1267 తీర్మానం సహా ఇతర తీర్మానాలన్నిటినీ అమలు చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు స్వర్గధామాలుగా మారిన ప్రాంతాల విముక్తి, మౌలిక సదుపాయాల తొలగింపు, ఉగ్రవాద సమూహ యంత్రాంగాల విచ్ఛిన్నం, నిధులందే మార్గాల మూసివేత, సీమాంతర ఉగ్రవాద నిరోధం తదితరాల కోసం అన్ని దేశాలూ కృషి చేయాలని కోరారు. సత్వర నేర న్యాయ చర్యలతో స్పందించడం ద్వారా తమ తమ భూభాగాల మీదనుంచి దుష్కృత్యాలకు పాల్పడే బహుళజాతి ఉగ్రవాదాన్నిఏరివేసేందుకు ప్రతి దేశం పటిష్ఠంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగా భారతదేశం, ఇండోనేషియా ల మధ్య సమాచార, నిఘా పరంగా ఆదాన ప్రదానం సహా సహకారాన్ని మరింత పెంచుకొనేందుకు ఇద్దరు నాయకులూ అంగీకరించారు.
సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి సదస్సు చేసిన తీర్మానాన్ని(యుఎన్ సిఎల్ఒఎస్) ప్రతిబింబించే అంతర్జాతీయ చట్ట సూత్రావళికి అనుగుణంగా ప్రతిబంధరహిత చట్టబద్ధ వాణిజ్యం, జలరవాణా స్వేచ్ఛను, గగన రవాణా స్వేచ్ఛను గౌరవించుకోవడంపై తమ వచనబద్ధతను ఇద్దరు నాయకులూ పునరుద్ఘాటించారు. ఆ మేరకు సంబంధిత పక్షాలన్నీ శాంతియుత మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. బెదిరింపులు, బలప్రయోగం వంటి చర్యలకు పాల్పడరాదని, ఆయా కార్యకలాపాలలో స్వీయ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలకు దారితీసే ఏకపక్ష దుందుడుకు చర్యలకు తావు ఇవ్వరాదని కోరారు. మహాసముద్రాలలో అంతర్జాతీయ చట్టాల కట్టుబాటును నిర్దేశించే యుఎన్ సిఎల్ఒఎస్ భాగస్వాములుగా అన్ని దేశాలూ ఈ తీర్మానానికి అపరిమిత గౌరవం ఇవ్వాలని భారతదేశం-ఇండోనేషియా భాగస్వామ్య దేశాధినేతలుగా వారు నొక్కిచెప్పారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో వివాదాలను శాంతియుత మార్గాల్లో, యుఎన్ సిఎల్ఒఎస్ సహా విశ్వవ్యాప్తంగా గుర్తించిన అంతర్జాతీయ చట్ట సూత్రావళికి అనుగుణంగా పరిష్కరించుకోవాలని ఉభయ పక్షాలూ స్పష్టం చేశాయి. సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య చర్చలను వేగంగా ముగించేందుకు వీలుగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా పునరుద్ఘాటించాయి.
ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సహా దాని ప్రధాన అంగాలకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కరణలకు ఇద్దరు నాయకులూ వారి మద్దతును పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించగలిగేలా ఐక్యరాజ్యసమితిని మరింత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దాల్సిన దృష్ట్యా ఈ సంస్కరణలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో కళ్లెదుట కనిపిస్తున్న అనేక వాస్తవాలపై మరింత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా, ప్రతిస్పందనాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలిగేలా ఐక్యరాజ్యసమితి భద్రత మండలిని సత్వరం పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. మండలిలోని శాశ్వత సభ్యత్వదేశాలలో వర్ధమాన ప్రపంచ దేశాలకు తగినంత ప్రాతినిధ్యం ఉండే విధంగా దానిని పునర్వ్యస్థీకరించడం అనివార్యమని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలకు సంబంధించిన వివిధ అంశాలపై సన్నిహితంగా వ్యవహరించేందుకు వారు అంగీకరించారు.
భౌగోళిక ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకొనేలా చేయడం, వాతావరణ మార్పులు వంటి ఉమ్మడి సవాళ్లను అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటుండడాన్ని ఉభయపక్షాలూ గుర్తించాయి. ఆ మేరకు అంతర్జాతీయ సమాజంలో కీలక సభ్యత్వ దేశాలుగా ఈ సమస్యలపై బహుళ వేదికల మీద ప్రభావవంతమైన సంయుక్త కృషికి శ్రీకారం చుట్టాలని అంగీకారానికి వచ్చాయి.
ఆసియాన్- ఇండియా సంప్రదింపుల సంబంధాలు గడచిన 24 ఏళ్ల నుండి నిలకడగా వృద్ధి చెందుతుండడంపై నాయకులు ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ సంబంధాల 25వ వార్షికోత్సవాలను నిర్వహించే ఆలోచనను స్వాగతించారు. దీనితో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యం- 2017 ఐదో వార్షికోత్సవం నేపథ్యంలో ఆసియాన్ సభ్యత్వ దేశాలతో పాటు ఈ భాగస్వామ్యంలోని అన్ని దేశాలలో 2017 సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహించే యోచనపై హర్షం వెలిబుచ్చారు. అంతేకాకుండా ఆసియాన్-ఇండియా భాగస్వామ్యాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారతదేశంలో స్మారక సదస్సు నిర్వహణ, మంత్రిత్వ స్థాయి సమావేశాలతో పాటు వాణిజ్య సదస్సులు, సాంస్కృతిక వేడుకలు వంటి కార్యక్రమాలను నిర్వహించే ప్రణాళికలను హర్షించారు. ఇక తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు (ఇఎఎస్), ఆసియాన్ ప్రాంతీయ వేదిక (ఎఆర్ఎఫ్), ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ (ఎడిఎమ్ఎమ్+) వంటి ఆసియాన్ సంబంధిత యంత్రాంగాల సన్నిహిత సమన్వయానికి రెండు దేశాలూ అంగీకరించాయి.
హిందూ మహాసముద్రం మీద విస్తరించిన రెండు పెద్దదేశాలుగా భారతదేశం, ఇండోనేషియా లు హిందూ మహాసముద్ర తీర దేశాల కూటమి (ఐఒఆర్ఎ) ప్రభావాన్ని సమర్థంగా చాటవలసివుందని ఇద్దరు నాయకులూ గుర్తించారు. ఆ మేరకు కూటమి గుర్తించిన రంగాలలోనూ, హిందూ మహాసముద్ర నావికా సదస్సు చర్చల (ఐఒఎన్ఎస్) లోనూ ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఐఒఆర్ఎ అధ్యక్ష స్థానం బాధ్యతలను చక్కగా నిర్వహించడంతో పాటు వచ్చే ఏడాది తొలి ఐఒఆర్ఎ సదస్సును నిర్వహించనున్న ఇండోనేషియా నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ అధ్యక్షుడు శ్రీ జోకో విడోడోకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
తమ మధ్య సాగిన చర్చల ప్రగతిని సమీక్షించడంతో పాటు కింద పేర్కొన్న మేరకు 2017 తొలి అర్ధభాగంలో నిర్వహించే సమావేశాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇద్దరు నాయకులూ అంగీకరించారు.. :
i) మంత్రుల స్థాయి సంయుక్త కమిషన్
ii) రక్షణ మంత్రుల చర్చలు, సంయుక్త రక్షణ సహకార కమిటీ (జెడిసిసి)
iii) ద్వైవార్షిక వాణిజ్య మంత్రుల వేదిక (బిటిఎమ్ఎఫ్)
iv) ఇంధన సహకారం కోసం మార్గ ప్రణాళిక రూపకల్పనకు ఇంధన వేదిక సదస్సు నిర్వహణ
v) భద్రత సహకారంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన దిశగా భద్రత సంప్రదింపుల చర్చలు.
ఇక వీలైనంత త్వరలో ఇండోనేషియాలో పర్యటించాల్సిందిగా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో ఆహ్వానించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకు తక్షణమే ఆమోదం తెలిపారు.