ఇండియన్ పోస్టల్ సర్వీస్ కేడర్‌ను సమీక్షించడానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
తపాలా విభాగంలో చేపట్టే కేడర్ సమీక్ష ఆ విభాగం లోని కార్యకలాపాల నిర్వహణ పరమైన అవసరాలను తీర్చడమే కాకుండా క్షేత్ర స్థాయి లోనూ, కేంద్ర కార్యాలయం లోనూ కేడర్ వ్యవస్థను పటిష్ఠపరచడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల అవసరాలు ఏమిటన్నవి సమీక్షిస్తూ, అందుకు తగినట్లుగా ప్రతిస్పందించడానికి మరిన్ని అవకాశాలు అందివస్తాయి. అంతే కాకుండా ప్రస్తుతం ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారుల కెరియర్ అవకాశాలలో నెలకొన్న ప్రతిష్టంభనను తగ్గించి వారి కెరియర్ అవకాశాలను మెరుపరుస్తుంది.
కేడర్ సమీక్ష ప్రతిపాదనను అమలు పరచడంలో భాగంగా ఒక డి జి (పోస్టల్ ఆపరేషన్స్) పోస్టును ఆపెక్స్ స్కేల్ తో ఏర్పాటు చేయడం, అదనపు డి జి (కో-ఆర్డినేషన్) పోస్టును హెచ్ ఎ జి ప్లస్ స్కేల్ తో ఏర్పాటు చేయడం, హెచ్ ఎజి స్థాయిలో ఒక పోస్టు, ఎస్ ఎ జి స్థాయిలో ఐదు పోస్టులు, జె ఎ జి స్థాయిలో నాలుగు పోస్టులను ఏర్పాటు చేయడం, ఇంకా ఎస్ టి ఎస్ నుంచి స్థాయి తగ్గించడం ద్వారా జె టి ఎస్ స్థాయిలో పోస్టులను 84కు పెంచడం, ఎస్ పి ఎస్ పోస్టులను మొత్తంమీద 96కు తగ్గించడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన పదవులను సర్దుబాటు చేయాలన్నదే దీనిలోని ఉద్దేశం. కేడర్ పదవుల సంఖ్యలో మొత్తంమీద ఏ మార్పూ ఉండదు.
పైన పేర్కొన్న కసరత్తును చేపట్టడానికి సిఆర్‌సి సిఫారసులపై ఆర్థిక మంత్రిత్వ శాఖతోను, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ ల శాఖతోను అవసరమైన సంప్రదింపులను ఇప్పటికే పూర్తి చేయడమైంది. ఈ ప్రతిపాదనకు వ్యయ విభాగం తనకు ‘అభ్యంతరం లేద’ని స్పష్టం చేసింది.