‘‘ఇండియా- ఇజ్రాయల్ ఇండస్ట్రియల్ ఆర్ & డి టెక్నలాజికల్ ఇనవేశన్ ఫండ్’’ (I4F)పై ఒక అవగాహన పూర్వక ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు 2017 జులైలో కుదిరింది.
భారతదేశం మరియు ఇజ్రాయల్ లు ప్రతి ఏటా చెరి 4 మిలియన్ యూఎస్ డాలర్లకు సమానమైన మొత్తాన్నిఈ నిధికి – 5 సంవత్సరాల పాటు- అందిస్తాయి. ఈ ఇనవేశన్ ఫండును ప్రతి దేశం నుండి నలుగురు సభ్యులు చొప్పున ఉండే ఒక ఉమ్మడి మండలి నిర్వహిస్తుంది.
శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన రంగాలలో పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి, ఇంకా నవకల్పన సంబంధిత ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఎమ్ఒయు ముఖ్యోద్దేశంగా ఉంది. ఇందుకోసం నవకల్పనతో కూడిన లేదా సాంకేతిక విజ్ఞాన ఆధారితమైన నూతన లేదా మెరుగైన ఉత్పత్తులు, సేవలు లేదా ప్రక్రియల కోసం సంయుక్త పథకాలకు మద్ధతును అందించడం జరుగుతుంది. ఈ కోవకు చెందిన పథకాలు నీరు, వ్యవసాయం, శక్తి మరియు డిజిటల్ టెక్నాలజీల వంటి పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న రంగాలలో తక్కువ వ్యయమయ్యే సాంకేతిక సంబంధ నవకల్పనలకు దారితీయగలవు. భారతదేశం మరియు ఇజ్రాయల్ ల ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు మరియు పరిశోధన- అభివృద్ధి సంస్థలు పాలుపంచుకొనే కన్సార్షియాను ఏర్పాటు చేస్తారు.
సంయుక్త నిధి అండతో సాగే కార్యకలాపాలు రెండు దేశాలలోను సాంకేతిక, ఆర్థిక సమన్వయాన్ని పెంచనున్నాయి. ఇందుకుగాను, సాంకేతిక విజ్ఞాన ఆధారిత నవకల్పనకు పెద్ద పీట వేసే ప్రాజెక్టులు మరియు కొలాబరేషన్ లను సంయుక్తంగా అభివృద్ధి చేస్తారు. ఇటు దేశీయంగాను, అటు గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లోను అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇజ్రాయల్- ఇండియా సంయుక్త పథకాలను ఈ పరిణామం ప్రోత్సహించగలుగుతుంది. ‘‘పరిజ్ఞానాన్ని’’ ‘‘ప్రావీణ్యంగా’’ బదలాయించడం కోసం ఉమ్మడి ప్రాజెక్టులకు ఈ ఎమ్ఒయు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో నవకల్పనకు మరియు ‘స్టార్ట్- అప్ ఇండియా కార్యక్రమాని’కి ఊతం ఇవ్వగలుగుతుందని భావిస్తున్నారు.
***