Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌” నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం – తెలుగు అనువాదం


కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారూ,

టెలికాం పరిశ్రమకు చెందిన నాయకులారా !

ఇతర విశిష్ట ప్రముఖులారా !

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2020 కార్యక్రమం లో మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.  టెలికాం రంగంలో ప్రముఖులైన ప్రతిభావంతులందరూ ఈ సమావేశంలో ఉన్నారు.  ఈ మధ్య కాలంలో కీలక పాత్ర పోషించిన, ఈ రంగంలో భాగస్వాములైన మీరందరూ,  భారతదేశాన్ని మరింత సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తారని భావిస్తున్నాను. 

మిత్రులారా,

రోజురోజుకూ అత్యంత వేగంగా మెరుగవుతున్న అనుసంధానతను మనం  అనుభవిస్తున్నప్పటికీ, అసలైన వృద్ధి వేగం ఇప్పుడే ప్రారంభమైందని కూడా మనకు తెలుసు.  మొట్టమొదటి టెలిఫోన్ కాల్ చేసినప్పటి నుండి, ఈ రోజుకు మనం చాలా అభివృద్ధి సాధించాము.   పది  సంవత్సరాల క్రితం కనీసం మనం ఊహించడానికి కూడా కష్టమైన రీతిలో, ప్రస్తుతం, మొబైల్ విప్లవం మన దేశం, సమాజం, ప్రపంచంపై అలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది. అదేవిధంగా, ప్రస్తుత వ్యవస్థ కూడా ప్రాచీనంగా కనబడే రీతిలో భవిష్యత్తు ఉంటుంది.  ఈ నేపథ్యంలో, రాబోయే సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకుని, మన జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించడం, ప్రణాళికలు రూపొందించుకోవడం చాలా ముఖ్యం.  వీటిలో – మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన విద్య, మన రైతులకు మంచి సమాచారం, అవకాశాలు, చిన్న వ్యాపారాల కోసం మంచి మార్కెట్ అందుబాటు వంటివి మనం సాధించగల కొన్ని లక్ష్యాలు.

మిత్రులారా,

మహమ్మారి ఉన్నప్పటికీ,  మీ ఆవిష్కరణలు, కృషి ఫలితంగా, ప్రపంచం క్రియాత్మకంగా పనిచేస్తోంది.  మీ కృషి ఫలితంగానే,   ప్రయత్నాల వల్లనే ఒక కుమారుడు వేరే నగరంలో ఉన్న తన తల్లితో మాట్లాడగలుగుతున్నాడు;  తరగతి గదిలో లేకుండానే, ఒక విద్యార్థి తన గురువు నుండి విద్యను నేర్చుకున్నాడు;  ఒక రోగి తన ఇంటి నుండే, తన వైద్యుడిని సంప్రదిస్తున్నాడు;  ఒక వర్తకుడు, వేరే ప్రాంతంలో ఉన్న తన వినియోగదారుతో అనుసంధానమవుతున్నాడు. 

మీ కృషి ఫలితంగా నే, మేము కూడా ప్రభుత్వపరంగా,  ఐ.టి, టెలికాం రంగం యొక్క సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోడానికి ప్రయత్నిస్తున్నాము.  భారతీయ ఐటి సేవల పరిశ్రమ నూతన శిఖరాలను అధిరోహించడానికి, కొత్తగా ఇతర సేవలను కూడా అందిస్తున్న సంస్థల మార్గదర్శకాలు సహాయపడతాయి.  మహమ్మారి తొలగిపోయిన చాలా కాలం తరువాత కూడా ఈ రంగం వృద్ధిని ఇది పెంపొందిస్తుంది.  ఐటి సేవల పరిశ్రమను ప్రజాస్వామ్య బద్ధం చేయడానికీ, మన దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లడానికీ, ఈ చర్య సహాయపడుతుంది.

మిత్రులారా,

కేవలం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించిన యాప్ లు దశాబ్దాల నుండి ఉన్న కంపెనీల విలువను అధిగమిస్తున్న యుగంలో ఈ రోజు మనం ఉన్నాము.  ఇది భారతదేశంతో పాటు, మన యువ ఆవిష్కర్తలకు కూడా శుభ పరిణామం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్న అనేక ఉత్పత్తులపై ఈ రోజు మన యువత పనిచేస్తున్నారు.

ఒక కోడ్,  ఒక ఉత్పత్తిని ప్రత్యేకమైనదిగా చేస్తుందని, చాలా మంది యువ టెకీలు, నాకు చెప్తారు.  కొంతమంది పారిశ్రామికవేత్తలు, అది, దాని భావన (కాన్సెప్ట్) ద్వారా వస్తుందని నాకు చెప్తారు.  ఒక ఉత్పత్తిని కొలవడానికి, మూలధనమే ముఖ్యమని, పెట్టుబడిదారులు సూచించారు.  అయితే, తరచుగా, చాలా ముఖ్యమైనది ఏమిటంటే, యువతకు వారి ఉత్పత్తిపై ఉన్న నమ్మకం.  కొన్నిసార్లు ఈ నమ్మకం అనేది కేవలం లాభదాయకమైన తయారీకీ,  వినూత్నమైన తయారీకి మధ్య ఉంటుంది.  అందువల్ల,  నా యువ స్నేహితులకు నా సందేశం ఏమిటంటే, వారి సామర్థ్యంతో పాటు వారి ఉత్పత్తులపై విశ్వాసం కలిగి ఉండాలి.

మిత్రులారా,

ఈ రోజు మన దేశంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ఫోను వినియోగదారులు ఉన్నారు.   ఈ రోజు మన దేశంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు కలిగిన వ్యక్తులు ఉన్నారు.  ఈ రోజు మన దేశంలో 750 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.  ఈ రోజు ఇంటర్నెట్ విస్తరిస్తున్న స్థాయి, వేగాన్ని ఈ క్రింది వాస్తవాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు భారతదేశంలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో సగం మంది గత 4 సంవత్సరాలలోనే చేర్చబడ్డారు. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో సగం మంది మన గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మన డిజిటల్ పరిమాణం, ఆవశ్యకత పరిమితమైనవి, అపూర్వమైనవి. మొత్తం ప్రపంచంలోనే సుంకాలు అతి తక్కువగా ఉన్న దేశం మనది. మొత్తం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ యాప్ మార్కెట్లలో మన దేశం ఒకటి. మన దేశం యొక్క డిజిటల్ సామర్థ్యం అసమానమైనది, బహుశా మానవజాతి చరిత్రలో కూడా ఇది అద్వితీయమైనది.

మొబైల్ సాంకేతికత కారణంగానే మనం బిలియన్ల డాలర్ల విలువైన ప్రయోజనాలను మిలియన్ల కొద్దీ ప్రజలకు అందించగలుగుతున్నాము.  మహమ్మారి సమయంలో, మొబైల్ టెక్నాలజీ కారణంగానే,  పేదలు మరియు బలహీన వర్గాల వారికి  త్వరగా సహాయం చేయగలిగాము.  మొబైల్ సాంకేతికత కారణంగానే క్రమబద్ధమైన, పారదర్శకతను పెంచే బిలియన్ల కొద్దీ నగదు రహిత లావాదేవీలు సాధ్యమయ్యాయి.  మొబైల్ టెక్నాలజీ కారణంగానే మనం ఈరోజున  టోల్ బూత్ ‌ల వద్ద భౌతికంగా ఒకరికొకరు కలవకుండా లావాదేవీలను పూర్తిచేయగలుగుతున్నాము.  మొబైల్ టెక్నాలజీ సహాయంతోనే, మనం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ -19 టీకా పంపిణీ ప్రక్రియలలో ఒక దాన్ని ప్రారంభించబోతున్నాము. 

మిత్రులారా,

భారతదేశంలో మొబైల్ ఫోనుల తయారీలో మనం చాలా విజయాలు సాధించాము.  మొబైల్ ఫోనుల తయారీకి భారతదేశం అత్యంత అనుకూలమైన గమ్యస్థానాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది.  భారతదేశంలో టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహక పథకాన్ని కూడా తీసుకువచ్చాము. టెలికాం పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీకి భారతదేశాన్ని ఒక అంతర్జాతీయ కేంద్రంగా మార్చడానికి మనందరం కలిసి పనిచేద్దాం.

రాబోయే మూడేళ్ళలో ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఫైబర్-ఆప్టిక్ కనెక్టివిటీ ఉండేలా మనం ఒక ప్రణాళికను ప్రారంభిస్తున్నాము. మనం ఇప్పటికే అండమాన్-నికోబార్ ద్వీపాన్ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ‌తో అనుసంధానించాము. అటువంటి కనెక్టివిటీని –  ఆశాజనక జిల్లాలు, వామపక్ష ఉగ్రవాదం ప్రభావిత జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాలు, లక్షద్వీప్ దీవులు వంటి ప్రదేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే కార్యక్రమాలతో మనం ముందుకు సాగుతున్నాము.  స్థిరమైన లైను కలిగిన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీతో పాటు  బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌ ల విస్తరణను నిర్ధారించడానికి మనం ఆసక్తిగా ఉన్నాము.

మిత్రులారా,

సాంకేతిక ఆధునీకరణ కారణంగా, హ్యాండ్ ‌సెట్ ‌లు, ఇతర ఉపకరణాలను తరచూ భర్తీ చేసే సంస్కృతి మనకు ఉంది. ఈ నేపథ్యంలో, ఇటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్వహించడానికీ, మెరుగైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి అనువైన మంచి మార్గాల గురించి ఆలోచించడానికీ, టెలికామ్ పరిశ్రమ ఒక టాస్క్-ఫోర్సు ‌ను ఏర్పాటు చేయగలదా?

మిత్రులారా,

నేను ఇంతకు ముందే చెప్పినట్లు, ఇది ఆరంభం మాత్రమే.  వేగవంతమైన సాంకేతిక పురోగతితో భవిష్యత్తు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో మనం మరింత పురోగతి సాధించడానికీ, మిలియన్ల మంది భారతీయులను శక్తివంతం చేయడానికీ, 5 జి తో సమయానుకూలంగా వ్యవహరించడానికీ, మనం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది.  ఈ సమావేశం అటువంటి అన్ని విషయాల గురించి ఆలోచిస్తుందనీ,  ఇటువంటి క్లిష్టమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తుందనీ, నేను ఆశిస్తున్నాను.

మీ అందరికీ శుభాకాంక్షలు. 

ధన్యవాదములు
 

*****