ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’ యొక్క కాడర్ సమీక్ష కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ప్రతిపాదనలో ఈ కింద పేర్కొన్న ముఖ్య అంశాలు ఉన్నాయి:
(ఎ) డైరెక్టర్ జనరల్ ఆఫ్ టెలికం అనే ప్రధాన పదవి ఏర్పాటు.
(బి) డ్యూటీ పోస్టుల సంఖ్యను 853గా ఖాయం చేయడమైంది.
(సి) ఐటిఎస్ అధికారులను ఇతర విభాగాలకు / సంస్థలకు పంపడం (డెప్యుటేషన్) కోసం 310 పోస్టులతో ఒక డెప్యుటేషన్ రిజర్వ్ ను ఏర్పాటు చేయడమైంది.
(డి) ఐటిఎస్ అధికారులకు బిఎస్ఎన్ఎల్ / ఎమ్ టిఎన్ఎల్ లో పోస్టింగ్ ఇచ్చేందుకు ఒక ప్రత్యేక డిమినిశింగ్ రిజర్వ్ ను ఏర్పాటు చేయడమైంది.
(ఇ) కాడర్ సంఖ్యను ఇప్పటి వర్కింగ్ స్ట్రెంత్ అయిన 1690కి పరిమితం చేయడమైంది.
ఈ ఆమోదం డిఒటి కేంద్ర కార్యాలయంలోను, క్షేత్ర యూనిట్ లలోను విధుల రీత్యా అవసరమైన మేరకు కాడర్ స్వరూపాన్ని బలపరచడానికి తోడ్పడుతుంది. ఇది బిఎస్ఎన్ఎల్ / ఎమ్ టిఎన్ఎల్ లలో నిపుణులైన మానవ శక్తి అవసరాలను తీర్చుతుంది కూడా. ఇది ఐటిఎస్ అధికారుల స్తబ్దతను తగ్గించగలుగుతుంది.
పూర్వ రంగం:
టెలికమ్యూనికేషన్స్ కు సంబంధించిన రంగాలలో ప్రభుత్వ విధానపరమైన, సాంకేతికపరమైన మరియు నిర్వహణ సంబంధమైన విధులను నెరవేర్చడం కోసం 1965లో ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ ‘ఎ’ను ఏర్పాటు చేయడమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఎంపిక అయిన ఐటీఎస్ అధికారులు టెలికమ్యూనికేషన్స్ విభాగం (డిఒటి)లో మేనేజ్ మెంట్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లలోను, డిఒటి కి చెందిన పిఎస్ యు లలో (బిఎస్ఎన్ఎల్ / ఎమ్ టిఎన్ఎల్ / టిసిఐఎల్), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ)లో, టెలికం డిస్ ప్యూట్ సెటిల్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యూనల్ ( టిడిఎస్ఎటి) లో, ఇంకా ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ స్వతంత్ర ప్రతిపత్తి కలిగివున్న సంస్థలలో మరియు రాష్ట్రప్రభుత్వాలలో డెప్యుటేషన్ పైనా పనిచేస్తున్నారు.
ఐటిఎస్ కాడర్ సమీక్షను 28 సంవత్సరాల తరువాత చేపట్టారు. కడపటి సమీక్షను 1988లో జరిపారు. కడపటి కాడర్ రివ్యూ నాటి నుండి, టెలికం సేవల సంబంధ విధులను డిఒటి నుండి విడదీయడమైంది. కానీ టెలికం లైసెన్సింగ్, పర్యవేక్షణ, లైసెన్స్ కండిషన్ ల అమలు, నెట్ వర్క్ సెక్యూరిటీ, ఇంటర్ ఆపరబులిటీ, స్టాండర్డయిజేషన్, లాఫుల్ ఇంటర్ సెప్షన్, ఇంకా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ వంటి నూతన విధులను జత చేశారు. అదనంగా, ఇంతకు ముందు ఆపరేషన్స్ లో ఎంబెడెడ్ అయిన పలు ఇతర కార్యకలాపాలు రాశిపరంగా పెచ్చరిల్లాయి. డిజిటల్ సమాజానికి పటిష్టమైన టెలికం మౌలిక సదుపాయాలు వెన్నెముకగా నిలుస్తాయి. ఈ రంగంలో రూపావళీ సంబంధ మార్పులు చోటు చేసుకొంటున్నాయి. దీనితో నియంత్రణ, అదుపు మరియు భద్రత లు తెర మీదకు వచ్చాయి. ఫలితంగా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ఉన్నత స్థాయి సాంకేతిక పర్యవేక్షణ అవసరమైంది. అందుకని, ఐటిఎస్ అధికారుల శ్రేణికి ఒక స్వరూపాన్ని ప్రతిపాదించారు. టెలికమ్యూనికేషన్స్ విభాగం పాత్ర, కర్తవ్యాల నిర్వహణకు ఇది అత్యవసరంగా పరిగణించారు. పైపెచ్చు, బిఎస్ఎన్ఎల్ మరియు ఎమ్ టిఎన్ఎల్ ల పునరుద్ధరణలో ఐటిఎస్ అధికారుల పాత్రను కూడా దృష్టిలో పెట్టుకోవడమైంది.
ఈ వాస్తవాలకు తోడు, సర్వీసుకు చెందిన వివిధ గ్రేడులలో ఏర్పడిన స్తబ్దత ఐటిఎస్ స్వరూపాన్ని సమీక్షించవలసిన అవసరానికి దారితీసింది.
కాడర్ సంఖ్యను ఇప్పటి కాడర్ వర్కింగ్ స్ట్రెంత్ కు పరిమితం చేయడమైనది. కాడర్ రివ్యూ పర్యవసానంగా ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదు.