Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్రధానితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జారీచేసిన పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

ఆస్ట్రేలియా ప్రధానితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జారీచేసిన పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం


గౌరవ ప్రధానమంత్రి గారికి,

ఇరు దేశాల ప్రతినిధులకు,

మీడియా మిత్రులకు,

నమస్కారం!

భారతదేశానికి మొదటిసారిగా అధికార పర్యటన మీద వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి నా హృదయ పూర్వక స్వాగతం. రెండు దేశాల ప్రధాన మంత్రుల స్థాయిలో వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరపాలని నిరుడు రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాని అల్బనీస్ సందర్శన మొదటిది. హోలీ రోజే ఆయన భారత దేశానికి వచ్చారు. ఆ తరువాత కొంత సేపు మేం క్రికెట్ మైదానంలో గడిపాం. ఈ రంగుల పండుగ వేడుకలు, సంస్కృతి, క్రికెట్ ఒక విధంగా ఇరు దేశాల ఉత్సాహానికీ, స్ఫూర్తికీ సరైన చిహ్నం.

మిత్రులారా,

పరస్పర సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను ఈరోజు వివరంగా చర్చించాం. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భద్రతా రంగ సహకారం ఒక ముఖ్యమైన స్తంభం లాంటిది. ఈరోజు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీరప్రాంత రక్షణ మీద, పెరుగుతున్న పరస్పర రక్షణరంగా, భద్రతారంగా సహకారం మీద సవివరంగా చర్చించాం. రక్షణ రంగంలో గడిచిన కొన్ని సంవత్సరాలలో అనేక కీలకమైన ఒప్పందాలు చేసుకున్నాం. అందులో ఇరుదేశాల సాయుధ దళాల రవాణా సహకారం కూడా ఇమిడి ఉంది. మన భద్రతా సంస్థల మధ్య క్రమంతప్పకుండా ఉపయోగకరమైన సమాచార మార్పిడి జరుగుతూ ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసే విషయం కూడా చర్చించాం. మీ యువ సైనికులతో స్నేహం పెంచటానికి ఈ నెలలోనే మొదలైన జనరల్ రావత్ ఆఫీసర్స్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం.

మిత్రులారా,

ఈ రోజు విశ్వసనీయమైన అత్యాధునిక అంతర్జాతీయ సప్లయ్ చెయిన్ ను అభివృద్ధి చేయటానికి అవసరమైన పరస్పర సహకారం మీద చర్చించాం. పునరుత్పాదక ఇంధనం అందులో ప్రధానమైన అంశం. అందుకే రెండు దేశాలూ దానిమీద దృష్టి సారించాయి. హైడ్రోజెన్, సౌర ఇంధనాలమీద రెండు దేశాలూ కలసి పనిచేస్తున్నాయి. నిరుడు అమలు చేసిన వర్తక ఒప్పందం వలన రెండు దేశాల మధ్య వర్తక, పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగాయి. మన బృందాలు కూడా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం మీద మన బృందాలు పనిచేస్తున్నాయి.

మిత్రులారా,

భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలలో ప్రజలకూ, ప్రజలకూ మధ్య ఉన్న బంధం ముఖ్యమైన స్తంభం. విద్యార్హతలలో పరస్పర గుర్తింపుకోసం ఒక ఒప్పందం మీద సంతకాలు చేసుకున్నాం. అది మన విద్యార్థి లోకానికి ఎంతో ఉపయోగకరం. మొబిలిటీ ఒప్పందం మీద కూడా మనం ముందడుగు వేస్తున్నాం. అది విద్యార్థులకు, కార్మికులకు, వృత్తి నిపుణులకు ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు ఆస్ట్రేలియాలో భారతీయులే రెండో అతిపెద్ద వలస ప్రజానీకం. ఆస్ట్రేలియా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో ఈ భారతీయులే చెప్పుకోదగిన పాత్ర పోషిస్తున్నారు. గడిచిన కొన్ని వారాలలో ఆస్ట్రేలియాలో ఆలయాల మీద అదే పనిగా దాడులు జరగటం విచారించదగ్గ విషయం. సహజంగానే అలాంటి వార్తలు భారతదేశ ప్రజలను కలవరపరుస్తున్నాయి. మా ప్రజల మనోభావాలను ఇలా నేను అల్బనీస్ తో పంచుకుంటున్నాను. అయితే, భారతీయుల భద్రతే తమకు ప్రత్యేక ప్రాధాన్యమని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో మన బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఉంటాయి. సాధ్యమైనంత సహకారం అందిస్తూ ఉంటాయి.

మిత్రులారా,

అంతర్జాతీయ సవాళ్ళను పరిష్కరించటానికి, ప్రపంచ సంక్షేమానికి మన ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యమని నేనూ, ప్రధాని అల్బనీస్ ఒప్పుకున్నాం. అధ్యక్ష హోదాలో భారతదేశపు జి-20 ప్రాధాన్యాలు, ప్రధాని అల్బనీస్ కు వివరించా. ఆస్ట్రేలియా యిస్తున్న మద్దతుకు నా ధన్యవాదాలు తెలియజేశా. ఈ ఏడాది మే నెలలో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్రసదస్సుకు ఆహ్వానించినందుకు ప్రధాని అల్బనీస్ కు కృతజ్ఞతలు తెలియజేశా. ఆ తరువాత సెప్టెంబర్ లో జరిగే జి-20 సదస్సు లో ప్రధాని అల్బనీస్ కు స్వాగతం పలికే అవకాశం నాకు లభిస్తుందనే విషయం ఆనందదాయకం. మరోసారి ప్రధాని అల్బనీస్ కు భారతదేశం తరఫున స్వాగతం పలుకుతున్నా. ఈ పర్యటన వలన మన సంబంధాలు మరింత పురోగమిస్తాయని ఆశిస్తున్నా.

ధన్యవాదాలు.

గమనిక: ప్రధాని ప్రసంగానికి ఇది దగ్గరి అనువాదం. అసలు ప్రసంగం హిందీలో ఉంది.