Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్థిక సహకార విస్తరణపై జపాన్ ప్రతినిధి బృందం కీజై డోయుకైతో ప్రధానమంత్రి సమావేశం


భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతినిధి బృందం కీజై డోయుకై (జపాన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ సంఘం)తో ఢిల్లీలోని లోక కళ్యాణ మార్గ్, 7 లో ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 20 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి కీజై డోయుకై అధ్యక్షుడు శ్రీ తకేసి నినామి నాయకత్వం వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అంశంలో వారి ఆలోచనలను ప్రధానమంత్రి విన్నారు.

వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, అంతరిక్షం, రక్షణ, బీమా, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పౌర విమానయానం, హరిత ఇంధనం, ఎంఎస్ఎమ్ఈ భాగస్వామ్యం తదితర కీలక రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలను విస్తరించడం, సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.

భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం గురించి ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో భారత్ అంకిత భావాన్ని స్పష్టం చేశారు. భారత్‌లో జపనీయుల పెట్టుబడులను వేగవంతం, సులభతరం చేయడానికి అభివృద్ధి చేసిన జపాన్ ప్లస్ గురించి ప్రధాని వివరించారు. పెట్టుబడిదారులకు ఎలాంటి అస్పష్టత, సంకోచం ఉండకూడదని ప్రధానమంత్రి అన్నారు. విధానాల ఆధారంగా భారత్‌లో పాలన సాగుతుందని, పారదర్శకమైన, ఊహించదగిన వాతావరణాని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు

దేశంలో విమానయాన రంగంలో ఉన్న విస్తృతమైన వృద్ధి అవకాశాల గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, రవాణా సామర్ధ్యాల విస్తరణతో సహా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా భారత్ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

విస్తృతమైన వైవిధ్యం కలిగి ఉన్న భారత్ ఏఐ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. ఈ రంగంలో సహకార ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. భారత్‌తో కలసి పనిచేయాల్సిందిగా ఇప్పటికే ఏఐలో రాణిస్తున్నవారిని ప్రోత్సహించారు.

జీవఇంధనాలపై ప్రధాన దృష్టి సారించి ప్రారంభించిన పథకం ద్వారా హరిత ఇంధన రంగంలోనూ భారత్ గణనీయమైన ప్రగతి కనబరుస్తోందని ప్రధానమంత్రి అన్నారు. విలువ జోడించిన ఈ జీవ ఇంధనాల నుంచి ప్రధానంగా వ్యవసాయ రంగం ప్రయోజనం పొందుతోందని వివరించారు.

బీమా రంగంతో పాటు అంతరిక్షం, అణు శక్తి లాంటి అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న అవకాశాల గురించి ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కీజై డోయుకై ప్రతినిధి బృందంలోని వ్యాపార దిగ్గజాలు భారత్‌ కోసం సిద్ధం చేసిన తమ వ్యాపార ప్రణాళికలను పంచుకొన్నారు. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధిలో భారత్-జపాన్ మధ్య పరస్పర ప్రయోజనకరమైన అంశాలను ఉపయోగించుకోవడంలో వారు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తు భాగస్వామ్యాల పట్ల రెండు వైపులా ఆశాభావం వ్యక్తమయింది. అలాగే రానున్న సంవత్సరాల్లో వ్యాపార, పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు ఇరుపక్షాలు ఎదురు చూస్తున్నాయి.

ప్రధాని మోదీ హయాంలో భారత్, జపాన్ మధ్య వృద్ధి చెందుతున్న సంబంధాలను షంటోరి హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రతినిధి, అధ్యక్షుడు, సీఈవో నినామి తకేషి ప్రశంసించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ కు అపారమైన అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత అయిన ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత దేశంలో పెట్టుబడులు పెట్టే అంశంలో తన లక్ష్యాలు, అంచనాలను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా వివరించారని ఎన్ఈసీ కార్పొరేషన్ కార్పొరేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రభుత్వ వ్యవహారాల  ప్రధానాధికారి తనక హిగేహీరో వ్యాఖ్యానించారు.

వికసిత భారత్ – 2047 లక్ష్యానికి అర్థవంతమైన, పరస్పరం ప్రయోజనం కలిగించే విధంగా
వ్యాపార సహకారం అందించడంలో జపాన్ నిబద్ధతను ఈ సమావేశం తెలియజేస్తుంది.

***