ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా ఈ నూతన కేంద్ర ప్రభుత్వం పథకం సహకారం అందిస్తుంది. జాతీయ విద్యా విధానం-2020 నుంచి ఆవిర్భవించిన మరో ముఖ్యమైన కార్యక్రమమే ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఈ పథకం అందిస్తుంది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉన్నత విద్యా సంస్థ (క్యూహెచ్ఐఈలు)ల్లో ప్రవేశం సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు, కోర్సుకు సంబంధించిన ఇతర ఖర్చులకు అయ్యే పూర్తి మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి హామీ రహిత రుణం పొందేందుకు అర్హులు. సరళమైన, పారదర్శకమైన పూర్తి స్థాయి డిజిటల్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో– మొత్తంగా, విభాగాల వారీగా, డొమైన్ల వారీగా 100 లోపు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు పొందిన విద్యాసంస్థలూ, 101-200 వరకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలూ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులూ– ఈ పథకానికి అర్హులు. ప్రతి ఏటా విడుదలయ్యే తాజా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ఆధారంగా ఈ జాబితా మారుతూ ఉంటుంది. ఈ ఏడాది అర్హత గల 860 క్యూహెచ్ఈఐల్లో ఈ పథకం ప్రారంభమవుతుంది. 22 లక్షల కంటే ఎక్కువ మంది రుణం అవసరమైన విద్యార్థులు పీఎం–విద్యాలక్ష్మి ప్రయోజనాలను పొందగలుగుతారు.
ప్రతి విద్యార్థికి రూ. 7.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ మొత్తంలో 75 శాతం క్రెడిట్ గ్యారెంటీ లభిస్తుంది. ఇది ఈ పథకం ద్వారా విద్యార్థులకు రుణాలు అందించేలా బ్యాంకులకు తోడ్పాటు అందిస్తుంది.
దీనికి అదనంగా, కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండి, ఇతర ప్రభుత్వ ఉపకార వేతనాలు, వడ్డీ రాయితీ పథకాలు పొందేందుకు అర్హత లేని వారికి, మారటోరియం కాల వ్యవధిలో 10 లక్షల వరకు ఉన్న రుణానికి 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ప్రతి ఏటా లక్ష మందికి ఈ వడ్డీ రాయితీ అందిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన వారికి ప్రాధాన్యమిస్తారు. 2024-25 నుంచి 2030-31 వరకు రూ.3,600 కోట్లు కేటాయింపుల ద్వారా 7 లక్షల మంది కొత్త విద్యార్థులకు ఈ వడ్డీ రాయితీ ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా.
సరళమైన విధానంలో అన్ని బ్యాంకులు ఉపయోగించేలా ఉన్నత విద్యా శాఖ రూపొందించిన ‘పీఎం–విద్యాలక్ష్మి’ ఏకీకృత పోర్టల్ ద్వారా విద్యారుణాలు, వడ్డీ రాయితీలకు దరఖాస్తు చేసుకోవాలి. వడ్డీ రాయితీ చెల్లింపులు– ఈ–ఓచర్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వాలెట్ల ద్వారా చేస్తారు.
దేశంలోని యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంతో పాటు విద్య, ఆర్థిక రంగాల్లో గత దశాబ్దంలో భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పరిధిని ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం మరింత విస్తరిస్తుంది. ఇది ఉన్నత విద్యా విభాగం అమలు చేస్తున్న పీఎం–యూఎస్పీలో అంతర్భాగమైన కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ (సీఎస్ఐఎస్), విద్యా రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ (సీజీఎఫ్ఎస్ఈఎల్) పథకాలకు అనుబంధ పథకంగా పనిచేస్తుంది. కుటుంబ వార్షికాదాయం 4.5 లక్షల వరకు ఉండి గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు పీఎం–యూఎస్‌పీ, సీఎస్ఐఎస్ ద్వారా రూ.10 లక్షల వరకు ఉన్న విద్యారుణాలకు మారటోరియం కాల వ్యవధిలో పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది. తద్వారా పీఎం విద్యాలక్ష్మి, పీఎం – యూఎస్‌పీ సంయుక్తంగా అర్హులైన విద్యార్థులందరికీ నాణ్యతా ప్రమాణాలు పాటించే, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని అందిస్తాయి.
***
A big boost to making education more accessible.
— Narendra Modi (@narendramodi) November 6, 2024
The Cabinet has approved the PM-Vidyalaxmi scheme to support youngsters with quality education. It is a significant step towards empowering the Yuva Shakti and building a brighter future for our nation. https://t.co/8DpWWktAeG