ఆరోగ్య రంగం లో సహకారం అంశం పై భారతదేశ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ విభాగం (డిఒఎచ్ ఎఫ్ డబ్ల్యు)కు మరియు బిల్ ఎండ్ మిలిండా గేట్స్ ఫౌండేశన్ (బిఎమ్ జిఎఫ్) ల మధ్య కుదిరినటువంటి సహకారపూర్వక ఒప్పందాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్-ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ ఒప్పందం పై బిఎమ్ జిఎఫ్ కో చైర్ మరియు ట్రస్టీ శ్రీ బిల్ గేట్స్ 2019వ సంవత్సరం నవంబరు నెల లో ఢిల్లీ ని సందర్శించిన సందర్భం లో సంతకాలు అయ్యాయి.
ఈ దిగువ న పేర్కొన్న రంగాల లో సహకారం ఈ సహకారపూర్వక ఒప్పందం పరిధి లోకి వస్తుంది:-
ఎ) తల్లులు, అప్పుడే పుట్టినటువంటి శిశువులు మరియు పిల్లల మరణాల రేటు ను తగ్గించడం, పోషణ సంబంధిత సేవల ను మెరుగుపరచడం కోసం టీకాలు వేయించడం, పౌష్టికాహార సేవల ను సమకూర్చడం మరియు అత్యవసర ప్రాథమిక స్వస్థత యొక్క నాణ్యత ను, వ్యాప్తి ని, పరిధి ని విస్తరించడం;
బి) కుటుంబ నియంత్రణ పద్ధతులలో నాణ్యత ను మరియు ఎంపిక ల విస్తృతి ని పెంచడం, ప్రత్యేకించి యువ మహిళల కు మార్పు సులభంగా సాధ్యపడే పద్ధతుల లభ్యత ను పెంచడం;
సి) టిబి, విఎల్, ఎల్ఎఫ్ ల వంటి ఎంపిక చేసిన సాంక్రామిక వ్యాధుల యొక్క భారాన్ని తగ్గించడం;
డి) బడ్జెటు తో పాటు ఆరోగ్య రంగ సిబ్బంది యొక్క నైపుణ్యాల ను వినియోగించుకోవడం, వారి యొక్క మేనేజ్ మెంట్, డిజిటల్ హెల్థ్, సప్లై చైన్ ల ను మరియు పర్యవేక్షక వ్యవస్థ లను శక్తివంతం చేయడం వంటి పార్శ్వాలు సహా ఆరోగ్య వ్యవస్థల ను పటిష్టపరచడం.
సహకారం యొక్క వివరాల ను మరింత గా విస్తృతం చేయటానికి, అలాగే ఈ సహకారపూర్వక ఒప్పంద పత్రం యొక్క అమలు తీరు ను పర్యవేక్షించటానికి ఒక ప్రోగ్రాం యాక్శన్ కమిటి (పిఎసి)ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.