స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు అయినటువంటి రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఎఎన్), జనసంఖ్య స్థిరత కోశ్ (జెఎస్ కె) లను మూసివేసి, అవి నిర్వహిస్తున్న బాధ్యతలను ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ విభాగానికి (డిఒహెచ్ ఎఫ్ డబ్ల్యు కు) బదిలీ చేయాలన్న ప్రతిపాదనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల హేతుబద్ధీకరణ వ్యవహారం భిన్న మంత్రిత్వ శాఖలతో చర్చలు, ప్రస్తుతం అమలులో ఉన్న ఉప నిబంధనల సమీక్షతో ముడిపడి ఉంది. ప్రత్యేకంగా గుర్తించిన కొన్న కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు వైద్య ఖర్చుల కోసం సహాయం అందించడానికి పని చేస్తున్న రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఎఎన్) కు ఏడాది గడువు ఉంటుంది. ఈ నిధి నుండి కొంత సొమ్ము ను ఆయా ఆస్పత్రుల మెడికల్ సూపరింటెండెంట్ ల చేతిలో ఉంచుతారు. వారు కేసుల వారీగా పరిశీలించి ఆయా రోగులకు వైద్య సహాయం మంజూరు చేస్తారు. ఈ బాధ్యతలన్నీ డిఒహెచ్ ఎఫ్ డబ్ల్యు చేతికి వస్తాయి. సొసైటీల నమోదు చట్టం, 1860 (ఎస్ఆర్ఎ) నిబంధనల మేరకు సర్వ స్వతంత్ర సంస్థను రద్దు చేయడం కోసం ఆర్ ఎఎన్ యొక్క మేనేజింగ్ కమిటీ సమావేశమవుతుంది. దీనికి తోడు, ఆరోగ్య మంత్రి యొక్క కేన్సర్ రోగుల నిధి (హెచ్ఎమ్ సిపిఎఫ్) కూడా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ విభాగానికే బదిలీ అవుతుంది. ఇందుకు కూడా ఏడాది గడువు ఉంటుంది.
జనాభా స్థిరీకరణ వ్యూహాల విషయంలో చైతన్యం కల్పించడం లక్ష్యంగా జనసంఖ్య స్థిరత కోశ్ (జెఎస్‌కె) 2003 సంవత్సరంలో 100 కోట్ల రూపాయల ప్రారంభ నిధితో ఏర్పాటయింది. తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో భాగంగా జెఎస్‌కె పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. అయితే ఈ విభాగానికి మంత్రిత్వ శాఖ నుండి నిరంతర నిధుల కేటాయింపు ఉండడంలేదు. ఇందుకు కార్పొరేట్, ప్రైవేట్ నిధుల రాక కూడా కీలకం. జనాభా స్థిరీకరణ ప్రయత్నాలలో జెఎస్‌కె భవిష్యత్తులో కూడా కీలక పాత్ర పోషించే ఆస్కారం ఉన్నప్పటికీ సర్వస్వతంత్ర సంస్థగా అది ప్రత్యేక హోదాలో పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఒక స్వతంత్ర సంస్థగా దానిని మూసివేసి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోని ఒక నిధిగా మార్చుతారు.
పూర్వరంగం:
సొసైటీల నమోదు చట్టం, 1860 (ఎస్ఆర్ఎ) లో భాగంగా కింద ఏర్పాటైన ఆరోగ్యం మరియు, కుటుంబ సంక్షేమ విభాగం నిర్వహణలోని 19 సర్వ స్వతంత్ర సంస్థల పనితీరు, కార్యకలాపాల గురించి వ్యయ నిర్వహణ సంఘం సిఫారసుల ఆధారంగా నీతి ఆయోగ్ సమీక్షించింది. వాటి హేతుబద్ధీకరణకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల కమిటీ అందించిన సిఫారసులతో మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆయా సంస్థలు నిర్వహిస్తున్న విధులు, అవి సాధిస్తున్న ఫలితాలు, సమర్థనీయత, ఆవశ్యకత, వినియోగ విలువ, మానవ వనరుల వినియోగం, ఏకీభావం, పరిపాలన ల వంటి అన్ని విభాగాలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల వ్యవహార శైలిని సమీక్షించి హేతుబద్ధీకరించడం ప్రభుత్వ లక్ష్యం. ఆర్ఎఎన్ ను, జెఎస్‌కె ను మూసివేసి వాటి విధులన్నింటినీ ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.
***