Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు (ఎఎఫ్ డిబి) వార్షిక సమావేశం ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు (ఎఎఫ్ డిబి) వార్షిక సమావేశం ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు (ఎఎఫ్ డిబి) వార్షిక సమావేశం ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం


శ్రేష్ఠులైన బెనిన్ మరియు సెనెగాల్ ప్రెసిడెంట్ లు, శ్రేష్ఠుడైన కోటే డి’ఐవరీ వైస్ ప్రెసిడెంట్,

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ ప్రెసిడెంట్,

ఆఫ్రికన్ యూనియన్ సెక్రటరీ- జనరల్,

ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ కమిషనర్,

నా మంత్రివర్గ సహచరుడు శ్రీ అరుణ్ జైట్లీ,

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ,

ఆఫ్రికా నుండి విచ్చేసిన గౌరవనీయ అతిథులు, సోదర, సోదరీమణులు,

సోదర, సోదరీమణులారా!

మనం ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో సమావేశమయ్యాము. వ్యాపారమంటే గుజరాతీలకు ఉన్న మక్కువ సుపరిచితమైందే. గుజరాతీలకు ఆఫ్రికా అన్నా కూడా చాలా ప్రేమ. ఈ సమావేశం భారతదేశంలో, మరీ ముఖ్యంగా గుజరాత్ లో జరుగుతున్నందుకు- ఒక భారతీయుడిగాను, ఒక గుజరాతీగాను నేను చాలా సంతోషిస్తున్నాను.

భారతదేశానికి ఆఫ్రికాతో శతాబ్దాల తరబడి పటిష్టమైన బంధాలు ఉన్నాయి. చారిత్రకంగా- తూర్పు భారతదేశం నుండి ముఖ్యంగా గుజరాత్ నుండి ఆఫ్రికా తూర్పు తీరానికీ, అలాగే ఆఫ్రికా తూర్పు తీరం నుండి తూర్పు భారతదేశానికి ముఖ్యంగా గుజరాత్ కు సముదాయాలు వచ్చి స్థిరపడ్డాయి. భారతదేశంలో ఉన్న సిద్దీలు తూర్పు ఆఫ్రికా నుండి వచ్చినట్లు చెబుతారు. కెన్యా కోస్తా తీరంలో ఉన్న బోహ్రా సముదాయాలు 12వ శతాబ్దానికి చెందిన వారు. మలింది కి చెందిన గుజరాతీ నావికుడి సహాయంతో వాస్కో డ గామా కాలికట్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ కు చెందిన దౌస్ లు రెండు వైపులా వ్యాపారం చేశారు. సమాజాల మధ్య ప్రాచీన సంబంధాలు కూడా మన సంస్కృతులను సుసంపన్నం చేశాయి. గొప్పదైన స్వాహిలి భాషలో చాలా హిందీ పదాలు ఉన్నాయి.

వలసల కాలంలో, అతి పెద్ద మొంబాసా ఉగాండా రైల్వే నిర్మాణం కోసం 32 వేల మంది భారతీయులు కెన్యా కు వచ్చారు. ఆ నిర్మాణంలోనే చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఆరు వేల మంది అక్కడే ఉండిపోయి తమ కుటుంబాలను కూడా తెచ్చుకున్నారు. అందులో చాలా మంది “దుకాస్” అనే వ్యాపారం ప్రారంభించారు. అందుకే వారు ” దుక్కావాలాలు” అని పేరు పొందారు. ఆ వలస కాలంలోనే వ్యాపారులు, వృత్తి కళాకారులు, ఆ తరువాత అధికారులు, ఉపాధ్యాయులు, వైద్యులు ఇతర వృత్తుల వారు తూర్పు, పశ్చిమ ఆఫ్రికా లకు వెళ్లి, భారత, ఆఫ్రికా ప్రజల సముదాయంతో ఒక శక్తివంతమైన సముదాయాలుగా రూపొందారు.

మరో గుజరాతీ అయిన మహాత్మ గాంధీ గారు దక్షిణ ఆఫ్రికా లోనే అహింసా పోరాటం అనే ఆయుధానికి పదును పెట్టారు. గోపాల కృష్ణ గోఖలే గారితో కలిసి 1912 లో ఆయన టాంజానియా ను సందర్శించారు. ఆఫ్రికా స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్న నాయకులతో పాటు శ్రీ న్యెరేరే, శ్రీ కెన్యట్టా, శ్రీ నెల్సన్ మండేలా లతో సహా భారత సంతతికి చెందిన పలువురు నాయకులు గట్టిగా మద్దతు పలికారు. వారితో పాటు పోరాటం సల్పారు. స్వాతంత్ర్య పోరాటం అనంతరం భారత సంతతికి చెందిన పలువురు నాయకులు టాంజానియా మరియు దక్షిణ ఆఫ్రికా మంత్రివర్గాల్లో నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన కనీసం ఆరుగురు టాంజానియన్లు ఇప్పుడు టాంజానియా పార్లమెంటులో సభ్యులుగా సేవలందిస్తున్నారు.

తూర్పు ఆఫ్రికాలో కార్మిక సంఘ ఉద్యమం మఖన్ సింగ్ తో ప్రారంభమైంది. కార్మిక సంఘ సమావేశాల సమయంలోనే కెన్యా స్వాతంత్ర్య పోరాటానికి మొదటి పిలుపు ప్రారంభమైంది. కెన్యా స్వాతంత్ర్య పోరాటంలో ఎమ్. ఎ. దేశాయ్ మరియు పియో గామా పింటో లు చాలా చురుకుగా పాల్గొన్నారు. శ్రీ కెన్యట్టా రక్షణ బృందం లో భాగంగా ఉండేందుకు అప్పటి ప్రధాన మంత్రి పండిత్ నెహ్రూ గారు ఒక భారతీయ పార్లమెంట్ సభ్యుడు దివాన్ శ్రీ చమన్ లాల్ ను పంపారు. 1953 లో కాపెంగురియా విచారణ సమయంలో దివాన్ శ్రీ చమన్ లాల్ అరెస్టయి విచారణను ఎదుర్కుంటున్నారు. భారత సంతతికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను రక్షణ బృందంలో చేర్చుకున్నారు. ఆఫ్రికా స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతును ప్రకటించింది. శ్రీ నెల్సన్ మండేలా ఇలా చెప్పారు.. ‘‘మిగిలిన ప్రపంచమంతా చూస్తూ ఉండగా లేదా అణచివేతదారులకు సహాయపడుతూ ఉండగా భారతదేశం మా వెన్నంటి ఉండేది. అంతర్జాతీయ మండలుల ద్వారాలు మన కోసం మూసివున్న సమయంలో భారతదేశం దారిచూపింది. మా యుద్దాలన్నింటినీ మీరు చేపట్టారు. అవి కూడా మీ స్వంత సమస్యలు గా భావించారు.’’

దశాబ్దాలుగా మన సంబంధాలు బలోపేతమౌతున్నాయి. 2014 లో నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత భారతదేశ విదేశీ విధానానికి, ఆర్ధిక విధానానికి ఆఫ్రికాను ఒక అత్యంత ప్రాధాన్యం గల దేశంగా చేశాను. 2015 సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ఏడాదిలో తృతీయ భారత ఆఫ్రికా సదస్సు జరిగింది. భారతదేశంతో దౌత్య సంబంధాలు కలిగిన మొత్తం 54 దేశాలూ ఆ సదస్సుకు హాజరయ్యాయి. రికార్డు స్థాయిలో 41 ఆఫ్రికా దేశాలకు చెందిన దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతలు ఆ సదస్సులో పాల్గొన్నారు. 2015 నుండి ఇంతవరకు నేను ఆరు ఆఫ్రికా దేశాలను.. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, తాంజానియా, కెన్యా, మారిషస్, సెషేల్స్.. ను సందర్శించాను. మా రాష్ట్రపతి మూడు దేశాలను.. నమీబియా, ఘనా, ఐవరీ కోస్ట్.. ను సందర్శించారు. ఉప రాష్ట్రపతి ఏడు దేశాలను.. మొరాకో, ట్యునీషియా, నైజీరియా, మాలి, అల్జీరియా, రవాండా, ఉగాండా..ను సందర్శించారు. గత మూడేళ్ళలో ఏ భారతీయ మంత్రి కూడా సందర్శించని ఆఫ్రికా దేశం ఒక్కటి కూడా లేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.

మిత్రులారా, ఒకప్పుడు మొంబాసా, ముంబయి ల మధ్య మాత్రమే ప్రధానంగా వర్తక సంబంధ, సముద్ర సంబంధ లావాదేవీలు ఉండేవి. కానీ, ఇప్పుడు

* అబిద్ జాన్ మరియు అహమదాబాద్ లను ఈ వార్షిక సమావేశం అనుసంధానపరుస్తున్నది.

* బమాకో మరియు బెంగుళూరు ల మధ్య సంబంధాలను వ్యాపారం కలుపుతోంది.

* చెన్నై, కేప్ టౌన్ లకు మధ్య సంబంధాలను క్రికెట్ కలుపుతోంది.

* ఢిల్లీ, డాకర్ లకు మధ్య సంబంధాలను అభివృద్ధి కలుపుతోంది.

ఇది నన్ను మన అభివృద్ధి సహకారం దిశగా తీసుకువస్తోంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యమనేది ఆఫ్రికా దేశాల అవసరాలకు ప్రతిస్పందించే సహకార నమూనా పైన ఆధారపడి ఉంది. ఇది మన డిమాండ్లకు అనుగుణంగాను, ఎటువంటి షరతులు లేకుండాను కొనసాగుతోంది.

ఈ సహకారంలో ఒక భాగంగా, భారతదేశం ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా లైన్ ఆఫ్ క్రెడిట్ ను సమకూర్చుతోంది. 44 దేశాలకు సుమారు 8 బిలియన్ డాలర్ల మేర 152 క్రెడిట్ లను అందజేయడమైంది.

ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ మూడవ శిఖరాగ్ర సభ జరిగిన సందర్భంలో రానున్న అయిదు సంవత్సరాల కాలంలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారతదేశం 10 బిలియన్ డాలర్లు ఇవ్వజూపింది. 600 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని కూడా మేము ఇవ్వజూపాము.

ఆఫ్రికాతో తనకు గల విద్యా, సాంకేతిక సంబంధాలకు భారతదేశం చాలా గర్విస్తోంది. ఆఫ్రికా లోని 13మంది ప్రస్తుత లేదా పూర్వ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు మరియు వైస్ ప్రెసిడెంట్ లు భారతదేశంలోని విద్యా సంస్థలను మరియు శిక్షణా సంస్థలను సందర్శించారు. ఆఫ్రికాలోని ఆరుగురు ప్రస్తుత లేదా మాజీ సైనికదళాల అధిపతులు భారతదేశంలోని సైనిక సంస్థలలో శిక్షణ పొందారు. ఇద్దరు ప్రస్తుత ఇంటీరియర్ మంత్రులు భారతీయ సంస్థలకు హాజరయ్యారు. చక్కటి ఆదరణను పొందిన ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా 2007 నుండి ఆఫ్రికా దేశాల అధికారులకు దాదాపు 33 వేలకు పైగా ఉపకార వేతనాలను ఇవ్వజూపడమైంది.

నైపుణ్యాభివృద్ధి రంగంలో మన అత్యుత్తమ భాగస్వామ్య కార్యక్రమాలలో ఒకటి ‘‘సౌర మామాస్’’ శిక్షణ కార్యక్రమం. సౌర ఫలకాలు, సర్క్యూట్స్ పై పనిచేయడానికి ప్రతి ఏటా 80 మంది ఆఫ్రికా మహిళలు భారతదేశం లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ అనంతరం వారు తిరిగి వెళ్లి తమ తమ సముదాయాలను అక్షరాలా విద్యుదీకరిస్తున్నారు. తిరిగి వెళ్లిన అనంతరం తమ సముదాయంలోని 50 గృహాలను విద్యుదీకరించడం ప్రతి మహిళ బాధ్యత. దీనికి ఎంపికయ్యే మహిళ తప్పనిసరిగా నిరక్షరాస్యురాలు గాని లేదా పాక్షిక అక్షరాస్యతను సాధించిన వ్యక్తి అయి గాని ఉండాలనేది ఒక షరతు. వారు బస చేసే సమయంలో వారు బుట్టలు తయారుచేయడం, తేనెటీగల పెంపకం, పెరటి తోటల పెంపకం వంటి పలు ఇతర నైపుణ్యాలలో కూడా శిక్షణ పొందుతారు.

48 ఆఫ్రికా దేశాలను కలుపుతూ టెలి-మెడిసిన్, టెలి-నెట్ వర్క్ ల కోసం చేపట్టిన పాన్ ఆఫ్రికా ఇ-నెట్ వర్క్ ప్రాజెక్టు ను మేము విజయవంతంగా పూర్తి చేశాము. భారతదేశంలోని ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాలు సర్టిఫికెట్, అండర్ సర్టిఫికెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 12 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కన్సల్టేషన్ లను, నిరంతర వైద్య విద్య లను అందిస్తున్నాయి. దాదాపు 7 వేల మంది విద్యార్ధులు వారి చదువు పూర్తిచేశారు. తదుపరి దశను త్వరలో మేము ప్రారంభించనున్నాము.

ఆఫ్రికా దేశాల కోసం చేపట్టిన పత్తి సాంకేతిక సహాయ కార్యక్రమం త్వరలోనే విజయవంతంగా పూర్తి చేయనున్నాము. ఈ ప్రాజక్టు ను బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలావి, నైజీరియా, ఉగాండా లలో అమలుచేయడం జరిగింది.

మిత్రులారా,

ఆఫ్రికా- భారతదేశం ల వాణిజ్యం గత 15 సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో ఇది రెట్టింపై, 2014-15 లో సుమారు 72 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకొంది. 2015-16 లో భారతదేశ వస్తురూప వాణిజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కంటే ఆఫ్రికాతో ఎక్కువగా ఉంది. ఆఫ్రికా లో అభివృద్ధికి మద్దతుగా భారదేశం కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో, జపాన్ తో కలిసి పని చేస్తోంది. నా టోక్యో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ అబే తో సవివరమైన సంప్రదింపులు జరిపిన విషయాన్ని ఆనందంగా గుర్తుచేసుకుంటున్నాను. అందరి అభివృద్ధి అవకాశాలు పెంపొందించడానికి మనకు గల నిబద్ధతపై మేము చర్చించాము. ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడర్ ను గురించి, మన సోదర, సోదరీమణులతో తదుపరి ప్రతిపాదిత సంభాషణ గురించి ఇరువురు నాయకులు ఉమ్మడి ప్రకటనలో పేర్కొనడం జరిగింది.

ఓక భవిష్యత్ ప్రణాళికతో భారత్, జపాన్ దేశాలకు చెందిన పరిశోధనా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ ప్రణాళికను ముందుకు తీసుకురావడానికి RIS, ERA, IDE-JETRO చేసిన చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను. ఆఫ్రికా సలహాదారులతో సంప్రతింపులు జరిపిన అనంతరం దీనిని చేపట్టడం జరిగింది. విజన్ డాక్యుమెంట్ ను బోర్డు సమావేశంలో సమర్పించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. భారతదేశం, జపాన్ లు ఇతర సుముఖంగా ఉన్న భాగస్వాములతో కలిసి పట్టు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల, వస్తువుల తయారీ, అనుసంధానం తదితర రంగాలలో సంయుక్తంగా చర్యలు చేపట్టేందుకు గల అవకాశాలను వెలికితీయడమే దీని ఉద్దేశం.

మన భాగస్వామ్యం కేవలం ప్రభుత్వాల తోనే పరిమితం కాలేదు. ఈ ప్రేరణను ముందుకు తీసుకువెళ్లడంలో భారతదేశపు ప్రయివేటు రంగం ముందు వరుసలో ఉంది. 1996 నుండి 2016 వరకు భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో సుమారు ఒకటిలో ఐదో వంతు వరకు ఆఫ్రికా లోనే పెట్టుబడి పెట్టడం జరిగింది. గత 20 ఏళ్లలో 54 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా – ఈ ఉపఖండంలో పెట్టుబడి పెట్టే దేశాలలో భారతదేశం ఐదవ అతి పెద్ద దేశంగా ఉంది. తద్వారా ఆఫ్రికా దేశస్తులకు ఉపాధి కల్పించడం జరిగింది.

ప్యారిస్ లో 2015 నవంబర్ లో ఐక్య రాజ్య సమితి వాతావరణం మార్పు సదస్సు ప్రారంభించిన ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా చేపట్టిన చర్యలకు ఆఫ్రికా దేశాలు చూపిన ప్రతిస్పందన భారతదేశానికి ప్రోత్సాహాన్నిచ్చింది. ప్రత్యేక విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌర వనరులు ఎక్కువగా కలిగిన దేశాల కూటమి గా ఈ అలయన్స్ పరిగణించబడింది. ఈ చర్యకు చాలా ఆఫ్రికా దేశాలు తమ మద్దతు తెలియజేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.

‘‘బ్రిక్స్ బ్యాంకు’’గా ప్రముఖంగా పిలువబడుతున్న కొత్త అభివృద్ధి బ్యాంకు వ్యవస్థాపక దేశంగా భారతదేశం- దక్షిణాఫ్రికాలో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం పట్ల స్థిరంగా మద్దతు పలుకుతోంది. ఎన్ డిబి కీ, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు తో సహా ఇతర అభివృద్ధి భాగస్వాముల మధ్య సహకారం పెంపొందించడానికి ఇది ఒక వేదికను కల్పిస్తుంది.

భారతదేశం 1982 లో ఆఫ్రికా అభివృద్ధి నిధి లో చేరింది. అలాగే 1983 లో ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకులో చేరింది. అన్ని బ్యాంకుల సాధారణ మూలానిది పెరగడానికి భారత్ సహకారం అందించింది. ఇటీవల ప్రారంభమైన ఆఫ్రికా అభివృద్ధి నిధి పునరుద్ధరణకు – భారతదేశం 29 మిలియన్ డాలర్లు ప్రకటించింది. అత్యంత పేద దేశాలకు మేము సహాయం అందిస్తున్నాము. మరియు బహుముఖ రుణ తగ్గింపు ప్రోత్సాహకాలు కల్పించింది.

ఈ సమావేశాల నేపథ్యంలో, భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం సదస్సులను, చర్చలను నిర్వహిస్తోంది. భారత వాణిజ్యం, పరిశ్రమల సంఘాల సమాఖ్య సహకారంతో ఒక ప్రదర్శన కూడ ఏర్పాటైంది. వ్యవసాయం నుండి ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, ఇతర ఇతి వృత్తములు దాకా వివిధ అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.

ఈ కార్యక్రమానికి ‘‘ఆఫ్రికాలో వ్యవసాయ మార్పిడి ద్వారా సంపద సృష్టి’’ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. ఈ విషయంలో భారతదేశం మరియు బ్యాంకు ఫలప్రదంగా చేతులు కలిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దిశగా నేను ‘‘ప్రత్తి సాంకేతిక సహాయ కార్యక్రమాన్ని’’ ప్రస్తావించాను.

ఇక్కడ భారతదేశంలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి నేను ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. అభివృద్ధి చేసిన విత్తనాలు, సరైన ఇన్ పుట్స్ నుండి తగ్గిన పంట నష్టాలు, మెరుగైన మార్కెటింగ్ మౌలిక సదుపాయాల వరకు పటిష్టమైన చర్యల అవసరం ఉంది. ఈ చర్యలపై ముందుకు వెళ్తున్న కొద్దీ – మీ అనుభవాల నుండి భారత్ నేర్చుకోవాలని చూస్తోంది.

నా ఆఫ్రికా సోదర సోదరీమణులారా !

మనం ఎదుర్కొంటున్న చాలా సవాళ్లు ఒకే మాదిరిగా ఉన్నాయి. మన రైతులు, ప్రజలను ఉన్నత స్థితికి తీసుకురావాలి. మహిళలకు సాధికారితను కల్పించాలి. మన గ్రామీణ సమాజాలకు నగదు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. మౌలిక సదుపాయాలు నిర్మించాలి. మనకు ఉన్న ఆర్ధిక అడ్డంకులకు లోబడి ఈ పనులన్నీ చేయాలి. మనం స్థూల ఆర్ధిక స్థిరత్వాన్ని నిర్వహించాలి. అప్పుడు ద్రవ్యోల్బణ నియంత్రణ ఉంటుంది. మన చెల్లింపుల నిల్వ స్థిరంగా ఉంటుంది. ఈ విధమైన అన్ని అంశాలలోనూ మన అనుభవాలను పంచుకుంటే మనం ఎంతో లబ్ది పొందవచ్చు. ఉదాహరణకు తక్కువ నగదు ఆర్ధిక వ్యవస్థ కావాలనుకుంటే, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా దీన్ని సాధించిన కీన్యా వంటి ఆఫ్రికా దేశాల నుంచీ మనం నేర్చుకున్నాం.

భారతదేశం గత మూడేళ్ళలో అన్ని స్థూల ఆర్ధిక సూచికలను మెరుగుపరచుకుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుత్వ కోశ సంబంధి లోటు, చెల్లింపుల బకాయిలు తగ్గాయి. అదేవిధంగా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పట్టింది. జిడిపి వృద్ధి రేటు, విదేశీ కరెన్సీ నిల్వలు, ప్రభుత్వ పెట్టుబడులు బాగా పెరిగాయి. అదే సమయంలో మనం అభివృద్ధిలో ప్రగతి సాధించాము.

గౌరవనీయులైన ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షా, మేము తీసుకున్న చర్యలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాఠ్యపుస్తకాలలో అంశాలుగా, అభివృద్ధికి ప్రతీకలుగా నిలుస్తాయని మీరు అభివర్ణించినట్లు తెలిసింది. మీ ప్రశంసలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు గతంలో కొంతకాలం హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నట్లు తెలుసుకుని నేను ఎంతో సంతోషించాను. అయినప్పటికీ ఇంకా ఎన్నో సవాళ్లు మా ముందు ఉన్నాయి. ఈ సందర్భంగా గత మూడేళ్ళలో మేము ఆచరించిన కొన్ని వ్యూహాలను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను.

పరోక్షంగా ధరల తగ్గింపునకు బదులు, రాయితీలను నేరుగా పేదలకు చెల్లించడం ద్వారా మేము పెద్ద మొత్తంలో నిధులు ఆదా చేయగలిగాము. మూడేళ్ళలో కేవలం వంట గ్యాసు లోనే దాదాపు 4 బిలియన్ డాలర్లకు పైగా మేము ఆదా చేశాము. దీనికి అదనంగా ధనిక వర్గానికి చెందిన పౌరులు వారి వంట గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేశాను. ‘‘గివ్ ఇట్ అప్’’ ప్రచారం కింద లభించిన ఆదా ఒక పేద కుటుంబానికి ఒక కనెక్షన్ ను ఇవ్వడానికి ఉపయోగపడుతుందని హామీ ఇచ్చాను. ఈ విధంగా చేయడానికి 10 మిలియన్ మందికి పైగా భారతీయులు వారంతట వారు ముందుకు వచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మిగులు నిధులతో 50 మిలియన్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లు అందించాలని మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము. 15 మిలియన్ కనెక్షన్ లకు పైగా ఇప్పటికే అందజేశాము. గ్రామీణ మహిళల జీవితాలను ఇది మార్చివేసింది. కట్టెలతో వంట చేయడం వాళ్ళ వచ్చే ఆరోగ్య సమస్యలనుంచి ఇది వారికి విముక్తి కలిగించింది. ఇది వాతావరణాన్ని పరిరక్షించడంతో పాటు, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ‘‘పరివర్తన కోసం సంస్కరణ’’కు ఇది ఒక ఉదాహరణగా జీవితాల్లో పరివర్తన కల్పించేందుకు చేపట్టిన చర్యల సమాహారంగా నేను చెబుతున్నాను.

రైతుల వినియోగం కోసం ఉద్దేశించి, రాయితీతో అందజేసే యూరియా ఎరువులు, రసాయనాల తయారీ వంటి వ్యవసాయేతర వినియోగానికి అక్రమంగా మళ్ళించబడుతున్నాయి. సార్వత్రిక వేప పూత యూరియాను మేము ప్రవేశపెట్టాము. దీనివల్ల ఎరువుల మల్లింపుకు అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల సమృద్ధిగా ఆర్ధిక ఆదాతో పాటు వేప పూత వల్ల ఎరువుల ప్రభావం మెరుగైంది.

మేము మా రైతులకు భూస్వస్థత కార్డులు కూడా అందజేస్తున్నాము. ఈ కార్డుల ద్వారా వారి భూమి ఏ రకానికి చెందినదీ తెలియజేయడంతో పాటు భూమిలో ఏ పంట పండించాలో, ఏయే ఎరువులు వేయాలో కూడా సలహా ఇవ్వడం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడానికి ఇది దోహదపడుతుంది.

మౌలిక సదుపాయాలూ, రైలుమార్గాలు, రహదారులు, విద్యుత్తు, గ్యాస్ గొట్టపు మార్గాలు వంటి వాటిలో పెట్టుబడులను మేము గణనీయంగా పెంచాము. వచ్చే ఏడాది కల్లా భారతదేశంలో ఒక్క గ్రామం కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండకూడదు. గంగా నది శుద్ధి, నవీకరణయోగ్య శక్తి, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, అందరికీ గృహాలు, నైపుణ్య భారత్ మిషన్ వంటి మా పథకాలు మమ్మల్ని స్వచ్ఛంగా, మరింత సుసంపన్నంగా, వేగంగా అభివృద్ధిచెందే ఆధునిక నూతన భారతదేశం వైపు నడిపిస్తున్నాయి. భారతదేశం అభివృద్ధికి చోదకశక్తిగా వ్యవహరించాలన్నదే మా ధ్యేయం. రానున్న సంవత్సరాలలో – వాతావరణ మిత్రపూర్వక అభివృద్ధికి ఒక ఉదాహరణగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము.

రెండు కీలక అంశాలు మాకు సహాయపడ్డాయి. ఒకటోది బ్యాంకింగ్ విధానంలో మార్పులు. గత మూడేళ్ళలో మేము సార్వత్రిక బ్యాంకింగ్ విధానాన్ని సాధించాము. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం మేము ప్రారంభించిన ‘జన్ ధన్ యోజన’ లేదా ప్రజల నగదు ప్రచారం క్రింద మేము 280 మిలియన్ కు పైగా బ్యాంకు ఖాతాలు ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఫలితంగా ప్రతి భారతీయ కుటుంబానికీ, ఒక బ్యాంకు ఖాతా దక్కింది. సాధారణంగా బ్యాంకులు వ్యాపారాలకూ , ధనవంతులకూ సహాయపడుతూ ఉంటాయి. మేము వాటిని తమ అభివృద్ధిలో భాగంగా పేదలకు సహాయ పడే విధంగా మార్చాము. ప్రభుత్వ రంగ బ్యాంకులను మేము పటిష్ఠపరిచాము. రాజకీయ నిర్ణయాలతో ప్రమేయం లేకుండా వృత్తి నైపుణ్యం గల వారిని వారి ప్రతిభ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ద్వారా వాటి అధిపతులను నియమించుకునే అధికారం కల్పించాము.

‘ఆధార్’ పేరుతో మేము ప్రారంభించిన సార్వత్రిక బయోమెట్రిక్ గుర్తింపు విధానం రెండో కీలక అంశం. అర్హత లేని వారు ప్రయోజనం పొందకుండా ఇది నివారిస్తుంది. ప్రభుత్వ సహాయం పొందడానికి ఎవరు అర్హులో సులువుగా గుర్తించడానికి ఇది మాకు ఎంతో ఉపయోగపడింది. అనర్హులను తొలగించడానికి కూడా ఇది సహకరించింది.

మిత్రులారా, ఈ వార్షిక సమావేశం ఎంతో విజయవంతంగా, ఉపయోగకరంగా సాగాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇక క్రీడల విషయానికి వస్తే, ఎక్కువ దూరం పరుగు పెట్టే పోటీలో ఆఫ్రికాతో భారతదేశం పోటీ పడజాలదు. అయితే, ఉత్తమ భవిష్యత్తు కోసం సాగే సుదీర్ఘ, సంక్లిష్ట పరుగులో మాత్రం భారతదేశం ఎల్లప్పుడూ మీతో భుజం భుజం కలిపి నిలబడుతుందని నేను హామీ ఇవ్వగలను.

శ్రేష్ఠులారా,

సోదర, సోదరీమణులారా,

ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశం ఇప్పుడు ఆధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

మీకు ఇవే నా ధన్యవాదాలు.

*****