Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్ లాండ్, అమెరికా, మరియు మెక్సికో దేశాలలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న


ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి, జూన్ 4 వ తేదీ నుండి జూన్ 6 వ తేదీ వరకు ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్ లాండ్, అమెరికా, మెక్సికో దేశాలలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పంచుకున్న విషయాలు వారి మాటల్లోనే :

” ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షులు శ్రీ అష్రఫ్ ఘనీతో కలసి హెరాత్ లో నిర్మించబడిన భారత్ ఆఫ్ఘానిస్తాన్ ఫ్రెండ్ షిప్ డ్యామ్ ప్రారంభోత్సవం కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను. ఈ డ్యామ్ నిర్మాణం రెండు దేశాల మైత్రికీ, బలపడుతున్న పరస్పర బంధానికీ, ఎన్నో గృహాలను కాంతులతో వెలిగించడానికీ, అక్కడి పంట పొలాలను సస్య శ్యామలం చేయడానికీ ప్రతిరూపం గా భావిస్తున్నాను. ఆ ప్రాంత ప్రజలందారికి ఈ డ్యామ్ సిరి సంపదలను సమకూరుస్తుందని ఆశిస్తున్నాను”. మా ఆత్మీయ మిత్రులైన అధ్యక్షులు అష్రఫ్ ఘనితో జరగబోయే ఈ సమావేశం , ప్రాంతీయ స్థితిగతులపై సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు, రాబోయే కాలం లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అజెండా ను సిద్ధం చేసుకునేందుకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను.

ఖతార్ దేశాన్ని 4-5 వ తేదీల్లో, ఆ దేశ ఎమిర్ గారి ఆహ్వానం మేరకు సందర్శిస్తున్నాను. గత సంవత్సరం ఏమిర్ షేక్ తమీమ్ పర్యటన, ఇరు దేశాల సంబంధాలను మరింత ధృఢం చేసే దిశలో ఒక మైలు రాయిలా నిలిచిపోతుంది. గత రెండు దశాబ్దాలుగా ఇరు దేశాల సంబంధాలకు దిశా నిర్దేశం చేసిన ఏమిర్ షేక్ తమీమ్ గారి తండ్రిని కలవడం కూడా గొప్ప గౌరవం. ఈ పర్యటన రెండు దేశాల చరిత్రాత్మక మితృత్వాన్ని మరింతగా పెంచి, ప్రజల మధ్య వ్యక్తిగత,వ్యాపార సంబంధాలను నూతన శిఖరాలకు చేరుస్తుందనడంలో సందేహం లేదు.

తమ స్వేదంతో, కష్టించే గుణంతో ఇరు దేశాల సంబంధాలను ఎన్నో సంవత్సరాలుగా పెంచి పోషిస్తున్న దాదాపు 6 లక్షల మందికి పైగా భారతీయ కార్మిక ప్రతినిధులను కలుసుకోబోతుండటం గొప్ప అదృష్టం. అంతేకాక భారత దేశం లోని అపారమైన పెట్టుబడి అవకాశాలను గూర్చి, ఆ దేశ వ్యాపార రంగ ప్రముఖులతో చర్చించడం కూడా ఆ రంగానికి సంబంధించి మేలి మలుపు అవుతుందని భావిస్తున్నాను.

యూరప్ ఖండం లో మన దేశానికి ముఖ్యమైన భాగస్వామి గా ఉన్న స్విట్జర్ లాండ్ దేశానికి 5వ తేదీ సాయంత్రం బయలుదేరి వెళుతున్నాను . దేశ అధ్యక్షులు ష్నిడర్ అమ్మాన్ తో జరిగే ద్వైపాక్షిక చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలను సుధృఢం చేస్తాయని భావిస్తున్నాను.

జెనీవా లో ఆ దేశ వాణిజ్య ప్రముఖులతో సమావేశం, ఆర్థిక వాణిజ్య రంగాలలో బంధాలను మరింత విస్తృతం చేసుకునే దిశగా ముందడుగని భావిస్తున్నాను.CERN లో పనిచేస్తున్న మన శాస్త్రవేత్తల భాగస్వామ్యం ప్రపంచ మానవాళికి ఉపయుక్తకరంగా ఉండబోతోంది. అటువంటి మన దేశ శాస్త్రవేత్తలను కలుసుకోవడం గర్వకారణం గా భావిస్తున్నాను.

అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు 6వ తేది సాయంత్రం వాషింగ్టన్ డీసీ వెళుతున్నాను. 7వ తేది ఉదయం అధ్యక్షులు బరాక్ ఒబామా తో జరిగే సమావేశం లో వివిధ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల జరిగిన ప్రగతి ని సమీక్షించుకుంటూ భవిష్యత్తు పై దృష్టి సారించే ప్రయత్నం జరుగుతుంది.

అమెరికా వాణిజ్య వ్యాపార రంగ ప్రముఖులు గత రెండేళ్లుగా భారత్ పై చూపిస్తున్న విశ్వాసం ఎనలేనిది. USIBC 40 వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశ్యించి ప్రసంగించాల్సి ఉంది. అమెరికా దేశ మేధావులతో జరిగే చర్చా కార్యక్రమం సైతం ముఖ్యమైనది. భారత్ కు తిరిగి ఇస్తున్న విలువైన వస్తువులకు సంబంధించిన కార్యక్రమం లో పాల్గొంటున్నాను. అంతేకాక ఆర్లింగ్టన్ సిమెట్రీ లో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా స్మృతి కేంద్రానికి వెళ్ళి నివాళులు ఆర్పిస్తాను . అమెరికా చట్టసభ స్పీకర్ పాల్ ర్యాన్ ఆహ్వానం మేరకు 8వ తేదిన అమెరికా చట్ట సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారత అమెరికా సంబంధాలను బలోపేతం చేయడం లో కీలక పాత్ర వహించిన సెనేటర్ల తోను, పార్లమెంటు సభ్యులతోనూ సమావేశమవబోతున్నాను.

భారత్, అమెరికా ఈ రెండు దేశాలు సహజ మిత్రులు మరియు భాగస్వాములు. భిన్నత్వము, బహుళత్వము వంటి విషయాలలో ఒకే రకమైన దేశాలు మరియు ఎంతో ఉత్సాహపూరితమైన ఆర్థిక వ్యవస్థలుగా వెలుగుతూ ఉన్నాయి. భారత్ అమెరికా మధ్య గల సౌహార్ధ్ర సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలకే కాక ప్రపంచమంతటికీ శ్రేయోదాయకమైనటువంటివి.

8వ తేది సాయంత్రం లాటిన్ అమెరికా ప్రాంతంలో భారత దేశానికి కీలకమైన మెక్సికో దేశ అధ్యక్షులు పెనా నీటో ను కలుసుకోబోతున్నాను. 30సంవత్సరాల తరువాత భారత్ తరఫున మెక్సికో దేశం లో పర్యటించబోతున్నందుకు, సంస్కరణ లలో దూసుకుపోతున్న మెక్సికో లో అనుభవాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రధానమంత్రుల స్థాయిలో ఇది ప్రథమ ద్వైపాక్షిక సమావేశం కావడం ఎంతో ఆనందదాయకం. ఈ పర్యటన అతి తక్కువ సమయమే అయినప్పటికీ మున్ముందు మరిన్ని నూతన శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను.