Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2018 జనవరి 28వ తేదీన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) 40 వ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారం. 2018 సంవత్సరంలో ఇది మొదటి ’మనసులో మాట’. రెండు రోజుల క్రితమే మనం మన గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా పది దేశాల అధినేతలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

ప్రియమైన నా దేశ వాసులారా, శ్రీ ప్రకాశ్ త్రిపాఠీ గారు Narendra Modi App కు ఒక పెద్ద లేఖను వ్రాశారు. తన లేఖలో పేర్కొన్న విషయాలను ప్రస్తావించవలసిందిగా కోరారు. వారు ఏం రాశారంటే, ఫిబ్రవరి ఒకటో తేదీన అంతరిక్షం లోకి వెళ్ళిన కల్పన చావ్లా వర్ధంతి. కొలంబియా అంతరిక్ష యాన దుర్ఘటనలో ఆవిడ మనల్ని వదలి వెళ్లిపోయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల యువతకు ప్రేరణను అందించారు. తన పొడవాటి లేఖలో మొదట కల్పన చావ్లా ను గురించి ప్రస్తావించినందుకు సోదరులు ప్రకాశ్ గారికి నేను ఋణపడి ఉంటాను. ఇంత చిన్నవయస్సు లోనే కల్పన చావ్లా గారిని కోల్పోవడం అందరికీ ఎంతో దు:ఖం కలిగించింది. కానీ ఆవిడ తన జీవితం ద్వారా నారీశక్తి కి ఎలాంటి సరిహద్దులూ ఉండవని యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా మన భారతదేశం లోని వేల మంది యువతులకు వెల్లడి చేశారు. కోరిక, ధృఢ సంకల్పం ఉంటే, ఏదైనా చెయ్యాలనే అభిలాష ఉంటే, అసాధ్యమైనది ఏదీ లేదు. ఇవాళ్టి రోజున భారతదేశంలో మహిళలందరూ ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతూ దేశ గౌరవాన్ని పెంచుతున్నారు.

ప్రాచీన కాలం నుండీ మన దేశంలో మహిళలకు లభించిన గౌరవం, సమాజంలో వారికి లభించిన స్థానం, వారి సహకారం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. భారతదేశంలో ఎందరో విదుషీమణుల సంప్రదాయం ఉంది. వేదాల కూర్పులో భారతదేశంలోని అనేక మంది విదుషీమణుల తోడ్పాటు ఉంది. లోపాముద్ర, గార్గి, మైత్రేయి.. ఇటువంటి పేర్లతో ఒక పెద్ద పట్టికే అవుతుంది. ఇవాళ మనం ‘బేటీ బచావో- బేటీ పఢావో’, ‘‘ఆడపిల్లను రక్షించు- ఆడపిల్లను చదివించు’’ గురించి మాట్లాడుకొంటున్నాం. కానీ శతాబ్దాల క్రితమే, మన ప్రాచీన పాఠాలలో, స్కంద పురాణంలో ఏమని ప్రస్తావించారంటే :

దశ పుత్ర- సమా కన్యా, దశ పుత్రాన్ ప్రవర్థయన్
యత్ ఫలం లభతే మర్త్య: తత్ లభ్యం కన్యకైకయా అని

ఈ మాటల భావం.. ఒక కుమార్తె పది కుమారులతో సమానం. పది మంది పుత్రుల వల్ల కలిగే పుణ్యం ఒక్క కుమార్తె తోనే లభిస్తుంది.. అని. ఇది మన సమాజంలో స్త్రీ ప్రాముఖ్యాన్ని చాటిచెబుతోంది. అందుకే మన సమాజంలో స్త్రీ ని శక్తి స్వరూపంగా భావిస్తారు. ఈ స్త్రీ శక్తి మొత్తం దేశాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఏక తాటిపై నిలుపుతుంది. వైదిక కాల విదుషీమణులైన లోపాముద్ర, గార్గి, మైత్రేయి ల విద్వత్తు అయినా; అక్క మహాదేవి, మీరాబాయి ల భక్తి, జ్ఞానాలు అయినా; అహిల్యా బాయి హోల్కర్ పరిపాలన వ్యవస్థ అయినా; రాణి లక్ష్మీబాయి వీరత్వం అయినా.. స్త్రీ శక్తే ఎప్పుడూ కూడా మనకు ఎంతో ప్రేరణను అందిస్తూవస్తోంది. వారు దేశానికి ప్రఖ్యాతిని తీసుకువచ్చారు.

శ్రీమాన్ ప్రకాశ్ త్రిపాఠీ మరిన్ని ఉదాహరణలను చెప్పుకొచ్చారు. మన సాహసవంతురాలైన రక్షణ మంత్రి నిర్మల సీతారమణ్ చేసిన సుఖోయి 30 యుద్ధ విమాన ప్రయాణం తనకు ఎంతో ప్రేరణను ఇచ్చినట్లు ఆయన వ్రాశారు. వర్తిక జోషి నేతృత్వంలో ఐఎన్ఎస్ వి తరిణి మీద ప్రపంచ యాత్ర చేస్తున్నటువంటి భారతీయ నౌకాదళ మహిళా సభ్యులను గురించి కూడా ఆయన పేర్కొన్నారు. భావనా కంఠ్, మోహనా సింహ్, అవనీ చతుర్వేదీ అనే ముగ్గురు సాహస వనితలు ఫైటర్ పైలెట్స్ అయ్యి, సుఖోయి 30 యుద్ధ విమాన శిక్షణ తీసుకుంటున్నారు. క్షమతా వాజపేయి నాయకత్వంలో అందరూ మహిళలే ఉన్నటువంటి నావిక సిబ్బంది ఢిల్లీ నుండి అమెరికా లోని శాన్ ఫ్రాన్ సిస్కో కు, తిరిగి ఢిల్లీ వరకు ఏర్ ఇండియా బోయింగ్ జెట్ విమానాన్ని నడిపారు. వారు సరిగ్గా చెప్పారు- ఇవాళ ప్రతి రంగంలో స్త్రీలు రాణించడమే కాకుండా నేతృత్వాన్ని వహిస్తున్నారు. ఇవాళ ప్రతి రంగంలోనూ అందరి కంటే ఎక్కువగా మన స్త్రీలే ఏదో ఒకటి సాధించి చూపెడుతున్నారు; పునాదిరాళ్లను వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మాననీయ రాష్ట్రపతి గారు ఒక కొత్త నాందీప్రస్తావనను చేశారు.

వారి వారి రంగాలలో మొట్టమొదటగా ఏదో ఒకటి సాధించిన ఒక అసాధారణ మహిళల బృందంతో రాష్ట్రపతి గారు భేటీ అయ్యారు. దేశం లోని ఈ మహిళా సాధకుల్లో, మొదటి మహిళా మర్చెంట్ నేవీ కేప్టన్, పాసింజరు ట్రైన్ తాలూకూ మొదటి మహిళా ట్రైన్ డ్రైవర్, మొదటి అగ్నిమాపక సిబ్బంది (ఫైర్ ఫైటర్), మొదటి మహిళా బస్ డ్రైవర్, అంటార్కిటికా చేరిన మొదటి మహిళ, ఎవరెస్టు ను అధిరోహించిన మొదటి మహిళ.. ఇలా ప్రతి రంగంలోని మొదటి మహిళలతో రాష్ట్రపతి గారు భేటీ అయ్యారు. మన స్త్రీ శక్తి, సమాజం లోని సాంప్రదాయక కట్టుబాట్లను అధిగమిస్తూ అసాధారణ విజయాలను సాధించారు. ఒక రికార్డును నెలకొల్పారు. కష్టపడి ఏకాగ్రతతో, ధృఢసంకల్పంతో పని చేసి ఎన్నో అవాంతరాలను, బాధలను అధిగమిస్తూ ఒక నూతన మార్గాన్ని తయారు చేయవచ్చని వారు నిరూపించారు. ఆ మార్గం తమ సమకాలీనులకే కాక రాబోయే తరాల వారికి కూడా ప్రేరణను అందించి, వారికి ఒక కొత్త ఉత్సాహాన్ని అందించేదిగా అది నిలుస్తోంది. దేశం మొత్తం ఈ స్త్రీ శక్తిని గురించి తెలుసుకోవడానికి, వారి జీవితాల నుండి, వారి పనుల నుండి ప్రేరణను పొందేందుకు వీలుగా ఈ women achievers, first ladies పై ఒక పుస్తకం కూడా తయారైంది. ఇది NarendraModi website లో ఇ-బుక్ రూపంలో లభ్యం అవుతోంది.

ఇవాళ దేశంలో, సమాజంలో చోటు చేసుకొంటున్న సానుకూలమైన మార్పులలో దేశ స్త్రీ శక్తి తాలూకూ ముఖ్యంమైన పాత్ర ఉంది. ఇవాళ మనం మహిళా సాధికారితను గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి, ఒక రైల్వే స్టేషన్ ను గురించి చెప్పాలనుకుంటున్నాను. మహిళా సాధికారిత కూ, ఒక ఒక రైల్వే స్టేషన్ కూ గల సంబంధం ఏమిటా అని మీరు అనుకోవచ్చు. ముంబయ్ లోని మాటుంగా స్టేషన్ భారతదేశంలో అందరూ మహిళా సిబ్బందితోనే నిండినటువంటి మొట్టమొదటి రైల్వే స్టేషన్. అక్కడ అన్ని విభాగాలలోనూ పనిచేస్తోంది మహిళా సిబ్బందే. వాణిజ్య విభాగంలో, రైల్వే పోలీస్ లో, టికెట్ చెకింగ్ లో, అనౌన్స్ మెంట్ సిబ్బంది లో, పోయింట్ పర్సన్ లో, నలభై కన్నా ఎక్కువగా అంతా మహిళా సిబ్బందే. ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతును చూసిన తరువాత చాలా మంది ప్రజలు ట్విటర్ లోను, ఇంకా ఇతర సాంఘిక మాధ్యమాల ద్వారాను కవాతులో వారు గమనించిన ముఖ్యమైన అంశం గురించే వ్రాశారు. అది అందరూ మహిళలే పాల్గొన్న సాహసవంతమైన ప్రయోగం BSF Biker Contingent గురించే ఉంది. ఈ సాహసవంతమైన ప్రయోగ దృశ్యం విదేశాల నుండి వచ్చిన అతిధులందరినీ కూడా ఆశ్చర్య చకితులను చేసింది. ఇది మహిళా సాధికారితకు, ఆత్మవిశ్వాసానికీ ఒక రూపం. ఇవాళ మన మహిళలు నాయకత్వాన్ని వహిస్తున్నారు. స్వశక్తులుగా మారుతున్నారు. ఇటువంటిదే మరొక విషయం నా దృష్టికి వచ్చింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన మన ఆదివాసి మహిళలు ఒక గొప్ప పనిని చేశారు. ఒక గొప్ప ఉదాహరణను చూపెట్టారు. ఆదివాసి మహిళల విషయం అనగానే, అందరి మనసుల్లో ఒక ఖచ్చితమైన చిత్రం కనబడుతుంది. ఒక అడవి, అందులో.. తలపాగాల చుట్టలపై కట్టెల మూటల బరువును మోస్తూ నడుస్తున్న మహిళల చిత్రం.. కనబడుతుంది. కానీ ఛత్తీస్ గఢ్ కు చెందిన మన ఆదివాసి మహిళలు దేశానికి ఒక కొత్త చిత్రాన్ని చూపించారు. ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడ ప్రాంతంలో హింస, అత్యాచారాలతో, బాంబులు, తుపాకులతో, మావోయిస్టులు ఒక భయంకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఉంచారు. అటువంటి ప్రమాదకరమైన ప్రాంతంలో ఆదివాసి మహిళలు ఇ-రిక్షా ను నడిపి తమ కాళ్లపై తాము నిలబడ్డారు. అతి కొద్ది సమయంలో ఎందరో మహిళలు ఇందులో కలిశారు. దీనివల్ల మూడు లాభాలు జరుగుతున్నాయి. ఒకవైపు స్వతంత్రోపాధి వారిని స్వశక్తులుగా తయారుచేసింది. మరొక వైపు మావోవాద ప్రభావం ఉన్నటువంటి ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతున్నాయి. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా బలం చేకూరుతోంది. ఇందుకు అక్కడి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అభినందిస్తున్నాను. దీనికి అవసరమైన ధన సహాయాన్ని అందించడం మొదలుకొని వారికి శిక్షణను ఇవ్వడం దాకా ఈ మహిళల విజయానికి జిల్లా అధికార యంత్రాంగం ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది.

‘‘మాలో మార్పు రాదు.. మేము ఇంతే’’ అనే మాటలు కొందరి నోటి నుండి మనం పదే పదే వింటూంటాం. ఆ విషయం ఏమిటంటే వినమ్రత, పరివర్తన. మన చేతుల్లో లేని దాన్ని వదిలెయ్యాలి, అవసరమైన చోట మార్పులు స్వీకరించాలి. తనను తాను సరిదిద్దుకోవడం మన సమాజంలోని ప్రత్యేకత. ఇటువంటి భారతీయ పరంపర, ఇటువంటి సంస్కృతి మనకు వారసత్వంగా లభించాయి. తనను తాను సరిదిద్దుకొనే పద్ధతే ప్రతి చైతన్యవంతమైన సమాజపు లక్షణం. యుగాలుగా మన దేశంలో వ్యక్తిగతంగా, సామాజిక స్థాయిలోనూ సామాజంలోని మూఢ నమ్మకాలకు, చెడు పద్ధతులకు వ్యతిరేకంగా నిలబడి ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బిహార్ ఒక ఆసక్తికరమైన కొత్త తరహా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని చెడు పద్ధతులను వేళ్లతో పెకిలించివెయ్యడానికి పదమూడు వేల కంటే ఎక్కువ కిలోమీటర్ల మేర ప్రపంచం లోకెల్లా అతి పెద్ద మానవ హారాన్ని రూపొందించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను బాల్య వివాహాలకు, వరకట్న దురాచారాలకు వ్యతిరేకంగా అప్రమత్తులను చేశారు. బాల్య వివాహాలకు, వరకట్న దురాచారాలు మొదలైన చెడు పద్ధతులకు వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రం పోరాటం చెయ్యాలని సంకల్పించింది. పిల్లలు, పెద్దలు, ఉత్సాహంతో నిండిన యువత, తల్లులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో భాగమయ్యారు. పట్నా లోని చారిత్రక గాంధీ మైదానం నుండి మొదలైన ఈ మానవ హారం రాష్ట్ర సరిహద్దుల వరకూ అనూహ్యంగా ప్రజలను కలుపుకుంటూ సాగింది. సమాజంలో ప్రజలందరికీ సరైన విధంగా అభివృధ్ధి ఫలితాలు అందాలంటే, సమాజం ఇటువంటి చెడు పద్ధతుల నుండి విముక్తిని పొందాలి. రండి.. మనం అందరం కలిసి ఇటువంటి చెడు పద్ధతుల సమాజం నుండి నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఒక న్యూ ఇండియా ను, ఒక సశక్తమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. నేను బిహార్ రాష్ట్ర ప్రజలనూ, ముఖ్యమంత్రిని, అక్కడి పరిపాలన యంత్రాంగాన్ని, ఆ మానవ హారంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని వారి సమాజ సంక్షేమం దిశగా ఇంతటి విశిష్టమైన, విస్తృతమైన ప్రయత్నాన్ని చేసినందుకుగాను అభినందిస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా, కర్ణాటక లోని మైసూర్ కు చెందిన దర్శన్ గారు My gov యాప్ లో ఏం వ్రాశారంటే, వారి తండ్రి గారి వైద్యానికి నెలకు ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యేవట. అంతక్రితం వారికి ప్రధాన మంత్రి జన ఔషధి యోజన గురించి తెలియదట. జన ఔషధీ కేంద్రం గురించి తెలిసిన తరువాత అక్కడ మందులు కొనడం మొదలుపెట్టాక, అతనికి మందుల ఖర్చు 75 శాతం వరకు తగ్గిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకుని, ఎక్కువ మంది ప్రజలు లాభం పొందాలనే ఉద్దేశంతో ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో నేను ఈ విషయాన్ని ప్రస్తావించాలని వారు కోరారు. కొద్ది కాలంగా ప్రజలు ఈ విషయాన్ని నాకు వ్రాస్తున్నారు, చెప్తున్నారు. ఈ పథకం ద్వారా లాభం పొందిన వారి వీడియోలు సామాజిక మాధ్యమాలలో నేను చూశాను. ఇటువంటి సమాచారం తెలిస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎంతో సంతోషం లభిస్తుంది. తనకు లభించింది ఇంకెందరికో కూడా లభించాలనే దర్శన్ గారి ఆలోచన నాకెంతో నచ్చింది. ఆరోగ్య సంరక్షణ ను అందుబాటులోకి తేవడం, జీవన సారళ్యతను ప్రోత్సహించడం ఈ పథకం వెనుక ఉద్దేశం. జన ఔషధి కేంద్రాలలో లభించే మందులు బజార్లో అమ్మకమయ్యే బ్రాండెడ్ మందుల కన్నా ఏభై శాతం నుండీ తొంభై శాతం వరకూ చౌకగా లభిస్తాయి. ఇందువల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిత్యం మందులు వాడే వయోవృద్ధులకు ఎంతో ఆర్థిక సహాయం లభిస్తుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇందులో కొనుగోలు అయ్యే జనరిక్ మందులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన స్థాయిలోనే ఉంటాయి. ఈ కారణంగా మంచి నాణ్యత కలిగిన మందులు తక్కువ ధరకే లభిస్తాయి. ఇవాళ దేశం మొత్తంలో మూడు వేల జన ఔషధి కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఇందువల్ల మందులు చౌకగా లభించడమే కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకొనే వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. చౌక ధరల్లోని మందులు భారతీయ ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల లోనూ, ఆసుపత్రుల లోని ’అమృత్ స్టోర్స్’ లోనూ అభ్యం అవుతాయి. దేశం లోని ప్రతి నిరుపేద పౌరుడికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులో ఉండే విధంగా చెయ్యాలనేదే ఈ పథకం ఉద్దేశం. తద్వారా ఆరోగ్యకరమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడమే ముఖ్యోద్దేశం.

ప్రియమైన నా దేశ వాసులారా, మహారాష్ట్రకు చెందిన శ్రీమాన్ మంగేశ్ Narendra Modi App కు ఒక ఛాయాచిత్రాన్ని పంపించారు. ఆ ఫోటో నా దృష్టిని ఆ వైపునకు తిప్పుకొనేలాగా ఉంది. అందులో ఒక మనవడు తన తాతయ్యతో కలిసి Clean Morna నదిని శుభ్రపరచే కార్యక్రమంలో పలుపంచుకొంటున్నాడు. అకోలా లోని ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోర్నా నదిని శుభ్రపరచడానికి పరిశుభ్రత కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్నా నది ఇదివరకు పన్నెండు నెలలలోనూ ప్రవహించేది. ఇప్పుడు అది కొన్ని నెలల్లో మాత్రమే ప్రవహిస్తోంది. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, నది పూర్తిగా కలుపుతో, గుర్రపు డెక్కతో నిండిపోయింది. నడి ఒడ్డున కూడా చాలా చెత్తను పారబోస్తున్నారు. అందుకని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకొని మకర సంక్రాంతి ముందరి రోజు నుండి, అంటే జనవరి 13 నుండి ‘Mission Clean Morna’ లో మొదటి భాగంగా నాలుగు కిలోమీటర్ల పరిధిలో పధ్నాలుగు స్థానాల్లో మోనా నదికి ఇరువైపులా శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ‘Mission Clean Morna’ పేరిట జరిగిన ఈ మంచి కార్యక్రమంలో అకోలా కు చెందిన ఆరు వేలకు పైగా ప్రజలు, వందకు పైగా ఎన్ జి ఒ లు, కళాశాలలూ, విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు, తల్లులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. 2018 జనవరి 20వ తేదీన కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. మోర్నా నది పూర్తిగా శుభ్రపడేవరకు ప్రతి శనివారం ఉదయం ఈ శుభ్రత కార్యక్రమం జరుగుతుందని నాకు చెప్పారు. మనిషి ఏదైనా సాధించాలని పట్టు పడితే సాధించలేనిది ఏదీ లేదని ఈ విషయం నిరూపిస్తుంది. ప్రజా ఉద్యమాల ద్వారా పెద్ద పెద్ద మార్పులను తీసుకురావచ్చు. నేను అకోలా ప్రజలకు, అక్కడి జిల్లా, నగర పురపాలక శాఖకు, ఈ పనిని ప్రజాఉద్యమంగా మార్చిన ప్రతి పౌరుడికి, వారి వారి ప్రయత్నాలకు గానూ ఎంతగానో అభినందిస్తున్నాను. మీ ఈ ప్రయత్నం దేశంలోని ఎందరికో ప్రేరణను ఇస్తుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈమధ్య పద్మ పురస్కారాలపై జరుగుతున్న చర్చలను మీరూ వినే ఉంటారు. వార్తాపత్రికలు, టీవీ ఈ విషయంపై మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాస్త నిశితంగా గమనిస్తే మీకు గర్వంగా అనిపిస్తుంది. ఎటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన మధ్య ఉన్నారో అని గర్వం కలుగుతుంది. మన దేశంలో సామాన్య వ్యక్తులు కూడా ఏ రకమైన సహాయం లేకుండా అంతటి స్థాయికి చేరుకుంటున్నందుకు స్వాభావికంగానే మనకి గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఏడాదీ పద్మ పురస్కారాలను ఇచ్చే సంప్రదాయం ఉంది కానీ గత మూడు సంవత్సరాలుగా పద్మ పురస్కారాల ప్రక్రియ మారింది. ఇప్పుడు ఏ పౌరుడైనా ఈ పురస్కారాలకై ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోకి రావడంతో పారదర్శకత వచ్చింది. ఒక రకంగా ఈ పురస్కారాల ఎన్నిక ప్రక్రియ మొత్తం మారిపోయింది. చాలా సాధారణమైన వ్యక్తులకు కూడా పద్మ పురస్కారాలు లభించడం మీరూ గమనించే ఉంటారు. సాధారణంగా టీవీలలో, పెద్ద పెద్ద నగరాలలో, వార్తాపత్రికలలో, సభలలో కనబడని వ్యక్తులకు పద్మ పురస్కారాలు లభిస్తున్నాయి. ఇందువల్ల పురస్కారాన్ని ఇవ్వడం కోసం వ్యక్తి పరిచయానికి కాకుండా అతడు చేస్తున్న పని ప్రాముఖ్యం పెరుగుతోంది. ఐఐటి కాన్ పుర్ విద్యార్థి అయిన అరవింద్ గుప్తా గారు పిల్లలకు బొమ్మలు తయారుచేయడం లోనే తన పూర్తి జీవితాన్ని గడిపేశారన్న సంగతి విని మీరు ఆనందిస్తారు. పిల్లలలో విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచడానికి ఆయన గత నలభై ఏళ్ళుగా పనికిరాని వస్తువులతో బొమ్మలను తయారుచేస్తున్నారు. పిల్లలు పనికిరాని వస్తువులతో విజ్ఞానపరమైన ప్రయోగాలు చెయ్యడానికి ప్రేరణను ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన దేశవ్యాప్తంగా మూడు వేల పాఠశాలలకు వెళ్ళి 18 భాషలలో తయారైన చలనచిత్రాలను చూపెట్టి పిలల్లకు ప్రేరణను అందిస్తున్నారు. ఎంతటి అద్భుతమైన జీవితమో! ఎంతటి అద్భుతమైన సమర్పణా భావమో!

ఇటువంటి కథే కర్నాటక కు చెందిన సితావా జోదత్తి ది కూడా. వీరికి ‘మహిళా సశక్తీకరణ్ కీ దేవీ’ అనే బిరుదు ఊరికే రాలేదు. ఆవిడ గత ముఫ్ఫై సంవత్సరాలుగా బెళగావి లో లెక్కలేనంత మంది మహిళల జీవితాలు మార్పు చెందటానికి గొప్ప సహకారాన్ని అందించారు. ఏడేళ్ళ వయస్సు లోనే దేవదాసిగా మారారు. తరువాత దేవదాసిల అభివృద్ధి కోసమే తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. ఇంతేకాక వీరు దళిత మహిళల జీవితాల కోసం కూడా అపూర్వమైన కార్యక్రమాలు చేశారు.

మధ్య ప్రదేశ్ కు చెందిన భజ్జూ శ్యామ్ గారిని గురించి కూడా మీరు వినే ఉంటారు. వీరు ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. జీవితం గడుపుకోవడానికి ఒక మామూలు ఉద్యోగం చేసే వారు. కానీ ఆయనకు సాంప్రదాయ ఆదివాసిల చిత్రాలు వేసే అలవాటు ఉండేది. ఇదే వ్యాపకం ఆయనకు భారతదేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా కూడా ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. ఈయన చిత్రాల ప్రదర్శనలు నీదర్ లాండ్స్, జర్మనీ, ఇంగ్లండ్, ఇటలీ ల వంటి ఎన్నో దేశాలలో జరిగాయి. విదేశాలలో భారతదేశం కీర్తిని పెంచిన భజ్జూ శ్యామ్ గారి ప్రతిభను గుర్తించి, ఆయనకు పద్మశ్రీ ని ఇవ్వడం జరిగింది.

కేరళ కు చెందిన ఆదివాసి మహిళ లక్ష్మీ కుట్టి గారి కథను విని మీరు ఆనందపరవశులవుతారు. ఆవిడ కల్లార్ లో ఉపాధ్యాయురాలు. ఇప్పటికీ ఆవిడ దట్టమైన అడవులలో ఆదివాసుల ప్రాంతంలో తాటాకులతో నిర్మించిన పాకలో నివసిస్తున్నారు. ఆమె తన స్మృతి ఆధారంగా ఐదు వందల మూలికా ఔషధాలను తయారు చేశారు. మూలికలతో మందులు తయారు చేశారు. పాము కాటుకు ఉపయోగించే మందును తయారు చేయడంలో ఆవిడ సిద్ధహస్తురాలు. మూలికా మందులలో తనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో లక్ష్మి గారు ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నారు. ఈ అజ్ఞాత వ్యక్తిని గుర్తించి ఆవిడ చేసిన సమాజ్ సేవకు గానూ ఆమెను పద్మశ్రీ తో గౌరవించడం జరిగింది.
ఇవాళ మరొక పేరును కూడా ప్రస్తావించాలని నాకు అనిపిస్తోంది. పశ్చిమ బెంగాలు కు చెందిన డెభ్భై ఐదు ఏళ్ల వయస్సున్న సుభాషిణి మిస్త్రీ గారు. వారిని కూడా పద్మ పురస్కారానికి ఎన్నుకోవడమైంది. ఒక ఆసుపత్రిని నిర్మించడానికి సుభాషిణి మిస్త్రీ గారు ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమారు; కూరగాయలు అమ్మారు. ఇరవై మూడేళ్ల వయస్సులో వైద్య సదుపాయం అందక ఆవిడ భర్త మరణించారు. ఆ సంఘటన ఆవిడలో పేదవారి కోసం ఆసుపత్రి నిర్మించాలనే సంకల్పాన్ని కలిగించింది. ఇవాళ ఆవిడ ఎంతో కష్టంతో నిర్మించిన ఆసుపత్రిలో వేల మంది పేదలకు ఉచిత వైద్యం అందించడం జరుగుతోంది. మన బహు రత్న భరత భూమిలో ఎవరికీ తెలియని, ఎవరూ గుర్తించని ఇలాంటి నర రత్నాలు,నారీ రత్నాలు ఎందరో ఉన్నారని నాకు ఎంతో నమ్మకం. ఇటువంటి వ్యక్తులకు గుర్తింపు లేకపోవడం సమాజానికే నష్టం. మన చుట్టుపక్కల సమాజం కోసం జీవిస్తున్న వారు, సమాజం కోసం జీవితాలను అంకితం చేసే వారు, ఏదో ఒక ప్రత్యేకతతో జీవితమంతా లక్ష్యంతో పని చేసే వారు ఉన్నారు. వారిని ఎప్పటికైనా సమాజంలోకి తీసుకురావాలి. అందుకు పద్మ పురస్కారాలు ఒక మాధ్యమం. వారు గౌరవ మర్యాదలను కోరుకోరు. వాటి కోసం పని చెయ్యరు. కానీ వారి పనుల ద్వారా మనకు ప్రేరణ లభిస్తుంది. పాఠశాలలకు, కళాశాలలకు పిలిచి వారి అనుభవాలను అందరూ వినాలి. పురస్కారాలను దాటుకుని కూడా సమాజంలో కొన్ని ప్రయత్నాలు జరగాలి.

ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీన మనం ప్రవాసి భారతీయ దినంగా మనం జరుపుకొంటున్నాం. గాంధీ గారు ఇదే తేదీన దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజున మనం భారతదేశంలోనూ, ప్రపంచంలోని నలుమూలల్లోనూ నివసిస్తున్న భారతీయులందరి మధ్యన ఉన్న వీడని బంధానికి ఉత్సవాన్ని జరుపుకొంటాం. ఈసారి ప్రవాసి భారతీయ దినం నాడు ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులను, మేయర్ల ను అందరికీ మనం ఒక కార్యక్రమానికి ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో మలేశియా, న్యూ జిలాండ్, స్విట్జర్ లాండ్, పోర్చుగల్, మారిషస్, ఫిజి, టాంజానియా, కెన్యా, కెనడా, బ్రిటన్, సురినామ్, దక్షిణ ఆఫ్రికా, ఇంకా అమెరికాల నుండి, ఇంకా ఇతర దేశాలలో ఎక్కడెక్కడ మన భారత సంతతికి చెందిన మేయర్లు ఉన్నారో, ఇతర దేశాలలో ఎక్కడెక్కడ మన భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, వారంతా పాల్గొన్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు, ఆయా దేశాల సేవలు చేస్తూనే భారతదేశంతో కూడా తమ సంబంధాలను బలంగా నిలుపుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది.

ఈసారి యూరోపియన్ యూనియన్ నాకు ఒక కేలెండర్ ను పంపించింది. అందులో వారు యూరోప్ లో వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయుల ద్వారా విభిన్న రంగాలలో వారు చేస్తున్న పనులను మంచిగా చూపించారు. యూరోప్ లో వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయుల కొందరు సైబర్ సెక్యూరిటీలో పని చేస్తుంటే, కొందరు ఆయుర్వేదానికి అంకితమయ్యారు. కొందరు తమ సంగీతంతోనూ, మరికొందరు కవిత్వంతోనూ సమాజాన్ని రంజింపజేస్తున్నారు. కొందరు వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తే, కొందరు భారతీయ గ్రంథాలపై పని చేస్తున్నారు. ఒకరు ట్రక్ ను నడిపి గురుద్వారా ను నిర్మిస్తే, మరొకరు మసీదు ను నిర్మించారు. మన భారతీయులు ఎక్కడ ఉన్నా వారు అక్కడ ఉన్న భూమిని ఏదో ఒకరకంగా అలంకరించారు. ఇటువంటి చెప్పుకోదగ్గ కార్యక్రమానికి గాను భారతీయ మూలాలు ఉన్న ప్రజలను గుర్తించడానికీ, వారి మాధ్యమం ద్వారా ప్రపంచం లోని ప్రజలకు వారి సమాచారాన్ని తెలిపినందుకు గానూ యూరోపియన్ యూనియన్ కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మనందరికీ సరైన మార్గాన్ని చూపిన పూజ్య బాపూ జీ వర్ధంతి జనవరి ముఫ్ఫై వ తేదీ న. ఆ రోజు మనం అమర వీరుల దినం జరుపుకుంటాం. ఆ రోజున దేశ రక్షణకు తమ ప్రాణాలను అర్పించిన గొప్ప అమరవీరులకు పదకొండు గంటలకు శ్రద్ధాంజలిని అర్పిస్తాం. శాంతి, అహింసల మార్గమే బాపూజీ మార్గం. భారతదేశమైనా, ప్రపంచం అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబం అయినా, సమాజం యావత్తూ పూజించే బాపూ జీ ఏ ఆదర్శాల కోసమై జీవించారో, ఏ విషయాలు మనకు చెప్పారో, అవి నేటికి కూడా అవి అత్యంత ఉపయుక్తమైనవి. అవి కేవలం కాగితపు సిద్ధాంతాలు మాత్రమే కాదు. ప్రస్తుత కాలంలో కూడా మనం అడుగడుగునా బాపూ జీ మాటలు ఎంత నిజమైనవో చూస్తున్నాం. మనం బాపూ జీ బాటలో నడవాలని సంకల్పించి, ఎంత నడవగలమో అంత నడిస్తే అంతకు మించిన శ్రద్ధాంజలి బాపూ జీకి ఏమి ఉంటుంది ?

ప్రియమైన నా దేశ వాసులారా, మీ అందరికీ 2018 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం!

***