Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో ఫిబ్రవరి 26, 2017 నాడు ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ ( మనసులో మాట) కార్యక్రమం పూర్తి పాఠం


ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారం. చలికాలం ఇక అయిపోతోంది. వసంత ఋతువు మన జీవితాల్లోకి తొంగిచూస్తోంది. శరత్కాలం తరువాత చెట్లకు కొత్త చిగుర్లు వస్తాయి. పూలు వికసిస్తాయి/పూస్తాయి. తోటలు,వనాలు పచ్చదనంతో నిండిపోతాయి.

పక్షుల కిలకిలారావాలు మనసును హత్తుకుంటాయి. పువ్వులే కాకుండా పళ్ళు కూడా చెట్ల కొమ్మల్లో నుండి ఎండలో మెరుస్తూ కనబడతాయి. ఎండాకాలంలో బాగా వచ్చే మామిడి పళ్ళ తాలూకూ మామిడి పూత వసంతంలోనే కనబడడం మొదలవుతుంది. పొలాల్లో పసుపు పచ్చని ఆవ పూలు రైతుల అంచనాలను పెంచుతాయి. ఎర్రని మోదుగ పూలు హోలీ వస్తోందన్న సందేశాన్ని అందిస్తాయి. కవి అమీర్ ఖుస్ రో ఋతువులు మారుతున్న ఈ క్షణాలపై ఎంతో ఇంపైన వర్ణన చేశారు.  ఆయన ఇలా అన్నారు :

“తోటలన్నింటా పూసిన ఆవపూలు,
ఆకాశం కురిపించినట్లున్న మోదుగపూలు,
కొమ్మ కొమ్మకూ కోయిలపాట..”

ప్రకృతి ఆనందకరంగా ఉన్నప్పుడు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మనిషి కూడా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తాడు. వసంత పంచమి, మహా శివరాత్రి, హోలీ మొదలైన పండుగలు మనిషి జీవితంలో ఆనందాల రంగులను నింపుతాయి. ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం నిండిన వాతావరణంలో మనం మన చివరి మాసమైన ‘ఫాల్గుణాని’కి వీడ్కోలు చెప్పబోతున్నాం. కొత్త నెల ‘చైత్రాన్ని’ స్వాగతించడానికి తయారుగా ఉన్నాం. ఈ రెండు నెలల సంయోగమే కదా వసంత ఋతువు.

‘మనసులో మాట’ కన్నా ముందు నుండే నేను అడిగినప్పుడల్లా NarendraModiApp, ట్విటర్, ఫేస్ బుక్ లలోను, ఉత్తరాల ద్వారాను నాకు బోలెడు సలహాలను అందించిన లక్షల మంది దేశ వాసులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారందరికీ నేను ఋణపడి ఉంటాను.

శోభా జాలాన్ అనే ఆవిడ NarendraModiApp లో “చాలా మంది ప్రజలకు ఐఎస్ఆర్ఒ ఉపయోగాలను గురించిన అవగాహన లేదు కాబట్టి, మీరు 104 ఉపగ్రహాల ప్రయోగం గురించీ ఇంటర్ సెప్టర్ మిసైల్ గురించీ కొంత సమాచారాన్ని అందించవలసింది” అని కోరారు.

శోభ గారూ, భారతదేశం గర్వించే ఉదాహరణను గుర్తు చేసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. పేదరికాన్ని పరిష్కరించాలన్నా, వ్యాధుల నుండి రక్షింపబడాలన్నా, ప్రపంచంతో ముడిపడాలన్నా, జ్ఞానాన్నీ, సమాచారాలనూ చేర్చాలన్నా, సాంకేతికత, విజ్ఞానం ద్వారానే సాధ్యపడేటటువంటి స్థానాన్ని అవి సంపాదించుకున్నాయి. 2017, ఫిబ్రవరి 15వ తేదీ భారతీయుల జీవితాలలో గౌరవప్రదమైన రోజు. మన దేశం ప్రపంచం ముందు గర్వంతో తలెత్తుకునేంత గొప్ప పనిని మన శాస్త్రవేత్తలు చేశారు. వారు గత కొద్ది కాలంగా ఐఎస్ఆర్ఒ (ఇస్రో)లో ఎన్నో అపూర్వమైన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. అంగారక గ్రహానికి, ‘మార్స్ మిషన్ ’, ‘మంగళ్ యాన్’ మొదలైన విజయవంతమైన ప్రయోగాల తరువాత కొద్ది రోజుల క్రితమే అంతరిక్ష క్షేత్రంలో ప్రపంచ రికార్డు ను ఐఎస్ఆర్ఒ నెలకొల్పింది. ఒక పెద్ద ప్రయోగం ద్వారా ఒకేసారి భారతదేశంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, కజాక్ స్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎఇ వంటి  దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను ఐఎస్ఆర్ఒ విజయవంతంగా ప్రయోగించింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది. ఇది పిఎస్ఎల్ వికి వరుసగా 38వ విజయవంతమైన ప్రయోగం కావడం ఆనందించాల్సిన విషయం. ఇది కేవలం ‘ఇస్రో’ కే కాక భారతదేశానికి కూడా ఒక చరిత్రాత్మక విశిష్ట కార్యం.  ఇస్రో అతి తక్కువ ఖర్చుతో దక్షతతో నిర్వహించిన ఈ అంతరిక్ష కార్యక్రమం యావత్ ప్రపంచంలో ఒక అద్భుతంగా మారింది; భారతదేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయాన్ని మొత్తం ప్రపంచం విశాల హృదయంతో ప్రశంసించింది.

సోదర సోదరీమణులారా, ఈ 104 ఉపగ్రహాలలోనూ ముఖ్యమైంది భారతదేశ ఉపగ్రహం కార్టొశాట్ 2డి. ఈ శాటిలైట్ తీసే చిత్రాలు, వనరుల మ్యాపింగ్, మౌలిక సదుపాయాలు, అభివృధ్ధి అంచనాలు, పట్టణ అభివృధ్ధి ప్రణాళికలూ మొదలైనవాటికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నా రైతు సోదర సోదరీమణులకు దేశంలో నీటి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే దృష్టిలో పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి, తదితర అంశాలపై కార్టొశాట్ 2డి మనకు సహకరిస్తుంది. మన శాటిలైట్ వెళ్తూనే కొన్ని చిత్రాలను పంపించింది. అది తన పనిని అప్పుడే మొదలుపెట్టేసింది. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం కార్యక్రమం తాలూకూ పర్యవేక్షణంతా మన యువ శాస్త్రవేత్తలు, మహిళా శాస్త్రవేత్తలూ చేశారు. యువకులు, మహిళల ఈ బలమైన భాగస్వామ్యం ఇస్రో సాధించిన విజయంలోకెల్లా ఒక గౌరవప్రదమైన విషయం. ఇస్రో శాస్త్రవేత్తలకు దేశ ప్రజలందరి పక్షాన నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల కోసం, దేశ సేవ కోసం, అంతరిక్ష విజ్ఞానం ఉపయోగపడాలనే లక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఉంచేందుకు నిత్యం కొత్త కొత్త రికార్డులను కూడా వారు నెలకొల్పుతున్నారు. మన  శాస్త్రవేత్తలకూ, వారి పూర్తి బృందానికీ మనం ఎన్ని అభినందనలు తెలిపినా తక్కువే.

శోభ గారు భారత దేశ భద్రతకు సంబంధించిన మరో ప్రశ్న కూడా వేశారు. ఆ విషయంలో భారతదేశం మరో గొప్ప సాఫల్యాన్ని కూడా సాధించింది. ఈ విషయాన్ని గురించి పెద్దగా చర్చలేమీ జరగలేదు కానీ ఈ ముఖ్యమైన విషయంపై ఆవిడ దృష్టి పడింది. రక్షణ రంగంలో కూడా భారతదేశం బాలిస్టిక్ ఇంటర్ సెప్టర్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించింది. ఇంటర్ సెప్షన్ టెక్నాలజీ వారి ఈ క్షిపణి తన ప్రయోగంలో భాగంగా భూమి నుండి దగ్గర దగ్గరగా 100 కిలోమీటర్ల ఎత్తు నుండి శత్రువుల క్షిపణిని గుర్తించి, కుప్పకూల్చి విజయాన్ని సాధించింది. రక్షణ రంగంలో ఇది చాలా కీలకమైన విజయం. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి పట్టు సాధించిన దేశాలు అతికష్టం మీద నాలుగో, లేక ఐదో ఉంటాయన్న సంగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మన భారత శాస్త్రవేత్తలు ఇది చేసి చూపెట్టారు. ఇంకా దీని శక్తి ఎటువంటిదంటే, ఒకవేళ 2000 కిలోమీటర్ల దూరం నుండి కూడా భారతదేశాన్ని ఆక్రమించేందుకు ఏదైనా క్షిపణి వస్తే, అంతరిక్షంలోనే దాన్ని నాశనం చేసే శక్తి మన క్షిపణి కి ఉంది.

కొత్త టెక్నాలజీని చూసినప్పుడు, ఏవైనా విజ్ఞానపరమైన కొత్త విజయాలు లభించినప్పుడూ మనకు ఆనందం కలుగుతుంది. మానవజీవితం తాలూకూ అభివృధ్ధి యాత్రలో జిజ్ఞాస చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ప్రత్యేకమైన వివేకం, ప్రతిభ గల వారు వారి జిజ్ఞాసను జిజ్ఞాస లాగా ఉండనివ్వరు. వారు దాని లోపల కూడా ప్రశ్నలు పుట్టించి, కొత్త జిజ్ఞాసలను వెతుకుతారు. కొత్త జిజ్ఞాసలను సృష్టిస్తారు. అదే జిజ్ఞాస కొత్త శోధనకు కారణమౌతుంది. వారి ప్రశ్నలకు సమాధానాలు దొరికేవరకూ వివేకవంతులు నిద్రపోరు. మానవజీవితం తాలూకూ వేల సంవత్సరాల అభివృధ్ధి యాత్రను గనుక మనం పరిశీలిస్తే, ఈ మానవజీవితం తాలూకూ అభివృధ్ధి యాత్రకు ఏ అంతమూ లేదన్న విషయాన్ని మనం చెప్పగలం. అంతం అనేది అసంభవం. బ్రహ్మాండాన్నీ, సృష్టి నియమాలనూ, మనిషి మనసునూ తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కొత్త విజ్ఞానం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందులోనుండే పుడతాయి. అలా పుట్టే ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం ఒక కొత్త యుగానికి జన్మనిస్తాయి.

నా ప్రియమైన యువకులారా, విజ్ఞానం, శాస్త్రవేత్తల కఠిన పరిశ్రమల విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడల్లా నేను ‘మన్ కీ బాత్‘ (మనసులో మాట)లో చాలా సార్లు మన యువతరంలో విజ్ఞానం పట్ల ఆకర్షణను పెంచాలన్న సంగతి చెప్తూ వచ్చాను. దేశానికి చాలా మంది శాస్త్రవేత్తల అవసరం ఉంది. నేటి శాస్త్రవేత్తలు రాబోయే తరాలలోని  జీవన విధానంలో ఒక శాశ్వత మార్పుకు కారణమౌతారు.

మహాత్మా గాంధీ చెప్పే వారు  “No science has dropped from the skies in a perfect form. All sciences develop and are built up through experience” అని.

ఇంకా పూజ్య బాపూజీ “I have nothing but praise for the zeal, industry and sacrifice that have animated the modern scientists in the pursuit after truth” అని కూడా అన్నారు.

విజ్ఞానం ఎప్పుడూ సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తన సిధ్ధాంతాలను సహజంగా ఎలా ఉపయోగించుకోవచ్చో, వాటికి ఏ మాధ్యమం ఉపయోగకరమో, ఏ సాంకేతిక పరిజ్ఞానం అవసరమో గమనించాలి. ఎందుకంటే, సామాన్య మానవుడికి అదే అన్నింటికన్నా ఎంతో ఉపయోగకరమైన వరమౌతుంది. గత కొన్ని రోజుల్లో నీతీ ఆయోగ్, భారత విదేశీ మంత్రిత్వ శాఖ కలిసి 14వ ప్రవాస భారతీయ దినం సందర్భంగా ఒక పెద్ద అద్వితీయమైన పోటీకి ప్రణాళిక ను తయారుచేశాయి. సమాజానికి ఉపయోగపడే  సృజనాత్మకతను ఆహ్వానించడమైంది. ఇటువంటి సృజనాత్మకతలను గుర్తించడం, ప్రదర్శించడం, ప్రజలకు వాటి సమాచారాన్ని అందించడం, ఇలాంటి సృజనాత్మక ఆవిష్కారాలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి, వాటిని పెద్ద ఎత్తున ఎలా ఉత్పత్తి చెయ్యాలి, వాటిని వాణిజ్యపరంగా ఎలా ఉపయోగించాలి మొదలైనవాటిని చూసినప్పుడు, వారు ఎంత గొప్ప పని చేశారో అని నాకు అనిపించింది. ఇటీవలే నేనొక ఆవిష్కరణని చూశాను. మన పేద జాలర సోదరుల కోసం అది తయారు చెయ్యబడింది. ఒక సామాన్యమైన మొబైల్ యాప్ తయారైంది. ఆ యాప్ లోని గొప్ప సంగతి ఏమిటంటే, జాలరులు చేపలు పట్టేందుకు వెళ్ళేప్పుడు, వారు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ చేపలు ఎక్కువ ఉంటాయో, గాలి ఎంత వేగంతో ఎటువైపు వీస్తోందో, అలలు ఎంత ఎత్తు వరకూ ఎగసిపడుతున్నాయో, అంటే ఒక్క యాప్ లోనే ఇంత సమాచారం లభిస్తోంది. దీనివల్ల మన జాలర సోదరులు చాలా తక్కువ సమయంలో ఎక్కడ ఎక్కువ చేపలు ఉన్నాయో అక్కడికి తక్కువ సమయంలో చేరి, తమ సంపాదన పెంచుకోగలుగుతారు.

అప్పుడప్పుడు సమస్య కూడా సమాధానం కోసం విజ్ఞాన మహత్వాన్ని చాటిచెప్తుంది. 2005లో ముంబయి లో ఎక్కువ వర్షాలు కురిశాయి. వరదలు వచ్చాయి. సముద్రం కూడా పొంగడం వల్ల చాలా కష్టాలు వచ్చాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అది ముందర పేదవాడికే వస్తుంది. ఇద్దరు వ్యక్తులు పెద్ద మనసుతో ఈ విషయంలో పని చేశారు. ఇటువంటి సమయాల్లో ఇంటిని రక్షించేలా, ఇంట్లోని వారిని రక్షించేలా, ఇంట్లో నీరు నిండకుండా కాపాడేలా, నీటి వల్ల కలిగే వ్యాధుల నుండి కూడా కాపాడేటటువంటి ఒక ప్రత్యేకమైన ఇంటి నమూనాని ఊహించి, అభివృధ్ధి చేశారు. ఇలాంటివి చాలా అవిష్కరణలే ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, సమాజంలో, దేశంలో, ఈ రకమైన పాత్రను పోషించే మనుషులు చాలా మందే ఉంటారు. మన సమాజం కూడా చాలా వరకూ సాంకేతికత దిశగానే పయనిస్తోంది. వ్యవస్థలన్నీ కూడా సాంకేతికత దిశగానే నడుస్తున్నాయి. ఒక విధంగా సాంకేతికత మన జీవితాలలో ఒక విభిన్నమైన భాగంగా మారుతోంది. గత కొద్ది రోజులుగా డిజి- ధన్ యోజన చాలా బలపడుతున్నట్లు తోస్తోంది. నెమ్మది నెమ్మదిగా ప్రజలు నగదుని వదిలి డిజిటల్ కరెన్సీ వైపుగా ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలు చాలా వేగంగా అభివృధ్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా యువతరం తమ మొబైల్ ఫోన్స్ నుండే తమ డిజిటల్ చెల్లింపులను జరపడానికి అలవాటుపడుతున్నారు. ఇదొక శుభ సంకేతంగా నేను భావిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం మన దేశంలో ‘లకీ గ్రాహక్ యోజన’, ‘డిజి-  వ్యాపార్ యోజన’లకు భారీ మద్దతు లభించింది. దగ్గరదగ్గరగా రెండునెలలు గడిచిపోయాయి. ప్రతి దినం పదిహేను వేల మందికి తలో వెయ్యి రూపాయిల బహుమానం గెల్చుకున్నారు. ఈ రెండు పథకాల ద్వారా భారతదేశంలో నగదు చెల్లింపును ఒక ప్రజా ఉద్యమంగా మార్చే ఒక ప్రయత్నం జరిగింది. యావత్ దేశం దీనిని స్వాగతించింది. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా ‘డిజి- ధన్ యోజన’ ద్వారా పది లక్షల మంది ప్రజలకు బహుమతి లభించింది. ఏభై వేల మందికి పైగా వ్యాపారస్తులు బహుమతులు గెలిచారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రజలకు  బహుమతి రూపంలో  ఇంచుమించు నూట ఏభై కోట్ల రూపాయిలకు పైగానే లభించింది. ఈ ప్రణాళికలో భాగంగానే వంద కంటే ఎక్కువ ఖాతాదారులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున బహుమతి లభించింది. నాలుగువేల కంటే ఎక్కువమంది వ్యాపారస్థులకు ఏభై వేల చొప్పున బహుమతి లభించింది. రైతైనా, వ్యాపారస్థులైనా, చిన్న ఉద్యోగస్తులైనా, కుల వృత్తి చేసేవారైనా, గృహిణులైనా, విద్యార్థులైనా, అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి లాభం కూడా చేకూరుతోంది. చూడండి, యువకులే పాల్గొంటున్నారా? లేదా పెద్ద వయసువారు కూడా పాల్గొంటున్నారా అని నేను ఈ విశ్లేషణ వివరాలను అడిగినప్పుడు, బహుమతి పొందినవారిలో పదిహేను సంవత్సరాల యువకులే కాకుండా అరవై ఐదు, డెభ్భై సంవత్సరాల పెద్దలు కూడా ఉన్నారని తెలిసి నాకు ఆనందం కలిగింది.

మైసూర్ నుండి శ్రీ సంతోష్ గారు తన ఆనందాన్ని ప్రకటిస్తూ NarendraModiApp లో వారికి లకీ గ్రాహక్ యోజన లో వెయ్యి రూపాయిల బహుమతి లభించిందని రాశారు. కానీ వారు రాసిన అన్నింటికన్నా గొప్ప సంగతి, నాకు పంచుకోవాలనిపించిన సంగతి ఏమిటంటే, “వెయ్యి రూపాయిల బహుమతి నాకు లభించిన సమయంలో నాకో సంగతి తెలిసింది. ఒక పేద వృద్ధురాలి ఇంటికి నిప్పు అంటుకుని, సామానంతా కాలిపోయిందని తెలిసింది. నాకు లభించిన వెయ్యి రూపాయిల బహుమతికి హక్కుదారు ఆ పేద వృధ్ధురాలు అనిపించి, ఆ వెయ్యి రూపాయిలూ ఆమెకు ఇచ్చేశాను. ఇలా చెయ్యడం నాకెంతో ఆనందం కలిగించింది” అని రాశారు. సంతోష్ గారూ, మీ పేరు, మీ పని రెండూ మా అందరికీ సంతోషాన్ని ఇస్తున్నాయి. మీరెంతో ప్రోత్సాహకరమైన పని చేశారు.

ఢిల్లీ కి చెండిన ఇరవై రెండేళ్ళ కారు డ్రైవరు, సోదరుడు సబీర్ నోట్ల చట్టబద్ధత రద్దు తరువాత తన రోజువారీ కార్యకలాపాల్లో డిజిటల్ వ్యాపారంతో ముడిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన ‘లకీ గ్రాహక్ యోజన’లో అతడికి ఒక లక్ష రూపాయిలు బహుమతి లభించింది. ఇవాళ అతడు కారు నడుపుతాడు. కానీ ఒకరకంగా ఈ ప్రణాళికకు రాయబారిగా మారాడు. ప్రయాణికులందరికీ ఎప్పుడూ డిజిటల్ సంబంధమైన విషయాలను చెప్తూ ఉంటాడు. ఎంతో ఉత్సాహంగా విషయాలను చెప్తూ, ఇతరులనూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు.

మహారాష్ట్ర నుండీ పిజి చదువుకుంటున్న పూజా నేమాడే అనే ఒక యువ మిత్రురాలు కూడా రూపే కార్డ్, ఇ-వేలెట్ ల ఉపయోగం తన కుటుంబంలో ఎలా జరుగుతోందో, దానిని అమలుజరుపుతుంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారో, తన అనుభవాలను తన స్నేహితులతో పంచుకుంటూ ఉంటుంది. లక్షరూపాయల బహుమానం రావడం తనకు ఎంత విలువైనదో చెప్తూ, తాను దీనిని ఒక ఉద్యమంగా తీసుకుని, ఇతరులను కూడా ఇందుకోసం ప్రోత్సహిస్తోంది.

దేశ ప్రజలకు, ముఖ్యంగా దేశ యువతకూ , ఈ ‘లకీ గ్రాహక్ యోజన’ లేదా ‘డిజి- ధన్ వ్యాపార యోజన’లో బహుమతి లభించిన వారిని స్వయంగా ఈ ప్రణాళికలకు రాయబారిగా మారమని కోరుతున్నాను. మీరు దీనిని ముందుకు నడిపించండి. ఈ పని ఒక రకంగా అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. నా దృష్టిలో, ఈ పనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఒక కొత్త అవినీతి వ్యతిరేక దళమే. ఒకరకంగా మీరు శుభ్రతా సైనికులు. మీకు తెలుసు, ‘లక్కీ గ్రాహక్ యోజన’ వంద రోజులు పూర్తయ్యే రోజైన ఏప్రిల్ 14వ తేదీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి.

గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఏప్రిల్ 14న కొన్ని కోట్ల రూపాయల బహుమతి ఉన్న ఒక డ్రా జరగబోతోంది. దానికి ఇంకా దగ్గర దగ్గర 40, 45 రోజులు ఉన్నాయి. బాబా సాహెబ్ అంబేడ్కర్ ను గుర్తుచేసుకుంటూ మీరొక పని చెయ్యగలరా ? కొద్ది రోజుల క్రితమే బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి జరిగింది. వారిని గుర్తు చేసుకుని మీరు కూడా కనీసం 125 మందికి BHIM APP డౌన్ లోడ్ చేసుకోవడం నేర్పించండి.  దానితో వ్యాపార లావాదేవీలు ఎలా జరుగుతాయో నేర్పించండి, ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉండే చిన్నపాటి వ్యాపారస్తులకు నేర్పించండి. ఈసారి బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, BHIM APP , రెండింటికీ విశేషమైన ప్రత్యేకతను ఇవ్వండి. అందుకే నేను చెప్పేదేమిటంటే,  బాబా సాహెబ్  వేసిన పునాదిని మనం బలపరచాలి. ఇంటింటికీ వెళ్ళి, అందరినీ కలుపుకుని 125 కోట్ల చేతుల వరకూ BHIM APP ను చేర్చాలి. గత రెండు మూడు నెలల నుండీ జరుగుతున్న ఈ ఉద్యమం ప్రభావం ఏమిటంటే, ఎన్నో కాలనీలలో, ఎన్నో పల్లెల్లో, ఎన్నో పట్టణాల్లో ఎంతో సఫలమైంది.

ప్రియమైన నా దేశ వాసులారా, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక పెద్ద మూలస్తంభం. పల్లెల్లోని ఆర్థిక బలం, దేశ ఆర్థిక పురోగతికి బలాన్నిస్తుంది. ఇవాళ నేనొక ఆనందకరమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మన రైతు సోదర, సోదరీమణులు ఎంతో శ్రమించి మన ధాన్యాగారాలను నింపేశారు. ఈ ఏడాది మన దేశంలో రైతుల శ్రమతో రికార్డు స్థాయిలో ధాన్య ఉత్పాదన జరిగింది. మన రైతులు పాత రికార్డులన్నీ బద్దలుకొట్టేశారు అని అన్ని సంకేతాలు తెలుపుతున్నాయి. ఈసారి పొలాల్లో పంటలు ఎలా పండాయంటే, ప్రతి రోజూ పొంగల్, బైశాఖీ పండుగలు జరుపుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఈ సంవత్సరం దేశంలో దాదాపు రెండువేల ఏడువందల లక్షల టన్నులకు మించి ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం జరిగింది. మన రైతుల పేరున నమోదైన ఆఖరి రికార్డ్ కంటే ఈసారి 8% ఎక్కువ నమోదైంది. ఇది ఇంతకుమునుపెన్నడూ ఎరగని సాఫల్యం. నేను దేశ రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు సంప్రదాయ పంటలే కాకుండా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని, రకరకాల పప్పు ధాన్యాలను కూగా సాగుచేశారు. ఎందుకంటే పేదవారికి పప్పు తోనే అన్నింటికన్నా ఎక్కువ ప్రోటీన్లు అందుతాయి. దేశంలో రైతులు పేదవారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర దగ్గరగా రెండువందల తొంభై లక్షల హెక్టార్ల భూమిలో రకరకాల పప్పుధాన్యాల పంటలు పండించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది కేవలం రకరకాల పప్పుల ఉత్పాదనే కాదు, నా దేశ పేద ప్రజలకి రైతులు చేసిన గొప్ప సేవ. నా ప్రార్థనని, నా విన్నపాన్నీ , నా దేశ రైతులు ఏ ప్రకారంగా నెత్తిమీద పెట్టుకుని కష్టపడి పప్పుధాన్యాల రికార్డ్ ఉత్పాదన చేశారో.. అందుకే నా రైతు సోదర సోదరీమణులు ప్రత్యేకమైన అభినందనలకు అర్హులు.

ప్రియమైన నా దేశ వాసులారా, మన దేశంలో ప్రభుత్వం ద్వారా, సమాజం ద్వారా, సంస్థల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా స్వచ్ఛత దిశగా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. ఒక రకంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో స్వచ్ఛత కు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తుట్లుగా కనబడుతోంది. ప్రభుత్వం కూడా నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వ జల, పారిశుధ్య మంత్రిత్వ శాఖ తాలుకూ తాగు నీరు, స్వచ్ఛత మంత్రిత్వ విభాగం వారి కార్యదర్శి నేతృత్వంలో 23 రాష్ట్ర ప్రభుత్వాల  సీనియర్ అధికారుల కార్యక్రమం ఒకటి తెలంగాణలో జరిగింది. ఆ సదస్సు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో తలుపులు మూసి ఉన్న ఒక గదిలో కాకుండా, ప్రత్యక్షంగా స్వచ్ఛత వల్ల ఉన్న ప్రయోజనాలు ఏమిటో వాటిని ప్రయోగపూర్వకంగా ఎలా చెయ్యాలో చేసి చూపెట్టారు. ఫిబ్రవరి 17, 18 తేదీలలో హైదరాబాద్ లో toilet pit emptying excercise ను నిర్వహించారు. ఆరు ఇళ్ళ toilet pitsను ఖాళీ చేయించి, వాటిని బాగుచేశారు. ట్విన్ పిట్ టాయిలెట్ లను ఖాళీ చేశాకా, మళ్ళీ ఆ టాయిలెట్ గొయ్యిలను తిరిగి ఉపయోగించుకునే విధానాలను అధికారులే స్వయంగా చూపెట్టారు. ఈ కొత్త టెక్నిక్ గల మరుగుదొడ్లు ఎంత సౌకర్యవంతమైనవో కూడా వారు చూపెట్టారు. వీటిని ఖాళీ చేసి, తిరిగి శుభ్రపరిచే పధ్ధతిలో ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. ఎటువంటి సంకోచమూ ఉండదు. టాయిలెట్లను శుభ్రపరచడానికి మానసిక అడ్డంకి ఏదైతే ఉంటుందో, అది కూడా ఉండదు. మనం ఇతర శుభ్రతలు ఎలా చేసుకుంటామో, ఈ టాయిలెట్ గొయ్యిలను కూడా అలానే శుభ్రపరుచుకోవచ్చు. దేశంలో ఈ ప్రయత్నానికి మీడియా ద్వారా చాలా ప్రచారం లభించింది. ఈ కార్యక్రమానికి స్వాభావికంగానే ప్రాముఖ్యత లభించింది. ఎందుకంటే ఒక ఐఎఎస్ అధికారి స్వయంగా టాయిలెట్ గొయ్యిలను శుభ్రపరిచినప్పుడు అది దేశప్రజల దృష్టిని ఆకర్షించడం స్వాభావికమే. ఈ టాయిలెట్ పిట్ ల శుభ్రపరిచేప్పుడు మనం ఏదైతే చెత్తా చెదారం అనుకుంటామో,  దానిని ఎరువు రూపంలో చూస్తే అది నల్ల బంగారమే. వ్యర్థం సంపదగా ఎలా మారగలదో మనం తెలుసుకుంటాము. అది నిరూపించబడింది కూడా. ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి ఒక స్టాండర్డ్ ట్విన్ పిట్ టాయిలెట్ ఐదేళ్ళ లో నిండుతుంది. ఆ తరువాత చెత్తను సులువుగా మరొక పిట్ లోకి మళ్ళించవచ్చు. ఆరు నుండి పన్నెండు నెలల్లో టాయిలెట్ గొయ్యి లో చేరిన చెత్త పూర్తిగా కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన చెత్త నిర్వహణ ఎంతో సురక్షితం. ఎరువు రూపంలో చూసినా ఎంతో ముఖ్యమైన ఎన్ పికె ఎరువు. రైతులకు ఎన్ పికె ఎరువు సుపరిచితమే. ఇది నైట్రోజన్, భాస్వరం, పొటాషియం మొదలైన పోషక తత్వాలతో నిండి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఇది ఎంతో ఉత్తమమైన ఎరువుగా పరిగణించబడుతుంది.

ప్రభుత్వం ఏ రకంగా ఈ ముందడుగు తీసుకుందో, ఇతరులు కూడా ఇలాంటి ముందడుగు ప్రయోగాలు చేసే ఉంటారు. ఇప్పుడు దూరదర్శన్ లో కూడా స్వచ్ఛత వార్తల తాలూకూ ఒక విశేష కార్యక్రమం వస్తోంది. అందులో ఇటువంటి విషయాలు ఎంత వెలుగు చూస్తే అంత మంచిది. ప్రభుత్వంలో కూడా రకరకాల విభాగాలలో స్వచ్ఛత పక్షోత్సవాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మార్చి నెల మొదటి పక్షంలో ‘మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ’ తో పాటూ ‘గిరిజనాభివృధ్ధి మంత్రిత్వ శాఖ’ వారు కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమానికి మద్దతునివ్వబోతున్నారు. మార్చి నెల రెండవ పక్షంలో మరో రెండు మంత్రిత్వ శాఖలు.. షిప్పింగ్ శాఖ- జల వనరుల శాఖ’, నదుల వికాసం మరియు గంగానది శుద్ధి శాఖ.. కూడా స్వచ్ఛత కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నాయి.

మనకు తెలుసు, మన దేశంలోని ఏ పౌరుడైనా కూడా ఏదైనా సాధించినప్పుడు దేశం యావత్తూ ఒక కొత్త శక్తిని అనుభూతి చెందుతుంది. అది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. రియో పారాలింపిక్స్ లో మన దివ్యాంగ క్రీడాకారుల ప్రదర్శనను మనమెంతో స్వాగతించాం. ఈ నెలలోనే జరిగిన అంధుల జట్టు టి-20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత దేశం పాకిస్తాన్ ను ఓడిస్తూ వరుసగా రెండో సారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి దేశ గౌరవాన్ని పెంచింది. మరో సారి నేను జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. దివ్యాంగ మిత్రుల ఈ ఘనకార్యానికి యావద్దేశం గర్విస్తోంది. దివ్యాంగ సోదర సోదరీమణులు ఎంతో సమర్థవంతులని నేనెప్పుడూ అనుకుంటాను. వారెంతో ధృఢ నిశ్చయం కలిగి ఉంటారు. సాహసవంతులు, సంకల్పబలం గల వారు. ఎల్లప్పుడూ వారి నుండి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది.

విషయం క్రీడా సంబంధితమైనదైనా, అంతరిక్ష సంబంధితమైనదైనా మన దేశ మహిళలు ఎవరికీ తీసిపోరు. అడుగులో అడుగు వేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. తమ విజయాలతో దేశఖ్యాతిని పెంచుతున్నారు. ఈ మధ్య జరిగిన ‘ఏషియా రగ్బీ సెవెన్స్ ట్రోఫీ’ లో మన దేశ మహిళా క్రీడాకారులు రజత పతకం సాధించారు. వారందరికీ నా హృద‌యపూర్వక అభినందనలు.

మార్చి 8వ తేదీన ప్రపంచామంతా కూడా మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతదేశంలో కూడా ఆడపిల్లలకు ప్రాముఖ్యత పెరగాలి. కుటుంబాల్లో, సమాజంలో వారి పట్ల శ్రధ్ధ పెరగాలి. వారిపట్ల కరుణ పెరగాలి. ‘బేటీ బచావో – బేటీ పఢావో’ ఉద్యమం వేగంగా ముందుకు సాగుతోంది. ఇవాళ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. ఒక సామాజిక సంచలనం గా, జన విద్యాకార్యక్రమం గా మారింది. గత రెండేళ్ళుగా ఈ కార్యక్రమం సామాన్య ప్రజల మనస్సులను ఆకర్షించింది. దేశంలోని నలుమూలలా  రగులుతున్న ఈ సమస్య ప్రజలను ఆలోచింపజేసింది. ఏళ్ల తరబడి వస్తున్న ఆచార వ్యవహారాల పట్ల ప్రజల ఆలోచల్లో మార్పు వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంబరాలు జరుపుకుంటున్నారన్న వార్తలు తెలిసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక రకంగా ఆడపిల్లల పట్ల పెరుగుతున్న సానుకూల వైఖరి వారి సామాజిక స్వీకరణకు కారణమౌతోంది. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలను ఆదుపుచేయగలిగారు. ఇప్పటిదాకా దాదాపు 175కు పైగా బాల్య వివాహాలను ఆపగలిగారు. జిల్లా పాలనా విభాగం ‘సుకన్య సమృధ్ధి యోజన’ లో భాగంగా దగ్గర దగ్గర 55-60 వేల పైనే ఆడపిల్లల బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. జమ్ము కశ్మీర్ లోని కధువా జిల్లాలో కన్వర్జెన్స్ మోడల్ ద్వారా అన్ని విభాగాలనూ ’బేటీ బచావో – బేటీ పఢావో యోజన’ కార్యక్రమంలో చేర్చారు. గ్రామ సభల నిర్వహణతో పాటు జిల్లా పాలనా విభాగం ద్వారా అనాధ బాలికలను దత్తత తీసుకోవడం, వారికి విద్యా సదుపాయాలను కల్పించడం మొదలైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మధ్య ప్రదేశ్ లో ఆడపిల్లలను చదివించడం కోసం పల్లె పల్లెలో, ఇంటి ఇంటికీ వెళ్ళి తలుపు తట్టే కార్యక్రమం ఒకటి ’హర్ ఘర్ దస్తక్ ’ అనే పేరుతో జరుగుతోంది. రాజస్థాన్ లో ’అప్నా బచ్చా, అప్నా విద్యాలయ ’ అనే కార్యక్రమాన్ని నడిపించి, ఏ బాలికలైతే బడి మానేశారో వారిని తిరిగి పాఠశాలలో చేర్చి, వారిని మళ్ళీ చదువుకోవడానికి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది.

ఇంతకీ చెప్పేదేమిటంటే, ‘బేటీ బచావో – బేటీ పఢావో’ యోజన కూడా అనేక రూపాంతరాలను చెందుతోంది. ఈ ఉద్యమం మొత్తం ఒక ప్రజాఉద్యమం గా మారింది. కొత్త కొత్త ఆలోచనలు దానితో ముడిపడుతున్నాయి. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకుంటున్నారు. ఇదొక శుభలక్షణంగా నేను భావిస్తున్నాను. మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంలో మనందరిదీ ఒకటే భావన-

“మహిళ ఒక స్వయం శక్తి, ఆమె భారతీయ నారి. ఏ మాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా ఆమెకు అందరితో సరిసమానమైన అధికారం ఉంది.”

ప్రియమైన నా దేశ వాసులారా, ‘మనసులో మాట’ కార్యక్రమం ద్వారా  అప్పుడప్పుడూ మీ అందరితో ఏదో ఒకటి మాట్లాడే అవకాశం నాకు దొరుకుతోంది. మీరంతా కూడా చురుకుదనంతో తోడవుతున్నారు. మీ వద్ద నుండి నేనెంతో తెలుసుకుంటున్నాను. ఏం జరుగుతోంది, పల్లెల్లో, పేదవారు మనసుల్లో ఏమనుకుంటున్నారో నాదాకా వస్తోంది. మీ ఈ సహకారానికి మీకు నేనెంతో ఋణపడి ఉంటాను. అనేకానేక ధన్యవాదాలు.

***