Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో ప్రధాన మంత్రి “మన్ కీ బాత్” ప్రసంగానికి తెలుగు అనువాదం


ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా,

ముందుగా మీ అందరికీ నమస్కారాలు చెప్పి.. నన్ను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనివ్వండి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పర్వ దినాన్ని జరుపుకొంటున్నారు. ఈస్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఇవే నా శుభాకాంక్షలు.

నా యువ మిత్రులారా… మీరంతా ఒకవైపు పరీక్షలలో తీరిక లేకుండా ఉన్నారనుకుంటున్నాను. కొంత మందికి పరీక్షలు పూర్తయి ఉంటాయి. ఇంకా కొంత మందికి ఇంకో విధమైన పరీక్ష; ఒకవైపు పరీక్షలు.. మరొక వైపు టి-20 క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ లు. ఇవాళ సాయంత్రం కూడా భారతదేశం- ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం మీరు తప్పక ఆసక్తితో వేచి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు.

కొద్ది రోజుల కిందట పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో రెండు చక్కని మ్యాచ్లలో భారతదేశం గెలిచింది. ఈ టి20 క్రికెట్ వరల్డ్ కప్ లో మంచి జోరును మనం చూస్తున్నాం. ఈ రోజు భారతదేశం, ఆస్ట్రేలియా జట్లు ఆడటానికి సన్నద్ధం అవుతున్నాయి; ఈ రెండు జట్లకు ఇవే నా శుభాకాంక్షలు.

మన దేశ జనాభాలో 65 శాతం యువతే. క్రీడా ప్రపంచంలో పాలు పంచుకోకుండా మనం దూరంగా ఉండటానికి ఏ కారణమూ కనపడటం లేదు. ఇది జరిగే పని కాదు. క్రీడలలో మనం విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావలసిన అవసరం ఉంది. భారత దేశంలో ఇది చోటు చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు. క్రికెట్ లాగానే ఇప్పుడు ఇక్కడ ఫుట్బాల్ లోను, హాకీ లోను, టెన్నిస్ లోను, కబడ్డీ లోను ఆసక్తి పెరుగుతోంది.

ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ నకు వచ్చే సంవత్సరంలో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచం అంతటి నుంచి ఇరవై నాలుగు జట్లు ఆడటానికి మన దేశానికి రానున్నాయి. 1951లో, 1962లో ఆసియన్ గేమ్స్లో భారతీయ ఫుట్ బాల్ జట్టు బంగారు పతకాలు గెలుచుకుంది. ఇంకా 1956 ఒలింపిక్ గేమ్స్లో భారతదేశ జట్టు నాలుగో

స్థానంలో నిలచింది. దురదృష్టవశాత్తు గడచిన కొన్ని దశాబ్ధాలుగా మనం అక్కడి నుంచి అట్టడుగు స్థానాలకు జారిపోయాం. ఇవాళ ఎఫ్ ఐ ఎఫ్ ఎ లో మన ర్యాంకింగ్ ఎంత తక్కువగా ఉందంటే, దానిని గురించి చెప్పాలన్నా కూడా నాకు మనసు రావడం లేదు.

మరో పక్క, భారతదేశ యువతలో ఫుట్బాల్ పట్ల అభిరుచి అంతకంతకు పెరుగుతుండటాన్ని నేను గమనిస్తూ వస్తున్నాను. అది ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కానివ్వండి, లేదా స్పానిష్ లీగ్ కానివ్వండి, లేదా ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు కానివ్వండి.. భారతీయ యువతీయువకులు ఈ మ్యాచ్ లను గురించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి గాని, వాటిని టెలివిజన్ లో చూడటానికి గాని సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేనేం చెప్పదలచుకొన్నానంటే, ఈ క్రీడ పట్ల ప్రజాదరణ ఇంతగా పెరుగుతున్నప్పుడు ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మనకు దక్కినప్పుడు మనం కేవలం ఆతిథ్య పాత్రను పోషిస్తూ మన బాధ్యతను పూర్తి చేసేద్దామా..? లేక, ఈ అవకాశాన్ని మన కు ప్రయోజనం కలిగేటట్లు ఉపయోగించుకొని క్రీడలను ప్రోత్సహిద్దామా?

ఫుట్ బాల్, ఫుట్ బాల్, ఫుట్ బాల్ అనే పదం ఈ సంవత్సరమంతా మారుమోగే వాతావరణాన్ని మనం సృష్టించాలి– పాఠశాలల్లోను, కళాశాలల్లోను, ఆ మాటకొస్తే భారత దేశం ప్రతి మూల మూలనా. మన యువత, బడులలో మన పిల్లలు ఫుట్ బాల్ ఆడుతూ చెమటతో తడిసి ముద్దయిపోవాలి. అలా జరిగిందంటే, ఆతిథ్యం ఇస్తున్నందుకు మనకు సిసలైన మజా దక్కుతుంది. కాబట్టి, మనం అందరం ఫుట్ బాల్ను గ్రామ గ్రామానికి, వీధి వీధికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. ఇప్పటి నుంచి 2017 లో ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ జరిగే దాకా, యువతలో ఒక రకమైన ఉద్వేగాన్ని నింపుదాం. ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల కలిగే మేలు ఏమిటంటే ఇక్కడ అనేక మౌలిక క్రీడా సదుపాయాలు రూపుదిద్దుకొంటాయి. కానీ, వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే.. మనం మన దేశంలోని ప్రతి యువకుడిని ఈ క్రీడతో మమేకం చేయగలిగినప్పుడే.

మిత్రులారా.. 2017 లో ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ ను మనం మన ప్రయోజనాల కోసం ఎంత ఉత్తమంగా ఉపయోగించుకోగలమనే విషయంలో మీ అభిప్రనయాలు ఏమిటో నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎలా ఉండాలి? ఈ సందర్భం తగినంత వేగం పుంజుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలను మనం ఏడాది పొడవునా నిర్వహించాలి? మనం ఇంకా ఏ యే అంశాలలో మెరుగుదల సాధించవలసిన అవసరం ఉంది? 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ ద్వారా ఈ ఆట పట్ల భారతదేశం యువతలో అభిరుచిని మనం ఎలా పెంచగలం? ఈ క్రీడతో సాన్నిహిత్యం ఏర్పరచుకొనేటట్లుగా ప్రభుత్వంలో, విద్యా సంస్థలలో, సామాజిక సంస్థలలో పోటీతత్వాన్ని ఎలా చొప్పించగలం?

క్రికెట్ లో ఇదంతా చోటు చేసుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం; ఇవే పార్శ్వాలను ఇతర క్రీడా విభాగాలకు కూడా వర్తించేలా మనం ప్రయత్నించాలి. ఎఫ్ ఐ ఎఫ్ ఎ కార్యక్రమం ఇలా చేయడానికి ఒక విశిష్ట అవకాశాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో మీరు మీ సలహాలు, సూచనలను నాకు పంపించగలరా? ఎఫ్ ఐ ఎఫ్ ఎ కార్యక్రమం

భారతదేశాన్ని ఒక బ్రాండ్ గా నెలకొల్పే ఒక మహదవకాశంగా నేను భావిస్తున్నాను. భారత యువత శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచం గుర్తించగలిగేటట్లు చేయడానికి ఇదొక అవకాశమని నేననుకొంటున్నాను– అది ఏదైనా మ్యాచ్ ను గెలిచామా లేక ఓడామా అనే అర్థంలో కాదు సుమా. 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ ఆతిథ్యానికి సిద్ధపడుతూ, మనం శక్తి సామర్థ్యాలను పోగేసుకొని వాటిని ప్రదర్శించవచ్చు.. ప్రదర్శించవచ్చు; అలా చేస్తూనే, మనం భారతదేశ ప్రతిష్టను పెంపొందించే బ్రాండింగ్ ను కూడా చేపట్టవచ్చు.

మీరు 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ నకు సంబంధించిన మీ సలహాలు, సూచనలను NarendraModiApp ద్వారా నాకు పంపించవచ్చు; వాటిని అందుకోవడం గురించి నేను ఎదురుచూస్తాను. లోగో ఎలా ఉండాలి.., స్లోగన్లు ఎలా ఉండాలి.., భారతదేశమంతటా ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి ఎలాంటి పద్ధతులను పాటిద్దాం?, పాటలు ఎలా ఉండాలి?, సావనీర్ లలో ఏయే అంశాలు ఉండాలి? .. మిత్రులారా ఆలోచించండి. ఇంకా నేను ఏం కోరుకుంటున్నానంటే.. ప్రతి యువకుడు, ప్రతి యువతి 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ యొక్క దూత అవ్వాలి. మీరు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలి. భారతదేశ ప్రతిష్టను నిర్మించేందుకు ఇది ఒక సువర్ణావకాశం.

ప్రియమైన నా విద్యార్థులారా, సెలవులలో ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్లాలని మీరు ఆలోచించే ఉంటారు. విదేశాలకు వెళ్లే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల లోపలే వారమో పది రోజులో యాత్రలు చేస్తారు. కొద్ది మంది వారి రాష్ట్రం వెలుపలి ప్రదేశాలను సందర్శిస్తారు. గతంలో కూడా నేను మీ అందరికీ ఒక విన్నపం చేశాను.. మీరు చూసిన స్థలాల ఫొటోలను అప్ లోడ్ చేయండని. నేను చూశాను ఏ పనినైతే మన పర్యాటక విభాగం గాని, సాంస్కృతిక విభాగం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని, లేదా భారత ప్రభుత్వం గాని చేయలేవో.. ఆ పనిని దేశపు కోట్లాది యాత్రికులు చేసి చూపెట్టారు; ఎలాంటి భవ్యమైన ప్రదేశాల ఫొటోలను వారు అప్ లోడ్ చేశారంటే.. వాటిని చూడటం నిజంగా ఎంతో ఆనందాన్నిస్తుంది.

ఈ పనిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఈసారి కూడా ఈ పనిని చేయండి. అయితే – ఈ సారి వాటి మీద ఏదైనా రాయండి. కేవలం ఫొటోనే కాదు… మీకున్న రచనా ఆసక్తిని ప్రదర్శించండి. కొత్త ప్రదేశంలోకి వెళ్తే దానిని చూస్తే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎంతో కొంత లభిస్తుంది. ఏ అంశాలను, విషయాలను మనం తరగతి గదిలో నేర్చుకోలేమో.. ఏవైతే మన కుటుంబంలో స్నేహితుల మధ్య నేర్చుకోలేమో.. అవి తిరగడం ద్వారా ఎక్కువగా నేర్చుకునేందుకు లభిస్తాయి. ఇంకా కొత్త ప్రదేశాల కొత్తదనం అనుభవం అవుతుంది. మనుషులు, వారి భాష, వారి ఆహారపు అలవాట్లు, మాటలు అక్కడి జీవన విధానం.. ఒకటేంటి. ఎన్నెన్నో చూడటానికి లభిస్తాయి. పరిశీలన లేని ప్రయాణీకుడు రెక్కలు లేని పక్షి వంటి వాడు అని అన్నారు ఎవరో. చూడటానికి మీకు నిజంగా ఆసక్తి ఉంటే, వాటిని చూసే అంతర్ దృష్టిని కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. భారతదశం వైవిధ్యాల నిలయం. ఒకసారి చూడటానికి బయలుదేరితే, జీవితం అంతా చూస్తూనే ఉంటారు.. చూస్తూనే ఉంటారు; ఎప్పటికీ తనివి తీరదు. నేను చాలా అదృష్టవంతుడిని. తిరగడానికి నాకు చాలా అవకాశం లభించింది. మీ లాగా నేను ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కానప్పుడు.. వయస్సులో చాలా చోట్ల తిరిగాను. దేశంలో నేను సందర్శించని జిల్లా అంటూ బహుశా లేదేమో.

జీవితాన్ని సరిద్దుకోవడంలో ప్రయాణం ఒక శక్తిమంతమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు భారత దేశంలో యువతలో ప్రయాణం పట్ల మక్కువ, జిజ్ఞాస పెరుగుతూ పోతున్నాయి. ముందు రోజుల్లో లాగా అందరూ వెళ్లే మార్గంలో, తయారుగా ఉన్న మార్గంలో వీరు వెళ్లడం లేదు. వారు ఏదో కొత్తది చేయాలనుకుంటున్నారు; వారు కాస్త కొత్తవి చూడాలనుకుంటున్నారు. దీనిని నేను ఒక మంచి సంకేతంగా భావిస్తాను. మన యువతీయువకులు సాహసవంతులు కావాలి. ఎక్కడైతే ఎప్పుడూ కాలు మోప లేదో, అక్కడ కాలు మోపడానికి ఇష్టపడాలి.

ఈ సందర్భంగా కోల్ ఇండియాకు ప్రత్యేక అభినందనలు తెలపాలని అనుకుంటున్నాను. వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (డబ్ల్యుసిఎల్) నాగ్పూర్ సమీపంలోని సావనేర్ గ్రామం దగ్గర- అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి- అక్కడ పర్యావరణ మైత్రీపూర్వకమైన మైన్ టూరిజం సర్క్యూట్ ను తీర్చిదిద్దింది. సాధారణంగా మనం బొగ్గు గనులు అనేసరికి అవేవో చూడదగ్గవి కావు అని అనుకుంటాం. అక్కడి గని పనివారి చిత్రాలు మనం చూసినట్లయితే, అక్కడికే వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో అని అబ్బురపడతాం. మనకొక సామెత కూడా ఉంది.. అదేంటంటే.. బొగ్గులో చేయిపెడితే చేతులు నల్లగా అయిపోతాయి అని. దీంతో మనుషులు దూరంగా పారిపోతారు. కానీ ఈ బొగ్గునే టూరిజానికి గమ్యంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ చేసి చూపించింది. నేను చాలా ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటంటే.. ఇప్పుడిప్పుడే ఇది ప్రారంభమైంది. నాగ్పూర్ సమీపంలోని సావనేర్ గ్రామ సమీపంలో ఎకో ఫ్రెండ్లీ మైన్ టూరిజం సైట్ ను ఇప్పటి వరకు 10,000 మందికి పైగా తిలకించారు. ఏదైనా ఒక కొత్తదానిని చూడాలంటే ఇదే మనకు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తోంది.

ఈసారి సెలవుల్లో ఊళ్లు తిరగడానికి వెళ్లినపుడు మీరు కూడా శుభ్రత కోసం ఏదన్నా చేయగలరా… ఈ మధ్య ఒక విషయం కనిపిస్తోంది. నిజానికి విమర్శించాలంటే ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి కానీ మొత్తం మీద ఒక చైతన్యం వచ్చిందనే చెప్పాలి. పర్యాటక స్థలాల్లో పరిశుభ్రత ఉండేలా ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు ప్రయత్నిస్తున్నారు. అక్కడ శాశ్వత నివాసం ఉండే వారు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. శాస్త్రీయమైన పద్ధతిలో ఈ ప్రయత్నం జరగడం లేదేమో కానీ పని మాత్రం జరుగుతోంది. మీరు ఒక పర్యాటకుడిగా వెళ్లినపుడు ఆ ప్రదేశంలో యువజనులు ఈ విషయంలో తోడ్పడగలరని నాకు నమ్మకం ఉంది.

పర్యాటకం ద్వారా ఉపాధికి ఎంతో అవకాశం ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం పర్యాటక రంగంలో చాలా వెనుకబడి ఉంది. కానీ మనం 125 కోట్ల మంది దేశ ప్రజలం. పర్యాటకాన్ని బలోపేతం చేయాలనుకుంటే కనుక, ప్రపంచాన్నే మనం ఆకర్షించగలం. ప్రపంచ పర్యాటకంలో పెద్ద భాగాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. ఇంకా మన కోట్లాది యువ జనానికి ఉపాధి అవకాశాలు చూపగలం. ప్రభుత్వం గానీ, సంస్థలు గానీ, సమాజం గానీ, వ్యక్తులు గానీ- అందరం కలసి దీన్ని సాధించే పని చేద్దాం. రండి, ఈ దిశగా మనం ఒక ప్రయత్నం చేద్దాం.

ప్రియమైన నా యువ మిత్రులారా, సెలవురోజులను అలా ఊరికే కొద్ది కొద్దిగా వ్యర్థం చేసేయడం నాకు నచ్చదు. మీరు కూడా ఇలా ఆలోచించి చూడండి. మీ సెలవులు, జీవితంలో కీలకమైన సంవత్సరాలు అంతకన్నా కీలకమైన సమయం.. అలానే కరగిపోవడం ఏమిటి? మీరు ఆలోచించడానికి ఒక విషయం చెబుతాను. సెలవుల్లో ఒక కొత్త ప్రతిభను మీ వ్యక్తిత్వానికి జోడించే సంకల్పం తీసుకోగలరా మీరు..? ఒక వేళ మీకు ఈదడం రాకపోతే, సెలవుల్లో ఈత నేర్చుకోవాలని సంకల్పించవచ్చు. సైకిల్ తొక్కడం రాకపోతే సెలవుల్లో సైకిల్ నేర్చుకుంటానని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికీ కేవలం రెండు వేళ్ళతో కంప్యూటర్ మీద టైపు చేస్తున్నానే అని మీరు అనుకుంటే నేను సరైన రీతిలో టైపింగ్ నేర్చుకోకూడదా అని ఎందుకు అనుకోరు? మన వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో రకాల నైపుణ్యాలున్నాయి? వాటిని ఎందుకు నేర్చుకోకూడదు..? మనలోని కొన్ని లోపాలను ఎందుకు దూరం చేసుకోకూడదు? మనలోని కొన్ని శక్తులను ఎందుకు పెంచుకోకూడదు? ఇప్పుడు ఒక ఆలోచన చేసి చూడండి.

వీటిలో మీకు చాలా క్లాసులు అవసరమనో, శిక్షకుడు కావాలనో, చాలా పెద్ద ఫీజు కట్టాలనో, పెద్ద బడ్జెట్ వెచ్చించాలనో.. ఇలా ఏమీ లేదు. మీరు మీ చుట్టుపక్కలే చూడండి. మీరు ఒకసారి నిర్ణయించుకున్నారనుకుందాం చెత్త నుంచి ఉత్తమమైంది తయారుచేస్తాను.. అని. కొన్ని పరిశీలించండి; వాటి నుంచి తయారు చేయడం మొదలుపెట్టండి. చూడండి– మీకు సంతోషం కలుగుతుంది. సాయంత్రం అయ్యే సరికి ఈ చెత్తా చెదారంలో నుంచి మీరు ఏం తయారు చేశారో.. మీకు చిత్ర లేఖనం అంటే ఇష్టం. కానీ బొమ్మలు గీయడం రాదు. అయితేనేం, మొదలయితే పెట్టండి. అదే వస్తుంది. మీరు మీ సెలవు దినాలను మీ వ్యక్తిత్వ వికాసానికి, ప్రావీణ్యం సాధించడానికి, మీ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి తప్పనిసరిగా వినియోగించాలి. అలాంటివి రంగాలు లెక్కలేనన్ని ఉన్నాయి. నేను చెప్పిన వాటిలోనే కృషి చేయాలని లేదు. ఆ నైపుణ్యం వల్ల మీ వ్యక్తిత్వానికి ఉనికి ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం చెప్పలేనంత పెరుగుతుంది. సెలవులు అయ్యాక స్కూలుకు తిరిగి వెళ్లినప్పడు, కాలేజికి వెళ్లినప్పుడు మీ స్నేహితులతో చెబుతారు. నేను సెలవుల్లో ఇది నేర్చుకున్నాను అని. ఒక వేళ వాళ్లు అది నేర్చుకోలేదునుకోండి.. వాళ్లనుకుంటారు అరే నేను నష్టపోయాను. నువ్వు నేర్చుకుని వచ్చావు అని ఇలా ఆలోచిస్తారు. ఇది సహజం. కాబట్టి మీరు తప్పకుండా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకా మీరు ఏం నేర్చుకున్నారో నాకు చెప్పండి. చెబుతారు కదూ.

ఈసారి www.mygov.in సైట్ లో ‘మన్కీ బాత్’ కోసం అనేకమైన సూచనలు అందాయి. వాటిలోంచి ఒకటి ఇదీ..

“నమస్తే ప్రధాన మంత్రి గారూ. నా పేరు అభి చతుర్వేది. గత వేసవి సెలవులలో మీరు పిట్టలకి కూడా వేసవి తాపం ఉంటుందని అన్నారు. ఓ పాత్రలో నీరు పోసి బాల్కనీలోనో, డాబా పైనో పెట్టాలని, పిట్టలు వచ్చి నీళ్లు తాగుతాయని చెప్పారు. నేను అదే పనిని చేశాను. ఎంతో సంతోషం కలిగింది. ఈ సాకుతో చాలా పిట్టలతో నాకు స్నేహం కుదిరింది. ఈ విషయాన్ని ‘మన్ కీ బాత్’లో మీరు మరోసారి చెప్పాలనే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీకు ఇవే నా కృతజ్ఞతలు.”

ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా.. నేను ఈ చిన్నారి అభి చతుర్వేది కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు ఫోన్ చేసి, నేను చెప్పిన విషయాన్ని ఈ బాలుడు నాకు గుర్తు చేశాడు. నిజం చెప్పాలంటే, నేను దాని గురించే మరచిపోయాను. ఇంకా.. నాకు బుర్రలో లేదు ఈ విషయంపై నేనేమైనా చెబుతానా అనేది. కానీ, అభి నాకు జ్ఞాపకం చేశాడు.. నిరుడు నేను పక్షులు తాగడానికి నీళ్లతో నింపిన ఒక మట్టి పాత్రను నింపి పెట్టండి.. అని చెప్పానన్న సంగతిని.

స్నేహితులారా.. నేను అభి చతుర్వేదికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ బాలుడు నాకు ఫోన్ చేసి ఒక మంచి పనిని గురించి తెలియజెప్పాడు. పోయినసారి .. ఆ.. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను అప్పట్లో మీకు సూచించాను. ఎండాకాలంలో పిట్టలకు మట్టి పాత్రలలో నీరు పెట్టండి అని. అభి తాను ఈ పనిని ఒక ఏడాది అంతా చేస్తూ వస్తున్నానంటూ నాకు తెలిపాడు. ఎన్నో పక్షులు తనకి స్నేహితులు అయిపోయాయని కూడా చెప్పాడు. హిందీ భాషలో మహా కవయిత్రి అయిన మహాదేవి వర్మకు పక్షులంటే ఎంతో ప్రేమ. ఆవిడ ఒక కవితలో ఇలా రాశారు.. ‘మేం నిన్ను దూరంగా ఎగిరిపోనివ్వం, మేం ధాన్యంతో ఆవరణంతా నింపేస్తాం.. నీటి కుంటను తియ్యని, చల్లని నీటితో నింపేస్తాం..’ రండి, మనం కూడా మహాదేవి వర్మ గారు చెప్పినట్లే చేద్దాం. నేను అభికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయాన్ని నాకు గుర్తు చేసినందుకు.

మైసూర్కు చెందిన శిల్పా కుకే ఎంతో దయామయమైన ఒక సమస్యను మన ముందుకు తెచ్చారు. మా ఇంటి దగ్గరకు పాల వాళ్లు వస్తారు, పేపర్ అమ్మేవాళ్లు వస్తారు. పోస్ట్ మ్యాన్ వస్తారు. కొన్ని సార్లు గిన్నెలు అమ్మేవారు, బట్టలు అమ్మేవారు ఆ దారి వెంబడి వెళ్తారు. మనం ఎప్పుడన్నా వారికి మంచినీళ్లు కావాలా… అని అడిగామా? ఎప్పుడన్నా ఇచ్చామా? శిల్పా… మీరు ఎంతో సున్నితమైన విషయాన్ని ప్రస్తావించారు. మీకు ధన్యవాదాలు. ఎంతో ముఖ్యమైన అంశాన్ని మీరు ఎంతో సరళంగా, సూటిగా చెప్పారు. విషయం చాలా చిన్నది కానీ, మంచి ఎండలో పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చినపుడు చల్లని నీరు తాగించామనుకోండి. అతను ఎంత సేదదీరుతాడు. నిజానికి మన దేశంలో ఇది స్వతహాగా జరిగే విషయమే. కానీ, శిల్పా… మీరు ఈ విషయం గమనించినందుకు నాకెంతో సంతోషం వేసింది.

ప్రియమైన నా రైతు సోదర సోదరీమణులారా… డిజిటల్ ఇండియా అన్న పదం మీరు చాలాసార్లు విని ఉంటారు. డిజిటల్ ఇండియా అంటే ఇది నగరాల్లో యువజనులకు సంబంధించిన సంగతి, అది వారి ప్రపంచం అనిపించవచ్చు. అది నిజం కాదు. ‘కిసాన్ సువిధా ఆప్’ అనే యాప్ మీ సౌకర్యం కోసం అందుబాటులోకి వచ్చిందని తెలిస్తే మీరు ఎంతో సంతోషపడతారు. ఈ రైతు సువిధ యాప్ని మీరు మీ మొబైల్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన, వాతావరణానికి సంబంధించిన విస్తృత సమాచారం స్వయంగా మీ చేతుల్లోనే అందుబాటులోకి వస్తుంది. మార్కెట్లో పరిస్థితులేంటి… మండీలో ఎటువంటి స్థితి ఉంది.. పంట దిగుబడి సరళి ఎలా ఉంది. పొలానికి వేయవలసిన మందులు ఏవి అందుబాటులో ఉన్నాయి… ఇలాంటి ఎన్నో విషయాలు ఆ యాప్లో ఉన్నాయి. అంతే కాదు.. ఇందులో ఉన్న బటన్ మిమ్మల్ని నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో, వ్యవసాయ నిపుణులతో మాట్లాడిస్తుంది. మీరేదైనా ప్రశ్నలు అడిగితే వారు జవాబు ఇస్తారు. మీకు వివరించి చెబుతారు. నా రైతు సోదరులు, సోదరీమణులు ఈ కిసాన్ సువిధ యాప్ను తమ మొబైల్ ఫోన్ పైన డౌన లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి ప్రయత్నించి చూడండి. అందులో మీకు పనికొచ్చే సంగతులు ఏమన్నా ఉన్నాయేమో. అందులో ఏదన్నా లోపం ఉంది, తక్కువ సమాచారం ఉంది అంటే మీరు నాకు ఫిర్యాదు చేయవచ్చు కూడా.

ప్రియమైన నా రైతు సోదర సోదరీమణులారా… మిగిలిన ప్రజలందరికీ వేసవి అంటే సెలవుల కాలం. కానీ రైతులకు మాత్రం ఇది మరింత చెమటోడ్చి పని చేయవలసిన కాలం. రైతు వర్షం కోసం ఎదురుచూస్తాడు. వర్షం కోసం ఎదురుచూసే ముందుగా వర్షం కోసం తన భూమిని సిద్ధం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. వర్షం కురిసినప్పుడు ఒక్క నీటి చుక్క కూడా వృథా కాకుండా భూమిని సిద్ధం చేసుకుంటాడు. వ్యవసాయం ప్రారంభమయ్యే రుతువు రైతులకు ఎంతో ముఖ్యమైన సమయం. కానీ, నీరు లేకపోతే ఏం జరుగుతుందన్న విషయం మన దేశవాసులందరూ కూడా ఆలోచించవలసిన విషయం. ఈ సమయంలో మనం మన చెరువులు, మన ప్రాంతంలో నీరు ప్రవహించే ప్రదేశాలు, చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరే మార్గాలు అక్కడ చెత్త చేరడం, లేదా దురాక్రమణ జరిగి నిర్మాణం జరగడం వల్ల అక్కడికి నీరు ప్రవహించడం ఆగిపోతుంది. అందువల్ల నీటి నిల్వలు క్రమేణా తగ్గిపోతున్నాయి. గతంలో నీరు ఉన్న ప్రదేశాలు, స్థలాలను మళ్లీ మనం తవ్వి చెత్త తీసి శుభ్రం చేసి మరింత నీరు వచ్చి చేరి నిల్వ ఉండేలా సిద్ధం చేయగలమా? ఎంత నీరు పొదుపు చేయగలిగితే అంత మంచిది. తొలకరి జల్లుల్లోనైనా సరే నీరు పొదుపు చేసి… చెరువులు నిండి.. మన నదులు, కాల్వలు నిండి పారాయంటే ఆ తర్వాత వర్షం కనిపించకుండా పోయినా నీటి కొరత అనేది బాధించదు. మనకు ఎక్కువ నష్టం జరగదు. అయితే మనం ప్రతి ఒక్క వాన నీటి చినుకును ఒడిసి పట్టి నిల్వ చేసుకొంటేనే ఇది సాధ్యమవుతుంది.

ఈసారి ఐదు లక్షల నీటి కుంటలను తవ్వేందుకు సంకల్పించాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ ఎన్ ఆర్ జి ఎ) కింద కూడా నీటి సేకరణకు, అసెట్స్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాం. ప్రతి ఊళ్లో, ప్రతి గ్రామంలో నీరు పొదుపు చేయాలి. రానున్న వర్షా కాలంలో ప్రతి వర్షపు చుక్కను పరిరక్షించాలి. గ్రామంలో నీరు గ్రామంలోనే ఉండాలి. ఈ ఉద్యమాన్ని ఎలా నడిపించాలో మీరు ప్రణాళికలు వేయండి. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో పాలుపంచుకోండి. నీటి వనరుల ప్రాముఖ్యత గురించి ప్రజా ఉద్యమాన్ని ఎలా నడిపించాలో మీరు ప్రణాళికలు వేయండి. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో పాలుపంచుకోండి. నీటి వనరుల ప్రాముఖ్యత గురించి ప్రజా ఉద్యమం ప్రారంభిద్దాం. నీటి వనరుల ప్రాముఖ్యత అందరూ గ్రహించేలా… నీరు పొదుపు చేసేందుకు అందరూ ప్రయత్నించేలా… ఒక ఉద్యమం ప్రారంభిద్దాం. మన దేశంలో ఎన్నో గ్రామాలు, ఎంతో మంది ప్రగతిశీలురైన రైతులు, ఎంతో మంది చైతన్యవంతులైన పౌరులు ఇప్పటికే ఈ పని చేస్తుండి ఉంటారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ దిశగా ఇంకా ఎంతో ప్రయత్నం జరగడం అవసరం.. అతి ముఖ్యం.

ప్రియమైన నా రైతు సోదర, సోదరీమణులారా.. ఇటీవల భారత ప్రభుత్వం ఒక భారీ రైతు సమ్మేళనం నిర్వహించింది. ఎంత అత్యాధునిక పరిజ్ఞానం ఆవిర్భవించిందో. వ్యవసాయ రంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో నేను గమనించాను. అయితే ఈ పరిజ్ఞానాన్ని పొలాల వరకు తీసుకువెళ్ళాలి. ఇప్పడు రైతులు కూడా ఇంక ఎరువులు తగ్గించాలి అంటున్నారు. ఈ పరిణామాన్ని నేను హర్షిస్తున్నాను. ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల మన భూమి తల్లి అస్వస్థత పాలైంది. మనం ఈ భూమి పుత్రులం, మనం ఈ పుడమి తల్లి సంతానం. మన అమ్మ రోగాల పాలవుతుంటే ఎలా చూస్తూ ఉండగలం…? భోజనం రుచికరంగా ఉంటుంది. కానీ, ఆ మసాలా మోతాదుకు మించి వస్తే అసలు ఆ భోజనం తినగలమా… మనకి నచ్చిన ఆ ఆహారమే నోటికి చేదు అనిపించదా?

ఈ ఎరువుల మోతాదుకు మించి మీరు వాడితే అది వినాశనానికే దారి తీస్తుంది. ప్రతిదీ సమతూకంలో ఉండాలి. అప్పుడే ఖర్చులు తగ్గి డబ్బులు మిగులుతాయి. అందుకు మా నినాదం ‘ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ – తక్కువ పెట్టబడి ఎక్కువ పంట’. ఇదే మంత్రం జపించాలి, అనుసరించాలి. మనం మన వ్యవసాయంలో శాస్త్రీయమైన పద్ధతుల్లో వృద్ధి సాధించాలి. నీటి పరిరక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో మనం పూర్తి చిత్తశుద్ధితో ఆ చర్యలు తీసుకోవాలి. వర్షం కురిసేందుకు ఇంకా ఒకటి రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ లోపుగా మనం నీటి పరిరక్షణకు సిద్ధం కావాలి. ఎంత నీరు పొదుపు చేస్తే వ్యవసాయానికి అంత లాభం.. జీవితం అంత సౌకర్యవంతం.

ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా.. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ఏడాది ఈ దినోత్సవం ప్రపంచమంతా ‘బీట్ డయాబెటిస్’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించనుంది. డయాబెటిస్ను ఓడిద్దాం… మధుమేహం ఇతర అనేక వ్యాధులకు మన శరీరంలో ఆతిథ్యమిచ్చేందుకు ఉత్సుకతతో ఉంటుంది. మన శరీరంలోకి అనేక ఇతర వ్యాధులు కురూపులైన అతిథులుగా మన శరీరం అనే ఇంట్లోకి చొరబడతాయి. 2014 నాటికి మన దేశంలో దాదాపు ఆరున్నర కోట్ల మంది మధుమేహం రోగులున్నారని అంచనా. మూడు శాతం మరణాలకు డయాబెటిస్ కారణమని తేలింది. డయాబెటిస్లో రెండు రకాలు టైప్-1, టైప్-2 అని. టైప్-1 వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుంది. టైప్-2 డయాబెటిస్ అలవాట్ల కారణంగా, వయస్సు కారణంగా, స్థూలకాయం కారణంగా వస్తుంది. అంటే మనమే దానిని స్వయంగా ఆహ్వానిస్తాం అన్నమాట. ప్రపంచమంతా డయాబెటిస్ వ్యాధి గురించి ఆందోళన చెందుతోంది. అందుకే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ఈసారి డయాబెటిస్ పై పోరాటాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు.

మన జీవనశైలి డయాబెటిస్ కు అతిపెద్ద కారణమని మనందరికీ తెలుసు. శారీరక శ్రమ తగ్గిపోతోంది. చెమట అనేది పట్టదు. అటూ ఇటూ తిరగడం అనేది జరగదు. ఆటలు ఆడటం అంటే ఆన్లైన్ గేమ్స్ మాత్రమే. ఆఫ్లైన్లో మాత్రం ఎటువంటి శ్రమ ఉండదు. మనం ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్ఫూర్తి పొంది డయాబెటిస్ను ఓడించేందుకు మన వ్యక్తిగత జీవితాల్లో ఏదన్నా చేయగలమా? మీకు యోగా అంటే ఆసక్తి ఉంటే యోగా చేయండి. లేదా కనీసం నడక లేదా పరుగు ప్రాక్టీస్ చేయండి. నా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే నా దేశం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది కాదా. కొన్నిసార్లు మనం ఏదో సంకోచంతో వైద్య పరీక్షలు చేయించుకోం. పరిస్థితి బాగా క్షీణించాక అయ్యో! నాకు ఎప్పటి నుంచో డయాబెటిస్ ఉందే అనేది స్ఫురణకు వస్తుంది. పరీక్ష చేయించుకుంటే ఏం పోతుంది చెప్పండి. ఆ మాత్రం చేసుకోండి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎంతో తేలికగా ఈ పరీక్ష చేయించుకోవచ్చు. మీరు తప్పనిసరిగా ఈ విషయం ఆలోచించండి.

మార్చి 24 నాడు ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం జరుపుకొంటుంది. నా చిన్నప్పుడు టీబీ అనే పేరు వింటే భయపడిపోయేవారు తెలుసా. ఇంక చావు దగ్గరపడింది అనిపించేది. కానీ, ఇప్పుడు టీబీ అంటే భయం లేదు. ఎందుకంటే ఇప్పడు అందరికీ తెలుసు టీబీకి చికిత్స వీలవుతుందని. అతి తేలికగా చికిత్స జరుగుతుందని తెలుసు. టీబీ అంటే మరణం అనుకున్న రోజుల్లో భయపడేవాళ్లు ఇప్పడు చికిత్స ఉంది అనేసరికి నిర్లక్ష్యం పెరిగిపోయింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా టీబీ రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. క్షయ నుంచి విముక్తి కావాలి అంటే ఒకటి సరైన చికిత్స జరగాలి… రెండు సంపూర్ణ చికిత్స జరగాలి. కరెక్ట్ ట్రీట్మెంట్ – కంప్లీట్ ట్రీట్మెంట్; మధ్యలోనే విడిచిపెడితే కొత్త సమస్యలు వస్తాయి. పైగా టీబీ ఎలాంటి వ్యాధి అంటే చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు కూడా గుర్తిస్తారు. బాబూ పరీక్ష చేయించుకో టీబీ వచ్చి ఉంటుంది అంటారు. దగ్గు వస్తోంది. జ్వరం వస్తోంది. బరువు కూడా తగ్గిపోయింది. ఇవన్నీ చూసి చుట్టుపక్కల వారు ఇదిగో చూడండి. అతనికి టీబీ-వీబీ ఏవన్నా వచ్చిందేమో అంటారు. దీని అర్థం ఏంటంటే ఈ వ్యాధి ఎటువంటిది అంటే అతి త్వరగా పరీక్ష కూడా చేయించుకోవచ్చు అని.

ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా… ఈ దిశలో ఎంతో కృషి జరుగుతోంది. మన దేశంలో 13 వేల 500 మందికి పైగా మైక్రోస్కోపీ కేంద్రాలున్నాయి. నాలుగు లక్షలకు పైగా డాట్ సేవలు అందించే వారు ఉన్నారు. ఎన్నో ఆధునిక లేబొరేటరీలు ఉన్నాయి. ఈ పరీక్ష ఉచితంగా జరుగుతుంది కూడా. మీరు ఒక్కసారి పరీక్ష చేయించుకోండి. ఈ రోగం మానిపోతుంది. చేయవలసిందల్లా సరైన చికిత్స పొందడం, వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు చికిత్స కొనసాగించడం. టీబీ కానివ్వండి, డయాబెటిస్ కానివ్వండి. నాది ఒకటే విజ్ఞప్తి. మనం ఈ వ్యాధులను పారద్రోలాలి. మన దేశాన్ని ఈ వ్యాధుల నుంచి విముక్తం చేయాలి. కానీ, మీరు తలచుకోనిదే ఈ పని ప్రభుత్వం, వైద్యులు, మందుల వల్ల కాదు. అందుకే దేశవాసులకు నా విజ్ఞప్తి. డయాబెటిస్ను ఓడిద్దాం. టీబీ నుంచి విముక్తిని పొందుదాం.

ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా.. ఏప్రిల్ నెలలో కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 14న బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి. ఆయన 125వ జయంతి వేడుకలు ఏడాది మొత్తం జరిగాయి. మహావ్ లో ఆయన జన్మ స్థలం, లండన్లో ఆయన విద్యాభ్యాసం, నాగ్పూర్లో ఆయన దీక్ష, ఢిల్లీలో 26, అలీపూర్ రోడ్లో ఆయన కాలం చేసిన ఇల్లు, ముంబైలో ఆయన అంత్యక్రియలు జరిగిన చైత్యభూమి.. ఈ పంచతీర్థాల్లో అభివృద్ధి కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఆయన స్వస్థలమైన మహావ్ ను సందర్శించే భాగ్యం నాకు కలిగింది. ఒక ఉత్తమ పౌరుడిగా మారేందుకు బాబా సాహెబ్ మనకు ఎంతో ప్రేరణ కలిగించారు. ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ఆయన మార్గంలో ఒక మంచి పౌరుడిగా మారడం ద్వారా మనం ఆయనకు ఘనమైన రీతిలో శ్రద్ధాంజలిని ఘటించగలుగుతాం.

మరి కొద్ది రోజుల్లోనే విక్రమ సంవత్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. దానిని వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు రూపాలలో జరుపుకొంటారు. కొంత మంది దీనిని కొత్త సంవత్సరం అంటారు. మరి కొంత మంది గుడిపడ్వని, మరి కొందరు వర్ష్ ప్రతిపద అని పిలుస్తారు. మరి కొందరు ఉగాది అని పిలుస్తారు. అయితే, భారత దేశంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో దీనికి ప్రత్యేకత ఉంది. కొత్త ఏడాది మంగళప్రదమైన వేళ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.

మీకు తెలుసు నేను గతంలో కూడా చెప్పాను. నా ‘మన్కీ బాత్’ వినాలనుకుంటే ఎప్పుడైనా వినవచ్చు అని. సుమారు 20 భాషలలో దీనిని వినవచ్చు. మీరు మీకు వీలున్నప్పుడే వినవచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్లో వినవచ్చు. ఇందుకు కేవలం ఒక మిస్డ్ కాల్ చేయవలసి ఉంటుంది. ఈ సేవ ఇప్పుడే నెల రోజుల క్రితమే ప్రారంభమైంది. కానీ, 35 లక్షల మంది దీనిని వినియోగించుకున్నారు. మీరు కూడా నంబర్ రాసుకోండి. 81908 – 81908. ఈ నంబర్ మళ్లీ చెప్తాను. 81908 – 81908. మీరు మిస్డ్ కాల్ చేయండి. ఎప్పుడైనా మీకు వీలుంటే అప్పుడు పాత ‘మన్ కీ బాత్’లు వినవచ్చు. మీరు మీ భాషల్లోనే వినవచ్చు. మీతో ఇలా కలసి ఉండటం అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది.

ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా… మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు; అనేకానేక ధన్యవాదాలు.

***