Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో ఆగస్టు 28, 2016 న ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం పూర్తి పాఠం


ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా న‌మ‌స్కారం..

రేపు ఆగ‌స్టు 29.. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జ‌యంతి.. ఈ తేదీని యావ‌త్ దేశం జాతీయ క్రీడా దినోత్స‌వంగా జ‌రుపుకుంటుంది. నేను ధ్యాన్ చంద్ గారికి శ్ర‌ద్ధాంజ‌లి అర్పిస్తూ, ఈ సంద‌ర్భంగా మీ అంద‌రికీ ధ్యాన్ చంద్ దేశానికి చేసిన సేవ‌ల‌ను గుర్తు చేద్దామ‌నుకుంటున్నాను. ఆయ‌న 1928 లోను, 1932 లోను, 1936 లోను ఒలంపిక్ క్రీడ‌ల‌లో హాకీలో భార‌త దేశం స్వ‌ర్ణ ప‌త‌కం సాధించ‌డంలో మ‌హ‌నీయ‌మైన పాత్ర‌ను పోషించారు. క్రికెట్ ప్రేమికులంద‌రికీ బ్రాడ్ మన్ గురించి తెలుసు. ఆయ‌న ధ్యాన్ చంద్ గురించి చెప్పిన మాటలు ఏమిటంటే- ‘ధ్యాన్ చంద్ ప‌రుగుల లాగా గోల్స్ చేసేస్తాడు’ అని. క్రీడా స్ఫూర్తికీ, దేశ భ‌క్తికీ ధ్యాన్ చంద్ ఒక స‌జీవ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు. ఒక‌సారి కోల్ క‌తాలో ఒక మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడు ధ్యాన్ చంద్ త‌ల‌పై హాకీ స్టిక్ తో గ‌ట్టిగా బాదాడు. అప్పుడు మ్యాచ్ పూర్తి కావ‌డానికి ఇంకా ప‌ది నిమిషాలే మిగిలి ఉంది. ధ్యాన్ చంద్ ఆ ప‌ది నిమిషాల్లో వ‌రుస‌గా మూడు గోల్స్ చేశారు. నాకు త‌గిలిన దెబ్బ‌కు గోల్స్ రూపంలో ప్ర‌తీకారం తీర్చుకున్నాను అని ధ్యాన్ చంద్ అన్నారు.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

ఎప్పుడు ‘మ‌న్ కీ బాత్’ స‌మ‌యం ఆస‌న్న‌మైనా mygov.in లేదా Narendra Modi App ద్వారా అనేక మంది అనే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ ఉంటారు. ఇవ‌న్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. కానీ ఈసారి చాలా మంది రియో ఒలంపిక్స్ ను గురించి త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడాల‌ని నాకు సూచ‌న‌లు పంపారు. సాధార‌ణ పౌరుడికి రియో ఒలంపిక్స్ ప‌ట్ల ఇంత ప్రేమ‌, అవ‌గాహ‌న చూసి నాకు చాలా ఆనందం వేసింది. ప్ర‌ధాన మంత్రి రియో ఒలంపిక్స్ ను గురించి మాట్లాడాలి అంటూ ప్ర‌జ‌ల నుండి ఒత్తిడి రావ‌డాన్ని నేను స‌కారాత్మ‌కమైందిగా భావిస్తున్నాను. క్రికెట్ కాకుండా ఇత‌ర క్రీడ‌ల ప‌ట్ల భార‌తీయుల‌కు ఉన్న ప్రేమ‌, ఆస‌క్తి, అవ‌గాహ‌నలు చూసి నేను ముగ్ధుడిన‌య్యాను. నిజంగా ఈ రోజు ఈ సందేశాన్ని ఇవ్వ‌డానికి నాకు క‌లిగిన ప్రేర‌ణ‌కు మీరు కార‌కుల‌య్యారు. Narendra Modi App పై అజిత్ సింగ్ ‘ఈసారి మ‌న్ కీ బాత్ లో బాలిక‌ల‌కు విద్య‌, క్రీడ‌లలో వారి భాగ‌స్వామ్యంపైన త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడవలసింది అని కోరారు. రియో ఒలంపిక్స్ లో ప‌త‌కాలను సాధించిన బాలిక‌లు దేశ గౌర‌వానికి వ‌న్నె తెచ్చార‌ని పేర్కొన్నారు’. మ‌రొక‌రు స‌చిన్, ఆయన ఏం రాశారంటే.. ఈసారి ‘మ‌న్ కీ బాత్’ లో సింధు, సాక్షి, దీపా క‌ర్మాక‌ర్ ల ప్ర‌స్తావ‌న త‌ప్ప‌నిస‌రిగా చేయండి అన్నారు. మ‌న దేశానికి ప‌త‌కాలు సాధించింది ఈ బాలిక‌లే. బాలిక‌లు ఎవ‌రికీ తీసిపోర‌ని మ‌రోసారి నిరూపించారు. ప‌త‌కాలు గెలుచుకున్న బాలిక‌లలో ఒక‌రు ఉత్త‌ర భార‌తదేశానికి చెందిన వారైతే, మ‌రొక‌రు ద‌క్షిణ భార‌తదేశానికి చెందిన‌ వారు. ఇంకొక‌రు తూర్పు భార‌తదేశానికి చెందిన‌ వారు. వేరొక‌రు భార‌త‌ దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి చెందిన‌ వారు. దీనిని పట్టి చూస్తే బాలిక‌లు అంద‌రూ దేశ ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌ను మ‌రింత‌గా పెంచే బాధ్య‌త‌ను త‌ల‌కు ఎత్తుకున్నార‌నిపిస్తుంది. mygov.in వెబ్ సైట్ పై ఒలంపిక్స్ లో మ‌రింత‌గా రాణించ‌గ‌లిగే వాళ్లం అని శిఖ‌ర్ ఠాకూర్ రాశారు. ఇంకా ‘గౌర‌వ‌నీయ మోదీ గారు, రియోలో ప‌త‌కాలు సాధించినందుకు శుభాకాంక్ష‌లు. కానీ.. మ‌న ప్ర‌ద‌ర్శ‌న నిజంగా బాగుందా.. అంటే.. లేదు అనే చెప్పాలి. క్రీడారంగంలో ఇంకా సుదూర ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికీ త‌ల్లిదండ్రులు కేవ‌లం చ‌దువు మీదే శ్ర‌ద్ధ పెట్ట‌మ‌ని చెబుతూ ఉంటారు. ఆట‌లు ఆడ‌డం అంటే స‌మ‌యాన్ని వృథా చేయ‌డ‌మ‌ని భావిస్తూ ఉంటారు. ఈ ఆలోచ‌న‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీనికి కావ‌ల‌సింది స‌రికొత్త ప్రేర‌ణ క‌ల్పించ‌డం. మీకు త‌ప్ప ఇంకొక‌రికి ఈ ప‌ని సాధ్యం కాద‌ు’ అంటూ ఆయ‌న రాశారు. Narendra Modi App పై స‌త్య‌ప్ర‌కాశ్ మెహ్రా సూచ‌న చేస్తూ, ‘విద్యేతర కార్య‌క‌లాపాల‌పైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది’ అని అన్నారు. ముఖ్యంగా పిల్ల‌ల‌కు, యువ‌కుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తిని పెంచాల‌ని కోరారు. దాదాపుగా వేలాది మంది ఈ విష‌యాల‌నే సూచించారు. మ‌నం ఆశించిన‌ట్లుగా మ‌న ప్ర‌ద‌ర్శ‌న లేదు.. అన్న వాస్త‌వాన్ని కొట్టి పారేయ‌లేము. అంతే కాదు, కొంత మంది క్రీడాకారులు ఇంత‌కుముందు దేశీయంగా ప్ర‌ద‌ర్శించిన స్థాయిని కూడా రియోలో చూప‌లేక‌పోయారు. ఇక ప‌త‌కాల ప‌ట్టిక చూస్తే, మ‌న‌కు రెండే వ‌చ్చాయి. కానీ నిజంగా ఆలోచిస్తే ప‌త‌కాలు రాక‌పోయినా.. అనేక విష‌యాలలో మొద‌టిసారి మ‌న భార‌తీయ క్రీడాకారులు చాలా అద్భుతమైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించారు. షూటింగ్‌లో అభిన‌వ్ బింద్రాకు నాలుగో స్థానం ద‌క్కింది. చాలా కొద్దిపాటి తేడాతో ప‌త‌కాన్ని కోల్పోయారు. జిమ్నాస్టిక్స్ లో దీపా క‌ర్మాక‌ర్ అద్భుతం సాధించారు, ఆమె నాలుగో స్థానంలో నిలచారు. పతకం కొద్దిపాటి తేడాతో చిక్కకుండా పోయింది. ఒలంపిక్స్ ఫైన‌ల్స్ కు యోగ్య‌తను సాధించిన మొట్ట‌మొద‌టి భార‌తీయ మ‌హిళ ఆవిడ. అదే విధంగా టెన్నిస్ లో సానియా మీర్జా, రోహ‌న్ బోప‌న్న‌ల జోడీ కూడా అతి కొద్ది తేడాతో ప‌త‌కాన్ని కోల్పోయింది. అథ్లెటిక్స్ లో ఈసారి మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చాము. 32 సంవత్సరాల అనంతరం పి.టి. ఉష త‌రువాత‌, ల‌లితా బాబ‌ర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫైన‌ల్స్ కు యోగ్య‌త సాధించారు. అంతే కాకుండా, 36 సంవత్సరాల త‌రువాత మ‌హిళా హాకీ టీమ్ ఒలంపిక్స్‌ లో స్థానాన్ని సంపాదించ‌డం అంద‌రికీ ఆనందం క‌లిగించే అంశం. అదే విధంగా 36 సంవత్సరాల త‌రువాత పురుషుల హాకీ జ‌ట్టు నాకౌట్ ద‌శ దాకా చేర‌డం కూడా గ‌ర్వ కార‌ణ‌మే. మ‌న జ‌ట్టు చాలా ప‌టిష్ఠ‌మైంది. ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం ఏమిటంటే, హాకీలో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించిన అర్జెంటీనా జ‌ట్టు ఈ ఒలంపిక్స్ లో ఒక్క‌సారి మాత్ర‌మే ఓడింది. ఆ ఓట‌మిని చ‌వి చూసింది మాత్రం మ‌న చేతిలోనే. భ‌విష్య‌త్ కచ్చితంగా మ‌న‌ది. బాక్సింగ్ లో వికాస్ కృష్ణ యాద‌వ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ దాకా వెళ్లారు. కానీ, కాంస్య ప‌త‌కాన్ని పొంద‌లేక‌పోయారు. ఇలా ఎంతో మంది; ఉదాహ‌ర‌ణ‌కు, అదితి అశోక్‌, ద‌త్తూ బోక్న‌ల్‌, అత‌నూ దాస్.. ఇలా మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారి పేర్లు మరెన్నో ప్రస్తావించవ‌చ్చు.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

మ‌నం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన తీరుగానే చేస్తూ ఉంటే, మ‌ళ్లీ మ‌నం నిరాశ‌కే లోన‌వుతాము. నేను ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాను. భార‌తదేశ ప్ర‌భుత్వం లోతుగా దీనిని ప‌రిశీలించి, అధ్య‌య‌నం చేస్తుంది. మ‌నం ఇంకా బాగా ఏం చేయ‌గ‌ల‌మో దాని కోసం మార్గసూచీని త‌యారుచేస్తాం. 2020, 2024, 2028 వ‌ర‌కు దూర‌దృష్టితో ముందుకు వెళ్ల‌డానికి ప్ర‌ణాళికను త‌యారుచేయవలసి ఉంది. నేను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.. మీరు సైతం ఇటువంటి క‌మిటీలు ఏర్పాటు చేయండి. క్రీడాలోకంలో మ‌నం ఏమేమీ చేయ‌గ‌ల‌మో ఆలోచించండి. ప్ర‌తి రాష్ట్రం చేయ‌గ‌ల‌దు. ప్ర‌తి రాష్ట్రం ఒక‌టో, రెండో క్రీడ‌ల‌ను ఎంచుకొని బ‌లాన్ని నిరూపించుకోవ‌చ్చు. క్రీడారంగంతో సంబంధం ఉన్న అన్నిసంఘాల‌ను కూడా నిష్పాక్షికంగా మేధోమ‌థ‌నం జ‌ర‌పాల్సిందిగా నేను కోరుతున్నాను. అభిరుచి ఉన్న ప్ర‌జ‌లంద‌రినీ కూడా వారి వారి ఆలోచ‌న‌ల‌ను Narendra Modi App కు స‌ల‌హాలు పంపండని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయా రాష్ట్రాల‌కు, ఆయా క్రీడా సంఘాల‌కు కూడా వారి వారి అభిప్రాయాల‌ను, సూచ‌న‌ల‌ను చ‌ర్చించి పంపించ‌వ‌ల‌సిందిగా కోరుతున్నాను. మ‌నం స‌ర్వ‌స‌న్న‌ద్ధం కావాలి. 125 కోట్ల మంది జ‌నాభా, అందులో 65 శాతం యువ‌తీయువకులే ఉన్న మ‌న భారతదేశం, ప్ర‌పంచంలో మ‌రింత మెరుగైన స్థానాన్ని పొందుతుంద‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది. ఈ సంక‌ల్పంతో మ‌నం ముందుకు వెళ్లాలి.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

సెప్టెంబ‌ర్ 5 ఉపాధ్యాయ దినోత్స‌వం.. నేను చాలా ఏళ్లుగా ఉపాధ్యాయ దినోత్స‌వం నాడు ఒక విద్యార్థి మాదిరిగా విద్యార్థుల‌తో ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతూ వ‌చ్చాను. ఆ చిన్న చిన్న పిల్ల‌ల నుండి నేను ఎంతో నేర్చుకుంటూ వచ్చాను. నాకు సంబంధించినంత వ‌ర‌కు సెప్టెంబ‌ర్ 5 ఉపాధ్యాయ దినోత్స‌వ‌మే కాదు; నా విద్యా దినోత్స‌వం కూడా. కానీ, ఈసారి జి- 20 శిఖ‌రాగ్ర స‌మావేశానికి వెళ్లవలసి ఉంది. అందుకే ఈ ‘మ‌న్ కీ బాత్’ లోనే ఆ విష‌యాలు కూడా మాట్లాడాల‌నుకున్నాను.

జీవితంలో త‌ల్లి పాత్ర ఎంతో ఉపాధ్యాయుడి పాత్రా అంతే. త‌మ‌కంటే విద్యార్థుల ప‌ట్ల‌నే ఎక్కువ ప్రేమ చూపే ఉపాధ్యాయుల‌ను మ‌నం ఎంతో మందిని చూసి ఉంటాము. వారు వారి శిష్యుల కోసం వారి జీవితాన్నే అంకితం చేస్తుంటారు. ఇప్పుడు రియో ఒలంపిక్స్ త‌రువాత ఎటు చూసినా పుల్లెల గోపీచంద్ పేరు వినిపిస్తోంది. అత‌ను క్రీడాకారుడే. కానీ, అంత‌కంటే మంచి ఉపాధ్యాయుడిగా ఎదిగి ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు. ఈ రోజు నేను గోపీచంద్ ను ఒక క్రీడాకారుడిగా గాక‌, ఒక ఉత్త‌మ ఉపాధ్యాయుడుగా చూస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా పుల్లెల గోపీచంద్ కు, అత‌ని త‌ప‌స్సుకూ క్రీడ‌ల ప‌ట్ల అత‌ని అంకిత భావానికీ, విద్యార్థుల విజ‌యాలు చూసి ఆనందించాల‌నే అత‌ని ఆకాంక్ష‌కూ స‌లాం చేస్తున్నాను. మ‌నంద‌రికీ కూడా జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎప్ప‌టికీ గుర్తుకు వ‌స్తూ ఉంటుంది. సెస్టెంబ‌ర్ 5 మాజీ రాష్ట్రప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి. దీనినే దేశం ఉపాధ్యాయ దినోత్స‌వంగా జ‌రుపుకొంటోంది. ఆయ‌న ఎన్ని ప‌ద‌వులను అధిరోహించినా ఎప్ప‌టికీ త‌న‌కు తాను ఒక ఉపాధ్యాయుడిన‌నే భావించారు; అలాగే జీవించారు. ఆయ‌న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.. ఏ ఉపాధ్యాయుడిలో అయితే ఎప్ప‌టికీ విద్యార్థి దాగి ఉంటాడో, అత‌డే మంచి ఉపాధ్యాయుడు అని. రాష్ట్రప‌తి అయిన త‌రువాత కూడా ఉపాధ్యాయుడిగా భావిస్తూ త‌న‌లోని విద్యార్థిని స‌జీవంగా ఉంచుకుంటూ, జీవితాన్ని గ‌డిపిన మ‌హామ‌నిషి డాక్ట‌ర్ రాధాకృష్ణ‌న్‌. నాకు నా ఉపాధ్యాయులు గుర్తుకువ‌స్తూ ఉంటారు. మా ఆ చిన్న ప‌ల్లెటూర్లో వారే నా కథానాయకులు. 90 ఏళ్ల వ‌య‌సులో ఈ మ‌ధ్యే మా గురువు గారు స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. ఆయ‌న ప్ర‌తి నెలా నాకు ఉత్త‌రం రాసే వారు; మొన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు నాకు ఉత్త‌రాలు రాస్తూనే ఉన్నారు. ప్ర‌తి ఉత్త‌రంలో ఆయ‌న ఆ నెల‌లో చ‌దివిన పుస్త‌కాల గురించి రాసే వారు. కొటేష‌న్ లను ప్రస్తావించే వారు. ఆ పుస్త‌కం.. ఆయ‌న‌కు న‌చ్చినదీ, లేనిదీ.. ఎందుకు న‌చ్చిందీ, లేదా ఎందుకు న‌చ్చ‌లేదనేది వివ‌రంగా రాసే వారు. ఆ ఉత్త‌రం చ‌దువుతూ ఉంటే, తరగతి గదిలో ఆయన నాకు ఎదురుగా కూర్చొని పాఠాన్ని చెబుతున్న‌ట్లుగా తోచేది. నిజంగా ఇప్పుడు కూడా క‌రెస్పాండెన్స్ కోర్సు ద్వారా ఆయ‌న నా జ్ఞానాన్ని పెంచుతున్నార‌ని అనిపించేది. 90 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆయ‌న చేతి రాతను చూసి ఆశ్చ‌ర్యం క‌లిగేది. అంత అందంగా ఆయ‌న దస్తూరి ఉండేది. ఈ వ‌య‌సులో కూడా చేతి రాత చెద‌ర‌నేలేదు. నా చేతి రాత బాగుండ‌దు. అందుకే ఎవ‌రి అంద‌మైన చేతి రాతను చూసినా, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వారి ప‌ట్ల గౌర‌వ‌భావం పెరుగుతుంది. నా అనుభ‌వాలు ఎలాంటివో, అటువంటి అనుభ‌వాలే మీకూ ఉండి ఉంటాయి. మీ ఉపాధ్యాయులు మీ జీవితానికి ఎంతో కొంత మంచిని చేసే ఉంటారు. ఆ విష‌యాన్ని న‌లుగురికీ చెప్పండి. దీనివ‌ల్ల స‌మాజంలో ఉపాధ్యాయుల ప‌ట్ల గౌర‌వం పెరుగుతుంది. వారిని చూసే దృష్టి కోణంలో మార్పు వ‌స్తుంది. స‌మాజంలో ఉపాధ్యాయుల గౌర‌వాన్ని పెంచ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. మీ ఉపాధ్యాయుల‌తో మీరు దిగిన ఫొటో గాని, ఆ ఉపాధ్యాయుల‌కు సంబంధించిన ప్రేర‌ణాత్మ‌క‌మైన సంఘ‌ట‌న‌లను గాని Narendra Modi App తో పాలుపంచుకోండి. దేశంలో ఉపాధ్యాయుల పాత్ర‌ను విద్యార్థి వైపు నుండి చూడ‌డం కూడా ఎంతో ముఖ్యం.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

కొద్ది రోజులలో గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌ర‌గ‌బోతున్నాయి. గ‌ణేశుడు విఘ్నాల‌ను తొల‌గించే దైవం. మ‌న‌ం అంద‌రమూ మ‌న దేశానికీ, మ‌న స‌మాజానికీ, మ‌న కుటుంబానికీ, మ‌న అంద‌రికీ…. ప్ర‌తి వ్య‌క్తి జీవితం కూడా నిర్విఘ్నంగా ఉండాల‌ని కోరుకుంటాము. కాబ‌ట్టి ఇప్పుడు గ‌ణేశ్ ఉత్స‌వానికి సంబంధించిన విష‌యం మాట్లాడుకుందాము.. గ‌ణేశ్ ఉత్స‌వాలు అన‌గానే లోక్ మాన్య తిల‌క్ జ్ఞాప‌కం రావ‌డం స‌హ‌జం. సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాల సంప్ర‌దాయం లోక్ మాన్య బాల‌ గంగాధ‌ర్ తిల‌క్ ప్రారంభించిందే. సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాల ద్వారా ఆయ‌న ఒక ధార్మిక అవ‌కాశాన్ని జాతిని మేలుకొలిపే పండుగ‌గా మార్చారు. స‌మాజంలో సంస్కారాల ప‌ర్వంగా దీనిని రూపుదిద్దారు. సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాల ద్వారా సామాజిక జీవితాన్ని స్పృశించే అన్ని అంశాల‌పైన విస్తృత చ‌ర్చ జ‌ర‌గాలి. స‌మాజానికి కొత్త ఊపును, ఉత్సాహాన్నీ ఇచ్చే విధంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాలి. ఈ ఉత్స‌వాల‌తో పాటు ‘స్వాతంత్య్రం మా జ‌న్మ హ‌క్కు’ అనే మంత్రాన్ని జోడించారు. కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌లో ఈ వాక్య‌మే కేంద్రంగా ఉండాలి. త‌ద్వారా స్వాతంత్య్రోద్య‌మానికి మ‌రింత బ‌లం చేకూరాల‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు ఒక్క మ‌హారాష్ట్ర లో మాత్ర‌మే కాదు, దేశంలో న‌లుమూల‌లా సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. యువ‌కులంతా ఉత్సాహంతో ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డానికి అనేక ర‌కాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కొంత మంది లోక్ మాన్య బాల‌ గంగాధ‌ర్ తిల‌క్ ఏ భావ‌న‌తో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారో, అదే భావ‌న‌తో ఇప్పుడు కూడా నిర్వ‌హించ‌డానికి శ‌త విధాలా కృషి చేస్తున్నారు. సామాజిక విష‌యాల‌పై ఆయ‌న చ‌ర్చ‌లను, గోష్టులను నిర్వ‌హించే వారు. వ్యాస ర‌చ‌నలో పోటీ పెట్టే వారు. రంగోలీ పోటీ ఉండేది. ఈ రంగోలీ ఆకృతుల‌లో సామాజిక అంశాలు ప్ర‌తిబింబించేవి. జ‌టిల‌మైన స‌మ‌స్య‌ల‌ను చాలా క‌ళాత్మ‌కంగా ప్ర‌తిబింబింపచేసే వారు. ఒక విధంగా చెప్పాలంటే, సామాజిక విద్యా ఉద్య‌మానికి సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాలు ఒక మాధ్య‌మంగా మారాయి. ‘స్వాతంత్య్రం మా జ‌న్మ హ‌క్కు’ అని ఒక ప్రేర‌ణాత్మక‌మైన మంత్రాన్ని తిల‌క్ ఇచ్చారు. ఇప్పుడు మ‌నం స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఉన్నాం. ఇప్పుడు సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాల నినాదం, మంత్రం, సుతంత్రం మా జ‌న్మ హ‌క్కు కావాలి. సుతంత్రం వైపు మ‌నం ముందుకు సాగాలి. సుతంత్ర‌మే ప్ర‌ముఖం కావాలి. ఇప్పుడు సుతంత్ర మంత్రాన్ని మ‌నం సామూహిక గ‌ణేశ్ ఉత్స‌వాల సందేశంగా అందించ‌లేమా.. రండి.. మిమ్మ‌ల్ని నేను ఆహ్వానిస్తున్నాను. సుతంత్రం వైపు ముందుకు సాగుదాం.

ఏ ఉత్స‌వ‌మైనా స‌మాజానికి శ‌క్తిప్రదాయ‌కం. ఉత్స‌వాలు వ్య‌క్తిలో, స‌మాజంలో, జీవితంలో కొత్త ఊపిరుల‌ను ఊదుతాయి. పండుగ కాని బ‌తుకు అసాధ్యం. కానీ, స‌మ‌యానుకూలంగా మ‌న జీవితాన్ని మ‌లుచుకోవాలి. ఈసారి అనేక మంది గ‌ణేశ్ ఉత్స‌వాలు, దుర్గా పూజ వంటి విష‌యాల‌పై నాకు ఎన్నో రాసి పంపించారు. వారి మాట‌లలో ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల బాధ క‌నిపించింది. మోదీ గారు, ‘మ‌న్ కీ బాత్’ లో ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయ‌కుడి ప్ర‌తిమ‌ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని శంక‌ర్ నారాయ‌ణ్ ప్ర‌శాంత్ కోరారు. చెరువు మ‌ట్టితో త‌యారుచేసిన విగ్ర‌హాల‌ను ఎందుకు ఉప‌యోగించ‌కూడ‌దు ? ఆలోచించండి.. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తో త‌యారుచేసిన విగ్ర‌హాలు ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేస్తాయి అంటూ ఆయ‌న ఎంతో వేదనను వ్య‌క్తం చేశారు. ఇత‌రులు కూడా వారి బాధ‌ను వెళ్లబోసుకొన్నారు. నేను కూడా మీ అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. గ‌ణేశుడి విగ్ర‌హాలు, దుర్గా మాత ప్ర‌తిమ‌లు, మ‌న పురాత‌న సంప్ర‌దాయం ప్ర‌కార‌మే మ‌ట్టి తోటే రూపొందించి ప‌ర్యావ‌ర‌ణాన్ని, చెరువుల‌ను, న‌దుల‌ను అన్నింటినీ కాపాడుకుందాము. నీటి కాలుష్యం ద్వారా ఆ నీటిలో ఉండే చిన్న చిన్న క్రిములు, ప్రాణులు న‌శిస్తాయి. అన్ని ప్రాణుల‌ను కాపాడ‌డమే కదా భ‌గ‌వంతుడి సేవ. వినాయ‌కుడు అంటే, విఘ్నాల‌ను తొల‌గించే శక్తి. మ‌నం విఘ్నాల‌ను క‌లిగించే వినాయ‌కులుగా మార‌కూడ‌దు. నేను చెప్పే ఈ విష‌యాలు మీరు ఎలా గ్ర‌హిస్తారో నాకు తెలియ‌దు. నేను కాదు, చాలా మంది ఈ విష‌యాల‌ను చెబుతున్నారు. నేను కూడా ఎంతో మంది చెప్పిన విష‌యాల‌ను విన్నాను. విగ్ర‌హాల‌ను త‌యారుచేసే పుణెకు చెందిన అభిజిత్ గోంఢే ఫ‌లే, ధ్యాన్ ప్ర‌బోధిని, కొల్హాపూర్ కు చెందిన నిస‌ర్గ్ మిత్ర్‌, విజ్ఞాన్ ప్ర‌బోధిని, విద‌ర్భకు చెందిన నిస‌ర్గ్ క‌ట్టా, ముంబయ్ కు చెందిన గిర్గావ్ చా రాజా, త‌దిత‌ర అనేక సంస్థ‌లు, సంఘాలు, వ్య‌క్తులు మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను త‌యారు చేయాల‌ని ప్ర‌చారం చేస్తూ ఉద్య‌మిస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూల‌మైన గ‌ణేశ్ ఉత్స‌వాలు స‌మాజ సేవ‌లో ఒక భాగ‌మే. దుర్గా పూజ‌కు ఇంకా స‌మ‌యం ఉంది.. ఇప్పుడే మ‌నం నిర్ణ‌యించుకుందాము. మ‌నం ప్రాచీన సంప్ర‌దాయం ప్ర‌కారం మ‌ట్టితో విగ్ర‌హాలు తయారుచేద్దాము. దీనివ‌ల్ల ఆ వృత్తి మీద ఆధార‌ప‌డే వారికి ఉపాధి దొరుకుతుంది. ప‌ర్యావ‌ర‌ణం కూడా ప‌రిర‌క్షించ‌బ‌డుతుంది. గ‌ణేశ్ చ‌తుర్ధి సంద‌ర్భంగా మీ అంద‌రికీ శుభాకాంక్ష‌లు.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

సెప్టెంబ‌ర్ 4న భార‌త‌ ర‌త్న మ‌ద‌ర్ టెరెసాను సెయింట్ బిరుదుతో స‌న్మానించ‌బోతున్నారు. మ‌ద‌ర్ టెరెసా త‌న యావత్తు జీవితాన్ని భార‌తదేశంలోని పేద‌ల సేవ కోస‌ం వినియోగించారు. ఆమె పుట్టిన దేశం అల్బేనియా. ఆమె మాతృ భాష ఇంగ్లీషు కాదు. అయినా ఆమె త‌న జీవితాన్ని ప్ర‌జ‌ల సేవ కోసం మ‌లుచుకున్నారు. పేద‌ల‌కు సేవ చేయ‌డం కోసం అవిరామంగా కృషి చేశారు. ఆమె జీవితాంతం నిరుపేద భార‌తీయుల సేవ‌లోనే గ‌డిపేశారు. అటువంటి మ‌ద‌ర్ టెరెసాకు సెయింట్ బిరుదు ల‌భిస్తోందంటే.. భార‌తీయుల‌మైన మ‌న‌మంద‌రమూ ఎంతో గ‌ర్వ ప‌డ‌డం స‌హజం. సెప్టెంబ‌ర్ 4న జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి 125 కోట్ల దేశ ప్ర‌జ‌ల త‌ర‌పున‌, భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున మ‌న విదేశాంగ మంత్రి సుష్మ స్వ‌రాజ్ నేతృత్వంలో ఒక అధికార ప్ర‌తినిధి బృందం అక్క‌డ‌కు వెళుతుంది. మునులు, రుషులు, సాధువుల ద్వారా ప్ర‌తి క్ష‌ణం మ‌నం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాము. ఎంతో కొంత గ్ర‌హిస్తూనే ఉంటాము. ఎంతో కొంత మంచి చేస్తూనే ఉంటాము.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

ప్ర‌గ‌తి అనేది ఒక ప్ర‌జా ఉద్య‌మంగా మారితే ఎంత మార్పు వ‌స్తుందో చూడండి. ప్ర‌జ‌ల శ‌క్తి భ‌గ‌వంతుడి రూప‌మే. భార‌త ప్ర‌భుత్వం కొద్ది కాలం క్రితం ఐదు రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో నిర్మ‌ల‌మైన గంగ కోసం, గంగానది కాలుష్యాన్ని తొల‌గించ‌డం కోసం ప్ర‌జ‌ల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఈ నెల 20న అల‌హాబాద్ లో గంగాన‌ది ఒడ్డున ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన‌పుడు ఆహ్వానింప‌బ‌డిన వారిలో న‌ది ఒడ్డున ఉండే పెద్ద‌లే ప్ర‌ముఖులు. వారిలో మ‌హిళ‌లు, పురుషులు అంద‌రూ ఉన్నారు. వారు అక్క‌డికి వ‌చ్చి గంగా న‌ది సాక్షిగా వారి, వారి గ్రామాల్లో దానిని అప‌విత్రం చేసి క‌లుషితం చేసే ప్ర‌య‌త్నాన్ని అడ్డుకుంటామ‌ని శ‌ప‌థం చేశారు. ప్ర‌తి గ్రామంలో, ప్ర‌తి వీధిలో మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్య‌మంగా చేప‌డ‌తామ‌ని చెప్పారు. అల‌హాబాద్ కు వ‌చ్చిన వారిలో ఒక‌రు ఉత్త‌రాఖండ్ వాసి అయితే, ఇంకొక‌రు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసి. మరొక‌రు బీహార్ వాసి. ఇంకా ఝార్ ఖండ్, ప‌శ్చిమ బెంగాల్ ల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంద‌రికీ ఇవే కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. శుభాకాంక్ష‌లు అందజేస్తున్నాను. భార‌త ప్ర‌భుత్వ అన్ని మంత్రిత్వ శాఖ‌ల‌కు, ఆయా మంత్రుల‌కు ఇవే నా శుభాకాంక్ష‌లు. గంగాన‌దిని కాలుష్య ర‌హితంగా చేయ‌డానికి క‌న్న క‌ల‌లు సాకార‌మ‌వుతున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఐదు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ధన్యవాదాలు పలుకుతున్నాను. ప్ర‌జాశ‌క్తిని స‌మీక‌రించి ఈ మ‌హ‌త్ కార్యంలో వారిని భాగ‌స్వాముల‌ను చేసినందుకు ధ‌న్య‌వాదాలు.

ప్రియ‌మైన నా దేశ వాసులారా…

అప్పుడప్పుడు కొన్ని విష‌యాలు నా మ‌న‌సును స్పర్శిస్తూ ఉంటాయి. ఆ భావాలు వెల్ల‌డించిన వారి ప‌ట్ల గౌర‌వం ఇనుమ‌డిస్తుంది. జులై 15న ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో క‌బీర్ ధామ్ జిల్లాలో సుమారు 1700 పాఠ‌శాల‌ల‌కు చెందిన ల‌క్షా పాతిక మంది విద్యార్థులు వారి వారి త‌ల్లితండ్రుల‌కు ఉత్త‌రాలు రాశారు. ఒక‌రు ఇంగ్లీషులో రాస్తే, మ‌రొక‌రు హిందీలో రాశారు. ఇంకొక‌రు ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాండ‌లికంలో రాశారు. ఈ పిల్ల‌లంద‌రూ వారి వారి త‌ల్లితండ్రుల‌కు రాసిన ఉత్త‌రాలలో వారి ఇంటిలో మ‌రుగుదొడ్డి కావాలి అని కోరారు. మ‌రుగుదొడ్ల నిర్మాణానికి పట్టుబట్టారు. కొంద‌రు విద్యార్థులైతే ఈసారి త‌మ పుట్టిన రోజు జ‌ర‌ప‌క‌పోయినా ఫ‌ర్వాలేదు, మ‌రుగుదొడ్డి త‌ప్ప‌కుండా క‌ట్టించాలంటూ కోరారు. 7 ఏళ్ల నుండి 17 ఏళ్ల మ‌ధ్య వయస్సు ఉన్న ఈ విద్యార్థులు చేసిన ప‌నికి వెల‌క‌ట్ట‌లేము. దీని ప్ర‌భావం ఎంత‌గా ఉందంటే, ఉత్త‌రాలు అందుకున్న త‌రువాత మ‌రుస‌టి రోజు పాఠ‌శాల‌కు వెళ్లేట‌ప్పుడు పిల్ల‌ల చేతుల్లో త‌ల్లితండ్రులు మ‌రో ఉత్త‌రాన్ని పెట్టారు. దానిని వారు ఉపాధ్యాయుల‌కు ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరారు. ఆ ఉత్త‌రంలో ఫ‌లానా తేదీ క‌ల్లా మేం మ‌రుగుదొడ్డిని క‌ట్టించేస్తామ‌న్న వాగ్దానం రాసి ఉంది. ఇటువంటి ఆలోచ‌న వ‌చ్చిన వారినే కాదు, ఆలోచ‌న రాని వారినీ ఆయా త‌ల్లితండ్రుల‌ను కూడా నేను అభినందిస్తున్నాను; విద్యార్థుల ఉత్త‌రాల‌ను గంభీరంగా పట్టించుకొని, మ‌రుగుదొడ్ల నిర్మాణ నిర్ణ‌యాన్ని తీసుకొన్న ఆ తల్లితండ్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఇదిగో ఇటువంటివే మ‌న‌కు స్ఫూర్తిని అందిస్తాయి. ప్రేర‌ణ‌ను కలిగిస్తాయి.

క‌ర్ణాట‌క‌లోని కొప్పాల్ జిల్లా. ఈ జిల్లాలో 17 ఏళ్ళ మ‌ల్ల‌మ్మ. ఈమె ఆమె కుటుంబం పైనే స‌త్యాగ్ర‌హానికి పూనుకొన్నది. అన్నం తిన‌డం కూడా మానేసింది. ఆమె త‌న కోసం మంచి దుస్తులు కావాల‌నో, మిఠాయి కావాల‌నో కాకుండా కేవ‌లం త‌న ఇంట్లో మ‌రుగుదొడ్డి కావాల‌ని ఉపవాసదీక్ష చేసింది. అయితే.. ఆమె కుటుంబానికి మ‌రుగుదొడ్డి క‌ట్టేటంత ఆర్థిక స్తోమత లేదు. కానీ, మ‌ల్ల‌మ్మ స‌త్యాగ్ర‌హాన్ని విర‌మించ‌డానికి స‌సేమిరా అంది. దీంతో ఆ ఊరి పెద్ద మ‌హ్మ‌ద్ ష‌ఫీ 18,000 రూపాయ‌ల‌ను స‌మీక‌రించారు. ఒక్క వారం రోజులలో మ‌రుగుదొడ్డిని ఏర్పాటుచేశారు. మ‌ల్ల‌మ్మ ప‌ట్టుద‌ల‌, ష‌ఫీ లాంటి గ్రామ పెద్ద స‌హ‌కారంతో క‌ల నిజ‌మైంది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌లుపులు ఎట్లా తెరుచుకుంటాయో తెలుసుకోవ‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌.

ప్రియ‌మైన నా దేశ వాసులారా…

స్వ‌చ్ఛ భార‌త్ ప్ర‌తి భార‌తీయుడి క‌ల‌గా, కొంతమందికి సంక‌ల్పంగా మారింది. కొంతమంది దీనినే ల‌క్ష్యంగా మార్చుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక విధంగా ఈ ఉద్య‌మంలో భాగ‌స్వాముల‌య్యారు; కొత్త కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వానికి ఒక ఆలోచ‌న వ‌చ్చింది. మీరు స్వ‌చ్ఛ‌త కోసం చేస్తున్న కృషి – రెండు నిమిషాలో మూడు నిమిషాలో- దానిని చిత్రీక‌రించి, కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించండి. వెబ్ సైట్‌లో దీనికి సంబంధించిన స‌మాచార‌మంతా ఉంటుంది. దీనిని ఒక పోటీగా నిర్వ‌హిస్తాము. ఈ పోటీలో గెలిచిన‌ వారికి అక్టోబ‌ర్ 2.. గాంధీ జ‌యంతి రోజు.. బ‌హుమ‌తులు అంద‌జేస్తాము. నేనైతే టీవీ ఛాన‌ళ్ల వారికి కూడా విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. మీరు కూడా స్వ‌చ్ఛ‌త‌పై ల‌ఘు చిత్రాలను త‌యారుచేసి పంపండి. దానితో స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మానికి మ‌రింత ప్రేర‌ణ ల‌భిస్తుంది. కొత్త కొత్త నినాదాలు ల‌భిస్తాయి. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోను, సామాన్య క‌ళాకారుల‌తోను సాధ్య‌మయ్యేవే. వీటి కోసం పెద్ద పెద్ద స్టూడియోలు, పెద్ద పెద్ద కెమెరాలు అవ‌స‌రం లేదు. రండి- ముందుకు సాగండి. మీ అంద‌రికీ ఇదే నా ఆహ్వానం.

నా ప్రియ‌మైన దేశ ప్ర‌జ‌లారా…

ఇరుగు పొరుగు దేశాల‌తో మ‌న సంబంధాలు బాగుండాల‌ని, ప్ర‌గాఢం కావాల‌ని మ‌నం కృషి చేస్తూనే ఉన్నాము. కొద్ది రోజుల క్రితం ఒక ప్ర‌ధాన‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. మ‌న గౌర‌వ‌నీయులైన రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గారు కోల్ క‌తాలో ఒక కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అది ఆకాశ‌వాణి మైత్రి ఛానెల్‌. చాలా మందికి ఇదేమిటి.. ఒక రేడియో ఛానెల్ ను ప్రారంభించ‌డానికి రాష్ట్రప‌తి కావాలా అని అనిపించ‌వ‌చ్చు. కానీ, ఇది మామూలు రేడియో ఛానెల్ కాదు. ఇదో పెద్ద ముంద‌ంజ. మ‌న పొరుగునే బంగ్లాదేశ్ ఉంది. మ‌న‌కు తెలుసు.. బంగ్లాదేశ్‌, ప‌శ్చిమ బెంగాల్ ఒకే ర‌క‌మైన సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు చెందిన‌వి. ఇటువైపు ఆకాశ‌వాణి మైత్రి.. అటువైపు వైర్ లెస్ బంగ్లాదేశ్‌. ఆ రెండు ప‌ర‌స్ప‌రం స‌మాచారాన్ని, విష‌యాల‌ను అందిపుచ్చుకుంటాయి. ఇరువైపులా ఉన్న బంగ్లా భాష మాట్లాడే వారు.. ఆకాశ‌వాణి ఆనందాన్ని అందుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల మ‌ధ్య స‌త్సంబంధాలు నెల‌కొల్ప‌డానికి ఆకాశ‌వాణి ఎంతో దోహ‌దం చేస్తుంది. అందుకే.. రాష్ట్రప‌తి స్వ‌యంగా మైత్రి ఛానెల్ ను ప్రారంభించారు. ఈ ప‌నిలో మ‌న‌కు చేదోడుగా నిలిచిన బంగ్లాదేశ్ కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. విదేశీ వ్య‌వ‌హారాల విధానంలో భాగ‌స్వాములైన ఆకాశ‌వాణి మిత్రుల‌కు కూడా నేను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా..

మీరు నాకు ప్ర‌ధాన మంత్రి ప‌నిని అప్ప‌గించారు. నిజ‌మే, కానీ నేను కూడా ఒక మ‌నిషినే. అప్పుడ‌ప్పుడు హృద‌యాన్ని స్పందింప‌చేసే, గుండెను బ‌రువెక్కించే సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అవి నాలో కొత్త శ‌క్తిని, ప్రేర‌ణ‌ను నింపుతుంటాయి. నా భార‌తదేశ ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌నే స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం నాకు ఒక ఉత్త‌రం వ‌చ్చింది. అది నా హృద‌యాన్ని తాకింది. సుమారు 84 ఏళ్ళ ఒక త‌ల్లి. విశ్రాంత ఉపాధ్యాయురాలు ఆమె. ఆమె పంపిన లేఖ సారాంశం ఇది.. త‌న పేరును ఎప్పుడు, ఎక్క‌డా ప్ర‌స్తావించ‌వ‌ద్ద‌ని ఆ లేఖ‌లో ఆవిడ మ‌రీమ‌రీ ప్రాథేయపడ్డారు. కానీ.. నేను ఆమె పేరును చెబుతూ.. మీతో మాట్లాడాల‌నుకుంటున్నాను. ఆమె త‌న ఉత్త‌రంలో “గ్యాస్ స‌బ్సిడీని త్యాగం చేయ‌ండని మీరు కోరిన‌ప్పుడే, నేను స‌బ్సిడీని వ‌దులుకున్నాను. ఆ విష‌యం ఆ త‌రువాత పూర్తిగా మ‌రచిపోయాను. కానీ, కొద్ది రోజుల క్రితం మీ త‌ర‌ఫున ఒక వ్య‌క్తి వ‌చ్చి, నాకు ఒక లేఖ అందించారు. గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ పంపిన లేఖ అది. ప్ర‌ధాన మంత్రి పంపించిన ఉత్త‌రం. ఇది ప‌ద్మ శ్రీ అవార్డు కంటే త‌క్క‌ువేమీ కాదు..” అని ఆ విశ్రాంత ఉపాధ్యాయురాలు తన మనోభావాలను ఉత్తరంలో పంచుకొన్నారు.

ప్రియమైన నా దేశ ప్ర‌జ‌లారా..

గ్యాస్ స‌బ్సిడీని విడచిపెట్టిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌తా పూర్వ‌కంగా లేఖ రాయాల‌ని ప్ర‌య‌త్నం చేశాను. నా త‌ర‌ఫున ఎవ‌రో ఒక‌రు స్వ‌యంగా ఆ త్యాగ‌మూర్తుల‌ను క‌లుసుకొని, ఆ ఉత్త‌రాలను వారికి అంద‌జేస్తారు. ఇదిగో అలా.. అంద‌జేసిన ఉత్త‌రానికి జ‌వాబే ఆ మాతృమూర్తి లేఖ‌. ‘మీరు చాలా మంచి ప‌ని చేస్తున్నారు. నిరుపేద‌లైన మ‌హిళ‌ల‌కు క‌ట్టెల పొయ్యి పొగ బారి నుండి విముక్తి క‌ల్పిస్తున్నారు. “నేను ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలిని. కొద్ది రోజులలో నాకు 90 ఏళ్లు నిండుతాయి. నేను 50,000 రూపాయ‌లు విరాళంగా మీకు పంపుతున్నాను. ఇది నిరుపేద‌లైన మ‌హిళ‌ల‌కు పొగ నుండి విముక్తిని క‌ల్పించ‌డంలో మీరు చేస్తున్న కృషికి తోడ్ప‌డాల‌ని ఆశిస్తున్నాను” అంటూ రాశారు. రిటైర్ అయి.. వ‌చ్చే పెన్ష‌న్ తో జీవితాన్ని సాగ‌దీస్తున్న ఒక మాతృమూర్తి, త‌న తోటి నిరుపేద సోద‌రీమ‌ణుల‌కు గ్యాస్ క‌నెక్ష‌న్ ను ఇవ్వ‌డం కోసం ‌50,000 రూపాయ‌ల‌ను పంపించారు. దీనిలో ముఖ్య‌మైంది న‌గ‌దు మాత్ర‌మే కాదు, ఆమెకు వ‌చ్చిన ఆలోచ‌న‌, భావ‌న‌, ఇత‌రుల కోసం సాయం చేయాల‌నే త‌ప‌న.. ఇవి న‌న్ను కదలించాయి. ఆ రిటైర్డ్ టీచ‌రుకు ధ‌న్య‌వాదాలు. ఇటువంటి కోట్లాది సోద‌రీమ‌ణుల ఆశీర్వాదాలే ఈ దేశ భ‌విష్య‌త్తుకు ఊతం. మ‌న దేశానికి బ‌లమూ, ధైర్యమూ. ఆమె నాకు రాసిన ఆ ఉత్త‌రం కూడా ప్ర‌ధాన మంత్రి పేరున పంప‌లేదు. మామూలు ఉత్త‌రం. ‘మోదీ భ‌య్యా’ అంటూ రాశారు. ఆవిడ‌కు నా న‌మ‌స్కారాలు. దేశంలో ఇటువంటి త‌ల్లులు అంద‌రికీ కూడా నా వందనములు తెలుపుకొంటున్నాను. వారు స్వయంగా క‌ష్టాలను భ‌రిస్తూ, త‌మ శ‌క్తి కొద్దీ ఇతరులకు స‌హాయపడుతూ ఉంటారు.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా…

గ‌త సంవ‌త్స‌రం అనావృష్టి కార‌ణంగా ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాము. అయితే ఈ ఆగ‌స్టు నెల వ‌ర‌ద‌ల క‌ష్టాల్లోకి మ‌న‌ల్ని నెట్టింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర ప్ర‌భుత్వం, స్థానిక సంస్థ‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, సామాజిక సంస్థ‌లు, ప్ర‌జ‌లు వారి వారి శ‌క్తి మేర‌కు వ‌ర‌ద‌ల నుండి ప్ర‌జ‌ల నుంచి గ‌ట్టెక్కించ‌డానికి కృషి చేశారు. కానీ, ఈ వ‌ర‌ద క‌ష్టాల వార్త‌ల మ‌ధ్య‌లోనే మ‌రికొన్ని సందేశాల‌ను ఇచ్చే వార్త‌లు కూడా వ‌చ్చాయి. వీటిపై దృష్టి సారించాలి. ఐక‌మ‌త్యంతో ఉండే బ‌లం ఎంతో.. క‌లసి న‌డిస్తే.. క‌లసి ప‌ని చేస్తే.. వ‌చ్చే ఫ‌లితాలు అద్భుతం. వీట‌న్నిటితో కూడిన ఆగ‌స్టు నెల చిర‌స్మ‌ర‌ణీయం. రాజ‌కీయంగా భిన్న ధృవాల‌కు చెందిన పార్టీలు ఒక తాటిపైకి వ‌చ్చి పార్ల‌మెంట్‌లో వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జి ఎస్ టి) బిల్లుకు చ‌ట్ట రూపం క‌ల్పించాయి. జి ఎస్ టి చ‌ట్టంగా మార‌డంలో అన్ని రాజ‌కీయ పార్టీల పాత్ర ప్ర‌ముఖ‌మైందే. అన్ని పార్టీలు క‌లసి న‌డిస్తే ఎంత గొప్ప కార్య‌మైనా ఎంత తేలిక‌గా పూర్త‌వుతుందో దీనిని బ‌ట్టి తెలుస్తోంది. అదే విధంగా క‌శ్మీర్ లో కూడా కొంత‌మేర జ‌రిగింది. క‌శ్మీర్ లోని ప‌రిస్థితుల విష‌యంలో దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఒకే గొంతుతో, ఒకే విధంగా స్పందించాయి. అటు ప్ర‌పంచానికీ, ఇటు వేర్పాటువాదుల‌కు గ‌ట్టి సందేశాన్ని ఇచ్చాయి. క‌శ్మీర్ ప్ర‌జ‌ల ప‌ట్ల మ‌న సానుభూతిని స్ప‌ష్టంగా వ్య‌క్తం చేశాయి. క‌శ్మీర్ విష‌యంలో అన్ని పార్టీల‌తో నేను స్వ‌యంగా మాట్లాడాను. ఇది ఎంతో బాగుంది. వారు వ్య‌క్తం చేసిన ప్ర‌తి అభిప్రాయంలోను ఒక విష‌యం స్ప‌ష్ట‌మ‌య్యేది. నేను త‌క్కువ మాట‌లలో చెప్పాల‌నుకుంటే- ఐక‌మ‌త్యం, అనురాగం ఈ రెండే మూల మంత్రాలుగా ఉండాల‌ని అనే వాడిని. మ‌నంద‌రి అభిప్రాయం ఒక‌టే. 125 కోట్ల మంది ప్ర‌జ‌ల అభిప్రాయ‌మే ఇది. గ్రామంలో స‌ర్పంచ్ మొద‌లుకొని ప్ర‌ధాన మంత్రి వ‌ర‌కు.. అంద‌రూ భావించేది ఒక్క‌టే. క‌శ్మీర్‌లో ఒక‌రి ప్రాణం పోయిందంటే.. అత‌ను యువ‌కుడైనా, భ‌ద్ర‌తాద‌ళాల‌కు చెందిన జ‌వాను అయినా.. ఎవ‌రి ప్రాణ‌మైనా స‌రే.. మ‌న‌లో ఒక‌రిని కోల్పోయిన‌ట్లే. ఇదే భావ‌న దేశ‌వ్యాప్తంగా ఉంది. అమాయ‌క క‌శ్మీరీ పిల్ల‌లను ముందుకు తోసి.. అక్క‌డ శాంతికి భంగం క‌లిగించే వారు ఎవ‌రైనా స‌రే.. ఎప్పుడో ఒక‌ప్పుడు.. వారు ఈ పిల్ల‌ల‌కు సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవ‌స‌రం వ‌స్తుంది.

ప్రియ‌మైన నా దేశ వాసులారా…

మ‌న దేశం చాలా పెద్ద‌ది. అనేక వైవిధ్యాల‌తో కూడుకొన్న‌ది. ఈ వైవిధ్యాల మ‌ధ్యే ఐక‌మ‌త్యాన్ని సాధించ‌డం పౌరులుగా, స‌మాజంగా, ప్ర‌భుత్వంగా మ‌నంద‌రి బాధ్య‌త‌. ఐక‌మ‌త్యాన్ని పెంపొందించే మాట‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చుదాము. ఈ విధంగానే దేశం ఉజ్జ్వల భ‌విష్య‌త్తును రూపొందించుకొని అక్క‌డికి చేరుకోగ‌లుగుతుంది. 125 కోట్ల నా దేశ ప్ర‌జ‌ల శ‌క్తియుక్తుల మీద నాకు న‌మ్మ‌క‌ం ఉంది.

మీ అంద‌రికీ నా ధ‌న్య‌వాదములు.

***