దీపావళి పవిత్ర పర్వదినం సందర్భంగా మీరు సెలవులను అద్భుతంగా గడిపి ఉంటారు. కొత్త వ్యాపార కార్యకలాపాలను కూడా ఉత్సాహంగా ప్రారంభించి ఉంటారు. ఇంకోవైపు – క్రిస్మస్ పండుగ కోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమై ఉంటాయి. సామాజిక జీవనంలో పండుగ మనకు ఎంతో ముఖ్యమైనది. ఒక్కోసారి పండుగ మన గాయాలను మాన్పడానికి ఉపయోగపడితే… ఒక్కోసారి కొత్త శక్తిని ఇస్తుంది. కానీ… ఒక్కొక్కసారి పండుగలప్పుడు కష్టాలు ఎదురైతే బాధాకరంగా ఉంటుంది. మరింత ఇబ్బందిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని అన్నిచోట్ల నుంచి ప్రకృతి వైపరీత్యాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో కూడా ప్రకృతి వైపరీత్యాల వార్తలు వస్తుంటాయి. వాతావరణ మార్పుల ప్రభావం ఎంత వేగంగా పెరిగిపోతోందన్న విషయం మనకిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మన దేశంలోనే కొద్దిరోజుల కిందట అతివృష్టి, అకాల వర్షాలు, ఎడతెరిపిలేని వర్షాలు ఎలా కురిశాయో… ప్రత్యేకించి తమిళనాడులో ఈ వర్షాల వల్ల వాటిల్లిన నష్టం ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. ఎంతోమంది చనిపోయారు. ఈ కష్ట సమయంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పూర్తి శక్తియుక్తులతో నిమగ్నమై ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ భుజం భుజం కలిపి పని చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ బృందం ఒకటి తమిళనాడు వెళ్లింది. తమిళనాడు శక్తి మీద విశ్వాసం ఉంది. ఇంతటి విపత్తును ఎదుర్కొన్నా… అది తిరిగి ముందుకు సాగుతుందని, అలాగే దేశ పురోగతిలో కూడా తన వంతు పాత్రను పోషిస్తుందని నమ్మకం ఉంది. కానీ, నలువైపులా ఇలాంటి విపత్తులను చూస్తుంటే వీటిని ఎదుర్కొనే విషయంలో తగిన మార్పు తేవాల్సిన అవసరం ఏర్పడిందనిపిస్తోంది. పదిహేనేళ్ల కిందట అయితే ప్రకృతి వైపరీత్యం అంటే అదేదో వ్యవసాయ విభాగానికే పరిమితంగా ఉండేది. ఎందుకంటే… అప్పట్లో ఎక్కువ మటుకు ప్రకృతి విపత్తులు వ్యవసాయానికే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు విపత్తుల తీరే మారిపోయింది. ప్రతి స్థాయిలో మనం మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేయడం అనివార్యంగా మారింది. ప్రభుత్వం, పౌర సమాజం, ప్రజలు, చిన్న పెద్ద సంస్థలు ఎంతో లోతైన శాస్త్రీయ దృక్పథంతో సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు పాటుపడవలసి ఉంది. నేపాల్‌లో వచ్చిన భూకంపం తర్వాత నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి శ్రీ నవాజ్ షరీఫ్‌తో మాట్లాడాను. సార్క్ దేశాలన్నీ కలసి విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత కోసం సంయుక్త విన్యాసం చేయాలని సూచించారు. ఢిల్లీలో సార్క్ దేశాల సమావేశం ఒక సదస్సు నిర్వహించి విపత్తులను ఎదుర్కొనే విషయంపై ఉత్తమ విధానాలను చర్చించడం నాకు సంతోషంగా ఉంది.
నాకు ఈరోజు పంజాబ్ లోని జలంధర్ నుంచి లఖ్విందర్ సింగ్ నుంచి ఫోన్ వచ్చింది.
‘నేను లఖ్విందర్ సింగ్‌ను. పంజాబ్ జలంధర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తాము. ఎంతో మందికి పంటల సాగు విషయంలో సలహాలు ఇస్తాం. నాకు ఒక సందేహం ఉంది. పంటలు కోసుకున్నాక కొయ్యలకు రైతులు నిప్పంటిస్తారు. గోధుమ గడ్డి దగ్ధం చేయడంవల్ల భూమిలోని సూక్ష్మ జీవాణువులు దెబ్బతిని దానివల్ల ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది అనే విషయం ఇక్కడి వారికి ఎలా చెప్పాలి అని. దిల్లీలో, హర్యాణాలో, పంజాబ్‌లో ఈ కాలుష్యానికి నివారణ ఏంటి?’ అనేది ఆ ఫోన్ కాల్.
లఖ్విందర్ సింగ్ గారు… మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషం కలిగింది. మీరు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు అని తెలిసి నాకు సంతోషం కలిగింది. రెండోది… మీరు స్వయంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే మరోవైపు రైతుల సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. మీ ఆవేదన సమంజసమే. కానీ ఈ సమస్య ఒక్క పంజాబ్‌లోనో, ఒక్క హర్యాణాలోనో కాదు. మొత్తం భారతదేశంలోనే మనకు ఈ అలవాటు ఉంది. తరతరాలుగా ఈ విధంగా మన పంటలు కోశాక గడ్డి, ఇతర అవశేషాలను కాల్చివేసే మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఒకటి -దీనివల్ల మొదట ఎలాంటి నష్టం వస్తుందో మనకు తెలిసేది కాదు. అందరు చేస్తున్నారు కాబట్టి మనమూ చేస్తూ వచ్చాం. ఇదే అలవాటుగా ఉండేది. రెండోది – దీనికి ఉపాయం ఏమిటో తెలుసుకునే శిక్షణ లేదు. దీనివల్ల ఈ విధంగా కొనసాగింది. ఈ పద్ధతి అలా పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుత వాతావరణ మార్పుల సమస్యకు ఈ కాల్చివేత సమస్య కూడా తోడైంది. ఈ సమస్య ప్రభావం నగరాలకు కూడా విస్తరించడంతో ఇప్పుడు దీని గురించిన చర్చ వినిపిస్తోంది. కానీ, మీరు ఇప్పడు వ్యక్తం చేసిన ఆవేదన చాలా నిజమైంది. దీనిపై మన రైతు సోదరసోదరీమణులకు అవగాహన కల్పించాలి. ఈ సమస్యకు మొట్టమొదటి పరిష్కారం పంటల కొయ్యలను కాల్చివేయడం వల్ల కొంత సమయం కలిసివస్తుంది. శ్రమ తగ్గుతుంది. తర్వాతి పంట వేసేందుకు పొలం సిద్ధం కానుంది. కానీ… ఇది వాస్తవం కాదు. పంటల అవశేషాలు కూడా చాలా విలువైనవని… వాటిలో ఎరువుగా ఉపయోగపడే గుణం ఉందనే వాస్తవాన్ని రైతులకు వివరించి చెప్పాలి. మనం వాటిని కాల్చడం వల్ల ఆ గుణాల్ని నాశనం చేస్తున్నాం. అంతేకాదు… వాటిని ముక్కలుముక్కలుగా చేసి పెడితే పశువులు ఎండిన పండ్లుగా ఇష్టంగా తింటాయి. రెండోది – వీటిని కాల్చడం వల్ల నేల పై పొర కాలిపోతుంది.
నా ప్రియమైన రైతు సోదరీ సోదరులారా.. ఒక్క క్షణం ఆలోచించండి. మన ఎముకలు గట్టిగా ఉండాలా… గుండె దృఢంగా ఉండాలా… మూత్ర పిండాలు బాగుండాలా.. అన్నీ బాగున్నా శరీరం మీద ఉండవలసిన చర్మం కాలిపోయిందనుకోండి. ఏమవుతుంది. మనం బతుకుతామా…? గుండె కొట్టుకుంటున్నా కూడా బతకలేం. మన చర్మం కాలిపోతే జీవించడం ఎలాగైతే కష్టమో అలాగే పంటల అవశేషాలను తగులబెడితే కేవలం అవే కాదు. చర్మం కూడా కాలిపోతుంది. మన భూమి పొర కాలితే సారవంతమైన భూమిని కూడా మృత్యువు వైపు మళ్లించినట్లవుతుంది. అందుకని ఈ విషయంలో సానుకూలమైన కృషి జరగాలి. ఈ అవశేషాలను మళ్లీ భూమిలో వేసి దున్నితే అవి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడతాయి. లేదా గొయ్యి తీసి ఒకచోట పాతి నీళ్లుపోస్తే కూడా మంచి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. పశువులు తినడానికి ఇది ఎలాగు పనికి వస్తుంది. దీనివల్ల మన భూమి కూడా బాగుంటుంది… ఆ నేలలో వేసే ఇలాంటి ఎరువు వల్ల రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది.
ఒకసారి అరటిసాగు చేసే రైతు సోదరులతో మాట్లాడే అవకాశం వచ్చింది. వాళ్లు నాకు ఒక మంచి అనుభవం గురించి చెప్పారు. అరటి సాగు చేసేటప్పుడు ఆ పంట అయిపోయాక అరటి బోదెలు మిగిలేవి. అటువంటి భూమిని చదును చేయడానికి ఒక్కొక్క హెక్టార్‌కు ఐదు వేలు, పది వేలు, పదిహేను వేల రూపాయలు ఖర్చయ్యేవి. ఆ బోదెలను, ఆకులను తొలగించడానికి ట్రాక్టర్ల నిండా జనం వస్తే తప్ప ఆ పని జరిగేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు ఏం రుజువు చేశారంటే – బోదెలను ఆరారు ఎనిమిదెనిమిది అంగుళాల ముక్కలు చేసి భూమిలో పాతేశారు. అనుభవం ఏంటంటే ఈ అరటి బోదెలలో ఎన్ని నీళ్లు ఉన్నాయంటే – అవి పాతేసిన నేలలో మొక్కలైనా, చెట్లయినా, పంటలైనా మూడు నెలల వరకు నీరు పోయవలసిన పని లేదు. ఆ పాతిపెట్టిన అరటి బోదెల ముక్కల్లో ఉన్న నీరు పైరును గానీ, మొక్కలను గానీ బతికిస్తుందన్న మాట. ఇప్పుడు అక్కడ ఈ అరటి బోదెలకే ఆదాయం కూడా వస్తోంది. ఆ మొక్కలకు కూడా ప్రాణం లభిస్తుంది. మొదట్లో ఆ ముక్కల్ని తొలగించి శుభ్రపరచడానికి ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ బోదెలకే ఆదాయం వస్తోంది. చిన్న ప్రయోగం కూడా ఎంతో లాభం ఇవ్వగలదు – మన రైతు సోదరులు ఏ శాస్త్రవేత్తలకు తీసిపోరు.
ప్రియమైన నా దేశవాసులారా,
వచ్చే డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచమంతా జరుపుకోనుంది. ఇంతకుముందు మన్ కీ బాత్ లో మీతో నేను అవయవ దానంపై మాట్లాడాను. అందులో అవయవదానం కోసం నోటో హెల్ప్ లైన్ గురించి కూడా మాట్లాడాను. ఆనాటి మన్ కీ బాత్ తర్వాత ఫోన్ కాల్స్ సంఖ్య ఏడు రెట్లు పెరిగింది. వెబ్ సైట్లో స్పందనలు రెండున్నర శాతం పెరిగాయి. నవంబర్ 27న భారతీయ అవయవ దానం దినాన్ని జరుపుకున్నాం. సమాజంలోని పలువురు ప్రముఖులు అందులో పాల్గొన్నారు. సినీనటి రవీనా టాండన్ తదితరులు ఎంతో మంది ప్రముఖులు ఇందులో పాలుపంచుకున్నారు. అవయవదానం ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడుతుంది. అవయవదానం ఒకరకమైన అమరత్వాన్ని తీసుకొస్తుంది. ఒక శరీరంలో నుంచి మరో శరీరంలోకి అవయవం వెళ్లడంతో ఆ శరీరానికి కొత్త జన్మ లభిస్తుంది. ఆ వ్యక్తికి కొత్త జీవితం లభిస్తుంది.
ఇంతకంటే సర్వోత్తమమైన దానం ఇంకేముంటుంది..? అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు ఎందరో ఉన్నారు. అవయవ దాతలు, అవయవ మార్పిడికి సంబంధించిన జాతీయస్థాయిలో ఒక రిజిస్ట్రీ వ్యవస్థ ఈ నెల 27న ప్రారంభమైంది. నోటోకు సంబంధించిన లోగో, డోనార్ కార్డు, స్లోగన్ డిజైన్ చేయడానికి మైగవ్ డాట్ ఇన్ లో ఒక జాతీయస్థాయి పోటీ పెట్టారు. దీనిలో ఎంత మంది పెద్ద ఎత్తున పాల్గొని వినూత్నమైన రీతిలో సానుభూతితో మాట్లాడారో తలుచుకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయంపై విస్తృతమైన చైతన్యం వస్తుందని, అవసరార్థులకు వాస్తవికంగా ఉత్తమోత్తమైన సహాయం లభిస్తుందని నాకు విశ్వాసం ఉంది. ఎవరో ఒకరు దానం చేయకపోతే… వారికి సహాయం ఎలా లభిస్తుంది? ఇంతకుముందే నేను చెప్పినట్టు డిసెంబర్ 3న వికలాంగుల దినోత్సవంగా జరుపుకోబోతున్నాం. శారీరక, మానసిక వికలాంగులు కూడా అసమాన సాహసులు, సామర్థ్య సంపన్నులై ఉంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా వారిని హేళన చేస్తే చాలా బాధ కలుగుతుంది. ఎక్కడైనా కరుణ, దయాపూర్వకమైన మాట వినిపిస్తే చాలా బాగనిపిస్తుంది. కానీ వాళ్లపట్ల మన దృష్టిని మార్చుకుంటే వారి నుంచి స్ఫూర్తి అందుతుంది. చిన్న కష్టం వస్తే చాలు మనం ఏడుస్తూ కూర్చుంటాం. నాకు వచ్చిన కష్టం చాలా చిన్నదని వాళ్లెట్లా కష్టపడుతున్నారు… వీళ్లెట్లా జీవిస్తున్నారు… ఎలా పని చేస్తున్నారు… అని గనుక ఆలోచిస్తే మన కష్టం పెద్ద కష్టం అనిపించదు. అందువల్ల వికలాంగులు మనకు స్ఫూర్తి కలిగిస్తారు. వారి సంకల్ప శక్తి, వారి జీవన విధానం కష్టాల్ని సమర్థంగా ఎదుర్కొనే వారి దృష్టి ప్రశంసనీయంగా అనిపిస్తుంది.
ఈరోజు జావెద్ అహ్మద్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. అతనికి 40-42 ఏళ్ల వయసు ఉంటుంది. 1996లో కశ్మీర్ లో జావెద్ అహ్మద్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయనను వారు కాల్చారు గానీ బతికి బయటపడ్డారు. కానీ, ఉగ్రవాదుల తూటాల కారణంగా మూత్ర పిండం పోగొట్టుకున్నారు. జీర్ణకోశం, పేగుల్లో కొంత భాగం పోయింది. వెన్నుకు తీవ్రమైన గాయం అయింది. సొంత కాళ్లపై నిలబడగలిగే శక్తి శాశ్వతంగా పోయింది. అయినా జావెద్ అహ్మద్ ఓటమిని ఒప్పుకోలేదు. ఉగ్రవాదపు దెబ్బ కూడా జావెద్ మనస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. తన అభిరుచి… తనది అన్నింటికంటే పెద్ద విషయం ఏంటంటే – అకారణంగా ఒక నిరపరాధికి ఇంత పెద్ద కష్టం ఎదుర్కోవలసి రావడం. జీవితంలో ముఖ్య దశ ప్రమాదంలో పడింది. కానీ ఏమాత్రం బెంగలేదు. ఆక్రోశం లేదు. ఈ కష్టాన్ని కూడా జావెద్ అహ్మద్ ఒక సంచలనంగా మార్చివేసి, తన జీవితాన్ని సమాజ సేవకు అర్పించేశారు. శరీరం సహకరించదు. కానీ 20 ఏళ్ల నుంచి పిల్లలకు చదువు చెప్పడంలో మునిగిపోయాడు. అంగవికలుర కోసం మౌలిక సదుపాయాలను ఎలా మెరుగుపర్చాలి…. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగుల కోసం ఏర్పాట్లను ఎలా మెరుగుపర్చాలి… అన్న అంశాలపై పని చేస్తున్నాడు. ఈ విషయాల్లోనే తన చదువును కొనసాగించాడు. సామాజిక సేవలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. ఒక సామాజిక సేవకుని రూపంలో ఒక అప్రమత్త పౌరుడిగా, వికలాంగులకు దూతగా మారి… ఒక నిశ్శబ్ధ విప్లవం రచిస్తున్నాడు. జావెద్ జీవితం హిందుస్థాన్ మూలమూలలా మనకు ప్రేరణ ఇవ్వడానికి సరిపోదా… జావెద్ అహ్మద్ జీవితాన్ని, ఆయన తపస్సును, ఇంకా ఆయన అంకితభావాన్ని డిసెంబర్ 3న ప్రత్యేకంగా గుర్తుచేస్తాను. సమయాభావం వల్ల జావెద్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కానీ దేశం నలుమూలలా ఇలాంటి ప్రేరణ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. జీవించేందుకు కొత్త వెలుగులు ఇస్తున్నాయి. దారి చూపుతున్నాయి. డిసెంబర్ 3న ఇలాంటి అందరినీ గుర్తుచేసుకుని వారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. మన దేశం ఎంతో విశాలమైందంటూ ఎన్నో ప్రస్తావనలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో మనం ప్రభుత్వాల మీద ఆధారపడతాం. మధ్యతరగతికి చెందిన వ్యక్తి కావచ్చు… దిగువ మధ్యతరగతి వ్యక్తి అయినా కావచ్చు… పేదవాడు కావచ్చు… దళితులు… పీడితులు… విధివంచితులు కావచ్చు. ప్రభుత్వ వ్యవస్థలతో నిరంతర సంబంధం ఉంటుంది. ఇంకా ఒక పౌరునిగా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒక ప్రభుత్వాధికారితో అతనికి చేదు అనుభవం ఉండి ఉండొచ్చు. ఆ ఒకటీ అరా చేదు అనుభవం వల్ల అతనికి ప్రభుత్వ వ్యవస్థ అంటే సదభిప్రాయం ఉండదు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ ఒక్కోసారి ఇదే ప్రభుత్వ వ్యవస్థలో లక్షలాది మంది సేవా దృష్టితో, అంకిత భావంతో ఎంతో ఉత్తమ సేవలందిస్తున్నారు. అలాంటివారు మన దృష్టికి రాకపోవచ్చు. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరో ప్రభుత్వోద్యోగి ఇంత మంచి పని చేస్తున్నారని మనకసలు తెలియనే తెలియనంత సహజంగా కాలం గడుస్తుంది.
మన దేశంలో ఆశ కార్యకర్తలు ఉన్నారు. దేశవ్యాప్తంగా వారి నెట్ వర్క్ ఉంది. మన దేశ ప్రజల మధ్య ఆశ వర్కర్లకు సంబంధించిన చర్చ నేనెప్పుడూ వినలేదు. మీరు కూడా విని ఉండరు. కానీ ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ ఫౌండేషన్ సంస్థ వ్యాపార కుటుంబం విజయం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచింది. గతేడాది బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కు సంయుక్తంగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశాం. వారు దేశంలో ఎన్నో సామాజిక సేవలందిస్తున్నారు. వారు అవిశ్రాంతంగా జీవన పర్యంతం ఏదైతే సంపాదించారో దాన్నంతటినీ పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఎప్పుడొచ్చినా… కలసినా, ఏఏ ఆశా వర్కర్లతో కలసి పనిచేసే అవకాశం కలిగినా వారిని ఎంత పొగుడుతారంటే ఆశా వర్కర్లు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేస్తారో… కొత్తకొత్త అంశాలు నేర్చుకునేందుకు ఎంత ఉత్సాహపడతారో ఇవన్నీ వారు చెబుతారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒక ఆశ కార్యకర్తను ప్రత్యేకంగా గౌరవించింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం తిందాగావ్. ఈ ఆశ కార్యకర్త, ఇంకా అక్కడి జనాభా అంతా గిరిజనులే. వారంతా షెడ్యూల్డు తెగలవారే… పేదలే. అంతేగాక ఆ ప్రాంతంలో మలేరియా విపరీతంగా ఉంది. అక్కడి ఆశ కార్యకర్త జమున మణిసింహ ఎవరినీ మలేరియాతో చావనివ్వనని నిశ్చయించుకుంది. ఇల్లిల్లు తిరగడం, ఎవరికైనా కొద్దిపాటి జ్వరం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడికి చేరిపోవడం… ఆ వ్యక్తికి తను గతంలో తీసుకున్న శిక్షణ ప్రకారం ఉపచారాలు చేయడం, ప్రతి ఇంట్లో క్రిమి నాశకాలు, దోమ తెరలు వాడకంపై అవగాహన కలిగించడం, తన సొంత బిడ్డలు నిశ్చింతగా నిద్రపోవడానికి ఎలాంటి సంరక్షణ అవసరమో అదంతా ఆ గ్రామస్తులందరికీ ఆ ఆశా వర్కరు చేసింది. అలాగే జమున మణిసింహ గ్రామమంతా దోమల నివారణకు నిరంతరం పాటుపడుతూ వచ్చింది. ఆ విధంగా మలేరియా రాకుండా ఎదుర్కొంది. తన మార్గంలో ఆ గ్రామ యువత కూడా పనిచేసేట్లుగా వారిని సిద్ధం చేసింది. ఇలాంటి ఎంత మంది, జమునా మణులున్నారో. మన చుట్టుపక్కలే అలాంటివారు ఎన్ని లక్షల మంది ఉంటారో. వాళ్లను మనం కొంచెం ఆదరభావంతో చూడాలి. అలాంటివారు మన దేశానికి గొప్ప సంపదగా ఉంటారు. సమాజ సుఖదుఃఖాలను పంచుకునే భాగస్వాములవుతారు. అలాంటి జమునామణి రూపంలో ఉన్న ఆశా కార్యకర్తలను అభినందిస్తున్నాను.
ప్రియమైన నా యువ మిత్రులారా….
ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చాలా క్రియాశీలంగా ఉన్న నా యువ మిత్రుల కోసం మైగవ్ సైట్ లో మూడు E- బుక్‌లను పెట్టాను. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించిన స్ఫూర్తిదాయక గాథల కోసం, సంసద్ ఆదర్శ గ్రామాలకు సంబంధించి E- బుక్ ఒకటి, ఇంకా ఆరోగ్య రంగానికి సంబంధించిందొకటి. వాటిని చూడమని మిమ్మల్ని కోరుతున్నాను. చూడండి. ఇతరులకీ చూపించండి. బాగా చదవండి. ఇంకా వీలైతే కొత్త విషయాలు జోడించాలనిపించ వచ్చు. తప్పక మైగవ్ కు పంపండి. ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే – మన దృష్టికి చప్పున రావు. కానీ సమాజానికి అయితే అలాంటివి ఎంతో బలాన్నిస్తాయి. సానుకూల శక్తి అన్నింటికంటే పెద్ద ఇంధనమవుతుంది. మీరు కూడా మంచి సంఘటనల గురించి షేర్ చేయండి. ఈ E- పుస్తకాలను షేర్ చేయండి. E-పుస్తకాలపై చర్చించండి. ఉత్సాహవంతులైన యువజనులు ఉంటే E- పుస్తకాల గురించి దగ్గరలోని పాఠశాలకు వెళ్లి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు చెప్పండి. అక్కడ అలా జరిగింది… ఇక్కడ ఇలా జరిగింది… అని చెప్పండి. అప్పుడు మీరు నిజమైన సామాజిక శిక్షకులవుతారు. దేశ నిర్మాణంలో మీరూ పాలుపంచుకోండి. అందుకు మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా,
యావత్ ప్రపంచం వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతోంది. వాతావరణ మార్పు, భూతాపంపై ప్రతిచోటా దానిపై చర్చ జరుగుతోంది. చాలా ఆందోళన కూడా ఉంది. ప్రతి పని చేయడానికి ముందు ఇప్పుడు దానికి ఒక కొలమానం రూపంలో ఆమోదం లభిస్తూ పోతోంది. భూతాపం ఇక పెరగకూడదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందరి ఆలోచన కూడా ఇదే. భూతాపం పెరగకుండా రక్షించడానికి అన్నింటికీ మించిన ఒక ముఖ్యమైన మార్గం ఉంది. అదే ఇంధన పొదుపు. డిసెంబర్ 14వ తేదీ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి. అందులో ఎల్.ఇ.డి. బల్బ్ బథకం ఒకటి. నేనొకసారి చెప్పాను పౌర్ణమి నాడు వీధి దీపాలన్నీ ఆర్పివేసి చిమ్మచీకటి చేసి ఒక గంటపాటు వెన్నెలలో జలకాలాడాలని, పున్నమి వెన్నెలను తనివితీరా ఆస్వాదించాలని. ఎవరో ఒక మిత్రుడు నాకు ఒక లింక్ పంపించాడు చూడమని. అది చూసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఆ విషయం మీకు కూడా చెప్పాలనిపించింది. అయితే ఈ ఘనత మాత్రం జీ న్యూస్‌కు దక్కుతుంది. ఎందుకంటే ఆ లింక్ జీ న్యూస్‌కు చెందినది కాబట్టి. కాన్పూర్ కు చెందిన నూర్ జహాన్ అనే ఒక మహిళ ఉంది. టీవీలో చూస్తే ఆమె ఎక్కువగా చదువుకున్నట్లు కనిపించదు. కానీ, ఆమె చేస్తున్న పని ఎవరికీ ఆలోచనకు కూడా తట్టి ఉండదు. సౌర విద్యుత్ తో సూర్యరశ్మిని వినియోగిస్తూ పేదలకు వెలుగునిచ్చే పని చేస్తోంది. చీకటిపై యుద్ధం చేస్తోంది. ఒక మహిళా మండలి ఏర్పాటుచేసి సౌరశక్తితో వెలిగే లాంతర్లు, వాటి తయారీని ప్రారంభించింది. ఇంకా నెలలో వంద రూపాయల అద్దెపై ఒక లాంతర్ ను అద్దెకిస్తోంది. జనం సాయంత్రం పూట ఆమె దగ్గర లాంతర్ తీసుకెళ్తారు. పొద్దున్నే వచ్చి మళ్లీ ఛార్జింగ్ చేయడానికి లాంతర్ ఇచ్చివెళ్తారు. చాలా పెద్ద ఎత్తున దాదాపు 500 ఇళ్లవారు ఆమె దగ్గరకు వస్తారని, లాంతర్లు తీసుకుని వెళ్తారని విన్నాను. రోజుకు సుమారు మూడు నాలుగు రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఇల్లంతా వెలుగుంటుంది. కానీ, ఈ నూర్ జహాన్ ఆ సౌర విద్యుత్‌తో లాంతర్లను రీఛార్జ్ చేసే పనిలో రోజంతా నిమగ్నమై ఉంటుంది. ఇప్పుడు చూడండి. వాతావరణ మార్పు నివారణ కోసం ప్రపంచంలోని పెద్దపెద్ద వాళ్లంతా ఏమేమి చేస్తుంటారో. కానీ ఒక్క ఈ నూర్ జహాన్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోంది. అలాంటి పని చేస్తోందామె. నూర్ జహాన్ అంతరార్థం ప్రపంచమంతా వెలిగించడమే. ఈ పని ద్వారా ఆమె వెలుగును విరజిమ్ముతోంది. నేను నూర్ జహాన్ ను అభినందిస్తున్నాను. జీ టీవీని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కాన్పూర్ లో ఒక మారుమూల జరుగుతున్న ఈ పనిని దేశానికంతటికీ, మొత్తం ప్రపంచానికి చాటి చూపింది. చాలా చాలా అభినందనలు.
నాకు ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీ అభిషేక్ కుమార్ పాండే ఫోన్ చేశారు.
‘అయ్యా నమస్కారం. గోరఖ్‌పూర్ నుంచి నేను అభిషేక్ కుమార్ పాండే మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రికి నేను చాలా అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే… ఆయన ముద్రా బ్యాంకు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము ప్రధానమంత్రి గారి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నడుపుతున్న ఈ ముద్రా బ్యాంకులో మావంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలా సహాయపడతారు. ఎటువంటి సహాయం మాకు లభిస్తోంది’? అంటూ ఫోన్ చేశారు. అభిషేక్ గారు… ధన్యవాదాలు. గోరఖ్ పూర్ నుంచి నాకు సందేశం పంపారు. ప్రధానమంత్రి ముద్రా యోజన నిధుల్లేని వారికి నిధులిస్తుంది. పెట్టుబడులు పెట్టలేనివారికి పెట్టుబడులిస్తుంది. ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే మూడు ‘E’ లు… ఎంటర్ ప్రైజ్, ఎర్నింగ్, ఎంపవర్ మెంట్. ముద్ర ఔత్సాహిక పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. ముద్ర సంపాదనకు అవకాశం కల్పిస్తోంది. ముద్రా నిజమైన అర్థంలో సాధికారుల్ని చేస్తుంది. చిన్న చిన్న వ్యాపారులకు సాయం చేసేందుకు ఈ ముద్ర యోజన నడుస్తోంది. ఎంత వేగంగా జరగాలనుంటున్నానో ఇంకా ఆ వేగం పుంజుకోవాల్సి ఉంది. కానీ, ప్రారంభం బాగానే జరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో సుమారు 66 లక్షల మందికి 42 వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ముద్ర యోజన నుంచి ఇవ్వడం జరిగింది. రజకుడు కానివ్వండి… క్షురకుడు కానివ్వండి… వార్తా పత్రికలు అమ్ముకునేవారు కానివ్వండి… పాలమ్ముకునేవారు కానివ్వండి… చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. నాకు ఇంకా సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఈ 66 లక్షల మందిలో సుమారు 24 లక్షల మంది మహిళలు కావడం. ఈ సహాయం పొందినవారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వయంగా కష్టించి పనిచేసి తమ కాళ్లపై తాము నిలబడి గౌరవంగా కుటుంబాన్ని నడుపుకోవాలని ప్రయాసపడేవారు. అభిషేక్ అయితే తన ఉత్సాహాన్ని గురించి స్వయంగా చెప్పారు. నా దగ్గరకు కూడా చాలా వార్తలు వస్తుంటాయి. ముంబైలో శైలేశ్ భోంస్లే అనే వ్యక్తి ఉన్నారని ఇప్పుడే నాకెవరో చెప్పారు. ఆయనకు ముద్ర యోజన ద్వారా బ్యాంకు నుంచి ఎనిమిదిన్నర లక్షల రూపాయల రుణం అందింది. దాంతో ఆయన మురుగు కాల్వలు శుభ్రంచేసే వ్యాపారం ప్రారంభించారు. నేను నా స్వచ్ఛ అభియాన్ సమయంలో ఇందుకు సంబంధించి మాట్లాడుతూ… స్వచ్ఛ అభియాన్ నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని తయారుచేస్తుందని చెప్పాను. శైలేశ్ భోంస్లే అది చేసి చూపించారు. ఆయన ఒక ట్యాంకర్ తెచ్చారు. దాంతో ఈ పని కొనసాగిస్తున్నారు. ఈ కొద్ది రోజుల్లో ఆయన రెండు లక్షల రూపాయలు తిరిగి బ్యాంకుకు చెల్లించినట్టు కూడా నాకు చెప్పారు. మా ముద్ర యోజన ఉద్దేశం కూడా అదేనని చెప్పదలుచుకున్నాను. భోపాల్‌కు చెందిన మమతా శర్మ విషయంలో ఆమెకు ప్రధానమంత్రి ముద్ర యోజన నుంచి 40 వేల రూపాయలు లభించాయని చెప్పారు. ఆమె పర్సులు తయారుచేసే పని చేస్తున్నారు. ఇందుకోసం ఆమె గతంలో ఎక్కువ వడ్డీపై డబ్బు తెచ్చుకునేవారు. చాలా కష్టంగా వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి డబ్బు వస్తున్న కారణంగా ఆమె తన పనిని మరింత బాగా చేసుకుంటున్నారు. ఒకటి వడ్డీలేని కారణంగా, ఇతర కారణాల వల్ల ఆమెకు ఎక్కువ ఖర్చవుతుండేది. ఇప్పడు బ్యాంకు అందించిన రుణం వల్ల సౌలభ్యం కలిగి ప్రతి నెలా దాదాపు వెయ్యి రూపాయలు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. వారి కుటుంబానికి ఒక మంచి వ్యాపారం మెల్లమెల్లగా వర్థిల్లుతోంది. కానీ, నేను ఈ పథకానికి మరింత ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను. మన బ్యాంకులు మరింత సానుకూలంగా, సానుభూతితో ఉండాలి. సాధ్యమైనంత ఎక్కువ మంది చిన్న వ్యాపారులకు అవి సహాయం చేయాలి. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థను వీరే నడిపిస్తారు. చిన్న చిన్న పనులు చేసే జనమే దేశ ఆర్థిక రంగానికి ఆర్థిక శక్తిగా నిలుస్తారు. మేము వారికే బలం ఇవ్వాలనుకుంటున్నాం. మంచి బాగా అమలు జరిగింది. కానీ ఇంకా బాగా జరగాలి.
ప్రియమైన నా దేశవాసులారా,
అక్టోబర్ 31 సర్దార్ పటేల్ జయంతి నాడు ‘ఒక్క భారతం – శ్రేష్ఠ భారతం’ గురించి నేను ప్రస్తావించాను. కొన్ని విషయాల్లో సమాజ జీవనంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ‘రాష్ట్రయాం, జాగ్రయాం, వ్యం’ శాశ్వత అప్రమత్తత ద్వారానే స్వేచ్ఛ పరిఢవిల్లుతుంది. అంతర్గత నిఘా మూల్యంగా, భారతం.. శ్రేష్ఠ భారతం దీనికి ఒక పథకంగా రూపం ఇవ్వాలని భావిస్తున్నాను. మైగవ్ మీద ఇందుకు సూచనలు కోరాను. కార్యక్రమ నిర్మాణం ఎలా ఉండాలి… ప్రజలేమిటి… ప్రజల భాగస్వామ్యం ఎలా పెరగాలి… దాని రూపం ఎలా ఉండాలి… ఈ అన్నిటిపై సూచనలు ఇవ్వాలని నేను కోరాను. తగినన్ని సూచనలు వస్తున్నాయని నాకు చెప్పారు. కానీ ఇంకా ఎక్కువ సూచనలు రావాలని నేను ఆశిస్తున్నాను. స్పష్టమైన పథకాన్ని కోరుకుంటున్నాను. ఇందులో పాల్గొనేవారికి సర్టిఫికెట్ లభిస్తుందని నాకు చెప్పారు. పెద్ద పెద్ద బహుమతులు కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. మీరు కూడా మీ సృజనాత్మక శక్తిని ఉపయోగించండి. ఐక్యత, అఖండత అనే ఈ మంత్రాన్నీ…. ఒక్క భారతం, శ్రేష్ఠ భారతం మంత్రాన్నీ… ఒక్కో భారతీయుడిని కలిపేదిగా ఎలా చేయగలం…? ఎలాంటి పథకం ఉండాలి… కార్యక్రమం ఎలా ఉండాలి..? అర్థవంతంగా ఉండాలి… గౌరవప్రదంగా ఉండాలి… జీవం నిండి ఉండాలి…. ప్రతి ఒక్కరినీ కలిపేందుకు అత్యంత సహజంగా, సరళంగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేయాలి… ప్రజలేం చేయాలి… పౌర సమాజం ఏం చేయాలి… చాలా విషయాలు చెప్పవచ్చు. మీ సూచనలు తప్పక పనికి వస్తాయని నాకు నమ్మకం ఉంది.
ప్రియమైన నా సోదర సోదరీమణులారా,
చలికాలం మొదలవుతోంది. చలిలో తినడం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. బట్టలు ధరించడం కూడా మజాగా ఉంటుంది. కానీ, నాదొక విన్నపం. వ్యాయామం చేయండి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఈ శీతాకాలంలో ఎంతో కొంత సమయం వ్యాయామం, యోగా చేద్దాం. కుటుంబంలో కూడా ఆ వాతావరణం కల్పిద్దాం. ఒక గంటసేపు అంతా కలసి ఇదే చేస్తే కుటుంబంలో పండుగే అవుతుంది. మీరు చూడండి. ఎలాంటి చైతన్యం వస్తుందో. రోజంతా శరీరం ఎంత సహకరిస్తుందో. అందుకే మంచి రుతువులో మంచి అలవాటు చేసుకుందాం.
ప్రియమైన నా దేశవాసులందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.
జైహింద్.