Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం

‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై  జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం


 యువర్ హైనెస్…

నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు… జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.

న్యూఢిల్లీలో జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రజా ప్రయోజనాలే ప్రధానంగా చేసిన నిర్ణయాలను, ఈ కూటమికి బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరింత ముందుకు తీసుకుపోతున్నారు.

దీర్ఘ కాలం నిలిచే అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ స్)ను సాధించడానికి మనం పెద్దపీట వేయడం ఎంతో సంతోషాన్నిస్తోంది.

మేం అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడం పైన, అభివృద్ధి సాధనలో మహిళలకు కీలక పాత్రను ఇవ్వడం పైన, యువశక్తి పైన దృష్టిని కేంద్రీకరించాం.

అలాగే, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలకు, ఆకాంక్షలకు ఊతాన్నిచ్చాం.

కిందటి సంవత్సరంలో మాదరిగానే ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే నినాదం ఈసారి నిర్వహిస్తున్న శిఖరాగ్ర సమావేశంలోనూ ప్రాముఖ్యాన్ని కలిగి ఉందన్న విషయం స్పష్టం.

మిత్రులారా,

తొలి కార్యక్రమానికి ఎంచుకొన్న ఇతివృత్తాన్ని గౌరవిస్తూనే, భారతదేశం అనుభవాలను, సాఫల్య గాథలను మీ సమక్షంలో ప్రస్తావిస్తున్నాను.

గత పదేళ్ళుగా, మేం 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం.

ఆహార ధాన్యాలను 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఇస్తూ వస్తున్నాం.

ప్రపంచంలో అతి పెద్దదైన ఆరోగ్య బీమా పథకం ప్రయోజనాలను 55 కోట్ల మంది ప్రజలు అందుకొంటున్నారు.

ఇక నుంచి ఉచిత ఆరోగ్య బీమా రక్షణను, 70 ఏళ్ళ వయస్సు దాటిన 6 కోట్ల మంది వయో వృద్ధులు సైతం అందుకోనున్నారు.

అభివృద్ధి సాధనలో మహిళలకు ముఖ్య పాత్రను కల్పించాలన్న మా విధానాన్ని కొనసాగిస్తూ, 30 కోట్ల మంది సూక్ష్మస్థాయి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణ సదుపాయాన్ని అందుకొనేటట్లు వారిని బ్యాంకింగ్ రంగం పరిధిలోకి తీసుకువచ్చాం.

ప్రపంచంలో అతి భారీ పంట బీమా పథకంలో భాగంగా 4 కోట్ల మందికి పైగా రైతులు 20 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ప్రయోజనాలను అందుకొన్నారు.

రైతుల కోసం అమలు చేస్తున్న పథకంలో 40 బిలియన్ డాలర్లకు పైగా సహాయాన్ని 11 కోట్ల మంది రైతులకు అందించాం.

రైతులకు 300 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన సంస్థాగత రుణాలను కూడా ఇస్తున్నాం.

భారతదేశంలో ఆహార భద్రతను కల్పించడం ఒక్కటే కాకుండా పోషణ విజ్ఞానం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాం.

సమీకృత పోషణ సమర్థన కార్యక్రమంలో భాగంగా అమలుచేస్తున్న ‘సక్షమ్ అంగన్‌వాడీ అండ్ న్యూట్రిషన్ 2.0’ ప్రచార ఉద్యమంలో గర్భవతులు, నవజాత శిశువులు, ఆరేళ్ళ వయసు లోపు బాలలతో పాటు పూర్వ కౌమార దశలో ఉన్న బాలికలకు కూడా పోషకాహారాన్ని సమకూర్చడంపై శ్రద్ధ వహిస్తున్నాం.

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ బడికి వెళ్ళే పిల్లలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం.

ప్రపంచ ఆరోగ్య భద్రతకు కూడా భారతదేశం తన వంతు తోడ్పాటును అందిస్తోంది.

మేం ఈ మధ్యే మాలవీ, జాంబియా, జింబాబ్వేలకు మానవీయ దృష్టితో సహాయాన్ని అందించాం.

మిత్రులారా,

మేం విజయం సాధించడానికి ఒక ప్రధాన కారణం ‘మూలాల్లోకి తిరిగివెళ్ళడం’, ఇంకా ‘భవిష్యత్తు దిశగా ముందుకు సాగిపోతుండటం’ అనే విధానాన్ని అనుసరిస్తుండడమే.

మేం ప్రాకృతిక వ్యవసాయానికి, సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం ఒక్కటే కాకుండా కొత్త కొత్త సాంకేతికతలకు కూడా ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాం.

దీర్ఘకాలంపాటు మనుగడలో ఉండే వ్యవసాయ పద్ధతులపైన మేం శ్రద్ధ తీసుకొంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, పోషణ, విజ్ఞానంలతో పాటు శ్రీ అన్న (చిరుధాన్యాల) వినియోగాన్ని ప్రోత్సహించడం పైన కూడా శ్రద్ధ తీసుకొంటున్నాం.

మేం అన్ని రుతువులలోను చక్కటి దిగుబడిని ఇవ్వగలిగే 2000కు పైగా పంటల రకాలను అభివృద్ధి చేశాం. ‘డిజిటల్ అగ్రికల్చర్ మిషన్’ను ప్రారంభించాం.

భారతదేశం అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమాజంలో అన్ని వర్గాల వారికి ఆర్థిక సేవల అందజేతలో సరళత్వానికి బాట వేసింది.

అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాలు, బ్లాకుల పథకాన్ని ప్రవేశపెట్టి, సమాజంలో అత్యంత బలహీన వర్గాల వారికి సైతం అభివృద్ధి ఫలాలను అందించే ఒక కొత్త నమూనాను మేం తీసుకువచ్చాం.

మిత్రులారా,

‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ఒక భౌగోళిక కూటమి’’ని ఏర్పాటు చేయాలన్న బ్రెజిల్ ప్రయత్నానికి మేం మద్దతు ఇస్తున్నాం.

ఇది న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన ‘ఆహార భద్రత కు సంబంధించిన దక్కన్ ఉన్నత స్థాయి సిద్ధాంతాల’ను అమలుచేసే దిశగా ఒక ముఖ్య చర్య అవుతుంది.

మిత్రులారా,

నా ప్రసంగాన్ని ముగించే ముందు… నేనొక విషయాన్ని స్పష్టం చేయదలచుకొన్నాను. అది ఏమిటంటే.. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న పోరాటాల నేపథ్యంలో ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు (గ్లోబల్ సౌత్) ఎంతో సతమతం అవుతున్నాయి.

ఈ కారణంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎదురవుతున్న సవాళ్ళను, ఆయా దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని మనం చర్చించినప్పుడే ఆ చర్చలు సఫలం అవుతాయి.

న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశాల సందర్భంలో ఆఫ్రికన్ యూనియన్‌కు జి20 లో శాశ్వత సభ్యత్వాన్ని ఇస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాల అభిప్రాయల వెల్లడికి సదావకాశాన్ని ఇచ్చిన విధంగానే గ్లోబల్ గవర్నెన్స్ సంస్థలలో సంస్కరణల కోసం కూడా మనం గట్టి ప్రయత్నాలు చేద్దాం.

ఈ సమావేశాలలో భాగంగా నిర్వహించుకొనే తదుపరి కార్యక్రమాలలో ఇదే విషయంపై మరింత లోతైన, సకారాత్మక చర్చలు చోటుచేసుకొంటాయన్న విశ్వాసం నాలో ఉంది.

మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.