Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక స‌హాయ‌క చర్య‌లు; ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ స్ (ఇఎపి ల) రూపంలో ప్ర‌త్యేకంగా నిధుల అంద‌జేత‌; పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు


కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర‌ ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక స‌హాయ చ‌ర్య‌ల‌లో భాగంగా విదేశీ రుణ సాయ ప్రాజెక్టుల (ఎక్స్‌ట‌ర్న‌ల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ స్.. ఇఎపి లు) రూపంలో ప్రత్యేక నిధుల అందజేత మరియు పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా నిధుల‌ కేటాయింపునకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ రాష్ట్రానికి అందించే కేంద్ర సాయం అమ‌ల‌య్యే విధానాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:

i. ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక సహాయాన్ని అందజేస్తుంది. 2015-16 నుండి 2019-20 వ‌ర‌కు ఈ సాయం వుంటుంది. ఈ కాలంలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌ ద్వారా కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా భ‌రించి ఉండి ఉంటే రాష్ట్రానికి ఎంత మేలు జ‌ర‌గ‌గ‌ల‌దో అంత మేలును కేంద్రం చేస్తుంది. 2015-16 నుండి 2019-20 మ‌ధ్య‌ కాలంలో ఇఎపి ల ద్వారా ఆంధ్ర‌ ప్ర‌దేశ్ తీసుకునే రుణాలతో పాటు వాటి వ‌డ్డీని కూడా కేంద్ర‌మే చెల్లిస్తుంది.

ii. 2014 ఏప్రిల్ 1 వ తేదీ నాటి నుండి పోల‌వ‌రం ప్రాజెక్టు యొక్క మిగతా ఖర్చునంతటినీ (ఇరిగేషన్ కంపోనంట్ మాత్రమే) కేంద్రమే చెల్లిస్తుంది. భారత ప్ర‌భుత్వం త‌రఫున ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టును అమలుపరుస్తుంది. అయితే, ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌న్వ‌యం, నాణ్య‌త నియంత్ర‌ణ‌, డిజైన్ స‌మ‌స్య‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్రాజెక్టు అనుమ‌తుల సంపాద‌న త‌దిత‌ర అంశాల‌ను కేంద్ర జ‌ల‌ వ‌న‌రుల శాఖ శాఖ ఆధీనంలో ప‌ని చేసే పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ చూసుకుంటుంది. 1-4-2014 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టుకు అయిన వ్య‌యాన్ని కూడా పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుంది. ఈ ప‌నిని కేంద్ర ఆర్ధిక శాఖ‌లోని వ్య‌య విభాగంతో సంప్ర‌దింపుల‌ ద్వారా పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ పూర్తి చేస్తుంది.

ఇఎపి రుణాల‌ను తిరిగి చెల్లించ‌డం ద్వ‌ారా కేంద్రం చేస్తున్న ఈ మూలధన వ్యయ స‌హాయం కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర‌ ప్ర‌దేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా స‌హాయ‌కారిగా ఉంటుంది. రాష్ట్ర ఆర్ధిక స్థితిగ‌తుల‌ను మ‌రుగుప‌ర‌చ‌డ‌మే కాకుండా ఆర్ధికాభివృద్ధికి కూడా ఇది దోహ‌దం చేస్తుంది. అంతే కాకుండా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వ‌డం, ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌ను కేంద్రం చేప‌ట్ట‌డం వ‌ల్ల ప్రాజెక్టు నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన సాగుతుంది. త‌ద్వారా రాష్ట్రానికి సాగునీటి వ‌న‌రులు ఏర్ప‌డి విశాల ప్ర‌జానీకానికి ప్రయోజనం చేకూరుతుంది.

పూర్వరంగం:

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం, 2014లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూ. 1,976.50 కోట్ల ఆర్ధిక సాయాన్ని 2016-17 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ అందించింది. వ‌న‌రుల వ్య‌త్యాసాన్ని పూర్తి చేయ‌డానికి ఇచ్చిన రూ.1,176.50 కోట్లు, రాయ‌ల‌సీమ మ‌రియు ఉత్త‌ర కోస్తా ప్రాంతంలోని వెన‌ుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన రూ.350 కోట్లు, రాజ‌ధాని నగరం కోసం ఇచ్చిన రూ. 450 కోట్లు ఈ ప్ర‌త్యేక సాయంలో కలిసి ఉన్నాయి.

ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రానికిగాను పోల‌వ‌రం సాగునీటి ప్రాజెక్టు కోసం రూ.2,081.54 కోట్లను కేంద్ర జ‌ల‌ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ అందించింది. ఆ విధంగా రాష్ట్ర పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చిన త‌రువాత‌ నుండి ఆంధ‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి కేంద్రం రూ.

10,461.04 కోట్ల మేరకు స‌హాయాన్ని అందజేసింది. 2014-15లో రూ.4,403 కోట్లు, 2015-16లో రూ.2,000 కోట్లు, 2016-17లో రూ.4,058.04 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయడమైంది.

***