గౌరవ అధ్యక్షా,
గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న, ఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చాలా అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయి. ఇది చాలా సహజం! అధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారు. ఇది నా అదృష్టం. కాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.
గౌరవ అధ్యక్షా,
మనం 2025 లో ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే 21వ శతాబ్దంలో ఇప్పటికే 25 శాతం గడిచిపోయింది. స్వాతంత్య్రానంతరం 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దపు మొదటి 25 ఏళ్లలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఈ రాష్ట్రపతి ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రాబోయే 25 ఏళ్ల గురించి, అభివృద్ధి చెందిన భారత్ కోసం కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రసంగం ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. మరో విధంగా చెప్పాలంటే గౌరవ రాష్ట్రపతి ప్రసంగం అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా కొత్త విశ్వాసాన్ని అందించటమే కాకుండా సాధారణ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.
గౌరవ అధ్యక్షా,
గత పదేళ్లలో దేశ ప్రజలు తమకు సేవ చేసే అవకాశం ఇచ్చారని అన్ని అధ్యయనాలు పదేపదే చెబుతున్నాయి. పేదరికాన్ని జయించి 25 కోట్ల మంది ప్రజలు బయటపడ్డారు.
గౌరవ అధ్యక్షా,
ఐదు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన నినాదాలను విన్నాం, ఇప్పుడు 25 కోట్ల మంది పేదలు పేదరికాన్ని జయించి బయటకు వచ్చారు. ఇది అలా ఊరికే జరిగిపోదు. అంకితభావం, సమస్యపైన పూర్తి అవగాహనతో కూడిన ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా పేదల కోసం జీవితాన్ని గడిపినప్పుడు ఇది సాధ్యం అవుతుంది.
గౌరవ అధ్యక్షా,
ఒక ప్రాంతంతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఆ ప్రాంతం గురించి నిజానిజాలు తెలుసుకుంటూ అక్కడ తమ జీవితాలను గడిపినట్లయితేనే అక్కడ మార్పు కచ్చితంగా వస్తుంది.
గౌరవ అధ్యక్షా,
పేదలకు మేం ఎప్పుడు తప్పుడు నినాదాలు ఇవ్వలేదు. వారికి నిజమైన అభివృద్ధిని అందించాం. పేదల, సామాన్యుల బాధలు.. మధ్యతరగతి కలలు అలా ఊరికే అర్థం కావు. దీనికి అభిరుచి అవసరం అధ్యక్షా. కొంతమందికి అది లేదని నేను విచారంతో చెప్పాల్సి వస్తోంది.
గౌరవ అధ్యక్షా,
వర్షాకాలంలో ప్లాస్టిక్ షీట్లతో కూడిన పైకప్పు కింద జీవించడం ఎంత కష్టం!. ప్రతి క్షణం కలలు నలిగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇది అందరికీ అర్థం కాదు.
గౌరవ అధ్యక్షా,
ఇప్పటి వరకు 4 కోట్ల ఇళ్లు పేదలకు అందాయి. ఆ జీవితం గడిపిన వారికి కాంక్రీట్ పైకప్పు ఉన్న ఇల్లు అంటే ఏంటో అర్థం కాదు.
గౌరవ అధ్యక్షా,
ఆడవాళ్లు బహిరంగ మలవిసర్జన చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్లు సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజువారీ చిన్న కాలకృత్యాన్ని తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వాళ్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వీళ్లు అర్థం చేసుకోలేరు అధ్యక్షా.
గౌరవ అధ్యక్షా,
12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా సోదరీమణుల సమస్యలను పరిష్కరించాం. అధ్యక్షా.. ఈ రోజుల్లో మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. సామాజిక మాద్యమాల్లో ఎక్కువగా ఇది జరుగుతోంది. దీని ప్రకారం కొందరు నాయకులు జకూజీ, ఇళ్లలో స్టైల్‌గా ఉండే షవర్లపై దృష్టి పెడుతున్నారు. కానీ ప్రతి ఇంటికీ నీరు అందించడంపైన మేం దృష్టి సారించాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశ జనాభాలో 70-75 శాతం అంటే 16 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సదుపాయం లేదు. మా ప్రభుత్వం ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు నల్లా నీటిని అందించింది, పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
గౌరవ అధ్యక్షా,
పేదల కోసం మనం ఎన్నో పనులు చేశాం కాబట్టే వాటిని గౌరవ రాష్ట్రపతి ప్రసంగంలో సవివరంగా పేర్కొన్నారు. పేదల గుడిసెల్లో ఫోటోలు దిగే కార్యక్రమాలు చేపట్టి అలరించే వారికి పార్లమెంట్‌లో పేదల గురించి మాట్లాడటం బోర్ కొడుతుంది.
గౌరవ అధ్యక్షా,
వాళ్ల కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. అధ్యక్షా.. సమస్యను గుర్తించడం ఒక విషయం అయితే బాధ్యత ఉంటే ఆ సమస్యను గుర్తించిన తరువాత దానిని విడిచిపెట్టలేరు. దానిని పరిష్కరించడానికి అంకితభావంతో కృషి చేయాలి. గత 10 సంవత్సరాల్లో మనం చేసిన పనిని చూశాం. మీరు కూడా చూసే ఉంటారు. సమస్యను పరిష్కరించేందుకు మా ప్రయత్నం రాష్ట్రపతి ప్రసంగంలో కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా మేం అంకితభావంతో పని చేస్తున్నాం.
గౌరవ అధ్యక్షా,
ఒకప్పుడు మన దేశంలో ఒక ప్రధాని ఉండేవారు. ఆయనను మిస్టర్ క్లీన్ అని పిలవడం ఒక ప్యాషన్‌గా మారింది. ప్రధానిని మిస్టర్ క్లీన్ అని పిలవడం ఫ్యాషన్‌గా తయారైంది. ఆయన ఒక సమస్యను గుర్తించారు. దిల్లీ నుంచి ఒక్క రూపాయి వెళ్తే 15 పైసలు మాత్రమే గ్రామానికి చేరుతాయని ఆయన చెప్పారు. అప్పుడు పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఒకే పార్టీ పాలన ఉండేది. ఆ సమయంలోనే 1 రూపాయి బయటకు వస్తుందని, 15 పైసలు మాత్రమే అర్హులకు అందుతున్నాయని బహిరంగంగానే చెప్పారు. చేతులకు మురికి అంటకుండా చేసుకునే అద్భుతమైన పని ఇది. ఆ 15 పైసలు ఎవరికి వెళ్తున్నాయో దేశంలోని సామాన్యుడికి కూడా సులభంగా అర్థం అవుతుంది.
గౌరవ అధ్యక్షా,
ఈ దేశం మాకు అవకాశం ఇచ్చింది. మేం పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నించాం. పొదుపుతో పాటు అభివృద్ధి, ప్రజల కోసమే ప్రజాధనం అనేది మా నమూనా. మేం జన్ ధన్, ఆధార్, మొబైల్ ఫోన్ అనే గొప్ప త్రయాన్ని సృష్టించి డీబీటీ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాన్ని అందించటం ప్రారంభించాం.
గౌరవ అధ్యక్షా,
మా హయాంలో రూ.40 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశాం.
గౌరవ అధ్యక్షా,
ఈ దేశ దుస్థితిని చూడండి. ప్రభుత్వాలు ఎలా నడిచాయో! ఎవరి కోసం నడిచాయో! చూడండి.
గౌరవ అధ్యక్షా,
ఆరోగ్యం బాలేనప్పుడు జనాలు ఏదైనా అంటుంటారు. కానీ దానితో పాటు నిరాశ వ్యాప్తి చెందినప్పుడు కూడా వారు చాలా మాట్లాడుతుంటారు.
గౌరవ అధ్యక్షా,
ఇంకా జన్మించని, ఈ దేశ గడ్డపైకి రాని 10 కోట్ల మంది నకిలీ వ్యక్తులు ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్ది పొందారు.
గౌరవ అధ్యక్షా,
సరైన వ్యక్తులకు అన్యాయం జరగకూడదని, రాజకీయ లాభనష్టాల గురించి ఆలోచించకుండా ఈ 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించి, నిజమైన లబ్దిదారులను కనుగొని వారికి సహాయం అందించే పని ప్రారంభించాం.
గౌరవ అధ్యక్షా,
ఈ 10 కోట్ల నకిలీ వ్యక్తులను తొలగించి, వివిధ పథకాల ఖాతాలను లెక్కించినప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఆదా అయ్యాయి. ఎవరి ప్రమేయం ఉందో నేను చెప్పడం లేదు కానీ తప్పుడు వ్యక్తులు అని చెబుతున్నాను.
గౌరవ అధ్యక్షా,
మేం ప్రభుత్వ కొనుగోళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి పారదర్శకత తీసుకొచ్చాం. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జెమ్ పోర్టల్‌ను ఉపయోగించుకుంటున్నాయి. జెమ్ పోర్టల్ ద్వారా చేసిన కొనుగోళ్ల ద్వారా ఖర్చు సాధారణ వ్యయం కంటే తక్కువ కావటంతో ప్రభుత్వానికి రూ.1,15,000 కోట్లు ఆదా అయ్యాయి.
గౌరవ అధ్యక్షా,
మన స్వచ్ఛభారత్ పథకాన్ని చాలా హేళన చేశారు. మనం ఏదో పాపం, తప్పు చేశాం అన్నట్లు మాట్లాడారు. ఇంకా ఏమన్నారో తెలియదు కానీ పరిశుభ్రతకు సంబంధించిన ఈ కార్యక్రమం వల్ల ఇటీవలి కాలంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయాల నుంచి విక్రయించే చెత్త ద్వారానే ప్రభుత్వానికి రూ.2300 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పటం ఎంతో సంతృప్తికరంగా ఉంది. మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సూత్రం గురించి మాట్లాడేవారు. మనం ధర్మకర్తలమని, ఈ ఆస్తి ప్రజలదేనని ఆయన చెప్పారు. అందువల్ల ఈ ధర్మకర్తృత్వ సూత్రం ఆధారంగా ప్రతి పైసాను పొదుపు చేసి సరైన చోట ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్లనే స్వచ్ఛభారత్ పథకం నుంచి చెత్తను అమ్మడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2300 కోట్లు వచ్చాయి.
గౌరవ అధ్యక్షా,
ఇథనాల్‌ను ఇంధనంలో కలపటానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాం. మనం ఇంధనం విషయంలో స్వతంత్రులం కాదని, బయటి నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని మాకు తెలుసు. ఇథనాల్‌ను ఇంధనంలో కలిపే ఆ ఒక్క నిర్ణయం వల్ల పెట్రోల్, డీజిల్ నుంచి రూ.1,00,000 కోట్ల వ్యయ వ్యత్యాసం వచ్చింది. ఈ రూ.లక్ష కోట్ల మొత్తం సొమ్ము రైతుల జేబుల్లోకి వెళ్లింది.
గౌరవ అధ్యక్షా,
నేను పొదుపు గురించి మాట్లాడుతున్నాను. కానీ ఇంతకు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికలు లక్షల రూపాయల కుంభకోణాల గురించి ఉండేవి. లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు.. లక్షల కోట్ల కుంభకోణాలు.. పదేళ్లు కావస్తున్నా ఈ కుంభకోణాలు జరగకపోవడం గమనార్హం. కుంభకోణాలు జరగకుండా చూడటం వల్ల లక్షల కోట్ల రూపాయలను కాపాడి, వాటిని ప్రజా సేవకు వినియోగిస్తున్నాం.
గౌరవ అధ్యక్షా,
మేం తీసుకున్న వివిధ చర్యలతో నేడు లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి, కానీ మేం ఆ డబ్బును అద్దాల రాజభవనాలు నిర్మించడానికి ఉపయోగించలేదు. దేశ నిర్మాణం కోసం ఉపయోగించాం. మేం అధికారంలోకి రాకముందు, అంటే 10 ఏళ్ల క్రితం మౌలిక సదుపాయాల బడ్జెట్ రూ. ఒక లక్షా ఎనబై వేల కోట్లుగా ఉంటే, నేడు అది 11 లక్షల కోట్లకు చేరింది. అందుకే దేశ పునాదులు బలపడుతున్న తీరును రాష్ట్రపతి వారి ప్రసంగంలో వివరించారు. రహదారులు, హైవేలు, రైల్వేలు, గ్రామాల్లోని రహదారులు ఇలా పనులేవైనా, వాటి ద్వారా దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాం.
గౌరవ అధ్యక్షా,
ప్రభుత్వ ఖజానాలో ఆదా అనేది ప్రధానమైనది, అయితే ఇలా ఆదా చేసిన సొమ్ము తాలూకు ప్రయోజనాన్ని సాధారణ ప్రజలు కూడా పొందాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలు కూడా పొదుపు చేసేలా ప్రోత్సహించేవిగా ఉండాలి. అప్పుడే తగిన ఫలితాలు దక్కుతాయి. అనారోగ్యం కారణంగా సామాన్యులు చేసే ఖర్చులు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఆదా అవడం మీరు చూసే ఉంటారు. ఇప్పటివరకు ఆయుష్మాన్ యోజన ప్రయోజనాన్ని పొందడం ద్వారా దేశప్రజలు వైద్యం కోసం చేసే ఖర్చులో 1లక్షా 20వేల కోట్లు ఆదా చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో దాదాపుగా 60-70 ఏళ్ల వృద్ధులు ఏదో ఒక జబ్బుతో ఉన్నవారు ఉండడం సాధారణం. అయితే వారి మందుల ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మేం జన ఔషధి కేంద్రాలను ప్రారంభించిన క్రమంలో, 80% తగ్గింపు ధరలకే వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కారణంగా, ప్రజలు మందుల కోసం చేసే ఖర్చులో దాదాపు రూ.30వేల కోట్లు ఆదా అయ్యాయి.
గౌరవ అధ్యక్షా,
పారిశుధ్యం, మరుగుదొడ్ల సౌకర్యం ఉన్న ఇళ్ళలో నివసించే కుటుంబాలు ఏడాదికి దాదాపు రూ. 70వేలు ఆదా చేస్తున్నట్లు యునిసెఫ్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే అంచనా వేసింది. స్వచ్ఛతా అభియాన్ అయినా, మరుగుదొడ్ల నిర్మాణం అయినా, స్వచ్ఛమైన తాగునీటిని అందించే పని అయినా, వాటి ద్వారా మన మధ్యతరగతి కుటుంబాలు భారీ ప్రయోజనాలను పొందుతున్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని పొందడం వల్ల, సగటు కుటుంబం నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల కోసం చేసే ఖర్చులో రూ. 40వేలు ఆదా చేస్తున్నట్లు డబ్ల్యుహెచ్ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇలా సామాన్యుల ఖర్చులను ఆదా చేసిన పథకాలు చాలానే ఉన్నాయి.
గౌరవ అధ్యక్షా,
దేశంలో కోట్లాది మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్న క్రమంలో వారికి వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా అనేక కుటుంబాలు ప్రతియేటా సగటున 25 నుంచి 30 వేల రూపాయలు విద్యుత్తుపై ఆదా చేస్తున్నారు, అలాగే మిగులు విద్యుత్ విక్రయం ద్వారా వారు డబ్బు సంపాదిస్తున్నారు. అంటే, సామాన్యులకు ఆదాతో పాటు ఆదాయం కూడా లభిస్తోంది. గతంలో ఎల్ఈడీ బల్బులు ఒక్కొక్కటి రూ. 400కి అమ్ముడయ్యేవని మీకు తెలుసు. మేం నిర్వహించిన ప్రచారంతో, దాని ధర నేడు రూ.40కి పడిపోయింది, ఎల్ఈడీ బల్బుల కారణంగా విద్యుత్ ఆదా అవడంతో పాటు, ఎక్కువ కాంతి కూడా లభిస్తుంది, దీని ద్వారా దేశవాసులకు దాదాపు 20వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.
గౌరవ అధ్యక్షా,
సాయిల్ హెల్త్ కార్డులను శాస్త్రీయంగా ఉపయోగించిన రైతులు వాటి ద్వారా ఎకరానికి రూ. 30వేల వరకు ఆదా చేశారు. గత పదేళ్లలో, ఆదాయపు పన్నును తగ్గించడం ద్వారా, మధ్యతరగతి ప్రజల పొదుపులను పెంచడానికి కూడా మేం కృషి చేశాం. 2014కి ముందు, దేశ ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితులను సరిచేస్తూ మేం ముందుకు సాగుతున్నాం. 2013-14లో, కేవలం 2లక్షల రూపాయల వరకే ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది, నేడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపునిచ్చాం. స్టాండర్డ్ డిడక్షన్ 75వేలు కూడా కలిపితే, ఏప్రిల్ 1 తర్వాత, దేశంలో వేతనదారులు వారి ఆదాయంలో 12.75 లక్షల రూపాయల వరకు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
గౌరవ అధ్యక్షా,
మీరు యువ మోర్చాలో పనిచేస్తున్న కాలంలో, 21వ శతాబ్దం అంటూ అదేపనిగా మాట్లాడే ఒక ప్రధానమంత్రి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన అలా అదే మాట చెబుతున్న క్రమంలో అదో ఊతపదంలా మారింది. ఆ సమయంలో, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆర్ కె లక్ష్మణ్ ఒక ఆసక్తికరమైన కార్టూన్ వేశారు. ఆ కార్టూన్లో, ఒక విమానం, పైలట్ ఉన్నారు. కొంతమంది ప్రయాణీకులు కూర్చుని ఉన్న విమానాన్ని ఒక బండిపై ఉంచి కార్మికులు ఆ బండిని తోస్తున్నారు, దానిపై 21వ శతాబ్దం అని వ్రాశారు. ఆ కార్టూన్ ఆ సమయంలో ఒక జోక్‌లాగా అనిపించింది, కానీ తరువాతి కాలంలో అదే నిజమని నిరూపితమైంది. ఇది వ్యంగ్యంగానే చెప్పినా, అప్పటి ప్రధానమంత్రి నిరాధారమైన మాటలు, వాస్తవ దూరంగా ఉన్న ఆయన వ్యాఖ్యలను అది స్పష్టంగా తెలియజేసింది. అయితే అప్పుడు 21వ శతాబ్దం గురించి మాట్లాడిన వారు 20వ శతాబ్దంలోని అవసరాలను మాత్రం తీర్చలేకపోయారు.
గౌరవ అధ్యక్షా,
గత పదేళ్లలో జరిగిన అన్ని విషయాలను నిశితంగా పరిశీలించినప్పుడు, మనం 40-50 ఏళ్లు వెనకబడి పోయామనిపించింది. ఇదంతా అప్పుడే జరగాల్సింది. అందుకే దేశ ప్రజలు 2014 నుంచి మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు, మేం యువతపై, వారి ఆకాంక్షలపై మరింత దృష్టి పెట్టాం, వారికోసం అనేక రంగాల్లో మరిన్ని అవకాశాలను కల్పించాం, దీని కారణంగా దేశ యువత వారి సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించడం మనం నేడు చూస్తున్నాం. మేం దేశంలో అంతరిక్ష, రక్షణ రంగాల్లో ఎన్నో అవకాశాలను కల్పించడమే గాకుండా, సెమీకండక్టర్ మిషన్‌ను తీసుకువచ్చాం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనేక కొత్త పథకాలకు రూపం ఇచ్చాం, భారత అంకురసంస్థల రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసాం, ఈ బడ్జెట్లో కూడా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రూ. 12 లక్షల ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు చాలా మంది మన్నన పొందింది, అయితే చాలా ముఖ్యమైన నిర్ణయాలను ఇప్పటికీ కొంతమంది గమనించలేదు. అణు విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించడం వంటి ఎన్నో ముఖ్య నిర్ణయాలు మేం తీసుకున్నాం, వీటి వల్ల దేశం ఎన్నో సానుకూల ప్రభావాలను, ఫలితాలను చూడబోతోంది.
గౌరవ అధ్యక్షా,
ఏఐ, 3డి ప్రింటింగ్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్ ప్రాముఖ్యతను చర్చించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మన దేశం ప్రపంచ గేమింగ్ రాజధానిగా, సృజనాత్మకత రాజధానిగా ఎందుకు మారకూడదో ఆలోచించాలని నేను దేశ యువతకు చెప్పాను, వారు ఈ దిశగా చాలా వేగంగా పనిచేస్తున్నారు. నా లక్ష్యాల్లో ఒకే ఏఐ కాదు, డబుల్ ఏఐ ఉంది, భారత్ ఈ రంగంలో రెండు బలాలను కలిగి ఉంది, ఒక ఏఐ అంటే కృత్రిమ మేధ అయితే, మరొక ఏఐ అంటే ఆకాంక్షాత్మక భారత్ (ఆస్పిరేషనల్ ఇండియా). మేం పాఠశాలల్లో పదివేల టింకరింగ్ ల్యాబ్‌లను ప్రారంభించాం. నేడు ఆ టింకరింగ్ ల్యాబ్‌ల నుంచి బయటకు వస్తున్న పిల్లలు రోబోలను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు, ఈ బడ్జెట్లో, మరో 50వేల కొత్త టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం కేటాయింపులు చేశాం. భారత ఏఐ మిషన్ గురించి ప్రపంచం మొత్తం చాలా ఆశాజనకంగా ఉంది, మన దేశ ఉనికి ప్రపంచ ఏఐ వేదికల్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందింది.
ఈ సంవత్సరం బడ్జెట్లో, మనం డీప్ టెక్ రంగంలో పెట్టుబడుల గురించి ప్రస్తావించాం, 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత శతాబ్దంగా మారడానికి, భారత్ ఈ రంగంలో చాలా వేగంగా ముందుకు సాగడం అవసరమని నేను నమ్ముతున్నాను. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిరంతరం పని చేస్తున్నాం, కానీ కొన్ని పార్టీలు నిరంతరం యువతను మోసం చేస్తూనే ఉన్నాయి. ఈ పార్టీలు ఎన్నికల సమయంలో ఈ భత్యం.. ఆ భత్యం.. ఇస్తామంటూ వారికి ఆశచూపుతాయి, అయితే అవి వాగ్దానాలు మాత్రమే చేస్తాయి కానీ వాటిని నెరవేర్చవు. ఈ పార్టీలు యువత భవిష్యత్తుకు విపత్తుగా మారాయి.
గౌరవ అధ్యక్షా,
హర్యానాలో మా పనితీరును ఇటీవలే దేశమంతా చూసింది. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎలాంటి స్లిప్స్ లేకుండా ఉద్యోగాలు ఇస్తామని మేం హామీ ఇచ్చాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మేం చెప్పిన దాని ఫలితమే ఇది.
గౌరవ అధ్యక్షా,
హర్యానాలో ముచ్చటగా మూడోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాం. దాంతో రాష్ట్ర చరిత్రలో మనకి మూడోసారి విజయం దక్కింది.. ఇదో చారిత్రాత్మక ఘట్టం.
గౌరవ అధ్యక్షా,
మహారాష్ట్ర విజయం కూడా చారిత్రాత్మకమైనదే. అధికార పార్టీ ఇంత భారీ మొత్తంలో సీట్లు దక్కించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి.. ప్రజల ఆశీస్సుల వల్లే ఇది సాధ్యపడింది.
గౌరవ అధ్యక్షా,
రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని రాష్ట్రపతి తమ ప్రసంగంలో విపులంగా చర్చించారు.
గౌరవ అధ్యక్షా,
రాజ్యాంగాన్ని కేవలం నిబంధనలు, ప్రకరణాలు గల పత్రంగా భావించలేం. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఎంతో ముఖ్యమైనది. ఆ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు దానిని పాటించడం ఆవశ్యకం, ఈ అంశాన్ని ఉదాహరణాలతో సహా వివరిస్తాను. మనమంతా రాజ్యాంగాన్ని సభక్తికంగా పాటించేవారం .
గౌరవ అధ్యక్షా,
మన దేశంలో రాష్ట్రపతి చట్టసభని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆ ఏడాదికి సంబంధించి ప్రభుత్వ పనితీరును చర్చించడం పరిపాటి. అదే విధంగా గవర్నర్లు రాష్ట్ర చట్టసభలని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల గురించి మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాల స్ఫూర్తి అంటే ఏమిటి అని ప్రశ్నించుకుందాం.. ఒక ఉదాహరణ తీసుకుందాం.. గుజరాత్ రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్న సందర్భమది.. ఆ సమయంలో అదృష్టవశాన నేను గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నాను. ప్రభుత్వం అప్పుడో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్వర్ణోత్సవాల సందర్భంగా గత 50 ఏళ్ళలో సభనుద్దేశించి గవర్నర్లు చేసిన అన్ని ప్రసంగాలతో కూడిన పొత్తం వెలువరించాలని నిర్ణయించాం. ఈ ప్రసంగాల్లో గవర్నర్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశంసించారు. ఈ రోజున ఆ ప్రమాణ గ్రంథాలు ప్రతి గ్రంథాలయంలో లభ్యమవుతున్నాయి. నేను బీజేపీ వాడినైనప్పటికీ, అప్పటికి గుజరాత్ ను కాంగ్రెస్ ప్రభుత్వాలే ఎక్కువగా పాలించాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలని ప్రశంసిస్తూ సాగిన గవర్నర్ల ప్రసంగాలకు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి ప్రాచుర్యం కల్పించారు.. ఎందువల్ల? రాజ్యాంగాన్ని గౌరవించడం మాకు తెలుసు కనుక.. మేము రాజ్యాంగానికి బద్ధులం. రాజ్యాంగ స్ఫూర్తి పట్ల మాకు చక్కని అవగాహన ఉంది.
గౌరవ అధ్యక్షా,
2014 లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు లెక్కించదగ్గ విపక్షమనేదే లేదు. గుర్తింపు పొందిన విపక్షం అప్పటికి లేదు. విపక్షంగా అధికార హోదా దక్కించుకునేందుకు అవసరమైనన్ని సీట్లు గల పార్టీ అప్పటికి లేనేలేదు. మన దేశంలో గల అనేక చట్టాలు అనేక వెసులుబాట్లను కల్పిస్తాయి, పూర్తి స్వేచ్చనిస్తాయి. ఇటువంటి కొన్ని చట్టాల ప్రకారం కొన్ని కమిటీల్లో విపక్ష అధినేత పాల్గొనడం అనివార్యం అని లిఖించి ఉంది. అయితే, విపక్షమనేదే లేని పరిస్థితి. గుర్తింపు పొందిన విపక్షం అప్పటికి లేదు. అయినప్పటికీ, రాజ్యాంగ పరిధికి లోబడి పార్లమెంటులో గల అతి పెద్ద విపక్ష పార్టీ నేతను ఆయా కమిటీల సమావేశాలకు ఆహ్వానించాం. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని ఆ విధంగా మేము ఆచరించాం. ప్రజాస్వామ్య స్పూర్తిని ఆ విధంగా గౌరవించాం. ఇక ఎన్నికల సంఘానికి సంబంధించి కమిటీల విషయానికి వస్తే, గతంలో ప్రధానమంత్రి మాత్రమే ఆ కమిటీని కూర్చేవారు, ప్రకటించేవారు. మేము ఆ పద్ధతిని మార్చివేశాం..ఆ కమిటీలో సైతం విపక్షాధినేత ఉండాలని నిర్ణయించి, తదనుగుణంగా చట్టాన్ని తీసుకొచ్చాం . ఈ రోజున ఎన్నికల సంఘం కూర్పు జరిగినప్పుడు, విపక్షాధినేత కూడా విధాన నిర్ణయాల్లో పాల్గొంటున్నారు.. మేము ఇటువంటి ఎన్నో పనులు చేపట్టాం. నేను ఇటువంటి చర్యలను ఇప్పటికే తీసుకున్నాను.. రాజ్యాంగాన్ని మేము అర్ధం చేసుకుని ఆచరించే తీరు ఇది.
గౌరవ అధ్యక్షా,
ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల వారు తమ సొంత మ్యూజియంలను ఏర్పాటు చేసుకోవడం మనకి తెలుసు. ఇవి ప్రజాధనంతో ఏర్పాటయ్యాయి. మరి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాటేమిటి? మేము ప్రధానమంత్రి మ్యూజియంను ఏర్పాటు చేశాం – ఇందులో తొలి ప్రధాని నుంచీ నాకు ముందు అ పదవిలో సేవలందించినవారి వరకూ ప్రతి ప్రధానమంత్రి జీవిత విశేషాలు సహా వారు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాం. పీఎం మ్యూజియంలో గల మహామహుల కుటుంబ సభ్యులు మ్యూజియంను సందర్శించి, మరేదైనా జోడించదలుచుకుంటే, ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా మ్యూజియం మరింత ఆసక్తిదాయంగా మారి, ఈ దేశ బాలలకు మరింత స్ఫూర్తిదాయకంగా నిలువగలదు. ఇదీ రాజ్యాంగ స్ఫూర్తిని అవగాహన చేసుకుని అమలు చేయడం. ఏ కాలంలోనైనా తమ స్వార్థం మాత్రమే చూసుకునే వారి సంఖ్య తక్కువేం కాదు, వీరు తమ గురించి మాత్రమే పాటుపడతారు. అయితే, రాజ్యాంగం కోసమే జీవించేవారూ ఇక్కడ ఆశీనులై ఉన్నారు.
గౌరవ అధ్యక్షా,
అధికారం సేవగా మారిన సందర్భాల్లో జాతి నిర్మాణం సాధ్యపడుతుంది. అదే అధికారం ఆనువంశికంగా మారితే, అది ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడుతుంది.
గౌరవ అధ్యక్షా,
మేం రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తున్నాం.. రాజకీయం పేరుతో విషాన్ని చిమ్మే పద్ధతి కాదు మాది. దేశ ఐక్యతకి అత్యంత ప్రాముఖ్యాన్నిస్తాం, అందుకే దేశాన్ని ఒక్క తాటి పైకి తెచ్చేందుకు అహరహం శ్రమించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని సంస్మరించుకుంటూ, ప్రపంచ అతి ఎత్తైన విగ్రహాన్ని, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట నెలకొల్పాం. సర్దార్… బీజేపీ వారూ కారు, జనసంఘ్ కి చెందిన వారూ కారు. మేం రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తాం కాబట్టే మా ఆలోచన ఈ దిశగా సాగింది.
గౌరవ అధ్యక్షా,
ఈ రోజుల్లో కొందరు బాహాటంగానే అర్బన్ నక్సల్స్ భాషను వినియోగించడం శోచనీయ పరిణామం. వీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సొంత దేశంపైనే యుద్ధం ప్రకటిస్తున్న ప్రబుద్ధులు. ఇటువంటి వారు రాజ్యాంగాన్ని కానీ దేశ ఐక్యతని కానీ అర్ధం చేసుకోరు.
గౌరవ అధ్యక్షా,
జమ్ము కాశ్మీర్, లద్దాక్ లు ఏడు దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులకి నోచుకోలేదు. ఈ పరిణామం అటు రాజ్యాంగానికీ, ఇటు జమ్ము కాశ్మీర్, లద్దాక్ ప్రజలకూ జరిగిన అన్యాయమనే చెప్పాలి. మేం 370 అధికరణం అడ్డుగోడను తొలగించినందువల్ల నేడు జమ్ము కాశ్మీర్, లద్దాక్ ప్రజలు మిగతా దేశవాసులు అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులను చవిచూస్తున్నారు. మాకు రాజ్యాంగం విలువ తెలుసు, రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తాం కాబట్టే ఇటువంటి గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం.
గౌరవ అధ్యక్షా,
రాజ్యాంగం మనకు వివక్ష చూపే హక్కునివ్వదు. రాజ్యాంగం ప్రతిని జేబులో పెట్టుకుని తిరిగేవారు ముస్లిం మహిళలు ఎటువంటి సమస్యల వలయంలో జీవించేందుకు తాము కారణమయ్యారో తెలుసుకోరు. ముమ్మారు తలాక్ పద్ధతిని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకి కూడా రాజ్యాంగ హక్కులను అందించగలిగాం. వారికి సమానత్వ హక్కుని కల్పించాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారీ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంది. దేశాన్ని విడగొట్టేందుకు కొందరు వాడే భాష ఏమిటో, వారి నిరాశా నిస్పృహలు వారిని ఏ తీరానికి చేరుస్తాయో నాకు తెలియదు కానీ, మా ఆలోచనలు, ఆశయాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆలోచనల తీరుతెన్నుల గురించి మాత్రం పూర్తి స్పష్టత ఉంది. గతంలో జరిగిన విషయాలకు ప్రాముఖ్యాన్నిస్తాం, చివరగా జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటాం. మహాత్మా గాంధీ అన్న మాటలను మరువం. అందువల్లే కొత్తగా ఎటువంటి మంత్రిత్వశాఖలను ప్రారంభించాలో మాకు అవగాహన ఉంది. ఇటువంటి ఆలోచనల నుంచీ ఉద్భవించిందే ఈశాన్య భారతదేశం గురించి ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ. మా పార్టీ అనేక దశాబ్దాలబట్టి ఆస్తిత్వంలో ఉంది. అటల్ జీ వచ్చి ప్రసంగాలు ఇచ్చేంత వరకూ ఎవరికీ ఆ ప్రాంతానికి గల ప్రత్యేక అవసరాల గురించిన ఆలోచన లేకపోయింది. ఎన్డీఏ గిరిజనుల కోసం కూడా ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది.
గౌరవ అధ్యక్షా,
మన దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు దిశలోని అనేక రాష్ట్రాలూ సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి. దాంతో, మత్స్య సంబంధ కార్యకలాపాలూ, గంగపుత్రులూ ఆయా రాష్ట్రాల సమాజాలలో ముఖ్యమైన భాగాలుగా కనపడతాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న నీటి వనరులు ఉన్నప్పటికీ సమాజంలోని అట్టడుగు వర్గాలు చేపల వేట కార్యకలాపాలలో మునిగి ఉంటారు. వీరందరి సంక్షేమం ఎంతో ముఖ్యమైంది. అందుకే మా ప్రభుత్వం ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేసింది.
గౌరవ అధ్యక్షా,
సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో కూడా ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండవచ్చు, నైపుణ్యాభివృద్ధికి ప్రాముఖ్యాన్నిస్తే, వారికి తగిన కొత్త అవకాశాలను కల్పించగలుగుతాం. వారి ఆశలూ కోరికలూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలవు, ఇదే ఆశయంతో నైపుణ్యాభివృద్ధి కోసం కొత్తగా ఒక మంత్రిత్వశాఖను ప్రారంభించాం.
గౌరవ అధ్యక్షా,
సామాన్య పౌరుడికి అధికారాన్ని అందించడం ప్రజాస్వామ్యం తొలి బాధ్యత! ఈ దిశగా దేశ సహకార రంగాన్ని మరింత బలంగా తయారు చేసేందుకు, కోట్లాది భారతీయులను ఈ రంగం ద్వారా అనుసంధానించేందుకు గొప్ప అవకాశం ఉంది. అనేక రంగాలకు సహకార స్ఫూర్తిని విస్తరించే అవకాశాన్ని మేము గమనించగలిగాం, అందువల్లే సహకార మంత్రిత్వశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దూరదృష్టికి ఇదొక నిదర్శనం.
గౌరవ అధ్యక్షా,
చేపట్టిన ప్రతి పథకం కోసం 100 శాతం కృషి, 100 శాతం అమలు అనే సూత్రాలతో ముందుకు సాగుతున్నాం. 100 శాతం లబ్ధిదారులకు పథకాలను చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందవలసిందే. రూపాయి 15 పైసల ఆట చెల్లదు. కానీ కొందరు బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా పథకాలనైతే తయారు చేశారు కానీ ఆ ప్రయోజనాలను కొందరికే పరిమితం చేసి, మిగతా వారిని వంచితులను చేశారు. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ బుజ్జగింపు ధోరణికి తిలోదకాలు ఇవ్వవలసిందే! మేము బుజ్జగింపు బాటకు బదులు నిజమైన సంతృప్తి మార్గాన్ని ఎంచుకున్నాం. ప్రతి రోజూ ఆ బాటలో ముందుకు సాగుతున్నాం. వివక్షకు తావు లేకుండా ప్రతి సమాజానికీ, సమూహానికీ తమ హక్కులు అందవలసిందే. అదే తృప్తికి దారి తీస్తుంది. 100 శాతం సంతృప్తి అంటే, నా దృష్టిలో సామాజిక న్యాయమే! ఇదే నిజమైన లౌకికవాదం..రాజ్యాంగాన్ని సంపూర్ణంగా గౌరవించడం.
గౌరవ అధ్యక్షా,
కులాన్ని గురించి మాట్లాడుతూ ఉండడం కొంత మందికి ఫ్యాషనైపోయింది. గత 30 ఏళ్లుగా, సభకు వస్తున్న ఓబీసీ సముదాయానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తూ ఒక్కటై ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వాలంటూ 30-35 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కులవాదంతో ప్రయోజనాల్ని రాబట్టుకోవచ్చనే భావనతో ఉన్నవారు, ఆ కాలంలో ఓబీసీ సముదాయాన్ని పట్టించుకోలేదు. ఓబీసీ సముదాయానికి రాజ్యాంగ ప్రతిపత్తినిచ్చిందే మేం. వెనుకబడిన తరగతుల (బీసీ) కమిషన్ ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలో భాగమైంది.
గౌరవ అధ్యక్షా,
ప్రతి రంగంలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు గరిష్ఠ స్థాయిలో అవకాశాల్ని అందించే దిశగా మేం చాలా పక్కాగా పనిచేశాం. ఈ రోజు, ఈ సభాముఖంగా, నేను దేశ ప్రజల సమక్షంలో ఒక ప్రధాన ప్రశ్న వేయదలచుకొన్నా. స్పీకర్ గారు, నా ఈ ప్రశ్న గురించి దేశ ప్రజలు తప్పక ఆలోచిస్తారని, దీని గురించి నలుగురూ కలిసి చర్చించుకొంటారని కూడా నేననుకొంటున్నాను. ఎవరైనా దయచేసి నాకు చెబుతారా, ఒకే కుటుంబంలో నుంచి ముగ్గురు ఎస్‌సీ ఎంపీలు ఏక కాలంలో పార్లమెంటులో ఉన్నారా? ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎస్‌సీ ఎంపీలంటూ ఎప్పుడైనా అసలు ఉన్నారంటారా? నేను మరో ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నా. దయచేసి ఎవరైనా నాతో చెబుతారా.. ఒకే కాలంలో, అదే సమయంలో ఎస్‌టీ ఎంపీలు అది కూడా ఒకే కుటుంబంలోని వారు పార్లమెంట్లో ఉన్నారంటారా?
గౌరవ అధ్యక్షా,
కొంతమంది మాట్లాడే మాటలకు, ప్రవర్తనకు మధ్య ఎంత తేడా ఉంటుందో. నేను అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తెలిసిపోయింది. తేడా నేలకు. నింగికి మధ్య ఉన్నంత ఉంటుంది. రాత్రికి, పగలుకు మధ్య ఉన్నంత తేడా ఉంటుంది.
గౌరవ అధ్యక్షా,
మేం ఎస్‌సీ, ఎస్‌టీ సమాజానికి ఏ విధంగా సాధికారతను కల్పిస్తున్నామంటే, గౌరవ అధ్యక్షా, సమాజంలో ఉద్రిక్తతను సృష్టించకుండా, ఐక్యతాస్ఫూర్తిని నిలబెడుతూ ఈ పనిని చేస్తున్నాం. సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాల వారి సంక్షేమానికి ఎలా పాటుపడవచ్చో అనే విషయంలో ఒక ఉదాహరణను నేను మీ దృష్టికి తీసుకువస్తాను. 2014కుముందు, మన దేశంలో 387 వైద్య కళాశాలలుంటే, ఇవాళ 780 వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వైద్య కళాశాలల సంఖ్యతోపాటు సీట్లు కూడా పెరిగాయి. గౌరవ అధ్యక్షా, ఇది చాలా ముఖ్యమైన కోణం, ఈ కారణంగానే కళాశాలలు పెరిగాయి కాబట్టి సీట్లు కూడా ఎక్కువయ్యాయి. 2014కు ముందు, మన దేశంలో ఎస్‌సీ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు 7,700 ఉన్నాయి. మేం అధికారంలోకి రావడాని కన్నా ముందు, దళిత సమాజానికి చెందిన 7,700 మంది యువతీయువకులకు వైద్యులయ్యేందుకు అవకాశం ఉండింది. మేం 10 ఏళ్ల పాటు కృషిచేశాం.. ఈ రోజు ఈ సంఖ్య పెరిగి, ఎస్‌సీ సమాజంలో 17,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఎదగడానికి తగిన ఏర్పాట్లు చేశాం. ఎక్కడ 7,700, ఎక్కడ 17,000; అదీనూ దళిత సమాజంలో. దళితులకు ఏదైనా సంక్షేమచర్యల్ని చేపట్టాలంటే, సమాజంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా, ఒకరంటే మరొకరికి గౌరవాన్ని పెంచుతూ వెళ్ళాలి.
గౌరవ అధ్యక్షా,
2014 కు ముందు ఎస్‌టీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ సీట్లు 3,800 ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 9,000కు చేరుకొంది. 2014 కన్నా వెనుకటి కాలంలో ఓబీసీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఎంబీబీఎస్ సీట్లు 14,000 కన్నా తక్కువ– నేను మరోసారి చెబుతున్నా– 14,000 కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ రోజు ఈ సీట్ల సంఖ్య దాదాపుగా 32,000 కి చేరింది. ఓబీసీ సమాజానికి చెందినవారు 32,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లవుతారు.
గౌరవ అధ్యక్షా,
గడచిన 10 సంవత్సరాల్లో ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటైంది, ప్రతి రోజూ ఒక కొత్త ఐటీఐ వెలిసింది, ప్రతి రెండు రోజులలో ఒక కొత్త కాలేజీ వచ్చింది. ఆలోచించండి, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ.. ఈ వర్గాల యువతను దృష్టిలో పెట్టుకొని ఎంతటి వృద్ధి చోటుచేసుకొందో మీరు ఇట్టే అంచనా వేయగలుగుతారు.
గౌరవ అధ్యక్షా,
మేం ప్రతి పథకాన్నీ శ్రద్ధతో అమలుచేస్తున్నాం, ఆ పథకం లాభాలు 100 శాతం మేర అందించే దిశలో వాటిని అమలు చేయడంలో వాటి లబ్ధిదారుల్లో ఏ ఒక్కరినీ వదలిపెట్టకుండా ఉండాలి.. ఈ దిశలో మేం పనిచేస్తున్నాం. ఎవరికైతే హక్కు ఉందో వారికి ఆ హక్కు లభించాలి; పథకమంటూ ఉంటే– ఆ పథకం ప్రయోజనాన్ని పొందే హక్కుదారయితే– అలాంటి వ్యక్తికి ప్రయోజనం లభించాల్సిందే. ఒక రూపాయిలో 15 పైసలు అనే ఆట ఇక సాగబోదు. అయితే కొంతమంది ఏం చేశారంటే, నమూనానే అలా తయారు చేశారు.. కొందరికే ఇవ్వడమూ, ఇతరులు బాధపడేటట్టు చేయడమూను. అలా చేసి తృప్తిపరిచే రాజకీయాల్ని నడపడం అన్నమాట. దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలంటే, ఈ తరహా తృప్తిపరిచే రాజకీయాలను వదిలించుకోవాలి. మేం ఒక మార్గాన్ని ఎంచుకొన్నాం. అదే– సంతృప్తి పరచే విధానం. అంతేగాని తృప్తిపరచేది కాదు. మరి ఈ దోవలో, ముందుకు సాగుతున్నాం మేం. ప్రతి ఒక్క సముదాయానికి చెందిన వారికి, ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారికి, ఎలాంటి భేదభావాలకు తావివ్వకుండా, హక్కును కలిగి ఉన్నవారికి ఆ హక్కు లభించాలి. ఇదే సంతృప్తిపరచే విధానం. మరి నా లెక్కల్లో ఎప్పుడైతే నేను 100 శాతం ప్రయోజనాల్ని గురించి ప్రస్తావిస్తున్నానో, దానికి అర్థం సిసలైన సామాజిక న్యాయాన్ని అందించడమన్నమాట. ఇదే నిజానికి సెక్యులరిజం, నిజమైన అర్థంలో రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ఇదీ.
గౌరవ అధ్యక్షా,
ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం దక్కాలి అనేదే రాజ్యాంగంలో పొందుపర్చుకున్న భావన. ఈ రోజు కేన్సర్ డే. ఇవాళ, ఆరోగ్యాన్ని గురించి దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే పేదలకు, వయోవృద్ధులకు ఆరోగ్య సేవలను అందించడంలో కొంత మంది అడ్డంకుల్ని సృష్టిస్తున్నారు. అది కూడా తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని. ఇవాళ దేశంలో 30,000 ఆసుపత్రులు, చక్కటి ప్రత్యేక సేవల్ని అందిస్తున్న ఆసుపత్రులూ ‘ఆయుష్మాన్ భారత్’తో ముడిపడ్డాయి. కానీ కొన్ని రాజకీయ పక్షాలు, వాటి సంకుచిత మానసిక దృక్పథం కారణంగా, చెడు రాజకీయాల కారణంగా– పేదలు, కేన్సర్ రోగులు ఈ ఆసుపత్రుల్లోకి వెళ్లకుండా– ఈ ఆసుపత్రుల తలుపుల్ని మూసేయించాయి. ఇటీవల, ప్రజారోగ్య పత్రిక లాన్సెట్ నిర్వహించిన ఒక అధ్యయనం ఆయుష్మాన్ పథకంలో కేన్సర్ చికిత్స సకాలంలో మొదలవుతోందని తేల్చి చెప్పింది. కేన్సర్‌ను గుర్తించే విషయంలో ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. ఎందుకు అంటే– గుర్తించడం ఎంత త్వరగా జరిగితే అంత త్వరగానూ– చికిత్సను మొదలుపెట్టవచ్చు. కేన్సర్ బారిన పడే రోగిని మనం కాపాడవచ్చు. ఈ ఖ్యాతి ఆయుష్మాన్ పథకానిదని లాన్సెట్ చెప్పింది. ఈ దిశగా భారత్‌లో చాలా కృషి జరిగిందని కూడా లాన్సెట్ పేర్కొంది.
గౌరవ అధ్యక్షా,
ఈసారి బడ్జెటులోనూ కేన్సర్ మందులు చౌకగా దొరికేటట్లుగా ఒక చాలా ముఖ్యమైన నిర్ణయాన్ని మేం తీసుకున్నాం. ఇదొక్కటే కాదు, రాబోయే కాలంలో మరో ముఖ్య నిర్ణయాన్ని తీసుకొంటాం. మరి ఈ రోజు కేన్సర్ డే కాబట్టి ఈ నిర్ణయంతో కలిగే లాభాన్ని గౌరవనీయ ఎంపీలు వారి ప్రాంతాల్లోని ఈ తరహా రోగుల్ని దృష్టిలో పెట్టుకొని వినియోగించుకోవాల్సిందిగా (ఎంపీలకు) నేను చెప్పి తీరాలనుకొంటున్నాను. సరిపడా ఆసుపత్రులు లేవు కాబట్టి బయటి నుంచి వచ్చే రోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో 200 డే కేర్ సెంటర్లను నిర్మించాలని ఈ బడ్జెటులో ఓ నిర్ణయం తీసుకొన్నాం. ఈ డే కేర్ సెంటర్లు రోగితోపాటు ఆ రోగి కుటుంబానికి సైతం ఎంతో ఊరటను కలిగిస్తాయి.
గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి ప్రసంగాన్ని చర్చించేటప్పుడు, విదేశాంగ విధానాన్ని గురించి కూడా చర్చించాం. కొంతమంది అనుకుంటారు.. వారు విదేశాంగ విధానాన్ని గురించి చర్చించలేదూ అంటే గనక తాము పరిణతి చెందిన వారం కాదన్నట్లుగా భావించుకొంటారు. అందుకని, వారు విదేశాంగ విధానాన్ని గురించి మాట్లాడాల్సిందే– అది దేశానికి నష్టం కలిగించేది అయినా సరే– అని ఆలోచిస్తారు. అలాంటి వారికి నేను చెప్పాలనుకుంటున్నా, వారికి విదేశాంగ విధానం అంశంపైన నిజంగానే ఆసక్తి ఉంటే, వారు దాన్ని అర్థం చేసుకోవాలని అనుకున్నట్లయితే, రాబోయే కాలంలో ఏదయినా చేయాలి అని అనుకుంటూ ఉంటే– నేనీ మాటల్ని శశి గారి కోసం చెప్పడం లేదు– మరి ఈ కారణంగా ఆ తరహా వ్యక్తులకు నేను చెప్పదలుచుకొన్నాను.. వారు తప్పక ఒక పుస్తకాన్ని చదవాలి అని. ఆ పనిని చేశారంటే, బహుశా వారు ఎప్పుడు ఏం మాట్లాడాలో గ్రహించగలరు. ఆ పుస్తకం పేరు జేఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్. దీనిలో జేఎఫ్ కెన్నెడీని గురించి రాశారు. ఈ పుస్తకాన్ని రాసింది ఓ ప్రఖ్యాత విదేశాంగ విధాన పండితుడు. దీనిలో ముఖ్య సంఘటనలను గురించిన ప్రస్తావన ఉంది. ఈ గ్రంథం భారత్ తొలి ప్రధానిని గురించి కూడా వివరిస్తుంది. ఆయన విదేశాంగ విధానానికి సైతం సారథ్యం వహించారు. పండిత్ నెహ్రూకు, అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కేన్‌కు మధ్య జరిగిన చర్చల్ని, తీసుకున్న నిర్ణయాల్ని గురించిన ప్రతి ఒక్క విషయాన్నీ ఈ పుస్తకం సమగ్రంగా తెలియజేసింది. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కాలంలో, ఆ సమయంలో విదేశాంగ విధానం పేరిట ఏ తరహా ఆట సాగిందో ప్రస్తుతం ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వస్తోంది. అందుకనే నేను చెబుతున్నా, దయచేసి ఈ పుస్తకాన్ని చదవండని.
గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి గారి ప్రసంగం ముగిసిన తరువాత, ఒక మహిళా రాష్ట్రపతి గారు, ఓ పేద కుటుంబాన్నుంచి వచ్చిన పుత్రిక.. ఆమెను గౌరవించ లేం అంటే అది మీ ఇష్టం. కానీ, ఆమెను ఏమేం మాటలంటూ అగౌరవం పాల్జేస్తున్నారో. నేను రాజకీయాల్లో ఆశాభంగాన్ని, నిరుత్సాహాన్ని అర్థం చేసుకోగలను, అయితే ఒక రాష్ట్రపతికి వ్యతిరేకంగా నడుచుకోవడానికి ఏమిటి కారణం, దీనికి కారణమేంటి.
గౌరవ అధ్యక్షా,
ఈ తరహా వికృత మానసిక భావనను, ఆలోచన విధానాన్ని వెనుకపట్టుననే విడిచిపెడుతూ, మహిళల నాయకత్వంలో అభివృద్ధిని సాధిస్తూ ఆధునిక భారత్ ముందుకు సాగిపోతోంది. జనాభాలో సగం మందికి పూర్తి అవకాశాలు చిక్కితే మన దేశం రెట్టింపు వేగంతో పురోగమించగలుగుతుంది. ఇది నా నమ్మకం. ఈ రంగంలో 25 సంవత్సరాల పాటు పనిచేసిన తరువాత నా ఈ నమ్మకం మరింతగా బలపడింది.
గౌరవ అధ్యక్షా,
గత పదేళ్లలో, 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయంసహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీస్)లో చేరారు. ఈ మహిళలు ఆదరణకు నోచుకోని వర్గాలకు చెందిన వారు, ఈ మహిళలు గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చిన వారు. సమాజంలో కింది స్థాయిలో ఉన్న ఈ మహిళల బలం పెరిగి, వారి సామాజిక హోదా కూడా మెరుగైంది. ప్రభుత్వం వారికి అందిస్తున్న సహాయాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీనిని అందుకొని వారు ముందంజ వేయగలగాలి. వారికిచ్చే పని పరిధిని, వారు నిర్వహించే కార్యకలాపాల స్థాయిని పెంచే దిశగా మేం కృషి చేస్తున్నాం. మరి ప్రస్తుతం ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది.
గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి తమ ప్రసంగంలో లఖ్‌పతి దీదీ అభియాన్‌ను గురించి చర్చించారు. మూడో సారి మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇంతవరకు నమోదు చేసిన సమాచారాన్ని బట్టి చూస్తే, సుమారు 50 లక్షల మందికి పైగా ‘లఖ్‌పతి దీదీస్’ (లక్షాధికారి సోదరీమణుల)ను గురించిన సమాచారాన్ని మేం అందుకొన్నాం. నేను ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు దాదాపు 1.25 కోట్ల మంది మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారు. మేం 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా ఎదిగేటట్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. దీనిని సాధించడానికి, తగిన ఆర్థిక కార్యక్రమాలకు ప్రాధాన్యాన్నిస్తాం.
గౌరవ అధ్యక్షా,
ప్రస్తుతం, దేశంలో చాలా గ్రామాల్లో డ్రోన్ దీదీ (డ్రోన్ సోదరీమణి) అంశాన్ని చర్చించుకొంటున్నారు. పల్లెల్లో మనస్తత్వం పరంగా ఒక మార్పు వచ్చింది. ఒక మహిళ డ్రోన్‌ను పట్టుకొని దానిని నడుపుతున్నారు. ఆ పనిని చేస్తున్న మహిళల విషయంలో పల్లెవాసుల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. ఇవాళ నమో డ్రోన్ దీదీ పొలాల్లో పనిచేస్తూ, లక్షల రూపాయల్ని సంపాదించడం మొదలుపెట్టింది. ముద్ర యోజన కూడా మహిళలకు సాధికారతను కల్పించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. కోట్ల కొద్దీ మహిళలు మొట్టమొదటిసారి ముద్ర యోజన సాయంతో పరిశ్రమలో అడుగుపెట్టి, పారిశ్రామికవేత్తల పాత్రను పోషిస్తున్నారు.
గౌరవ అధ్యక్షా,
4 కోట్ల కుటుంబాలకు ఇచ్చిన ఇళ్లలో దాదాపుగా 75 శాతం ఇళ్ల యాజమాన్య హక్కు మహిళల చేతుల్లోనే ఉంది.
గౌరవ అధ్యక్షా,
ఈ మార్పు 21వ శతాబ్దంలో ఒక బలమైన భారత్‌కు పునాదిని వేస్తోంది. గౌరవనీయులైన సభాపతి గారూ, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం గ్రామీణ ఆర్థిక వ్యవస్థే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయకుండా అభివృద్ధి చెందిన భారత్ దిశగా మనం అడుగులు వేయలేం. ఈ కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి ఒక్క రంగాన్ని బాగుపరిచే ప్రయత్నాలు మేం చేశాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కీలకం అనే విషయం మాకు తెలిసిన విషయమే. అభివృద్ధి చెందిన భారత్‌కు నాలుగు మూలస్తంభాల్లోనూ మన రైతులు ఒక స్తంభంగా ఉంటున్నారు. గత పది సంవత్సరాల్లో, వ్యవసాయానికి బడ్జెటును పది రెట్లు పెంచాం. 2014 తరువాతి కాలాన్ని గురించి మీకు తెలియజేయనివ్వండి నన్ను.. ఇది చాలా విశేషమైన పురోగతే.
గౌరవ అధ్యక్షా,
2014కి ముందు యూరియా అడిగినందుకు లాఠీచార్జీ చేసిన వారు, ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఎరువుల కోసం రాత్రంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు ఉండేవి. రైతుల పేరు మీద ఎరువులు విడుదలైనా అవి పొలాల వరకు చేరుకొనేవి కావు. మరెక్కడో నల్లబజారులో రూపాయి 15 పైసల చేతివాటం ఆటలు సాగుతూ ఉండేవి. ప్రస్తుతం రైతులందరికీ అవసరమైనంత మేర ఎరువులు అందుతున్నాయి. కొవిడ్ సంక్షోభం సమయంలో మొత్తం సరఫరా వ్యవస్థ అంతా దెబ్బతింది. అంతర్జాతీయంగా వాటి ధరలు అసమంజసమైన రీతిలో పెరిగిపోయాయి. మనం యూరియూ దిగుమతులపైనే ఆధారపడి ఉండటం వల్ల దాని ప్రభావం మనపై ఎక్కువగా పడింది. ఇప్పుడు యూరియా బస్తా ధర రూ.3,000. కానీ భారత ప్రభుత్వం రైతులకు రూ.300 కంటే తక్కువకే యూరియా బస్తాను అందిస్తోంది. మిగిలిన మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది. రైతులకు గరిష్ట ప్రయోజనాలు దక్కేలా మేం నిరంతరాయంగా పనిచేస్తున్నాం.
గౌరవ అధ్యక్షా,
రైతులకు తక్కువ ధరలకే ఎరువులు అందించేందుకు గాను గత పదేళ్లలో రూ.12 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సుమారుగా రూ.3.5 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. అలాగే గతంలో మునుపెన్నడూ లేని విధంగా దశాబ్ధకాలంలోనే పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ)ను రికార్డు స్థాయిలో పెంచి మూడు రెట్లు ఎక్కువగా సేకరించాం. రైతులు తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు పొందుతున్నారు. ఇవి మూడు రెట్లు ఎక్కువగా పెరిగాయి. గతంలో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే ఆ నష్టాన్ని పూర్తిగా రైతులే భరించాల్సి వచ్చేది. మా ప్రభుత్వ హయాంలో పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు రెండు లక్షల కోట్ల రూపాయలు అందించాం.
గౌరవ అధ్యక్షా,
గడచిన దశాబ్దంలో నీటిపారుదల రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో చర్యలు తీసుకున్నాం. దురదృష్టవశాత్తూ రాజ్యాంగం గురించి మాట్లాడేవారికి దీనిపై అంతగా అవగాహన లేదు. నీటి ప్రాజెక్టులపై డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు స్పష్టమైన, సమగ్రమైన, సమ్మిళితమైన ఆలోచనలను ఉన్నాయని మన దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన ఆలోచనలు ఈనాటికీ మనల్ని చైతన్యం చేస్తున్నాయి. దశాబ్దాలుగా నిలిచిపోయిన 100 నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు మేం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాం. తద్వారా పొలాలకు నీరు అందుతుంది. నదుల అనుసంధానం బాబా సాహెబ్ అంబేద్కర్ కల. ఈ విధానాన్ని ఆయన సమర్థించేవారు. ఏళ్లు, దశాబ్దాలు గడిచిపోయినా ఈ విషయంలో ఏమీ జరగలేదు. ఈ రోజు మేం కెన్–బెత్వా, పార్వతి–కాలీసింధ్–చంబల్ అనుసంధాన ప్రాజెక్టులను ప్రారంభించాం. గుజరాత్లో ఇలా నదుల అనుసంధానం ద్వారా అంతరించిపోయిన అనేక నదులను విజయవంతంగా పునరుద్ధరించిన అనుభవం నాకు ఉంది.
గౌరవ అధ్యక్షా,
ఇది దేశంలోని ప్రతి పౌరుడి కలగా మారాలి. ప్రపంచంలోని ప్రతి డైనింగ్ టేబుల్ మీద మేడ్ ఇన్ ఇండియా ఆహారపు పొట్లాలు ఉండటం మన అందరి లక్ష్యం కావాలి. ఇప్పుడు భారత్‌లో తయారైన టీతో పాటు కాఫీ సైతం తన పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోంది. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కొవిడ్ తర్వాత మన పసుపునకు సైతం డిమాండ్ బాగా పెరిగింది.
గౌరవ అధ్యక్షా,
శుద్ధి చేసిన సముద్రఆహారం, బీహార్ మఖానాను భవిష్యత్తులో ప్రపంచం మొత్తం చేరుకోవడం మీరు చూస్తారు. ఇది ఎప్పుడు, ఎలా జరుగుతుందో తెలియక కొంతమంది కలత చెందుతున్నారు. మన చిరుధాన్యం శ్రీఅన్న కూడా ప్రపంచ మార్కెట్లో భారత్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది.
గౌరవ అధ్యక్షా,
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం భవిష్యత్తుకు తగినట్టుగా రూపుదిద్దుకున్న నగరాలు చాలా అవసరం. మన దేశం పట్టణీకరణ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. దీన్ని మనం సవాలుగా పరిగణించాలి కానీ సంక్షోభంలా కాదు. దీన్ని అవకాశంగా స్వీకరించి ఆ దిశగా మనం పనిచేయాలి. మౌలిక వసతుల అభివృద్ధి అవకాశాల విస్తరణకు దారి తీస్తుంది. రవాణా అనుసంధానం ఎక్కడ పెరుగుతుందో అక్కడ అవకాశాలు విస్తరిస్తాయి. ఢిల్లీ–యూపీని కలుపుతున్న మొట్ట మొదటి నమో రైలును ప్రారంభించి అందులో ప్రయాణించే అవకాశం నాకు దక్కింది. ఇలాంటి సదుపాయాలు దేశంలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలి. ఇదే రాబోయే రోజుల్లో మన అవసరం, మన నడవాల్సిన మార్గం కానుంది.
గౌరవ అధ్యక్షా,
ఢిల్లీలో మెట్రో వ్యవస్థ రెట్టింపు స్థాయిలో పెరిగింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం మెట్రో వ్యవస్థ విస్తరించింది. ప్రస్తుతం మన దేశంలో మెట్రో వ్యవస్థ 1000 కి.మీ మేర విస్తరించడం మనందరికీ గర్వకారణం. మరో వెయ్యి కి.మీ.ల పనులు జరుగుతున్నాయి. అంటే మనం చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని అర్థం.
గౌరవ అధ్యక్షా,
కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దేశంలో 12వేల విద్యుత్ బస్సులను నడపడం ప్రారంభించాం. ఢిల్లీకి కూడా మేం వాటిని అందించాం.
గౌరవ అధ్యక్షా,
మన దేశంలో కాలానుగుణంగా ఒక నూతన ఆర్థికవ వ్యవస్థ విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో గిగ్ ఎకానమీ బాగా విస్తరిస్తోంది. లక్షల మంది యువకులు వాటిలో చేరుతున్నారు. ఈ తరహా కార్మికులు, గిగ్ వర్కర్లు ఈ–శ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకుని ధ్రువీకరణ పొందాలి. ఈ కొత్తతరం సేవా ఆర్థిక వ్యవస్థలో వారికి ఏవిధమైన సాయం చేయాలన్నా వారు ఈ–శ్రామ్ పోర్టల్ ద్వారా వారు గుర్తింపు కార్డు పొందాలి. అలాగే గిగ్ వర్కర్లకు ఆయుష్మాన్ యోజన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. తద్వారా గిగ్ వర్కర్లు సరైన దిశలో ప్రయాణించగలుగుతారు. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశంలో సుమారు కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. వారి సంక్షేమం కోసం మేం పనిచేస్తున్నాం.
గౌరవ అధ్యక్షా,
ఎంఎస్ఎంఈ రంగం అపారమైన ఉద్యోగావకాశాలు తీసుకువస్తుంది. ఈ రంగానికి విస్తృత స్థాయిలోఉపాధి కల్పించే సామర్థ్యం ఉంది. ఈ చిన్నతరహా పరిశ్రమలు స్వయం సమృద్ధి సాధించిన భారత్‌కు ప్రతీకలు. దేశ ఆర్థికవ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగం బృహత్ స్థాయిలో సహకారం అందిస్తోంది. మా విధానం చాలా స్పష్టంగా, సరళంగా, సులభంగా, ఉద్యోగ కల్పన చేసే ఎంఎంస్ఎంఈ రంగాన్ని ప్రోత్సాహించేలా ఉంది. అందుకే ఈ సారి మేం తయారీ రంగంపై దృష్టి సారించాం. మొత్తం తయారీ రంగాన్ని అంటే ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయబోతున్నాం. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తాం. యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగాలకు తగినట్టుగా సిద్ధం చేస్తాం. ఎంఎస్ఎంఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు మేం అనేక అంశాలపై పనిచేయడం ప్రారంభించాం. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవసరమైన నిబంధనలను 2006లో రూపొందించారు. కానీ వాటిని సవరించలేదు. గత పదేళ్లలో వీటిని రెండు సార్లు సవరించడానికి మేం ప్రయత్నించాం. ఈసారి ఈ విషయంలో మేం చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చాం. మొదటిసారి 2020లో, రెండోసారి ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. వాటికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం.
సరైన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడమే ఎంఎస్ఎంఈల ముందు ప్రస్తుతం ఉన్న సవాలు. కొవిడ్ సంక్షోభంలో, ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి సారించాం. బొమ్మల పరిశ్రమకు సైతం మేం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం. వస్త్ర పరిశ్రమపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నగదు కొరత లేకుండా ఎలాంటి హామీ లేకుండా రుణాలు అందించాం. వేలాది సంస్థల్లో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించి, ఉద్యోగ భరోసా కల్పించాం.
సులభతర వ్యాపారాలను ప్రోత్సహించేలా చిన్న పరిశ్రమలకు అందించే కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ గ్యారంటీ కవరేజీల అంశంలో మేం చర్యలు తీసుకున్నాం. అనవసరమైన నియమాలను తొలగించి వారిపై పరిపాలనా భారాన్ని తగ్గించాం. గతంలో పని పూర్తి చేసుకోవడం కోసం ఒకరిద్దరికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి కొత్త విధానాలు రూపొందించామని తెలిస్తే మీరు సంతోషిస్తారు. 2014కు ముందు మనం ఆటబొమ్మలను దిగుమతి చేసుకొనేవాళ్లం. కానీ ఇప్పుడు నా దేశంలోని బొమ్మలు తయారుచేసే చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. దీంతో దిగుమతుల్లో భారీ తగ్గుదల కనిపించింది. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. ఈ ఎగుమతులు దాదాపుగా 239 శాతం మేర పెరిగాయి. ఎంఎస్ఎంఈలు నిర్వహిస్తున్న అనేక రంగాలు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తున్నాయి. మేడిన్ ఇండియా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తులు ఇతర దేశాల జీవితాల్లో భాగమవుతున్నాయి.
గౌరవ అధ్యక్షా,
అభివృద్ధి చెందిన భారత్ అనే కలను సాకారం చేసే దిశగా గొప్ప ఆత్మ విశ్వాసంతో భారత్ ముందుకు సాగుతోంది. అభివృద్ధి చెందిన భారత్ అనేది కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదు. ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కల. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తిని ధారపోయాలి. దీనికి ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. 20-25 ఏళ్ల వ్యవధిలో అభివృద్ధి సాధించవచ్చని ఈ ప్రపంచంలోని చాలా దేశాలు నిరూపించాయి. భారత్‌కు చాలా శక్తి ఉంది. మనకు జనాభా, ప్రజాస్వామ్యం, డిమాండ్ ఉన్నాయి. మరి మనం ఎందుకు దాన్ని సాధించలేం? మన దేశం స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగాలి.
గౌరవ అధ్యక్షా,
మనం చాలా పెద్ద లక్ష్యాలను సాధించాల్సి ఉంది. వాటిని సాధిస్తాం కూడా. అధ్యక్షా ఇది మా మూడో విడత పాలన మాత్రమే. దేశం అవసరానికి అనుగుణంగా ఆధునిక భారతాన్ని, సామర్థ్యమున్న భారతాన్ని నిర్మించడానికి, అభివృద్ధి చెందిన భారత్ అనే కలను సాకారం చేయడానికి రానున్న కాలంలో మేం అంకిత భావంతో పనిచేస్తాం.
గౌరవ అధ్యక్షా,
అన్ని పార్టీలకు, నాయకులకు, దేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సొంత రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయి, సొంత రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఏదీ దేశం కంటే పెద్దది కాదు. అన్నింటి కంటే దేశమే ప్రధానం. ఇది 140 కోట్ల మంది దేశ పౌరుల కల, ఈ సభలో కూర్చున్న ప్రతి పార్లమెంటు సభ్యుడి కల అయిన అభివృద్ధి చెందిన భారత్‌ను అందరూ కలసి సాకారం చేసుకుందాం.
గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి ప్రసంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూనే మీకు, ఈ సభకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు!
సూచన: పీఎం హిందీలో చేసిన ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన తెలుగు అనువాదం.
***
The President’s address clearly strengthens the resolve to build a Viksit Bharat! pic.twitter.com/0LkMOVGe9t
— PMO India (@PMOIndia) February 4, 2025
A Government that has worked for all sections of society. pic.twitter.com/NkQ2caCc9p
— PMO India (@PMOIndia) February 4, 2025
We believe in ensuring resources are spent towards public welfare. pic.twitter.com/IYl8D4jaeT
— PMO India (@PMOIndia) February 4, 2025
Our Government is proud of the middle class and will always support it! pic.twitter.com/j7VYFXx5Bk
— PMO India (@PMOIndia) February 4, 2025
Proud of India's Yuva Shakti. pic.twitter.com/9Ttm8DaajG
— PMO India (@PMOIndia) February 4, 2025
Leveraging the power of AI to build an Aspirational India. pic.twitter.com/Mnbk5IwdUQ
— PMO India (@PMOIndia) February 4, 2025
An unwavering commitment to strengthening the values enshrined in our Constitution. pic.twitter.com/j3i0zegzQ1
— PMO India (@PMOIndia) February 4, 2025
Public service is all about nation building. pic.twitter.com/B2ilXOHjoq
— PMO India (@PMOIndia) February 4, 2025
Our commitment to the Constitution motivates us to take strong and pro-people decisions. pic.twitter.com/4ALSCOulBk
— PMO India (@PMOIndia) February 4, 2025
Our Government has worked to create maximum opportunities for people from SC, ST and OBC Communities. pic.twitter.com/ft4vTHtaOr
— PMO India (@PMOIndia) February 4, 2025
Our Government has shown how to strengthen unity as well as care for the poor and downtrodden. pic.twitter.com/APfORBYryb
— PMO India (@PMOIndia) February 4, 2025
Emphasis on saturation is generating outstanding results. pic.twitter.com/Q5c1WU08NR
— PMO India (@PMOIndia) February 4, 2025
In the last decade, unprecedented support has been given to the MSME sector. pic.twitter.com/C6P3sguBH1
— PMO India (@PMOIndia) February 4, 2025
Speaking in the Lok Sabha. https://t.co/5cGIgu7G00
— Narendra Modi (@narendramodi) February 4, 2025
गरीबों की झोपड़ियों में फोटो सेशन से अपना मनोरंजन करने वालों को हमारे गरीब भाई-बहनों की बात बोरिंग ही लगेगी! pic.twitter.com/6WXdUuluAf
— Narendra Modi (@narendramodi) February 4, 2025
हमारी योजनाओं से जन-सामान्य की अधिक से अधिक बचत हो, इस पर शुरू से ही हमारा पूरा फोकस रहा है। pic.twitter.com/4mwF3FIDbj
— Narendra Modi (@narendramodi) February 4, 2025
2014 से हमने देश के युवाओं की आकांक्षाओं पर बल दिया है। उसी का नतीजा है कि हमारे युवा आज हर क्षेत्र में सफलता का परचम लहरा रहे हैं। pic.twitter.com/dGzZju6FC1
— Narendra Modi (@narendramodi) February 4, 2025
संविधान को मजबूती देने के लिए, संविधान की भावना को जीना पड़ता है और हम वही कर रहे हैं। pic.twitter.com/wP9bzx7Ige
— Narendra Modi (@narendramodi) February 4, 2025
समाज में एकता की भावना को बरकरार रखते हुए वंचितों का कल्याण कैसे किया जाता है, हमारी सरकार ने इसके अनेक उदाहरण पेश किए हैं। pic.twitter.com/RC8EF5yDj4
— Narendra Modi (@narendramodi) February 4, 2025
मेरा दृढ़ विश्वास है कि हमारी माताओं-बहनों-बेटियों को पूरा अवसर मिले तो भारत दोगुनी रफ्तार से आगे बढ़ सकता है। इस दिशा में लखपति दीदी और ड्रोन दीदी के साथ ही सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं देशभर के लिए मिसाल बनी हैं। pic.twitter.com/rvb6dlT6w8
— Narendra Modi (@narendramodi) February 4, 2025
हमारे किसान भाई-बहन विकसित भारत के चार आधारस्तंभों में से एक हैं। उनका जीवन अधिक से अधिक आसान बने, इसके लिए हमने बीते एक दशक में खेती के बजट में 10 गुना वृद्धि की है। pic.twitter.com/Y9PnQPdv5x
— Narendra Modi (@narendramodi) February 4, 2025
‘विकसित भारत’ कोई सरकारी सपना नहीं, बल्कि मेरे 140 करोड़ देशवासियों का सपना है। pic.twitter.com/efk3cVuoas
— Narendra Modi (@narendramodi) February 4, 2025