గౌరవనీయులారా!
నమస్కారం.
ముందుగా ‘యాగి‘ తుఫాను బాధితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఆపరేషన్ సద్భావ్ ద్వారా మానవతా సాయాన్ని అందించాం.
మిత్రులారా,
ఆసియాన్ ఐక్యత కోసం, ప్రాంతీయంగా అది ప్రధాన శక్తిగా ఎదిగేందుకు భారత్ నిరంతరం మద్దతిస్తోంది. భారత్ ఇండో–పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారానికి ఆసియాన్ కీలకం. భారత్ తీసుకున్న “ఇండో–పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం“, “ఇండో–పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం” మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో శాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి జరగడానికి స్వేచ్ఛ, అరమరికలులేని, సమ్మిళిత, అభ్యున్నతి దిశగా– పద్ధతితో కూడిన ఇండో–పసిఫిక్ కార్యక్రమాలు ఉండాలి.
దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, సుస్థిరత నెలకొనడం… ఈ మొత్తం ఇండో–పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల్లో చాలా ముఖ్యం.
‘యూఎన్సీఎల్ఓఎస్’కు అనుగుణంగా సముద్రయాన కార్యకలాపాలు నిర్వహించాలని మేం కోరుకుంటున్నాం. నావిగేషన్, గగనతల స్వేచ్ఛను నిర్ధారించుకోవటం చాలా అవసరం. పటిష్ఠమైన, సమర్థవంతమైన ప్రవర్తనా నియమావళిని తయారు చేసుకోవాలి. అలాగే ఇది ఈ ప్రాంత దేశాల విదేశీ విధానాలపై ఆంక్షలు విధించకూడదు.
మన విధానం విస్తరణవాదం కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
మిత్రులారా,
మయన్మార్‌లో పరిస్థితిపై ఆసియాన్ విధానాన్ని మేం సమర్థిస్తున్నాం. ఈ విషయంలో అంగీకరించిన అయిదు అంశాలకూ మద్దతిస్తున్నాం. మానవతా సహాయాన్ని కొనసాగించడం, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తగిన చర్యలను తీసుకోవటం చాలా ముఖ్యమని మేం విశ్వసిస్తున్నాం. ఈ ప్రక్రియలో మయన్మార్‌ను ఏకాకిని చేయకుండా, దానిని విశ్వాసంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం.
పొరుగుదేశంగా భారత్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటుంది.
మిత్రులారా,
ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా నష్టపోతున్నది దక్షిణార్థ గోళంలోని దేశాలే. యురేషియా, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతను పునరుద్ధరించాలనే అందరూ కోరుకుంటున్నారు.
నేను బుద్ధుడు పుట్టిన దేశం నుండి వచ్చాను. ఇది యుద్ధ యుగం కాదని నేను పదేపదే చెబుతుంటాను. యుద్ధభూమిలో సమస్యలకు పరిష్కారాలు దొరకవు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం చాలా అవసరం. మానవతా దృక్పథంతో చర్చలు, దౌత్యానికి పెద్దపీట వేయాలి.
విశ్వబంధుగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో, ఈ దిశలో తన వంతు సహకారం అందించడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.
ఉగ్రవాదం ప్రపంచ శాంతి భద్రతలకు పెను సవాలు విసురుతోంది. దీన్ని ఎదుర్కోవాలంటే మానవత్వాన్ని విశ్వసించే శక్తులు ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాలి.
సైబర్, సముద్ర, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.
మిత్రులారా,
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో మేం నలంద పునరుద్ధరణకు సంబంధించిన వాగ్దానం చేశాం. ఈ జూన్ లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం ద్వారా దాన్ని నెరవేర్చాం. నలందలో జరిగే ‘ఉన్నత విద్యా సారథుల సదస్సు (హెడ్స్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్) ‘లో పాల్గొనాలని నేను ఇక్కడ ఉన్న అన్ని దేశాలను ఆహ్వానిస్తున్నాను.
మిత్రులారా,
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు భారతదేశ తూర్పు దేశాల ప్రాధాన్య (యాక్ట్ ఈస్ట్) విధానంలో కీలకం.
నేటి శిఖరాగ్ర సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ప్రధాన మంత్రి సోనెక్సే సిఫాండోన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
తదుపరి అధ్యక్షత బాధ్యతలు నిర్వహించనున్న మలేషియాకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చేందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి దగ్గరి అనువాదం.
Took part in the 19th East Asia Summit being held in Vientiane, Lao PDR. India attaches great importance to friendly relations with ASEAN. We are committed to adding even more momentum to this relation in the times to come. Our Act East Policy has led to substantial gains and… pic.twitter.com/3DS7fjqfdI
— Narendra Modi (@narendramodi) October 11, 2024