Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.

అర్థ దశాబ్దం పాటు సాగుతూ వచ్చిన సేవాయాత్రలో కార్యకర్ సువర్ణ మహోత్సవ్ ఒక ప్రధాన ఘట్టం అని శ్రీ మోదీ చెబుతూ, యాభై సంవత్సరాల కిందట కార్యకర్తల పేర్లను నమోదు చేసుకొనే ప్రక్రియతో మొదలుపెట్టి వారు అందించాల్సిన సేవాకార్యాల్ని వారికి అప్పగించడం.. ఇలా ఒక కొత్తరకం కార్యక్రమం శ్రీకారం చుట్టుకొందని శ్రీ మోదీ అన్నారు. లక్షల సంఖ్యలో బీఏపీఎస్ కార్యకర్తలు అత్యంత భక్తితోనూ, అంకిత భావంతోనూ సేవా కార్యాల్లో పాలుపంచుకొంటూ ఉండడాన్ని చూస్తే సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఇది సంస్థ సాధించిన ఒక ఘన విజయమని శ్రీ మోదీ ప్రశంసిస్తూ, బీఏపీఎస్‌కు అభినందనలను, శుభాకాంక్షలను తెలియజేశారు.

‘‘కార్యకర్ సువర్ణ మహోత్సవ్ అంటే అది భగవాన్ స్వామి నారాయణ్ మానవతభరిత ప్రబోధాల్ని ఒక పండుగలా చేసుకోవడం వంటిదే’’ అని శ్రీ మోదీ అన్నారు. ఇది లక్షల కొద్దీ ప్రజల జీవనంలో మార్పును తీసుకు వచ్చిన, దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న సేవ తాలూకు కీర్తే అని చెప్పవచ్చని ఆయన అన్నారు. బీఏపీఎస్ సేవా కార్యక్రమాలను దగ్గరి నుంచి గమనించే సౌభాగ్యం తనకు దక్కిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భుజ్‌లో భూకంపం సృష్టించిన విధ్వంసం తరువాత చేపట్టిన పనులు, నరనారాయణ్ నగర్ గ్రామాన్ని పునర్నిర్మించడం, కేరళలో వరదల విజృంభణ, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడం మిగిల్చిన వేదన, చివరకు ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి వంటి ఇటీవలి విపత్తు.. ఇలా అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చారు. ఒక కుటుంబం లాగా ప్రజల వెన్నంటి నిలిచి ప్రతి ఒక్కరికి దయతో సేవలను అందిస్తున్నందుకు కార్యకర్‌లను శ్రీ మోదీ కొనియాడారు. కోవిడ్ కాలంలో బీఏపీఎస్ దేవాలయాలను ఏ విధంగా సేవా కేంద్రాలుగా మార్చివేశారో అందరూ చూశారు అని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం సందర్భంగా శత్రుత్వాలు పెరిగిపోవడంతో ఉక్రెయిన్ నుంచి, పోలండ్ నుంచీ తరలించిన వ్యక్తులకు బీఏపీఎస్ కార్యకర్తలు సాయపడి, ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన వైనాన్ని ప్రధాని వివరించారు.  రాత్రికి రాత్రి యూరోప్ అంతటా గల వేలాది బీఏపీఎస్ కార్యకర్తలను వెనువెంటనే కూడగట్టి, పెద్ద సంఖ్యల్లో పోలండుకు చేరుకొంటూ ఉన్న భారతీయులకు సాయపడినందుకు బీఏపీఎస్ కార్యకర్తలను ఆయన ప్రశంసించారు. బీఏపీఎస్ సంస్థకున్న శక్తిని గురించి శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ప్రపంచ స్థాయిలో మానవత శ్రేయం కోసం వారందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా బీఏపీఎస్ కార్యకర్తలందరికీ ప్రధానమంత్రి తన కృతజ్ఞతలను తెలియజేస్తూ, ప్రస్తుతం బీఏపీఎస్ కార్యకర్తలు వారి అలుపెరుగని సేవ ద్వారా ప్రపంచం అంతటా కోట్లకొద్దీ ప్రజల జీవనాల్లో ఒక మార్పును తీసుకువస్తున్నారన్నారు. బీఏపీఎస్ కార్యకర్తలు వారందిస్తున్న సేవలతో కోట్ల మంది మనసులను గెల్చుకొంటున్నారని, బాగా దూర ప్రాంతాలలో ఉన్న వారితో సహా సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి సాధికారితను కల్పిస్తున్నారని ఆయన అన్నారు. బీఏపీఎస్ కార్యకర్తలు ప్రేరణమూర్తులుగా నిలుస్తున్నారు, వారు ఆరాధనీయులు, గౌరవ పాత్రులు అని శ్రీ మోదీ అన్నారు.

బీఏపీఎస్ నడుంకట్టిన పనులు ప్రపంచంలో భారతదేశం సామర్థ్యాన్ని, ప్రభావాన్ని పటిష్టం చేస్తున్నాయని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ప్రపంచంలో 28 దేశాల్లో భగవాన్ స్వామి నారాయణ్ దేవాలయాలు 1800 ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇరవైఒక్క వేలకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక కేంద్రాలు విస్తరించాయని ఆయన చెప్పారు. ఈ కేంద్రాలన్నీ సేవకు సంబంధించిన అనేక ప్రాజెక్టుల్ని నిర్వహిస్తూ, ప్రపంచంలో భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి, భారతదేశ గుర్తింపునకు సాక్షిగా ఉంటున్నాయని ఆయన అన్నారు. బీఏపీఎస్ దేవాలయాలు భారతదేశ సాంస్కృతిక దర్పణంగా ఉంటున్నాయని శ్రీ మోదీ అన్నారు. ఈ దేవాలయాలు ప్రపంచంలో అతి పురాతనమైన సజీవ సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తున్నయన్నారు. కొన్ని నెలల కిందట అబూ ధాబీలో భగవాన్ స్వామి నారాయణ్ దేవాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం తనకు లభించిందని, ఈ దేవాలయ ప్రాణప్రతిష్ఠ గురించి ప్రపంచం అంతటా చర్చించుకొన్నారని ఆయన అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం ఎలాంటివో పూర్తి ప్రపంచం చూసింది అని కూడా ఆయన అన్నారు. ఇలాంటి ప్రయత్నాల కారణంగానే భారతదేశ సాంస్కృతిక యశస్సును గురించి, మానవీయత భరిత ఔదార్యాన్ని గురించి ప్రపంచానికి తెలిసింది అంటూ బీఏపీఎస్ కార్యకర్తల కృషికిగాను ఆయన వారికి అభినందనలను తెలియజేశారు.

కార్యకర్తల సంకల్పాలు సులభంగా నెరవేరాయంటే అది భగవాన్ స్వామి నారాయణ్ చేసిన తపస్సు ఫలితమే అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రతి ఒక్క ప్రాణి  బాధలు పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల శ్రద్ధ వహించారు, తన జీవనంలోని క్షణక్షణమూ మానవ సంక్షేమానికే అంకితం చేశారని ఆయన అన్నారు. భగవాన్ స్వామి నారాయణ్ నెలకొల్పిన విలువలను బీఏపీఎస్ ప్రపంచమంతటా చాటిచెబుతోందని కూడా ప్రధాని అన్నారు. బీఏపీఎస్ చేస్తున్న కృషిని వివరించడానికి శ్రీ మోదీ ఒక పద్యంలోని కొన్ని పాదాలను చదివి వినిపించారు.

బీఏపీఎస్ తోనూ, భగవాన్ స్వామి నారాయణ్ తోనూ తన చిన్న నాటి నుంచే అనుబంధాన్ని కలిగి ఉండడం తనకు దక్కిన భాగ్యం అని శ్రీ మోదీ అంగీకరించారు. ప్రముఖ్ స్వామి మహారాజ్ నుంచి తాను అందుకున్న ప్రేమానురాగాలు తాను తన జీవనంలో కూడబెట్టుకొన్న సంపద అని ప్రధాని అభివర్ణించారు.  తన జీవనంలో ప్రముఖ్ స్వామి జీతో తనకు ఎదురైన అనేక ఘటనలు తన జీవనంలో విడదీయరాని భాగంగా మారిపోయినట్లు ప్రధాని చెప్పారు. గుజరాత్‌కు తాను ముఖ్యమంత్రి కావడం, తరువాత భారతదేశానికి ప్రధానమంత్రి కావడం.. ఈ పరిణామాలకు వెనుక తన జీవన యాత్రలో ప్రతి మలుపు వద్దా ప్రముఖ్ స్వామి జీ తనకు దారిని చూపెట్టారన్నారు. నర్మద జలాలు సబర్మతికి వచ్చిన వేళ పరమ పూజ్య ప్రముఖ్ స్వామి జీ తనంత తాను తరలివచ్చారని, అది ఒక చరిత్రాత్మక ఘట్టమని శ్రీ మోదీ జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నారు. స్వామినారాయణ్ మహామంత్ర మహోత్సవ్, స్వామి నారాయణ్ మంత్ర లేఖన్ మహోత్సవం లను స్వామి జీ మార్గదర్శకత్వంలో నిర్వహించడం వంటి మరపురాని క్షణాలను కూడా ఆయన గుర్తుచేసుకొన్నారు. తనంటే స్వామిజీకి ఉన్న ఆధ్యాత్మిక వాత్సల్యం తాను ఆయనకు పుత్రుడి వంటి వాడినన్న స్నేహపూరిత భావనను తనలో రేకెత్తించేదని ప్రధాని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యాల్లో ప్రముఖ్ స్వామి మహారాజ్ దీవెనలను తాను ఎల్లప్పటికీ అందుకొంటూ వచ్చానని శ్రీ మోదీ అన్నారు.

 ‘సేవ పరమ ధర్మ’ అనే సంస్కృత పదాలను ప్రధానమంత్రి పలుకుతూ, ఇవి కేవలం పదాలు కావు, ఇవి జీవన విలువలను గురించి చెబుతాయి. భక్తి, విశ్వాసం, ఆరాధన.. వీటి కన్నా మిన్నయిన స్థానంలో సేవను నిలిపారని ఆయన అన్నారు. (సేవ పరమ ధర్మ అనే సంస్కృత భాషితానికి – సేవ చేయడం అంటే, అది అతి పెద్ద ధర్మం అని భావం.) జనానికి సేవ చేయడం ప్రజలకు సేవ చేయడంతో సమానం అని శ్రీ మోదీ అంటూ, సేవలో స్వార్థ భావనంటూ ఉండదు, వ్యక్తి ఆధ్యాత్మిక యాత్రకు దిశను చూపించగలిగేది సేవయే, కాలం గడిచే కొద్దీ ఆ వ్యక్తికి పరిణతిని సేవ ప్రసాదిస్తుంది అన్నారు. ఈ తరహా సేవను లక్షల మంది కార్యకర్తలు ఒక సంస్థగా ఏర్పడి చేశారా అంటే అప్పుడు అందే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అని ఆయన అన్నారు. ఆ విధమైన సంస్థగత సేవకు పెను సమస్యలను తీర్చగలిగిన సామర్థ్యంతోపాటు సమాజంలో, దేశంలో అనేక చెడులను రూపుమాపగలిగిన సత్తా కూడా ఉంటుందని ఆయన చెప్పారు. లక్షల కొద్దీ కార్యకర్తలు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఒక్కటయ్యారంటే గనక అది సమాజంలోనూ, దేశంలోనూ ఒక గొప్ప శక్తిగా మారగలుగుతుంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోతుండగా, ప్రజలంతా సహజంగానే కలిసికట్టుగా నిలుస్తూ ప్రతి రంగంలోనూ ఏదో ఒక పెద్దదైన కార్యాన్ని సాధించాలి అన్న భావనను కనబరుస్తున్నారని శ్రీ మోదీ అన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్, ప్రాకృతిక వ్యవసాయం, పర్యావరణ చైతన్యం, బాలికల విద్యార్జన, గిరిజన సంక్షేమం.. ఈ ఉదాహరణలను గురించి శ్రీ మోదీ ప్రస్తావించి, దేశ ప్రజలు ముందడుగు వేసి జాతి నిర్మాణ యాత్రకు నాయకత్వాన్ని వహిస్తుండడం గమనిస్తే సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తలంతా ఒక సంకల్పాన్ని తీసుకొని అంకిత భావంతో కృషిచేయాలని ఆయన కోరారు. ప్రాకృతిక వ్యవసాయం, భిన్నత్వంలో ఏకత్వ భావనను విస్తృతం చేయడం, మత్తుమందుల దుర్వినియోగం బారి నుంచి యువతను రక్షించడానికి పోరాటం కొనసాగించడం,  నదులకు నూతన జవసత్త్వాలను కల్పించడం, ధరిత్రి భవిష్యత్తును కాపాడడం కోసం దీర్ఘకాలం మనుగడ సాగించగలిగే జీవనశైలిని అనుసరించడం వంటి ప్రత్యామ్నాయాలకు ప్రాణం పోయాలని వారికి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన మిషన్ లైఫ్ దార్శనికతకు ఉన్న విశ్వాసనీయతను, ప్రభావాన్ని నిరూపించాల్సిందిగా కార్యకర్‌లను శ్రీ మోదీ కోరారు. వారు ఏక్ పేడ్ మాఁ కే నామ్ (‘తల్లి పేరిట ఒక మొక్కను నాటే’ కార్యక్రమం), ఫిట్ ఇండియా (వ్యక్తులంతా వారి శారీరిక దృఢత్వానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే కార్యక్రమం), వోకల్ ఫర్ లోకల్ (‘స్థానిక ఉత్పాదనలను కొనుగోలు చేస్తూ వాటి తయారీని ప్రోత్సహించే’ కార్యక్రమం), మిలెట్స్ (‘శ్రీ అన్న’ వంటి ‘చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగానికి పెద్దపీటను వేసే’ కార్యక్రమం).. ఈ కోవకు చెందిన మన దేశ అభివృద్ధికి జోరును అందించే ఉద్యమాలను వారు చురుకుగా ప్రోత్స హించనూ వచ్చు అని ప్రధాని వివరించారు.

అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చడానికి భారతదేశ యువత వారి ఆలోచనలను, వారి వంతు తోడ్పాటు ఏ విధంగా ఉండబోయేదీ వచ్చే ఏడాది జనవరి లో నిర్వహించనున్న ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమంలో తెలియజేయనుందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో యువ కార్యకర్‌లందరూ పాలుపంచుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

పూజ్యులు ప్రముఖ్ స్వామి మహారాజ్ భారతదేశంలో కుటుంబ సంస్కృతికి ప్రత్యేక ప్రాధానాన్ని కట్టబెట్టారని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన ‘ఘర్ సభ’ మాధ్యమం ద్వారా సంఘంలో ఉమ్మడి కుటుంబ భావననను బలపరిచారని ప్రధాని స్పష్టంచేశారు. ఈ ప్రచార ఉద్యమాలను కార్యకర్‌లు ముందుకు తీసుకుపోవాలని శ్రీ మోదీ కోరారు. ప్రస్తుతం భారత్ 2047కల్లా అభివృద్ధి చెందాలనే లక్ష్యాన్ని సాధించాలని తీర్మానించుకొని ఆ దిశలో పాటుపడుతోందని ఆయన చెబుతూ, రాబోయే 25 సంవత్సరాలకు దేశం చేరాల్సిన గమ్యం భారత్‌కు ఎంత ముఖ్యమో ప్రతిఒక్క బీఏపీఎస్ కార్యకర్తకూ అంతే ముఖ్యమని ఆయన అన్నారు. భగవాన్ స్వామి నారాయణ్ ఆశీర్వాదాలతో బీఏపీఎస్ కార్యకర్తలు నడుపుతున్న ఈ సేవాప్రధాన ఉద్యమం ఇదే విధంగా అంతరాయమనేదే ఎరుగకుండా మునుముందుకు సాగిపోతూనే ఉంటుందన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

***