అసమ్ లోని తిన్ సుకియా జిల్లా లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ కు చెందిన చమురు బావి బాఘ్ జన్- నంబర్ 5 లో బ్లో అవుట్ మరియు మంటలు చెలరేగిన ఘటన ల వల్ల ఉత్పన్నమైన స్థితి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశాని కి హోం మంత్రి శ్రీ అమిత్ శాహ్, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్, ఇతర కేంద్ర మంత్రుల తో పాటు భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరు అయ్యారు.
ఈ బావి నుండి వాయువు 2020 వ సంవత్సరం మే 27 వ తేదీ న అకస్మాత్తు గా వాతావరణం లోకి చొరబడటం మొదలుపెట్టింది. ఈ హఠాత్పరిణామాన్ని నియంత్రించడానికి సన్నాహం సాగుతూ ఉండగానే, 2020 వ సంవత్సరం జూన్ 9 వ తేదీ న బావి లో అగ్గి రాజుకొంది. పరిసర ప్రాంతాల లో నివసిస్తున్న కుటుంబాల ను సురక్షిత ప్రాంతాల కు తరలించి, వారి ని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఇండియా లిమిటెడ్ సహకారం తో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల కు పంపడమైంది. సుమారు 9,000 మంది ఈ సహాయక శిబిరాల లో తల దాచుకొంటున్నారు. జిల్లా యంత్రాంగం గుర్తించిన 1,610 కుటుంబాల కు తక్షణ సహాయం లో భాగం గా ఒక్కొక్క కుటుంబాని కి 30,000 రూపాయలు చొప్పున మంజూరు చేశారు.
బాధిత కుటుంబాల కు మద్దతు గా తగిన సహాయం మరియు పునరావాసం కల్పించడానికి భారత ప్రభుత్వం పూర్తి గా కట్టుబడి ఉందని, ఈ దురదృష్టకర సంఘటన కారణం గా తలెత్తిన కష్టం సమయం లో, రాష్ట్ర ప్రభుత్వం తో భారత ప్రభుత్వం కలిసి నిలబడుతుందంటూ ప్రధాన మంత్రి అసమ్ ముఖ్యమంత్రి ద్వారా అసమ్ ప్రజలకు హామీ ని ఇచ్చారు. భవిష్యత్తు లో ఉపయోగపడే విధం గా ప్రస్తుత సంఘటన ను అధ్యయనం చేసి వివరాల ను నమోదు చేయాలని, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ను ప్రధాన మంత్రి ఆదేశించారు. భవిష్యత్తు లో ఇటువంటి ప్రమాదాల ను నివారించడానికి మరియు అవి సంభవించినప్పుడు అటువంటి విపత్తుల ను ఎదుర్కోవడానికి వీలు గా మరింత సామర్థ్యాల ను, నైపుణ్యాలను, మన స్వంత సంస్థల లోనే అభివృద్ధి పరచాలని ప్రధాన మంత్రి సూచించారు.
బావి నుండి వాయువు ప్రవాహాన్ని నియంత్రించడానికి మరియు దానిని నిలిపివేయడానికి, భారతీయ నిపుణుల ఇంకా విదేశీ నిపుణుల సహాయం తో వివరణాత్మక ప్రణాళిక ను రూపొందించినట్లు సమీక్ష సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది. సిద్ధం చేసిన నిర్ణీత కాల పట్టిక ప్రకారం ఈ ప్రణాళిక ను అమలు చేయడం కొనసాగుతోంది. భద్రతపరం అవసరమైన అన్ని జాగ్రత్తల ను తీసుకొన్న అనంతరం 2020 వ సంవత్సరం జూలై 7 వ తేదీ న బావి ని మూసివేయాలని ప్రతిపాదించడమైంది.
Reviewed the situation in the wake of the Baghjan fire tragedy in Assam. Centre and state government are working to ensure proper relief and rehabilitation to those affected. https://t.co/X0Cz6bVUDS
— Narendra Modi (@narendramodi) June 18, 2020