Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అవినీతి మరియున‌ల్ల‌ధ‌నాన్ని అంతం చేయడంపై ప్ర‌ధాన మంత్రి చారిత్ర‌క ప్ర‌క‌ట‌న‌లు; 500 రూపాయల మరియు 1,000 రూపాయ‌ల నోట్లు ఈ రోజు మధ్య రాత్రి తరువాత నుంచి ఇక న్యాయ సమ్మత ద్రవ్యం కాదు


అవినీతి, న‌ల్ల‌ధ‌నం, మనీ లాండరింగ్, ఉగ్ర‌వాదం, ఉగ్ర‌వాదులకు ఆర్థిక సహాయం ఇంకా న‌కిలీ నోట్ల పై యుద్ధానికి గొప్ప శక్తిని సంతరించే విధంగా ఒక చరిత్రాత్మకమైన చర్య తీసుకోవడం జరిగింది. 500 రూపాయలు మరియు 1,000 రూపాయ‌ల నోట్ల‌ు ఈ రోజు అంటే నవంబరు 8వ తేదీ మధ్య రాత్రి నుండి న్యాయసమ్మత ద్రవ్యం కాదు అని, వాటిని చెలామ‌ణి నుండి తొల‌గించాల‌ని భారత ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

2,000 రూపాయ‌ల నోట్ల‌ను జారీ చేయాలని, అలాగే 500 రూపాయ‌ల కొత్త నోట్ల‌ను చెలామణి లోకి తేవాలని ఆర్ బి ఐ చేసిన సిఫారసులను ప్ర‌భుత్వం ఆమోదించింది.

100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, ఒక రూపాయి నోట్ల‌ు న్యాయసమ్మత ద్రవ్యంగా ఉంటాయి; ఈ రోజు తీసుకున్న నిర్ణయం తాలూకు ప్రభావం వాటి పైన ఉండబోదు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మంగ‌ళ‌వారం 2016 నవంబర్ 8 నాటి రాత్రి దూర‌ద‌ర్శ‌న్ లో ప్రసంగిస్తూ ఈ ముఖ్యమైన ప్రక‌ట‌న‌లు చేశారు. ఈ నిర్ణయాలు నిజాయతీగా ఉంటూ, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే స్వ‌భావం గ‌ల‌ భారతదేశ పౌరుల ప్ర‌యోజ‌నాల‌ను పూర్తిగా ప‌రిర‌క్షిస్తాయని, దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక శక్తులు దాచిపెట్టిన 500 రూపాయలు మరియు 1,000 రూపాయ‌ల నోట్ల‌ు విలువ కోల్పోయిన కాగితపు ముక్కలుగా మిగిలిపోతాయని ఆయ‌న అన్నారు.

అవినీతితోను, న‌ల్ల‌ధ‌నంతోను, న‌కిలీ నోట్లతోను పోరాడుతున్న సామాన్య పౌరుల చేతులలోకి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మ‌రింత బ‌లం చేకూరగలదని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

రానున్న కొద్ది రోజులలో సామాన్య పౌరులు ఎదుర్కోగల కొన్ని ఇక్క‌ట్ల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న ఉందని ప్రధాన మంత్రి చెబుతూ, అలాంటి స‌మ‌స్య‌లను అధిగ‌మించడంలో తోడ్పడే పలు చ‌ర్య‌లను ప్ర‌క‌టించారు.

500 రూపాయలు, లేదా 1,000 రూపాయ‌ల పాత నోట్లు కలిగి ఉన్న వారంద‌రూ వాటిని బ్యాంకులు, తపాలా కార్యాలయాలలో ఈ నెల 10వ తేదీ నుండి డిసెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చున‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. ఎ టి ఎ మ్ లు మరియు బ్యాంకుల నుండి న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ లపైన కూడా కొన్ని ప‌రిమితులను విధిస్తున్న‌ట్టు తెలిపారు.

500 రూపాయలు, 1,000 రూపాయ‌ల నోట్ల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులలోని ఫార్మ‌సీలు (వైద్యుని మందుచీటీతో), రైల్వే టికెట్ల బుకింగ్ కౌంటర్లు, ప్ర‌భుత్వ బ‌స్సులు, విమాన సంస్థ టికెట్ కౌంట‌ర్లు, పెట్రోల్, డీజిల్‌ మరియు పిఎస్‌యు ఆయిల్ కంపెనీల గ్యాస్ స్టేష‌న్ లు, కేంద్ర‌ ప్రభుత్వ లేదా రాష్ర్ట‌ప్ర‌భుత్వాల అధీకృత‌ వినియోగ‌దారు స‌హ‌కార స్టోర్స్, రాష్ర్ట‌ప్ర‌భుత్వాల అధీకృత‌ పాల‌ కేంద్రాలు, మరియు శవదహనశాలలు, శ్మ‌శాన‌ వాటిక‌లలో కరుణామయ కారణాలతో స్వీకరిస్తార‌ని శ్రీ మోదీ చెప్పారు.

చెక్కులు, డిమాండు డ్రాఫ్టులు, డెబిట్‌ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు మరియు ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ ద్వారా జరిపే ఏ విధమైన నగదేతర చెల్లింపులపై ఎలాంటి ఆంక్ష‌ లేదు అని ప్ర‌ధాన మంత్రి స్పష్టం చేశారు.

ద్ర‌వ్యోల్బ‌ణంపై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూప‌గ‌ల విధంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో న‌గ‌దు చెలామ‌ణి ఎంత తీవ్రంగా ఉందో ప్ర‌ధాన మంత్రి స‌వివ‌రంగా తెలియ‌చేశారు. అవినీతి మార్గాల ద్వారా ఆర్జించిన ధ‌నాన్ని ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చెలామ‌ణిలోకి తేవ‌డం వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం ఎంత జ‌టిలం అయిందో కూడా ఆయ‌న వివ‌రించారు. అది పేద‌ప్ర‌జ‌లు, న‌వ్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవ‌నాన్ని దుర్భ‌రం చేసింద‌ని ఆయ‌న అన్నారు. ఇళ్ళ‌ కొనుగోలులో నిజాయ‌తీప‌రులైన పౌరులు ఎన్ని ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న‌దీ ఆయ‌న ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు.

న‌ల్ల‌ధ‌నం నిర్మూలించేందుకు అలుపెరుగ‌ని పోరాటం

న‌ల్ల‌ధ‌నం దురాగ‌తాన్ని తుద‌ముట్టించాల్సిందేనంటూ ప్ర‌ధాన మంత్రి ప‌దేప‌దే క‌ట్టుబాటు ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల ఎన్ డి ఎ పాల‌న‌లో ఆయ‌న క్రియాశీలంగా అడుగులు వేస్తూ న‌ల్ల‌ధ‌నంపై పోరాటంలో ఒక ఆద‌ర్శంగా నిలిచారు.

న‌ల్ల‌ధ‌నంపై ద‌ర్యాప్తున‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఏర్పాటు చేయ‌డం ఈ దిశ‌గా ఎన్ డి ఎ సర్కారు తీసుకున్న తొలి చ‌ర్య‌.

విదేశీ బ్యాంకు ఖాతాల‌న్నింటికి సంబంధించిన వివ‌రాల ప్ర‌క‌ట‌న కోసం ఒక చ‌ట్టాన్ని 2015లో ఆమోదించింది. బినామీ లావాదేవీల‌న్నింటికీ అడ్డుక‌ట్ట వేస్తూ క‌ఠిన నిబంధ‌న‌లను 2016 ఆగ‌స్టులో అమ‌లులోకి తెచ్చింది. అదే స‌మ‌యంలో న‌ల్ల‌ధ‌నం ప్ర‌క‌ట‌న‌కు ఒక స్కీమ్ ను కూడా ప్ర‌క‌టించింది.

ఈ ప్రయత్నాలు స‌త్ఫ‌లితాల‌నిచ్చాయి. గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలో 1.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా న‌ల్ల‌ధ‌నం వెలుప‌లికి వ‌చ్చింది.

అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై న‌ల్ల‌ధ‌నం ప్ర‌స్తావ‌న‌

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కీల‌క బ‌హుముఖీన శిఖ‌రాగ్ర స‌ద‌స్సుల‌తో పాటు ప‌లువురు ప్ర‌పంచ నాయ‌కుల‌తో ద్వైపాక్షిక చ‌ర్చ‌ల స‌మ‌యంలో కూడా న‌ల్ల‌ధ‌నం అంశాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.

రెండున్న‌ర సంవ‌త్స‌రాల్లో రికార్డు పురోగ‌తి

ప్ర‌భుత్వం తీసుకున్న‌చ‌ర్య‌ల‌న్నింటితోనూ అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌తదేశం వెలుగు దివ్వెగా భాసిల్లుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పెట్టుబ‌డుల‌కు భార‌తదేశం ఆక‌ర్ష‌ణీయ‌మైన గ‌మ్యం కావ‌డంతో పాటు వ్యాపారాల నిర్వ‌హ‌ణ‌కు కూడా అనుకూల‌మైన ప్రాంతంగా మారింద‌ని ఆయ‌న చెప్పారు. భార‌తదేశ వృద్ధి యానం ప‌ట్ల ప్ర‌ముఖ ఆర్థిక విశ్లేష‌ణ‌ సంస్థ‌ల‌న్నీ ఆశావ‌హ దృక్ప‌థం ప్ర‌క‌టించాయ‌ని ఆయ‌న చెప్పారు.

వీట‌న్నింటికీ తోడు భార‌తదేశ ప్ర‌జ‌ల ఔత్సాహిక పారిశ్రామిక ధోర‌ణులు, న‌వ‌క‌ల్ప‌న‌లు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్ట‌ప్ ఇండియా’ మరియు ‘స్టాండ‌ప్ ఇండియా’ కార్య‌క్ర‌మాల‌కు గ‌ట్టి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించిన ఈ చారిత్ర‌క చ‌ర్య‌లు ఇప్ప‌టికే కేంద్ర‌ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌లు చ‌ర్య‌ల‌కు విలువ‌ను జోడిస్తాయ‌న‌డంలో సందేహం లేదు.