Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం


నమస్కారం,

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ కులపతి గౌరవనీయులైన డాక్టర్ సైయదనా ముఫద్దల్ సైఫుద్దీన్ సాహెబ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, సహాయమంత్రి శ్రీమాన్ సంజయ్ ధోత్రే జీ, ఉపకులపతి భాయీ తారిక్ మంసూర్ జీ, అందరు ప్రొఫెసర్లు, వర్సిటీ సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏఎంయూకు చెందిన వేలమంది విద్యార్థులు, లక్షలమంది పూర్వవిద్యార్థులు, ఇతర పెద్దలు.. మిత్రులారా..

ఏఎంయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటుచేసుకున్న ఈ చారిత్రక సంబరాల్లో మీతోపాటు పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెంచురీ గేట్స్, సోషల్ సైన్స్ డిపార్ట్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్ వంటి ఎన్నో విభాగాలను చాలా అందంగా చిత్రీకరించిన దృశ్యాలను చూస్తున్నాను. ఇవి కేవలం భవనాలు మాత్రమే కాదు.. వీటికి అనుబంధంగా ఉన్న చరిత్రకు భారతదేశానికి అమూల్యమైన ఆస్తులు. ఏఎంయూ నుంచి పట్టాలు పుచ్చకుని బయటకు వచ్చిన విద్యార్థులంతా.. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. విదేశీ పర్యటనల సందర్భంగా చాలాసందర్భాల్లో ఏఎంయూ పూర్వవిద్యార్థులు కలుస్తారు.. ఏఎంయూలో చదువుకున్నామని గర్వంగా చెబుతుంటారు. ఏఎంయూ ప్రాంగణంలో సరదాగా సాగిన సందర్భాలను పంచుకుంటారు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతదేశ సంస్కృతి, వారసత్వాలకు ప్రతినిధిత్వం వహిస్తున్నారు.

ఇక్కడి విద్యార్థులకు ఈ వర్సిటీతో అనుబంధంగా పనిచేస్తున్నవారందరికీ గర్వకారణమైన సందర్భమిది. ఈ వర్సిటీలో గత వందేళ్లలో లక్షలమంది జీవితాలను తీర్చిదిద్దారు. వారికి ఆధునిక, వైజ్ఞానిక ఆలోచనను అందించారు. సమాజంకోసం, దేశం కోసం ఏమైనా చేయాలనే స్ఫూర్తిని రగిలించారు. వారందరి పేర్లను ప్రస్తావిస్తే.. ఈ సమయం సరిపోదు. సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఏ మూల విలువల లక్ష్యంతో  ద్వారా ఈ సంస్థను స్థాపించారో.. అవే ఏఎంయూకు ఈ గుర్తింపు, ఈ గౌరవాన్ని నిలబెట్టాయి. అందుకే ప్రతి విద్యార్థికి, విద్యార్థినికి, ఈ వందేళ్లలో ఏఎంయూ ద్వారా దేశ సేవకు అంకితమైన ప్రతి అధ్యాపకుడికి, ప్రొఫెసర్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

కరోనా సమయంలోనూ ఏఎంయూ సమాజసేవలో నిమగ్నమైన తీరు అభినందనీయం. వేల మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, ప్లాస్మా బ్యాంకుల వ్యవస్థ, పీఎం కేర్ ఫండ్‌లో భారీ మొత్తాన్ని జమచేయడం వంటి కార్యక్రమాలు సమాజం పట్ల ఏఎంయూ నిబద్ధతకు నిదర్శనం. కొద్దిరోజుల క్రితమే కులపతి డాక్టర్ సైయదానా గారి లేఖ నాకు అందింది. టీకాలను అందరికీ ఇచ్చే కార్యక్రమంలోనూ తమ భాగస్వామ్యానికి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. జాతి ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావించి చేస్తున్న ఇటువంటి కార్యక్రమాల కారణంగానే.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొనగలిగింది.

మిత్రులారా,

ఏఎంయూ క్యాంపస్ ఓ నగరంలా ఉంటుందని చాలా మంది నాకు చెబుతుంటారు. ఎన్నో విభాగాలు, డజన్లకొద్ది హాస్టళ్లు, వేలమంది టీచర్లు, ప్రొఫెసర్లు, లక్షలమంది విద్యార్థులతో ఓ మినీ ఇండియాగా వర్సిటీ కనబడుతుంది. ఏఎంయూలో ఒకవైపు ఉర్దూ నేర్పిస్తుంటే మరోవైపు, హిందీ, అరబీ భాషకూ సరైన గౌరవం ఉంది. ఇక్కడ సంస్కృత భాషకు సంబంధింని ప్రాచీన సంస్థానం కూడా ఉంది. ఇక్కడి గ్రంథాలయంలో ఖురాన్ రాతప్రతి ఉంది. దీంతోపాటు భగవద్గీత-రామాయణాల అనువాదాలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. ఈ వైవిధ్యమే ఏఎంయూతోపాటు భారతదేశానికి ఎప్పటికప్పుడు నూతనోత్తేజాన్ని అందిస్తుంది. మనం ఈ శక్తిని మరిచిపోవద్దు.. దీన్నెప్పుడూ తగ్గించవద్దు. ఏఎంయూ క్యాంపస్‌లో ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ భానవ కూడా కొంతకాలంగా బలోపేతం అవుతోంది. మనమంతా దీన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేయాలి.

మిత్రులారా,

గత వందేళ్లలో.. ప్రపంచంతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడంలోనూ ఏఎంయూ కృషిని మరువలేము. ఉర్దూ, అరబీ, పార్సీ భాషలపై ఇక్కడ జరిగే పరిశోధనలు, అధ్యయనాలు.. ఇస్లామిక్ సాహిత్యంపై జరిగే పరిశోధనలు.. యావత్ ఇస్లామిక్ ప్రపంచంతో.. భారతదేశ సాంస్కృతిక సంబంధాలను సరికొత్త ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తాయి. ఈ క్యాంపస్‌లో దాదాపు వెయ్యిమంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని నాకు తెలిపారు. మన దేశంలోని మంచిని, గొప్పదనాన్ని, దేశ శక్తిని ఇక్కడి విద్యార్థులు అవగతం చేసుకుని.. వారి వారి ప్రాంతాలకు దీన్ని తీసుకెళ్లేలా చేసే బాధ్యత కూడా ఏఎంయూ బాధ్యతే. ఎందుకంటూ ఏఎంయూలో ఆ విదేశీ విద్యార్థులు వినే మాటలు, చూసే అంశాలు.. మొదలైనవి.. భారతదేశ అస్తిత్వాన్ని వారు అర్థం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. అందుకే మీ విశ్వవిద్యాలయంపై ఓ గురుతర బాధ్యత ఉంది.

మన గౌరవాన్ని పెంచడానికి.. మన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరముంది. ఓ వైపు మన యూనివర్సిటీ సాఫ్ట్ పవర్ (ఆకట్టుకునే సామర్థ్యం)గా మరింత ముందుకు తీసుకెళ్లాలి.. మరోవైపు జాతి  నిర్మాణంలో మీ బాధ్యతను నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. ఏఎంయూతో అనుసంధానమైన ప్రతి విద్యార్థిని, విద్యార్థి తమ బాధ్యతను మదిలో ఉంచుకుని ముందుకెళ్తారనే విశ్వాసం నాకుంది. ఈ సందర్భంగా సర్ సయ్యద్ గారు చెప్పిన ఓ అంశాన్ని మీకు గుర్తుచేద్దామనుకుంటున్నాను. ‘అందరి శ్రేయస్సుకోసం పనిచేయడమే.. మన దేశం గురించి ఆలోచించేవారి మొదటి బాధ్యత. ప్రజల జాతి, కుల, మతాలతో సంబంధం లేకుండా వారి కోసం పాటుపడాలి’ అని సర్ సయ్యద్ చెప్పారు.

మిత్రులారా,

ఈ మాటను మరింత చక్కటి అర్థంతో వివరించేందుకు వారో చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని ప్రతి అవయవం కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరముంది. అందుకే దేశాభివృద్ధి జరగాలంటే.. ప్రతి చోటా అభివృద్ధది జరగడం అత్యంత అవసరం’ అని ఆయన అన్నారు.

మిత్రులారా,

ఇవాళ దేశంలోని ప్రతి పౌరుడి పట్ల ఎలాంటి భేదభావాలను చూపించకుండా వారి అభివృద్ధి జరగాలనే మార్గంలో మనమంతా పయనిస్తున్నాం. ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను నిశ్చింతగా పొందాలి. తన భవిష్యత్తు విషయంలో నిశ్చింతగా ఉండాలనే దిశగా దేశం ముందుకెళ్తోంది. మతం పేరుతో ఎవరూ వెనకబడకూడదని.. అందరికీ ప్రగతి పథంలో వెళ్లేందుకు సమానావకాశాలు లభించేలా.. ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహించే దిశగా దేశం మందుకెళ్తోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ దీనికి మూలాధారం. ఈ సంకల్పమే దేశంలోని ప్రతి విధానంలో ప్రతిబింబిస్తుంది. ఇవాళ దేశంలోని పేదల సంక్షేమం కోసం తీసుకొస్తున్న పథకాల్లోనూ ఎవరికీ మతం, వర్గం పేరుతో వివక్ష చూపకుండా అందరికీ అందిస్తున్నాం.

ఎలాంటి వివక్ష లేకుండానే.. దేశంలోని 40 కోట్లకు పైగా పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిచాం. ఎలాంటి తేడాలు చూపకుండానే.. 2కోట్లకు పైగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చాం. ఎలాంటి భేదభావాలు చూపకుండానే 8కోట్లకు పైగా మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఎలాంటి తేడాలు చూపకుండానే.. కరోనా సమయంలో 80కోట్లకు పైగా మందికి ఉచితంగా ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎలాంటి వివక్ష చూపకుండానే.. దేశంలోని 50కోట్లకు పైగా మందికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాం. దేశానిది ఏమున్నా.. అది అందరు దేశవాసులదే. దాని లబ్ధి కూడా వారికి అందాల్సిందే. మా ప్రభుత్వం ఈ ఆలోచనతోనే ముందుకెళ్తోంది.

మిత్రులారా,

కొద్దిరోజుల క్రితం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వవిద్యార్థితో నేను సమావేశమయ్యాను. వారు ఒక ఇస్లామిక్ స్కాలర్ కూడా. వారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని నాకు చెప్పారు. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా దేశంలో నిర్మితమైన 10కోట్లకు పైగా శౌచాలయాల లబ్ధి అందరికీ చేకూరింది. ఇవి కూడా ఎలాంటి తేడాల్లేకుండా అందరికీ అందించాం. కానీ ఇందులోని ఓ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు.. విద్యారంగం కూడా దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని ప్రతి విద్యార్థి ఈ విషయాన్ని గమనించాలి..

ప్రియ మిత్రులారా,

ఒకప్పుడు మన దేశంలో ముస్లిం బాలికల డ్రాపవుట్ 70శాతానికన్నా ఎక్కువగా ఉండేది. ఇలా ముస్లిం బాలికలు మధ్యలోనే చదువు ఆపేయడం వల్ల ముస్లిం సమాజం కూడా బాధపడేది. 70 ఏళ్లుగా 70 శాతానికి పైగా ముస్లిం బాలికలు తమ చదువును పూర్తిచేసేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభమైన తర్వాత.. ప్రతి గ్రామంలో శౌచాలయాలు నిర్మితమయ్యాయి. ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లే విద్యార్థినుల అవసరాలను ప్రాధాన్యతగా గుర్తించి శౌచాలయాల నిర్మాణాన్ని పూర్తిచేసింది. వీటన్నిటి కారణంగా 70శాతానికి పైగా ఉన్న ముస్లిం బాలికల డ్రాపవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గి దాదాపు 30 శాతానికి చేరుకుంది.

మొదట్లో కనీస శౌచాలయ వసతుల్లేని కారణంగా ముస్లిం బాలికలు చదువును ఆపేసేవారు. ఇప్పుడుపరిస్థితులు మారుతున్నాయి. ఈ బాలికల డ్రాపవుట్ చాలా తక్కువగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనూ ఇలా డ్రాపవుట్ అయిన విద్యార్థినులు, విద్యార్థుల కోసం ‘బ్రిడ్జ్ కోర్స్’ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడే నాకు మనవాళ్లు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఏఎంయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య 35శాతంగా ఉన్నారని తెలిసింది. ఇది చాలా సంతోషకరం. ముస్లిం బాలికలను విద్యనందించడం.. వారికి సాధికారత కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గత 6 ఏళ్లలో ప్రభుత్వం ద్వారా దాదాపుగా కోటి మంది ముస్లిం బాలికలు స్కాలర్‌షిప్ లు ఇచ్చాం.

మిత్రులారా,

లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు లభించాలి. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఇది ఏఎంయూ ఏర్పాటు వెనకున్న ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. ఏఎంయూ వ్యవస్థాపక కులపతి బాధ్యతలను బేగం సుల్తానా నిర్వహించడం.. నేటికీ ఏఎంయూకు గర్వకారణం. వందేళ్లనాటి పరిస్థితుల్లోనూ.. ఓ మహిళ ఇంతటి కీలక బాధ్యతలు చేపట్టారంటే.. అదెంత గొప్ప ఉద్దేశమో మనం అర్థం చేసుకోవాలి. ఆధునిక ముస్లిం సమాజాన్ని నిర్మించాలన్న ఆ ప్రయత్నాన్ని.. దుర్వినియోగమవుతున్న ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దుచేయడంతో మరింత ముందుకు తీసుకెళ్తున్నాం.

మిత్రులారా,

ఓ మహిళ సుశిక్షితురాలైతే.. కుటుంబం మొత్తం సుశిక్షితమవుతుందని అప్పట్లో చెప్పేవారు. ఇది వాస్తవం. కానీ కుటుంబ విద్యతోపాటు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. మహిళలు సుశిక్షితులవ్వడం వల్ల.. వారి అధికారాలను వారు తెలుసుకుంటారు, వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. తమ భవిష్యత్తును వారే నిర్ణయించుకోగలుగుతారు. విద్య.. ఉపాధి అవకాశాలను, వ్యాపార సామర్థ్యాన్ని అందిస్తుంది. వీటి ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. దీని ద్వారా సాధికారత లభిస్తుంది. సాధికారత పొందిన మహిళ.. సమాజంలో మిగిలిన వారితో సమానంగా తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకోగలుగుతుంది. అది కుటుంబానికి ఓ మార్గం చూపించడమైనా.. దేశానికి దిశానిర్దేశం చేయడమైనా. ఈ వేదిక ద్వారా ఏఎంయూతోపాటు అన్ని విద్యాసంస్థలకు చెప్పేదొక్కటే. బాలికలను వీలైనంత ఎక్కువగా విద్యావ్యవస్థతో అనుసంధానం చేయడంలో చొరవతీసుకోండి.. విద్య ఒక్కటే కాదు.. ఉన్నతవిద్యను అందించేందుకు కృషిచేయండని చెబుతున్నాను.

మిత్రులారా,

ఉన్నతవిద్యలో ఏఎంయూ తీసుకొచ్చిన సమకాలీన పాఠ్యాంశాలు (contemporary curriculum) ఇతరులను కూడా ఆకర్శిస్తున్నాయి. మీ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో విద్యాబోధన మొదటన్నుంచీ జరుగుతోంది. ఓ విద్యార్థికి సైన్స్ అంటే ఇష్టం. అదే విద్యార్థికి చరిత్ర కూడా ఇష్టమే అయినప్పుడు.. రెండింట్లో ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలి. ఈ అంశాన్నే నూతన జాతీయ విద్యావిధానంలో ప్రస్తావించాం. 21వ శతాబ్దపు భారతీయ విద్యార్థి అవసరాలు, ఆకాంక్షలు, ఆసక్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. మన దేశ యువత ‘దేశమే అన్నింటికంటే ముందు’ అనే భావనను అర్థం చేసుకుని ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు అనుగుణంగా సరికొత్త స్టార్టప్స్ ద్వారా దేశం ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొంటున్నారు. హేతుబద్ధమైన ఆలోచన, శాస్తీయమైన దృష్టికోణం వారి మొదటి ప్రాధాన్యతగా మారింది.